" ఎక్కడైతే భూగర్భజలం పుష్కలంగా వుందో అక్కడ నా పాదాలు అతుక్కుపోయేవి "

 

రాజశేఖర్ : మజీద్ గారూ ! మీ ఆధ్యాత్మిక జీవితం గురించి చెప్పండి.

మజీద్ : నేను పుట్టింది షక్కర్నగర్లోనే. " అబ్దుల్ హమీల్ ", " మున్ని " నా తల్లిదండ్రులు. మా నాన్నగారు చెక్కర ఫ్యాక్టరీలోనే జాబ్ చేసి రిటైర్ అయ్యారు. మాకు ఒక పండ్లరసం దుకాణం వుండేది. అమ్మ ఇంటికే పరిమితం.

ఏ పని అయినా పూర్తి మనస్సుతో సవ్యంగా చేయటం నాకు పుట్టుకతో వచ్చిన విద్య. పత్రిసార్ యొక్క అక్కగారు అయిన Dr శ్రీమతి సుధా కోడూరి మేడమ్ .. వారు పుట్టిపెరిగిన ఇల్లు కొన్నారు. అది చాలా పాత ఇల్లు. దానికి ఒక అందమైన రూపు ఇవ్వటం అప్పట్లో " ధ్యానమైన దత్తు " అనే మాస్టర్‌కి అప్పజెప్పబడింది. పని వేగంగా పూర్తి చేయటానికి ఆయన నన్ను అర్హుడిగా గమనించి నాకు అప్పజెప్పటం .. నేను వెంటనే ఆ పనిని 24 గంటలలో పూర్తిచేయటం జరిగిపోయింది .

నేను అంతకుముందు జాబ్ చేసేవాడిని. కానీ కిడ్నీలో రాళ్ళు రావటం వలన ఆరోగ్యం పాడైపోయి జాబ్ వదిలేసి ఖాళీగా వున్న సమయంలో నాకు ఈ మహదవకాశం దొరికింది.

రాజశేఖర్ : పత్రిసార్‌తో మొదటిపరిచయం ఎప్పుడు జరిగింది ?

మజీద్ : పత్రిసార్కు 61 సంవత్సరాల వయస్సు వచ్చాక సుధా మేడమ్ సహకారంతో ఈ ఇల్లు కేర్ సెంటర్‌గా చేయటానికి 2007 జూలై 12 న వచ్చారు. కారు దిగగానే జనసమూహం ఆయనను చుట్టుముడితే .. ఆయన గుంపులో వున్న మా అమ్మాయి " సమెరిన్ " ను పిలిచి ప్రత్యేకంగా షేక్‌హ్యాండ్ ఇచ్చారు. దాంతో మా అమ్మాయి ఎంతో పొంగిపోయింది .

ఆ తర్వాత కేర్ సెంటర్ ప్రారంభోత్సవం అయిపోయాక దాదాపుగా అందరూ వెళ్ళిపోయాక నాకు ఆఖరిగా ఆయన షేక్‌హ్యాండ్ దక్కింది. చివరలో మా ఫోటోగ్రాఫర్ " సార్! మజీద్‌తో ఒక ఫోటో దిగండి " అని అడిగితే సార్ " ఏయ్ .. ఫో .. వాడికి ఫోటో ఎందుకు ? పొండి, పొండి ! " అని అరిచారు. నేను చాలా చిన్నబుచ్చుకుని " ఆయనతో నాకు పనేంటి ? ఆయన ఎవరు ? నాకు ఆయనతో ఫోటో దిగాల్సిన అవసరం ఏమీలేదు. పనికోసం వచ్చాను ; చేసాను. ఫోటో దిగకపోతే నాకు వచ్చిన నష్టం ఏమీలేదు " అని వెళ్ళిపోయాను. కానీ సాయంత్రం సిద్ధిపేట శ్రీ భీమేశ్వరప్రసాద్ గారు నన్ను పిలిపించి " కేర్ సెంటర్ బాధ్యతలు వైజాగ్ గీత సత్యవతి మేడమ్ చూస్తున్నారు. ఆమెకు మీరు సహకారం అందించండి. మీరు కూడా సాధ్యమైనంతవరకు కేర్ సెంటర్ బాధ్యతలు నిర్వర్తించాలి " అన్నారు. సత్యవతి మేడమ్, భీమేశ్వరప్రసాద్ గార్లు చాలా స్నేహశీలులు. నేను ఒప్పుకున్నాను.

రాజశేఖర్ : అప్పటినుంచి ధ్యానం మొదలుపెట్టారా ?

మజీద్ : నేను చేసేవాడిని కాదు. నాకు అప్పట్లో అంత ఆసక్తి వుండేది కాదు. కానీ అందరినీ ప్రోగుచేయాల్సిన బాధ్యత తీసుకుని ప్రతి క్లాస్ జయప్రదంగా చేయటానికి ప్రయత్నం చేసేవాడిని. కానీ అది కేవలం ‘ బాధ్యత ’ గా చేసేవాడిని. పత్రిసార్ ఆదేశానుసారం సత్యవతి మేడమ్ 41 రోజులు ఇక్కడే వున్నారు. ఆమె ప్రతిరోజూ ధ్యానం చేయమని పొరేవారు. నేను వేళాకోళంగా " ధ్యానాలతో ఆరోగ్యాలు బాగుపడితే ఇంక డాక్టర్లు ఎందుకు ? ఇవన్నీ ఊసుపోక చేసే పనులు " అని కొట్టిపారేసేవాడిని.

ఇలాంటి సందర్భంలో నేను ఒకసారి పెద్దగుట్ట - బడాపహాడ్ - దర్గాకు ప్రార్థన కోసం వెళ్ళాను. అప్పుడు అకస్మాత్తుగా " మెడిటేషన్ చేయాలి " అని అల్లా నన్ను అజ్ఞాపించినట్లు ఆలాపనగా వినిపించింది. సరే, మొదలుపెట్టాను. అనుకోకుండా ఆ రోజు పౌర్ణమి. పౌర్ణమి అని తెలుసు కానీ పౌర్ణమికి ఎక్కువ వైబ్రేషన్స్ వస్తాయని నాకు తెలియదు. అర్థరాత్రి 12 గంటల నుంచి 3.00 గంటల వరకు నేను లేవలేదు , ఏదో తెలియని పారవశ్యం, మధురానుభూతి, అలౌకిక ఆనందం. హఠాత్తుగా నా సూక్ష్మశరీరం ( అంటే ఏమిటో అప్పుడు తెలియదు ) రిలీజ్ అయ్యి చంద్రుడు చేయిచాస్తే అందే దూరంలోకి వెళ్ళిపోయింది , నేను చాలా భయపడ్డాను. ఆ భయం వలన వెంటనే శరీరంలోకి వచ్చేసాను. నా లోపలికి నేను ప్రవేశించానో లేదో తెలియలేదు కానీ నాకు చాలాసేపు స్పృహ రాలేదు.

రాజశేఖర్ : అద్భుతంగా వుంది , మళ్ళీ అలాంటి అనుభవాలు వచ్చాయా ?

మజీద్ : వచ్చింది మళ్ళీ రెండవసారి .. అదే ప్రదేశంలో ధ్యానంలో ఏడేళ్ళ బాబు ఏడుస్తూ .. తర్వాత పదేళ్ళ బాబులా మామూలుగా నా ఎదురుగా కాస్సేపు కనిపించి తర్వాత కనపడలేదు. తర్వాత గొప్ప తేజస్సుతో ఒకాయన చెట్టుక్రింద తపస్సు చేస్తూ కనిపించారు. ఆయన శరీరం చుట్టూ ఓ వింత కాంతి ప్రకాశిస్తోంది. " ఆయనే ఈ దర్గాలో జీవసమాధి అయిన బాబా " .. అని అర్థమైంది. ఆ వెంటనే ఆయన హృదయంలో నుంచి నా హృదయంలోకి ఒక జ్యోతిలాంటి మెరుపు ప్రకాశిస్తూ ప్రవేశించింది. అపార ఆనందం కలిగింది. ఈ సంఘటన తర్వాత పదిహేనురోజులలో నా కిడ్నీలో రాళ్ళు వాటంతట అవే ఏ మందూ తినకుండానే కరిగిపోయాయి .

అంతకుముందు నాలుగు అడుగులు వేయటానికే బ్రహ్మప్రళయం అయ్యేది. ఇప్పుడు నేను పరుగులో ఎవరితోనైనా పోటీపడగలను .

కిడ్నీలో రాళ్ళు పోయిన తర్వాత ధ్యానం మీద నమ్మకం కలిగి " నేను బాగుపడ్డాను, కాబట్టి అందరూ బాగుపడాలి " అని ధ్యానప్రచారం మొదలుపెట్టాను. ధ్యానప్రచారం మొదట హాస్పిటల్స్‌కి, HIV పాజిటివ్‌తో బాధపడేవారికి ... " HIV బాధితులకు ధ్యానం ఒక వరం " అనే ప్రాజెక్ట్ పేరు పెట్టి ధ్యానం నేర్పాను. వాళ్ళలో చాలా గణనీయమైన మంచి మార్పులు వచ్చాయి. మన మనుగడకు ఎంతో మంచి చేస్తూ సమతుల్యాన్ని కాపాడుతున్న ప్రకృతిని కాపాడాలనిపించి నిర్మల్ D.F.O డాక్టర్ ప్రభాకర్ గారి సహకారంతో ధ్యానం గురించి, ప్రకృతికి ఇవ్వాల్సిన సహకారం గురించి ప్రచారం చేశాను " ధ్యానంచేయండి, ప్రకృతిని కాపాడండి " అనేది ప్రాజెక్ట్ పేరు. " ధ్యాన గ్రామీణం " ప్రాజెక్ట్ నాకు ఒక వరం. ఇలాంటి వరాలు నేను కోరితెచ్చుకున్నవి కావు. ధ్యానసాధన అపరిమితంగా చేయటం వలన అలవోకగా లభ్యమయ్యాయి.

నా ఈ అద్భుతమైన అనుభవాలను ప్రత్యక్షంగా, ప్రత్యేకంగా కూడా గమనిస్తున్న వర్ని యోగామాస్టర్ శ్రీ వీరప్ప గారు ఒకరోజు " మజీద్ , తెలంగాణా ప్రాంతంలో రైతులు పొలాలు వున్నా కూడా నీటి వనరులు లేక బోర్లు వేసినా కూడా అవి ఫెయిల్ అవటం వలన పేదవారిగానే ఉండిపోతున్నారు. నీ ధ్యానశక్తితో ఏ పొలంలో, ఏ స్పాట్లో నీళ్ళు పడతాయో చెప్పటానికి ప్రయత్నించరాదా ?! " అన్నారు. నేను వెంటనే " తప్పకుండా, ప్రయత్నం అయితే నేనే చేస్తాను. ఫలితం చూపించేది మాత్రం పత్రిసారే. కానీ ఎదుటివారు మూడు షరతులకు కట్టుబడి వుంటేనే ...
1. ధ్యానం నేర్చుకుని చేయాలి
2. మాంసాహారం మానివేయాలి
3. చిన్నదో పెద్దదో పిరమిడ్ నిర్మించాలి అన్నాను.

రాజశేఖర్ : ధన్యజీవివి మజీద్, ఎంత నిస్వార్థమైన, లోకహితమైన షరతులు పెట్టావు, హుండీలో వేసే ముడుపులు కావు ఈ షరతులు .. సర్వాత్మకే హారతులు .. తర్వాత ?

మజీద్ : ఇంక మొదలైంది నా కోసం వేట. ఎందరెందరో ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారు. నా షరతులు మామూలే. నా ఫీజు కూడా అదే , అందరూ ఒప్పుకునేవారు.

రాజశేఖర్ : ప్రతివారి పొలంలో నీరు పడేవా ? నీటి జాడ కోసం అసలు మీరు ఏం చేసేవారు ?

మజీద్ : రేపు ఫలానా వారి పొలంలో నీరు వుందో లేదో చూడాలి అని నిర్ణయించుకున్నప్పుడు ఈ రోజు రాత్రి ఆ రైతు పేరు తలచుకుని మూడుగంటలు ధ్యానం చేసేవాడిని. నాకు అప్పుడే తెలిసిపోయేది నీరు వుందో లేదో ! నీరు వుందని తేలితే ఆ పొలంలోకి వెళ్ళి ధ్యానం చేసి పొలమంతా నడిచేవాడిని. ఎక్కడైతే భూగర్భజలం పుష్కలంగా వుందో అక్కడ నా పాదాలు నేలకు అతుక్కుపోయేవి. అక్కడ బోర్ వేస్తే తప్పకుండా 2 1/2, 3 ఇంచ్‌ల నీరు పడుతున్నాయి.

" సుబ్బారావు " అనే ఒక రైతు " నా పొలంలో నీరు చూపిస్తే నిన్నూ, ధ్యానాన్ని కూడా పూర్తిగా నమ్మటమే కాక ధ్యానప్రచారం కూడా చేస్తాను " అన్నాడు. ఆయన పొలంలో నీరు చూపించాను. ఆ సుబ్బారావు గారు ఇప్పుడు తన మాట నిలబెట్టుకున్నారు.

మరొక రైతు నన్ను పరీక్ష చేయటానికి తన పొలంలో నీళ్ళు ఎక్కడ పడతాయో చూపించమన్నాడు. నా పద్ధతి ప్రకారం నేను చూపించాను. ఆయన ఎంతో ఆశ్చర్యపోయి " జియాలజిస్ట్ చూపించింది కూడా ఆ ప్రదేశమే " అని నన్ను ఎంతగానో అభినందించాడు .

ఇదంతా విన్న పత్రిసార్ " మజీద్ ధ్యానభగీరథుడు " అన్నారు. ఆయన అలా అంటూ వుండటం మామూలే కానీ .. " భగీరథుడూ ఆయనే, భగవంతుడూ ఆయనే " అని నాకు బాగా తెలుసు. నడవని కాలును నడిచేలా .. నవ్వని పెదవిని నవ్వేలా.. జ్ఞానిని, విజ్ఞానిగా చేయగల సత్తా వున్న సర్వాత్మ స్వరూపులు ఆయన. మనం ఆత్మప్రగతి వైపు సవ్యంగా అడుగులు వేస్తూన్నంతసేపూ ఆయన ఎంతగానో ప్రశంసిస్తారు. ప్రశంసలో భాగంగా " మజీద్ ! ఇలాంటివన్నీ మనకు చాలా చిన్న విషయాలు, నువ్వు మనందరం కలిసి చేయవలసిన విశేషమైన విషయాలు ఇంకా ఎన్నో వున్నాయి " అన్నారు. నేను దీనికే పొంగిపోయి అహంకారపూరితుడను కాకూడదని ఆయన ఆకాంక్ష అని నాకు అర్థమైంది. ఆ ఎరుకలో వున్నాను కాబట్టే సార్ ఎన్నోసార్లు " వీడు నా హీరో " అనీ .. " వీడు నా బడా భాయ్ " అన్నా కూడా ఆనందపడ్డానే తప్ప అహంకార పడలేదు.

మొన్న ఈ మధ్య పత్రిసార్ మండువేసవిలో షక్కర్నగర్ వచ్చినప్పుడు నేను చల్లని జ్యూస్ ఇచ్చాను. సార్ అది త్రాగి " ఎండలో చల్లదనాన్నీ, చలిలో వేడినీ ఇవ్వగలిగినవాడే భగవంతుడు. నేను చలికాలం లేక వానాకాలం వస్తే వేడివేడిగా ఏమైనా ఇవ్వాలి మరి " అన్నారు. ఆయన అంతరార్థం అర్థం కాని నేను అయోమయంగా తల ఊపాను. ఆయన అన్న కొద్దిరోజులకే నాకు నా స్థోమతకు తగిన చక్కని ‘ క్యాంటీన్ ’ లభ్యమైంది. పత్రిసార్ కృపతో సావిత్రీదేవి పిరమిడ్ సంస్థలో నేను ఒక ట్రస్టీని కూడా అయ్యాను .

రాజశేఖర్ : మెడిటేషన్లో ఇంకా ఎలాంటి అనుభవాలు వచ్చాయో చెప్పండి. మీరు ఇప్పుడు ఏ కారణంతో జన్మ తీసుకున్నారో తెలిసిందా ?

మజీద్ : ప్రపంచం మనుష్యులది మాత్రమే కాదనీ ... సమస్త ప్రాణికోటికీ ఈ భూమిపైన నివసించే హక్కు, అధికారం వుందనీ నాకు క్రితం జన్మలో అర్థమైంది. అలాగే మాంసాహారప్రియులు రాక్షసుల కంటే భయంకర స్వభావులని కూడా తెలిసింది. కాబట్టే ఒక ముస్లిమ్ కుటుంబంలో పుట్టి కూడా నేను ఏనాడూ ఏ రకమైన మాంసాన్ని ముట్టలేదు. నా తోడబుట్టినవారిని, కట్టుకున్నామెనూ, కన్నపిల్లల్ని కూడా అలాగే ఈ భూమిపైకి తెచ్చుకున్నాను. నా ఈ బృహత్తర ప్రయత్నానికి నాకు తోడు - నీడగా ... అనుక్షణమూ అండగా, నా మార్గదర్శి గురువు .. తల్లి .. తండ్రిగా వున్న పత్రీజీ కనుసన్నలలో వారితో కలిసి పనిచేయటానికి వచ్చాను. ఇక ఇతర అనుభవాల సంగతికి వస్తే ఒకసారి సార్ నా ధ్యానంలోకి వచ్చి " మజీద్ ! ఎవరైతే షక్కర్‌నగర్‌లోని సావిత్రీదేవి పిరమిడ్ కేర్ సెంటర్‌కు వచ్చి వెళ్తారో ... వారిలో ఏ ఒక్కరూ కూడా ఆత్మ భోజనం .. ఉదర భోజనం .. చేయకుండా వెళ్ళరాదు" అని ఆదేశించారు. ఆ రోజు ఒక కేజీ బియ్యంతో భోజనం తయారుచేసిన నేనూ, నా మిగతా మిత్రులందరం ఈ రోజు వరకూ ఎవరినీ అభోజనంగా పంపించలేదు. ప్రతి ఆదివారం ధ్యానవర్క్షాపులు పెడుతూండేవారం. అప్పుడు ౩౦ కేజీల బియ్యం వండిన రోజులు కూడా వున్నాయి . పత్రిసార్కు అందరికీ భోజనం దగ్గరుండి పెట్టించటం ఎంత మహదానందమో చెప్పలేను .

ఇక అనుభవాల సంగతికి వస్తే .. మొత్తం భూగోళం పైనే నేను ఒక పెద్ద పిరమిడ్ కట్టినట్లు చాలాసార్లు విజన్ వచ్చింది. నాకు అర్థంకాక హైదరాబాద్ " ధ్యానజగత్ " ఆఫీస్‌లో పనిచేస్తున్నలలితా మేడమ్‌కు ఫోన్‌చేసి అడిగితే " ‘ T.V.ఛానెల్స్ ద్వారా ప్రచారం జరిగి భూలోకం నిండా పిరమిడ్లు వెలుస్తాయి ’ అని మాస్టర్స్ నీకు సందేశం ఇస్తున్నట్లు అనిపిస్తోంది " అన్నారు. ఆమె అన్నట్లుగానే వారంరోజులలోపే T.V. లో పత్రిసార్ మొట్టమొదటి ప్రసంగం ప్రసారమైంది , అలాగే ఒకసారి షక్కర్నగర్ పత్రిసార్ ఇంట్లోనే ధ్యానం చేస్తూంటే పూర్తిగా మోడువారిపోయి, ఒక్క ఆకు కూడా లేని ఎండిపోయిన పెద్ద చెట్టు కనిపించింది. నాకు చాలా బాధ అనిపించి అలా చూస్తూనే " సాక్షాత్తూ పత్రిసార్ ఇంట్లో చెట్టుకు ఇంత దురవస్థా?’ అని మనస్తాపం చెందుతూండగానే ఒక్కసారిగా ఆ చెట్టు ఆకులు, ఫల, పుష్పాదులతో నిండుగా కనిపించింది. దీని అంతరార్థాన్ని ఆశించి ఆ చెట్టును అడిగాను. వెంటనే ఆ చెట్టు " ఈ ఇంట్లో పుట్టిన పత్రీజీ నన్నే కాదు .. విసిగి వేసారిపోయి నిరాశగా, నిరాసక్తంగా, జీవచ్ఛవాలుగా వున్న సమస్త జీవరాశి జీవితాలను మళ్ళీ అర్థవంతంగా, ఫలవంతంగా చేయటానికే ఉద్భవించారు " అని చెప్పింది .

రాజశేఖర్ : పరమాద్భుతం మజీద్ ! ఈ దృశ్యం ప్రకృతికీ, పత్రిసార్కూ వున్న బలవత్తరమైన అనుసంధాన బంధాన్ని తెలుపుతోంది. అలాగే సార్‌కూ పిరమిడ్లకూ వున్నసంబంధాలు ఏమైనా తెలిసాయా ?

మజీద్ : బాసరలో పత్రీజీ 61 వ జన్మదినోత్సవం జరిగింది. ఆ రోజు రాత్రే దాదాపుగా అందరూ ఎవరి ఊళ్ళకు వారు వెళ్ళిపోయారు. పత్రిసార్ కూడా వెళ్ళిపోయారనే నేను అనుకున్నాను. మరునాటి ఉదయం నేను ఒంటరిగా వెళ్ళి బాసర ఆశ్రమ గుట్టపైన మెడిటేషన్‌కు కూర్చున్నాను. ప్రపంచంలోనే అతి పెద్దదైన పిరమిడ్ ఇక్కడ నిర్మించినట్లు కనిపించింది. సరిగ్గా పిరమిడ్ పైకోణం పైన ధారగా ఎంతో స్వచ్ఛమైన బంగారు రంగు గల నీరు పడుతున్నాయి. ఆ పిరమిడ్ నాలుగుదిక్కులా నాలుగు నక్షత్రాలు ఎంతో కాంతివంతంగా మెరిసి ఆ మెరుపులు నాలుగు పిరమిడ్లుగా మారి పెద్ద పిరమిడ్‌కు నాలుగువైపులా ఏర్పడ్డాయి. ఆ ప్రాంతమంతా ఎన్నో అందమైన కాటేజ్‌లు వున్నాయి.

నా మెడిటేషన్ పూర్తి అయ్యి నేను బయటకు వచ్చాక " పత్రిసార్ మరికొంతమంది ఊర్లోనే వున్నారు " అని తెలిసింది. సార్ మధ్యాహ్నం 2:00 గంటలకు అందరినీ బాసరలోని వ్యాసమహర్షి గుహలో ధ్యానానికి కూర్చోబెట్టారు. నేను కూడా ధ్యానంలో కూర్చుందామనుకున్నాను. కానీ సార్ " వద్దు " అన్నారు. నాకు సామూహిక ధ్యానం ఎంతో ఇష్టం. నేను ఆయనను ఎలాగో తప్పించుకోని ధ్యానంలో కూర్చున్నాను. ధ్యానానికి o.k. " చెప్పిన తర్వాత అందరినీ అనుభవాలు చెప్పమన్నారు. నన్ను పిలిచి " నువ్వు చెప్పు " అన్నారు. " మీరు నన్ను ధ్యానం చేయవద్దన్నా చేసాను కదా , మీరు వచ్చి ఎక్కడ తిడతారో అని భయంతో కూర్చున్నాను. ఇంక అనుభవాలు ఎలా వస్తాయి సార్ ?” అన్నాను. " ఈ రోజు ఉదయం వచ్చింది కదరా ! అది చెప్పు " అన్నారు. నాకు షాక్ తగలినంత పనైంది. ఉదయం ధ్యానం తర్వాత సార్‌కు కానీ, మరెవ్వరికీ కానీ నేను విషయం చెప్పలేదు. " ఆయన సర్వాంతర్యామి " అని మరోసారి ఋజువైంది. నేను మొత్తం చెప్పేశాను. సార్ నన్ను కావలించుకుని " నీకి వచ్చిన విజన్‌కు ఇంతకుముందు రాత్రే చర్చలు జరిగాయిరా T.T.D. వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు ఇక్కడ అతిపెద్ద పిరమిడ్ కట్టడానికి ఒప్పుకున్నారు. ఆ పిరమిడ్ స్వరూపమే నువ్వు ఈ రోజు ఉదయం ధ్యానంలో చూసావు " అని చెప్పేసరికి నాకు నోటమాట రాలేదు. ఆ రోజంతా ఆనందతాండవంలో ఉండిపోయాను.

రాజశేఖర్ : ఓహో ! మరో అద్భుతమైన పిరమిడ్ రాబోతోంది అన్నమాట , మీ పిల్లల గురించి ఏమైనా చెప్పండి .

మజీద్ : నా పిల్లలు " అబ్దుల్ " మరి " తబ్రేజ్ " .. నా కంటే ఎక్కువగా .. జీవరాసులను ప్రేమిస్తారు. ధ్యానం గొప్పతనం నాకు అప్పుడప్పుడే నాకు కాస్త తెలుస్తున్న రోజులలో మా ఇంట్లో చీమలబాధ పడలేక నేను " లక్ష్మణరేఖ " తెచ్చాను. అది చూసిన మా పిల్లలు " మన కడుపు నిండకపోతే మనకెంత కష్టమో వాటికీ అంతే కష్టం కదా , ఇక్కడ ఆహారం వాటికి దక్కనీయకపోగా వాటి ప్రాణాలకే హాని చేయటానికి నీకెలా మనసొప్పింది నాన్నా ? " అని నన్ను నిలదీశారు. నాకు నిలువెల్లా సిగ్గు పశ్చాత్తాపం కలిగి వెంటనే ఆ ప్రయత్నం మానేశాను.

రాజశేఖర్ : థాంక్యూ మజీద్ గారూ , మీ నుంచి చాలా మంచి సమాచారం నేనూ, నా తోటి ధ్యానులు పొందాం. చివరిగా మీ సందేశం ?

మజీద్ : పత్రీజీ అదేశాలే సందేశాలుగా భావించి హాయిగా ఆనందంగా అందరమూ బ్రతుకుదాం. తోటి మనుష్యులతో పాటుగా తోటి వృక్షజాతులనూ, ఇతర ప్రాణికోటినీ ప్రేమించుదాం. మనం పదిరెట్లు పంచితే వందరెట్లుగా తిరిగివస్తుంది ప్రేమ. ఇచ్చిపుచ్చుకుందాం ప్రేమను. మనకూ, సకలజీవరాసులకూ .. ఆకాశం, భూమి, చంద్రుడు, సూర్యుడు, పుట్టుక, చావు అంతా ఒక్కటే. అలాగే " అందరమూ ఒక్కటే " అనే ఆత్మసత్యాన్ని అర్థం చేసుకుని హాయిగా వుందాం.

 

మజీద్
షక్కర్నగర
సెల్ : +91 9951356949

Go to top