" యోగాతో సహా ఏ విద్య కూడా అనాపానసతి ధ్యానానికి సాటిరాదు "

 

రాజశేఖర్ : వీరప్ప గారూ ‘ మీ గురించి చెప్పండి

వీరప్ప : నా గురించి చెప్పేముందు నా తల్లిదండ్రుల గురించి చెప్పాలి. 10-4-09 న నా మేనల్లుడు " చందు " మా ఇంటికి వచ్చి " బ్రహ్మర్షి పత్రీజీ " గురించి .. " శ్వాస మీద ధ్యాస " ధ్యాన అవసరం గురించి మా నాన్న బసప్ప, అమ్మ గంగమ్మ గార్లకు విస్తారంగా వివరించి ధ్యానం చేయమని అభ్యర్థించాడు. అప్పటికి మా నాన్నగారు అనారోగ్యం వల్ల నడవలేని స్థితిలో ఉండేవారు. అమ్మకు విపరీతమైన నడుమునొప్పి, ఒళ్ళంతా మంటలు, రక్తపోటు. నేను అప్పటికే యోగా శిక్షకుడిని. 25 సంవత్సరాల యోగానుభవం నాది. కుమారుడుగా కొంత, యోగవిద్య తెలిసిన వ్యక్తిగా కొంత మా అమ్మానాన్నల అనారోగ్యాలు పోగొట్టడానికి .. వారి మీద ఎన్నో ప్రయోగాలు చేసి ఏ ఫలితం లేకపోయేసరికి విసిగిపోయి వున్నాను. మా అమ్మా నాన్న చందూ చెప్పినట్లుగా ధ్యానం చేయటం మొదలుపెట్టారు.

రాజశేఖర్ : వాళ్ళను చూసి మీకు ఇన్స్పిరేషన్ కలిగిందా ?

వీరప్ప : లేదు. లేదు. కళ్ళుమూసుకుని కూర్చుంటే రోగాలు ఎలా పోతాయి ?? ముసలితనంలో వచ్చే అనేక ఛాదస్తాలలో ఇది కూడా ఒకటిగా భావించేవాడిని. కానీ మా అమ్మ కేవలం నెలరోజులకే ఒళ్ళు మంటలు, రక్తపోటు కూడా పూర్తిగా పోగొట్టుకుంది , మరో నెలాపదిరోజులకు నడుమునొప్పి కూడా పోయింది. నాకు కొంత ఆశ్చర్యమేసినా " ఏదో కాకతాళీయంలే " అని పట్టించుకోలేదు. సరిగ్గా రెండునెలల ఇరవైరెండు రోజులకు మా నాన్నగారు కూడా ఒక అర ఫర్లాంగు, ఒక ఫర్లాంగు కూడా నడిచి వచ్చేవారు, అంతకుముందు పదిగజాలు నడిస్తే గొప్ప అది కూడా ఎవరిమైనా పట్టుకుంటేనే

రాజశేఖర్ : వారిద్దరూ ఎంతసేపు ధ్యానం చేసేవారు ?

వీరప్ప : ఇద్దరూ కూడా మొదట్లో పూటకు గంట చొప్పున, ఆ తర్వాత రెండుపూటలా రెండేసి గంటలు చేసేవారు. ఇలా మూడునెలలు గడిచాక మా నాన్నగారు నిజామాబాద్ బంధువుల ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. బస్సులో ఊరికే కూర్చోవటం ఎందుకని ఆయన ధ్యానం చేయటం మొదలుపెట్టారట. మొదలుపెట్టిన రెండవ క్షణమే ఆయన తన ఉనికిని మరిచిపోయేంత గాఢస్థితిలోకి వెళ్ళిపోయారట. గంటలు గంటలు చేసినప్పుడు కూడా రానంత విశ్వశక్తి ఆయన శరీరమంతా నిండిపోయి " నిజామాబాద్ వచ్చింది " అని కండక్టర్ చెప్పేవరకు బాహ్యస్మృతిలో లేరట. బస్సు దిగగానే ఒళ్ళంతా దూదిపింజలా అయిపోయినట్లు అనిపించిందట. మా బంధువుల ఇల్లు బస్‌స్టాండ్‌కు నాలుగు కిలోమీటర్లు. ఎవరైనా ఆటో ఎక్కాల్సిందే. కానీ ఆయనకు " నాలుగు కిలోమీటర్లు ఒక లెక్కా " అనిపించిందట , అలా అనిపించటంతో .. ఆ వెంటనే ఆయన యువకుడిలాగా నడిచి మా బంధువుల ఇంటికి చేరారట. ధ్యానం మొదలుపెట్టిన దగ్గరి నుంచి మా తల్లిదండ్రులు మందులు మానేశారు. మందులూ లేవూ, పథ్యాలూ లేవు, యోగశిక్షణా లేదు. కేవలం ధ్యానం వలన వారికి కలిగిన లాభాన్ని కళ్ళారా చూసిన నేను కొంత ఆలోచనలో పడి 12-7-09 న బోధన్‌లో జరిగిన ధ్యాన వార్షికోత్సవానికి వెళ్ళి ధ్యానం పట్ల ఆకర్షితుడనయ్యాను. ఆ రోజు నుంచి ఈ క్షణం వరకు నాకు ధ్యానమే ప్రాణంగా మారింది , ప్రతిరోజూ చేతనైనంతా ఎక్కువ ధ్యానం చేయటమే కాక ధ్యానప్రచారం ఎక్కువగా చేయాలనే మక్కువ " నా జీవితధ్యేయం " గా మారింది.

రాజశేఖర్ : ధ్యానానికి ముందు మీకు ఏమైనా మానసిక , శారీరక సమస్యలు వుండేవా ?

వీరప్ప : ఆరోగ్యపరంగా " యోగా " నాకు చాలా మేలు చేసింది. 50 సంవత్సరాల వయస్సు వచ్చినా నాకు తలనొప్పి కూడా ఎప్పుడూ రాలేదు. కానీ మానసిక సమస్యలు చాలా ఎక్కువ. " కీడెంచి మేలెంచు " అనే పాత సామెత నా మనస్సులో చిన్నప్పుడే ముద్రపడిపోయింది. ఏ పని మొదలుపెట్టినా " దానిని విజయవంతం చేయగలను " అనే ఆత్మవిశ్వాసం నాకు వుండేది కాదు .. అలజడి, భయం నా తోబుట్టువులలా వుండేవి. పిల్లి ఎదురైనా, ఎవరైనా తుమ్మినా ఆ రోజంతా ఆందోళనగా వుండేది. ఈ అవలక్షణాలన్నీ పోవటానికి నేను పూజాది కార్యక్రమాలు చేపట్టాను. విపరీతమైన పూజలు చేసేవాడిని. నాకు వచ్చినన్ని మంత్రాలు, స్తోత్రాలు, జపాలు కొంతమంది బ్రాహ్మణులకు కూడా రావేమో " గుళ్ళు కట్టిస్తే భయాలు పోతాయి " అని ఎవరో చెబితే .. ఎవరు గుడి కట్టిద్దామని అనుకున్నా నేను ముందుండి నా శాయశక్తులా సహకారం అందించి గుళ్ళు కట్టించేవాడిని. దానిలోనే మోక్షమార్గం వుందని భ్రమలో అలా కట్టించేవాడిని. ఇన్ని చేసినా తీరని అశాంతి, అంతులేని ఆందోళనలతో చేసిన ప్రతి పనిలోనూ అపజయం కలిగేది.

అయితే ధ్యాన పరిచయం తర్వాత నా సరిక్రొత్త జీవితం ప్రారంభమైంది. అదే ధ్యానజీవితం, చెప్పలేనంత ఆత్మవిశ్వాసం, దృఢసంకల్పం, ఏదైనా సాధించగలననే నమ్మకంతోపాటు అవి సాధించటం కూడా సాధ్యమైంది. ఇప్పుడు ‘ నేను ’ అంటే భయానికే భయం .. ఆందోళనకే ఆందోళన.

ఇంతకుముందు జన్మలో ధ్యానం చేస్తూ చేస్తూ మానివేసి ప్రక్కదారి పట్టినందువలన ఇంతకుముందు చెప్పిన ఇబ్బందులు కలిగాయి " అని ఒక గ్రేట్ మాస్టర్ చెప్పారు. నా ధ్యానసాధనలో అది ధృవీకరించబడింది కూడా. ధ్యానంలోకి రాకముందు " మన తలవ్రాత బ్రహ్మ వ్రాస్తాడు " అని మా పెద్దలు చెప్పిన మాట నమ్మి " విధిలిఖితం ఎలా వుంటే అలా జరుగుతుంది .. మనం చేయగలిగింది ఏమిలేదు " అనిపించేది. ఇప్పుడు " మన తలవ్రాత మనమే వ్రాసుకుని వస్తాం " అనీ .. " అవసరాన్ని బట్టి దాన్ని మనం ధ్యానం ద్వారా మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు " అనీ అర్థమై ముక్తిమార్గం వైపుకు పయనిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా వుంది.

రాజశేఖర్ : ఇంత అద్భుత ధ్యానాన్ని మనకందించిన పత్రిసార్ పరిచయం గురించి చెప్పనే లేదు

వీరప్ప : నేను ధ్యానాన్ని పూర్తిగా నమ్మి ధ్యానసాధన చేస్తూన్న రోజుల్లో సిద్ధిపేట " దుర్గారెడ్డి మాస్టర్ " మా ఊర్లో మా ఇంటి దగ్గరలో క్లాస్ చేసారు. నేను ఆ క్లాసుతో విపరీతంగా ప్రభావితుడనై దుర్గారెడ్డి గారి సలహాతో " కేర్ సెంటర్ " పెట్టాను. దాని ప్రారంభోత్సవానికి నిజామాబాద్ మాస్టర్ సాంబశివరావు గారు కూడా వచ్చి ధ్యానం చేసారు. అప్పుడు ఆయనకు ఎందరో ఆస్ట్రల్ మాస్టర్స్ ఆ కేంద్రంలో కనిపించారట , ప్రారంభోత్సవానికి వచ్చిన ధ్యానుల కంటే వారే ఎక్కువ సంఖ్యలో ఉన్నారట , అంతలోనే మల్లెపువ్వు లాంటి తెల్లని బట్టలతో పత్రిసార్ వచ్చి కూర్చున్నారట , ఈ విషయం ఆయన చెబుతూన్నప్పుడు సరిగ్గా అప్పుడే పత్రిసార్ నుంచి ఫోన్ వచ్చింది , " ఇంత మంచి పని చేస్తున్నందుకు నీకు నా అభినందనలు " అన్నారు ఆయన. అదే మొదటిసార్ సార్‌తో మాట్లాడటం .. ఆయన స్వరం వినటం వల్ల నేను ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయి ఎక్కువ మాట్లాడలేకపోయాను. అత్యంత అద్భుతమైన విశేషం ఏమిటంటే సార్ వచ్చింది ఆస్ట్రల్గా కానీ మరుసటిరోజు లోకల్ పేపర్లో పత్రిసార్ ఫిజికల్‌గా వచ్చి క్లాస్ చెప్పారనీ .. ఆయన ప్రసంగం అందరినీ అపరిమితంగా ఆకట్టుకుందనీ న్యూస్ వచ్చింది. ఇదో పెద్ద మిరాకిల్, తర్వాత మారం శివప్రసాద్ గారి ఇంట్లో ప్రత్యక్షంగా చూసాను. ఆయన చాలా స్నేహశీలిగా మాట్లాడారు.

నాకు అనేకసార్లు వచ్చిన అనుభవాలు ఏమిటంటే నేను నా అవసర నిమిత్తమై ఎవరినైనా కలవాలనుకుంటే వాళ్ళే వచ్చి నన్ను కలిసేవారు. అలాగే ఎవరైనా నా మీద కోపంగా వుంటే నేను ధ్యానంలో కూర్చుని " మీకు నేను ప్రేమ తరంగాలను పంపిస్తున్నాను " అని మనస్ఫూర్తిగా అనుకునేవాడిని. అతి తొందరలో వారు మారి నాతో ప్రేమగా ప్రవర్తించేవారు ! ఆఖరికి మన చావు కూడా మన చేతుల్లోనే వుంది. కావలసిందల్లా గట్టి సంకల్పబలం + అపరిమిత ధ్యానం .. అవి నేను సాధించుకోగలిగాను. ఏ కష్టం వచ్చినా దాని ద్వారా మనం ఏదో ఒకటి నేర్చుకుంటున్నామని కూడా తెలుసుకున్నాను. సంతోషకరమైన విషయాలు చెప్పటం, వినటం, చూడటం వలన మనం ప్రశాంతంగా వుంటూ అందరినీ ప్రశాంతంగా ఉంచగలం.

నా జీవితం పత్రీజీకి అంకితం. ఆయనంత గొప్ప దేవుడు మనకు దొరకటం వేయిజన్మల ధ్యానసుకృతం. అంతటి గొప్ప మహాత్ములు మనకు అత్యంత సన్నిహితులుగా వుండటం మనకు ఒక పెద్ద వరం. ఆయన ఆశయాలు ప్రచారం చేయటమే మన తక్షణ కర్తవ్యం. ఆ దేవదేవుని జన్మస్థలం అయిన ‘ షక్కర్నగర్ ’ లో గొప్ప మెగా పిరమిడ్ కట్టించడానికి మనమంతా నడుంకట్టాలి. అందుకు ఏర్పాటుచేసిన ట్రస్టుకు నన్ను సెక్రెటరీగా నియమించటం వారి కృపకు తార్కాణం. వారి పాదపద్మాలకు సదా నా ప్రణామాలు. నేను ఉన్నతమైన మార్గంలోకి రావటానికి కారణమైన నా తల్లిదండ్రులకూ, సిద్ధిపేట మాస్టర్ దుర్గారెడ్డి గారికీ, నిజామాబాద్ సాంబశివరావు గారికీ, బండిపల్లి రామయ్య గారికీ, వైజాగ్ సత్యవతి మేడమ్కూ నా ధ్యానవందనాలు.

రాజశేఖర్ : చివరిగా మీ సందేశం చెప్పండి !

వీరప్ప : " యోగా " తో సహా ప్రపంచంలోని ఏ విద్యా కూడా ఆనాపానసతి ధ్యానానికి సాటిరాదు. మీరు మిగతా విద్యలు నేర్చుకున్నా, నేర్చుకోకపోయినా ఇదొక్కటి నేర్చుకుంటే సమస్త విద్యలూ కరతలామలకం అవుతాయి ; వీరబ్రహ్మేంద్రస్వామి, వేమన కూడా ఇదే చెప్పారు.

 

B. వీరప్ప
నిజామాబాద్
సెల్ : +91 9440090704

Go to top