" సకల మతస్థుల యొక్క మేలు కలయిక .. షక్కర్‌నగర్ "

 

రాజశేఖర్ : సుజాత మేడమ్ ! పత్రిసార్ జన్మించిన అపూర్వ గృహంలో వుండే మహత్తర అవకాశం మీకు ఎలా వచ్చింది ?

సుజాత : 2006 సెప్టెంబర్లో భీమవరం మాస్టర్ తటవర్తి వీరరాఘవరావు గారి ద్వారా ధ్యాన ప్రవేశం కలిగింది. సమయాభావం వలన ఆయన పదినిముషాలు ధ్యానం గురించి చెప్పారు. ఆ పదినిమిషాలకే నేను ప్రభావితురాలినై ధ్యానం చేయడం మొదలు పెట్టాను. మొదలు పెట్టిన కొద్దిరోజులకే నాకు కొన్ని మంచి మార్పులు కనిపించి నా భర్త శ్రీ రంగారెడ్డి గారికి ధ్యానం గురించి చెప్ప ‘ పిట్లం ’ అనే గ్రామంలో డా|| సత్యనారాయణ (జగిత్యాల) గారి క్లాసుకు తీసుకువెళ్ళాను. అక్కడి నుంచి మేమిద్దరం, మా పిల్లలు అందరం కూడా ధ్యానం చేయసాగాము.

రాజశేఖర్ : పత్రిసార్ని మొదటిసారిగా ఎప్పుడు కలిసారు ?

సుజాత : 2006 అక్టోబర్లో ‘ కామారెడ్డి ’ లో పత్రిసార్ దర్శనం అయ్యింది. ఆ దర్శనభాగ్యంతోనే మేమందరం పులకించిపోయాం. ఆనాటినుంచి మా కుటుంబసభ్యులందరికీ ధ్యానంలో పత్రిసార్ పదేపదే కనిపించటం, మాకు అవసరమైన సందేశాలు ఇవ్వటం, మా జీవితం ఆనందంగా సాగటం ఇలా జరిగిపోతోంది. " మా ‘ కల్హేర్ ’ గ్రామంలో మా స్వగృహంలో వుండి సార్నూ, ధ్యానాన్నీ తలచుకుంటేనే ఇంత మంచి అనుభవాలు వస్తూంటే, సాక్షాత్తు పత్రిసార్ (షక్కర్నగర్) ఇంట్లో నివాసం ఉండగలిగితే మా జన్మ ధన్యమవుతుంది " అనిపించింది.

మేము ఇలా అనుకుంటూ ఉండగానే బోధన్ షక్కర్నగర్లో సావిత్రీదేవి పిరమిడ్ కేర్ సెంటర్ నిర్వహిస్తున్న " శ్రీనివాస్ సార్ " మాకు ఫోన్చేసి " సార్ ఇంట్లో మిమ్మల్ని ఉండమని నాకు సందేశం వచ్చింది .. మీకు వీలవుతుందా ?? " అని అడిగారు. మేము కోరిందీ అదే కాబట్టి మా భార్యాభర్తలిద్దరం 2010 ఫిబ్రవరిలో సార్ ఇంట్లో స్థిరపడ్డాం ! మేం స్థిరపడిన రెండునెలలకే కేర్ సెంటర్లో పిరమిడ్ నిర్మించటానికి పెద్దలు నిర్ణయించి ఆ నిర్మాణ బాధ్యతలు మా ఇరువురి మీద కూడా పెట్టారు . ఆ క్షణం నుంచి మనసా, వాచా, కర్మణా ఆ బాధ్యతను నిర్వహించటం మొదలుపెట్టాం .

" పిరమిడ్ కట్టాలి " అంటే మేస్త్రీతో పాటు పనివాళ్ళు కావాలి కదా ! రావటం అయితే ఇద్దరు హిందూ మేస్త్రీలు వచ్చారు కానీ .. వాళ్ళ తాలూకు పనిమనుషులు స్వంత పనులు వలన బయటకు వెళ్ళటంతో " పనిమనుషులు మీరు తీసుకువస్తామంటే మేం కడతాం " అని వాళ్ళు ఒప్పుకున్నారు. మా భార్యాభర్తలిద్దరం విశ్వప్రయత్నం చేయగా మొదట క్రిస్టియన్ పిల్లలు వచ్చి గోడలు మూడు అడుగుల వరకు కట్టి " మాకు వేరె పని వుంది " అని వెళ్ళిపోయారు. మళ్ళీ వెతగ్గా ముస్లిమ్ పిల్లలు వచ్చి పిరమిడ్ పైభాగం వరకు పూర్తిచేసారు. దీని గురించి నేను ధ్యానంలో కూర్చూంటే " పిరమిడ్ ఏ ఒక్క మతానికీ పరిమితం కాదని సర్వమత సమ్మతుడైన పత్రీజీ అభీష్టం మేరకే ముగ్గురు మతస్థులకూ దీనిలో పనిచేసే భాగ్యం దక్కింది " అని సందేశం వచ్చింది. అసలు షక్కర్నగర్ మొదటినుంచీ కూడా అన్ని మతస్థులకూ దీనిలో పనిచేసే భాగ్యం దక్కింది " అని సందేశం వచ్చింది ! అసలు షక్కర్నగర్ మొదటినుంచీ కూడా అన్ని మతస్థుల యొక్క మేలుకలయికగానే వుంది. దానికి నిదర్శనం ఊరిలో వున్న శ్రీరామమందిరం, మసీద్, చర్చి.

రాజశేఖర్ : ఇది నిజంగా చాలా పెద్ద విశేషం ! ఇంకా ఏమైనా అద్భుతాలు జరిగాయా ?

సుజాత : పిరమిడ్లో టైల్స్ వేసే పనివాళ్ళు వచ్చి రెండు రోజులలో పని ముగించి తర్వాత డబ్బులివ్వమని అడిగారు. అప్పటికి గంట ముందే అందాల్సిన డబ్బు అందకపోయేసరికి మాకు కాలూ, చేయి ఆడలేదు. ఆ పనివాళ్ళకు చాలా కోపం వచ్చి " డబ్బు లేనివాళ్ళు పని ఎందుకు చెప్పారు ? ఇప్పటికిప్పుడు మా డబ్బు కక్కండి " అని గొడవపడ్డారు. నేను, నా భర్త కూడా చాలా ఖంగారుపడ్డాం. అర్జంటుగా మేము వెళ్ళిపోవాలని ఒక్కప్రక్క వాళ్ళు, అందాల్సిన డబ్బు అందుతుందో లేదో అనే భయంలో మేము వుండగా " పత్రిసార్ ఈ పిరమిడ్ మీది. మీరే విశ్వాత్మ. ఈ సమస్యకు మీరే పరిష్కారం చూపించండి " అని పదినిమిషాలు ధ్యానం చేసాను.

కళ్ళు తెరిచేసరికి మా ఎదురుగుండా మాకు తెలిసినాయన ఒకాయన వున్నారు. ఆయనకు విషయం చెప్పగానే జేబులో చేయిపెట్టి డబ్బు బయటకు తీసారు. ఒక్క రూపాయి తేడా లేకుండా వాళ్ళకు ఇవ్వాల్సిన పేమెంట్ ఎంతో అంతే డబ్బు కరెక్టుగా వుంది " అని ఆశ్చర్యపోయి ధ్యానం ఎలా చేయాలో మాతో చెప్పించుకుని 30 నిమిషాలు ధ్యానం చేసి " ఇంత ఆనందం మా జీవితంలో ఏనాడూ ఎరగం " అని మాకు చెప్పి కొన్ని పుస్తకాలు కొనుక్కోవడమే కాకుండా మేం ఇవ్వాల్సిన డబ్బులో కూడా కొంత తగ్గించి తీసుకున్నారు .

ఈ పుణ్యభూమిలో, ఈ ఇంట్లో జన్మించి భూలోకం మొత్తాన్ని అద్భుతమైన శక్తిక్షేత్రంగా మార్చి శాంతి, అహింస కరువైన భూమిని " ధ్యాన, జ్ఞాన భూమి " గా మార్చటానికి వచ్చిన పుణ్యమూర్తి .. ఎవరి సమస్యను వారే పరిష్కరించుకోగలిగేలా మనుష్యులను మలిచే ఏకైక జగద్గురువు బ్రహ్మర్షి పత్రీజీ ! ఆ తండ్రికి అనంతకోటి ప్రణామాలు . ఆనాటి రాముడికి, ఒక్క ఆంజనేయుడే లోకకళ్యాణార్ధం సహకరిస్తే ఈనాడు " లక్షలమంది ఆంజనేయుళ్ళు " పిరమిడ్ ధ్యానులు రూపంలో పనిచేస్తూ ఈ భూమికే కాదు, ఈ సృష్టికే కళ్యాణకారకుడిగా వున్న పత్రిసార్ దగ్గర జీవితాలను రోజు రోజుకీ పునీతం చేసుకుంటూ మోక్షస్థితికి చేరుకుంటాం.

రాజశేఖర్ : గంగారెడ్డి గారూ ! మీ అనుభవాలు చెప్పండి !

గంగారెడ్డి : నేను ఎక్కువభాగం ధ్యానంలో, మౌనంలో గడుపుతూ వుంటాను. పత్రిసార్ని అనుక్షణం నా హృదయంలో నింపుకునే వున్నాను. ఒకసారి నాకు తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. ధ్యానంలో పోగొట్టుకుందామని నేను కూర్చున్నాను. " ఈ నొప్పి ఇక్కడ తగ్గదు బెంగళూరు పిరమిడే దీనికి సరైన మందు " అని వినిపించింది. ఆ గొంతు ఎవరిదో తెలియదు. నేను " సరే " అని తలవూపిన మరుక్షణం నేను బెంగళూరు పిరమిడ్లో వున్నాను. నాతోపాటు " రిచార్డ్ బాక్ ", మరి ఒకాయన వున్నారు. వారిరువురు నన్ను పిరమిడ్ లోపలికి తీసుకువెళ్ళి ధ్యానం చేయించగానే నా నొప్పి తగ్గిపోయింది . మేము ముగ్గురం ఆ పిరమిడ్ చుట్టుప్రక్కల ప్రాంతాలను కలియతిరుగుతూండగా హఠాత్తుగా రిచార్డ్ బాక్ " పత్రిసార్ వచ్చారు. మనం స్వాగతం పలకాలి పదండి, పదండి " అని హడావుడి చేసారు. మేము ముగ్గురమూ పిరమిడ్ కాంపౌండ్ ప్రాంగణం దాటి సార్కి స్వాగతం పలికాము. ఆ తర్వాత మేమందరం కలిసి మళ్ళీ పిరమిడ్ దాకా వెళ్ళాము. అక్కడ సార్ " ఇంక మీరు వుండండి నాకు వేరే పని వుంది " అనగానే నా సూక్ష్మదేహం వచ్చి నా స్థూలదేహంలో ప్రవేశించింది.

రాజశేఖర్ : ఇది చాలా బాగుంది , ఇలాంటి సంఘటన ఇంకా ఏదైనా చెప్పగలరా ?

సుజాత : మరో అనుభవం మా భార్యాభర్తలిద్దరికీ కంబైన్డ్గా వచ్చింది. ఒకరోజు నా భార్య ధ్యానంలో వుండగా పత్రిసార్ ఆస్ట్రల్గా వచ్చి వేగంగా తన బెడ్రూమ్లోకి వెళ్తున్నారట. ఆమె ఖంగారుపడి సార్ని ఏదో అడగబోగా " నేను ఎనిమిదిరోజుల పాటు ఒక పుస్తకం ఇక్కడ కూర్చుని వ్రాయాల్సి వుంది అందుకే వచ్చాను. నా పని నేను చూసుకుంటాను , నీ పని నువ్వు చూసుకో " అన్నారు. రెండు మూడు రోజులు గడిచాక నేను " మీరు నిజంగా వుంటే ఇంకా ఎవరికైనా కనిపించాలి " అన్నాను. ఇలా జరిగిందని నేను ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. ఇలా అన్న రెండవరోజు మావారు ధ్యానం చేస్తూంటే సార్ కనిపించారట. హఠాత్తుగా సార్ అలా కనిపించేసరికి మావారు ఖంగారుపడి మర్యాదలు చేయాలని చూసారట. అప్పుడు సార్ " మీ మర్యాదల కోసం రాలేదు ; ఒక మిత్రుడిలా వచ్చాను. నువ్వు కూర్చో కూర్చో " అని రెండుసార్లు అని లేవనీయకుండా భుజాల మీద చేతులు వేసి కూర్చోపెట్టారట. సార్ ఇచ్చిన భరోసాతో మా గంగారెడ్డి గారు మరింత డీప్ స్థితికి వెళ్ళిపోయారట. అప్పుడు మరో అనుభవం వచ్చింది.

గంగారెడ్డి : అలా డీప్ స్థితిలోకి వెళ్ళగానే " కాశిరెడ్డినాయన " వచ్చారు. ఆయన " పత్రిసార్కు పనులు వున్నాయి. ఆయన పని ఆయన చూసుకుంటారు ; మనమిద్దరం అలా, అలా వెళ్ళివద్దాం రా " అని వైజాగ్ బీచ్కి తీసుకువెళ్ళారు. బీచ్లో కొంచెం సేపు షికారు చేసిన తర్వాత నా శరీరంలోకి నేను వచ్చేసాను. ఇది నేను నా భార్యకి కూడా చెప్పాను. ఆమె చాలా సంతోషించింది.

రాజశేఖర్ : మేడమ్ ! మీరు విని సంతోషించి ఊరుకున్నారా లేక పత్రిసార్కి ఏదైనా సంకల్పం పెట్టారా ?

సుజాత : పెట్టాను. " మా ఇరువురికీ కనిపించారు. మా జన్మలు ధన్యమయ్యాయి. ఈ ఎనిమిదిరోజులలోపు మా రెండో అమ్మాయి ‘ సంతోషి ’ కి కూడా కనిపించి ఆమెని సంతోషపెట్టారా. " అని అడిగాను. సరిగ్గా ఎనిమిదవరోజు ఎంతోమంది బాల, బాలికల సమూహంతో వచ్చి మా " సంతోషి " కి కనిపించి నాట్యం చేస్తూ " సంతోషి , మనమందరం నిరంతరం ఈ పిల్లలలాగానే ఆట, పాటలతో జీవితాన్ని గడిపివేయాలి " అని చెప్పారట. ఈ విధంగా ఈ ఇంట్లో ప్రవేశించిన క్షణం నుంచి ఈ క్షణం వరకు మా కుటుంబసభ్యులందరం అత్యంత ఆనందంగా హాయిగా వున్నాం .

రాజశేఖర్ : చివరగా మీ సందేశం !

సుజాత : పత్రిసార్ గొడుగులో ఉన్నంతకాలం మనుషులే కాదు సమస్త జీవరాసులు సంతృప్తిగా, సంతోషకరంగా బ్రతకగలరు. కాబట్టి " అందరూ కూడా ఆ మహాపురుషుని అండలో వుండి ఆనందాలు పొందాలి " అని నా కోరిక.

రాజశేఖర్ : గంగారెడ్డి గారూ, మీ సందేశం ఏమిటి ?

గంగారెడ్డి : ధ్యానానికీ, మౌనానికీ ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ పత్రిసార్ పదేపదే చెప్తున్నట్లుగా " నోటిలోని మౌనం మనస్సులోని శూన్యం " పాటిస్తూ వుంటే ప్రతి ఒక్కరం అత్యంత శీఘ్రగతిన ప్రగతిని పొందగలం. ఇదే నేను చేస్తున్నది, అదే చెప్తున్నాను.

 

గంగారెడ్డి & సుజాత
షక్కర్‌నగర్
సెల్ : +91 9618834604

Go to top