" ధ్యానంలోకి వచ్చిన తరువాత నా వ్యాపారం ఎన్నోరెట్లు పెరిగింది "

శ్రీ వెలగపూడి లక్ష్మణరావు గారు .. గుంటూరు జిల్లాను " ఆధ్యాత్మిక గుంటూరు జిల్లాగా మార్చడానికే జన్మ తీసుకున్న గొప్ప మాస్టర్. 2004 లో కొడైకెనాల్ ట్రెక్కింగ్ సందర్భంలో పత్రీజీ " 1,44,000 మంది పిరమిడ్ మాస్టర్లు ఈ భూమి పైన వివిధ ప్రాంతాలలో వున్నారు. వారు రావలసిన సమయం వచ్చేసరికి ఒక్కసారిగా వచ్చేస్తారు " అన్నట్లు 2006 లో పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీలోకి లేట్‌గా వచ్చిన లేటెస్ట్ మాస్టర్ శ్రీ లక్ష్మణరావు గారు ఇంటర్వ్యూలో అమరావతిలో " ధ్యాన మహాచక్ర " జరుపుకోబోయే విధానం .. మన కళ్ళకు కట్టినట్లుగా తెలియజేస్తున్నారు. వారికి " ధ్యానాంధ్రప్రదేశ్ " ధన్యవాదాలు.

మారం శివప్రసాద్


మారం : లక్ష్మణరావు గారూ. మీ గురించి చెప్పండి.

లక్ష్మణరావు : నా పేరు లక్ష్మణరావు ; ఇంటి పేరు వెలగపూడి. P.U.C మూడుసార్లు తప్పాను. వయస్సు 62 సంవత్సరాలు. మా తండ్రిగారు కీర్తిశేషులు శ్రీ " వెలగపూడి వీరరాఘవయ్య ". తల్లి " వెంకటరత్నమ్మ ". చక్కగా ధ్యానం చేస్తూ ఆరోగ్యంగా మాతో వుంటోంది.

మేము ఇద్దరం కవల సోదరులం. మా అన్న రామారావు. ఈయన కూడా నాలాగే విజయవాడలో కాంట్రాక్టర్. మా తమ్ముడు వెంకటేశ్వరరావు మిలటరీలో పనిచేసి వచ్చాడు. ఇద్దరు అక్కచెల్లళ్ళు.

మాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్దవాడు రఘువీర్ ప్రతాప్, చిన్నవాడు కృష్ణప్రసాద్. ఇద్దరూ U.K. లో MS & MBA చేసి వచ్చి నా వ్యాపారం చూసుకుంటున్నారు. నా శ్రీమతి " ఉషారాణి ". మరి ఒకటిన్నర వయస్సున్న మనవళ్ళు ఇద్దరు జయదేవ్, అర్జున్‌లు. మరి కోడళ్ళు ఇద్దరూ అక్కచెల్లెళ్ళే. ఇదీ నా కుటుంబం.

మారం : ధ్యానం ఎప్పటినుంచి ప్రారంభించారు ? బ్రహ్మర్షి పత్రీజీ ని ఎప్పుడు ఎక్కడ కలిశారు ? ఎవరి ద్వారా ధ్యానంలోకి వచ్చారు ??

లక్ష్మణరావు : 2006 జనవరి మొదట్లో బ్రహ్మర్షి పత్రీజీ ని విజయవాడలో కలుసుకున్నాను. అయితే ఐదు నిమిషాలు కూడా ధ్యానం చేయలేకపోయాను. అయితే జనవరి 15 నుంచి మెడిటేషన్ మొదలుపెట్టాను. నేను మా కారు మెకానిక్ గుంటూరు జిల్లా మొదటి సీనియర్ పిరమిడ్ మాస్టర్ " శ్రీధర్ " ద్వారా ధ్యానంలోకి వచ్చాను " స్పిరిచ్యువల్ రియాలిటీ CD " చూసి పత్రీజీని కలిశాను.

నేను ధ్యానం మొదలుపెట్టిన పదిహేనురోజులలోపే " స్పిరిచ్యువల్ రియాలిటీ CD " లో చూపించవన్నీ ధ్యానంలో దర్శించాను , నేను పొందిన అనుభవాలు అందరూ పొందాలనే ఉద్దేశ్యంతో ఆ తరువాత పదిహేనురోజులకే మా ఇంటిపైన పూలమొక్కల మధ్య రాష్ట్రంలోనే మొట్టమొదటి A.C. పిరమిడ్ 15x15 కొలతలతో కట్టాను .

అంతకుముందు అనారోగ్య రీత్యా రోజువారీ గుప్పెడు మాత్రలు మింగేవాడిని. ధ్యానం చేయడం మొదలుపెట్టిన 2006 జనవరి 15 నుంచి ఈ రోజు వరకు ఒక్క టాబ్లెట్ కూడా మింగలేదు. ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా వున్నాను , ధ్యానంలో రకరకాల రంగులు కనిపించి ఆస్ట్రల్ ట్రావెల్ జరిగేది.

మొదట్లో నాకు " హీలింగ్ " అంటే ఏమిటో కూడా తెలియదు. ధ్యానంలోకి వచ్చిన కొత్తలో మా స్నేహితుడు ఒకరిని విజయవాడ స్టేషన్లో ఐదవ నంబర్ ఫ్లాట్‌ఫామ్ మీద ఎక్కించాలి. అతనేమో అనారోగ్యంతో నిలబడలేని స్థితిలో వున్నాడు. ఆలోచిస్తూ ఆయన చేయి పట్టుకున్నాను. మా ఇల్లు రెండవ అంతస్థులో వుంది. ఆ మెట్లు రెండు రెండుగా ఎక్కడం నాకు అలవాటు. అలాగే రైల్వేస్టేషన్లో మా స్నేహితుడి చేయి పట్టుకుని రెండు రెండు మెట్లు గబగబా ఎక్కాను. అతడు కూడా నా వెంట అంతే వేగంగా ఎక్కి నడిచి మళ్ళీ మెట్లు దిగి రైల్లో కూర్చుని " నేను రిలాక్స్డ్గా వున్నాను " అని చెప్పాడు. ఉన్నాడు కూడా.

ఇంకొకసారి " పొన్నూరు సత్యనారాయణ గారు " అని .. గుంటూరులో పత్రీజీ ని పరిచయం చేసినవారు ఆయన. నేను షిర్డీ ధ్యానయజ్ఞంకు బయలుదేరుతూంటే ఆయనకు ఊపిరి ఆడనంత విపరీతమైన దగ్గుగా వుంది. డాక్టర్ దగ్గరకు వెళ్ళే ఓపిక కూడా లేదు. " నాకోసం ధ్యానం చేయండి ; నాకు హీల్ చేయండి " అన్నారు ఫోన్లో. మరుసటిరోజు ఉదయం నాకు ఫోన్ చేసి " రాత్రి మీతో మాట్లాడిన తరువాత నాకు చాలా స్వస్థతగా వుంది ; మళ్ళీ ఇప్పటివరకు దగ్గు కూడా రాలేదు " అన్నారు. అప్పుడు నాకు అర్థమైంది " నాలో హీలింగ్ చేసే పవర్ వుంది " అని. ఆ తరువాత నేను ఎవరికీ అదేపనిగా హీల్ చేయలేదు. ధ్యాన ప్రచారం చేస్తూన్నవాళ్ళకు అవసరమైతే నేను హీల్ చేస్తాను. ఆ తరువాత షిర్డీలో పత్రీజీకి ఈ విషయం చెబితే ఆయన " నాకు జలుబుగా వుంది హీల్ చెయ్యవయ్యా " అని నా చేయి తన తలపైన పెట్టుకోబోతే సిగ్గుపడి లాక్కున్నాను. ఇదీ కథ.

మారం : మీరు ఆత్మలతో మాట్లాడగలుగుతున్నారు. ఎవరినైనా గైడ్ చేసి వారు తమ సూక్ష్మశరీరయానంలో ఆత్మలతో మాట్లాడే ఛానెలింగ్ చేయగలుగుతున్నారు. దాన్నిగురించి వివరించండి

లక్ష్మణరావు : ఆత్మలతో ఛానెలింగ్ చేయడం కూడా సహజంగానే వచ్చింది. రాజుపాలెం ( గుంటూరు జిల్లా ) అనే ఊళ్ళో ఒక " మాతాజీ " వున్నారు. ఇరవై సంవత్సరాల నుంచి ఆవిడ బయటకు రాలేదు. ఒక ఇంట్లో " బాలయోగి " లాగా సమాధిస్థితిలో వున్నారు. ఆవిడ చిన్నప్పటినుంచే ధ్యానం చేస్తున్నారు. ఆమె ఆశ్రమం ముందు కూర్చుని మా కారు డ్రైవర్ చేయి పట్టుకుని ఆస్ట్రల్ ట్రావెల్ చేసి మాతాజీతో మాట్లాడి రమ్మని చెబితే .. మా డ్రైవర్ నా చేయి పట్టుకుని ధ్యానం చేసి తన ఆస్ట్రల్ బాడీతో మాట్లాడాడు. నేను ప్రశ్నలు వేస్తూ వుంటే మా డ్రైవర్ ఆస్ట్రల్ బాడీ ఆవిడతో మాట్లాడుతూ ప్రశ్నలకు సమాధానం చెబుతున్నాడు. " మీరు ఎప్పుడు బయటకు వస్తారు ? " అంటే " 2012 లో " అని మరి ఆ తరువాత " మళ్ళీ 2016 లో బయటకు వస్తాను " అని మాతాజీ చెప్పారు. " అమరావతి ధ్యానమహాచక్రం " గురించి అడిగితే " మీరు అనుకుంటున్న దానికంటే పదిరెట్లు గొప్పగా జరుగుతుంది " అని చెప్పింది ఆ మాతాజీ ఆత్మ. " ఇందుకు మాకు ఏదైనా ఒక సాదృశ్యం చూపించండి " అని అడిగాం ఆ మాతాజీని. " కొంచెంసేపట్లో మీకు ఒక శ్వేతనాగు దర్శనమిస్తుంది ; ఇదే మీకు నిదర్శనం " అని చెప్పింది ఆ మాతాజీ. ఆమె చెప్పినట్లుగానే కాసేపట్లో ఒక ధవళవర్ణం కలిగిన పాము ( శ్వేతనాగు ) భౌతికంగా మా ముందు నుంచి ప్రాకుతూ వెళ్ళిపోయింది. నేను, మా ఆవిడ, మా డ్రైవర్ కళ్ళారా చూశాం ఇది , దీన్ని నేనేమీ ‘ గొప్ప ’ గా ఫీల్ కాను. ఎందుకంటే పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీలో ఎందరో మాస్టర్లు ఎన్నో దివ్యశక్తులు కలిగినవాళ్ళు వున్నారు , ఇది సత్యం .

మారం : 2006 నుంచి మీరు గుంటూరు జిల్లాలో చేసిన ధ్యాన ప్రచారం గురించి చెప్పండి

లక్ష్మణరావు : 2006 జనవరి 15 న ధ్యానం మొదలుపెట్టిన నేను 30 వ తేదీ నుంచే .. ధ్యాన ప్రచారం మొదలుపెట్టాను , రాష్ట్రంలో వున్న సీనియర్ మాస్టర్లందరినీ ఆహ్వానించడం .. వారితో క్లాసులు పెట్టించడం చేశాను. విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లో ఏ సీనియర్ మాస్టర్ వచ్చినా వారిని వదిలిపెట్టకుండా క్లాసులు ఏర్పాటుచేశాను. కొత్తలో పుస్తకాలు, క్యాసెట్లు అన్నీ కొని పంచడం మొదలుపెట్టాను.

అప్పట్లోనే " ధ్యాన ఘంటసాల శరత్చంద్ర " గారి ప్రోగ్రామ్ గుంటూరులో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. సమయం కూడా నాకు బాగా అనుకూలించింది. ఉధృతంగా ధ్యాన ప్రచారం జరిగింది.

" రాజకీయ ధ్యానమహాయజ్ఞం " ఎనిమిదిరోజుల పాటు గుంటూరు NTR స్టేడియంలో 2009 ఫిబ్రవరి నెలలో చేశాం. చాలా బాగా విజయవంతం అయింది. మొదటిరోజు మీతోనే మొదలుపెట్టి 1,500 మంది వస్తే .. చివరిరోజు పత్రీజీ ప్రోగ్రామ్‌కు 3,000 మంది వచ్చారు. నేను అప్పుడు పత్రీజీ వెంట గీజా పిరమిడ్‌కు వెళ్ళాలనుకున్నాను. అయితే ఈ రాజకీయ జ్ఞానయజ్ఞం కోసం ‘ గీజా ’ కు వెళ్ళాలనుకున్న డబ్బు ఇలా ఇంకా బాగానే ఖర్చుపెట్టి వైభవంగా చేశాం. " NTR స్టేడియం నిండేలా గుంటూరులో ఒక ప్రోగ్రామ్ చేయాలని చాలా రోజుల నుంచి నాకు ఒక సంకల్పం వుండింది ; అది ఈ రోజు నెరవేరింది " అన్నారు పత్రీజీ. అలా మేము మొదలుపెట్టిన " రాజకీయ ధ్యాన మహాయజ్ఞం " మిగతా అన్ని జిల్లాల్లో చేయడానికి మార్గదర్శకమైంది.

మారం : శ్రీ శైలం ధ్యానమహాయజ్ఞం వేదికపై బ్రహ్మర్షి పత్రీజీ " ఇంతవరకు పదకొండు ‘ ధ్యాన మహాయజ్ఞాలు ’ జరిగాయి. ఇక అన్నీ ‘ ధ్యానమహాచక్రాలు ’ జరుగుతాయి " అంటూ కరతాళధ్వనులు మిన్నుముడుతూండగా .. " అది కూడా కృష్ణాతీరంలో పంచారామ శైవక్షేత్రమైన అమరావతిలో " అని కూడా ప్రకటించారు , దీని వెనుక జరిగిన నేపథ్యం ఏమిటి ? " అమరావతి " గురించి ఎప్పుడు ఎక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

లక్ష్మణరావు : శ్రీశైలం ప్రోగ్రామ్ ఇంకా ఒక నెల వుంది అనగానే నేను ఎవరి నోట్లోనో విన్నాను " వచ్చే సంవత్సరం అమరావతిలో ప్రోగ్రామ్ చేస్తే ఎలా వుంటుంది " అని. ఈ విషయం విని నేను పత్రీజీతో " సర్ , అమరావతిలో ధ్యానమహాయజ్ఞం చేయడానికి నాకు అవకాశం ఇవ్వండి. ఎంత ఖర్చయినా నేను భరిస్తాను " అన్నాను. ఆ తరువాత శ్రీశైలంలో వేదికపై పత్రీజీ మాట్లాడుతూ " ఇక అన్నీ ధ్యానమహాచక్రాలు వుంటాయి. ధ్యానమహాయజ్ఞాల అవసరం పూర్తయింది ; ఇక మనం చేయవలసింది శ్రీకృష్ణుడిలా చక్రం తిప్పడమే. అందుకే ఇక అన్నీ ధ్యానమహాచక్రాలు " అని ప్రకటించారు అమరావతి గురించి.

నేను శ్రీశైలంలో మళ్ళీ అడిగాను పత్రీజీని, అమరావతిలో ప్రోగ్రామ్ చేసే అవకాశం నాకు ఇమ్మని. అంతకు నెలరోజుల ముందు చర్చించినప్పుడు " వసతిసౌకర్యాలూ, ఇంకా చాలా విషయాల్లో ఇబ్బంది పడతావేమో, చూసుకో " అన్నారు. " నేను అన్నీ గమనించుకోగలను సార్ .. నాకు అవకాశం ఇవ్వండి " అన్నాను. నాకు అంతకుముందు అమరావతిలో జరిగిన " కాలచక్ర " గుర్తుంది. " మరి వాళ్ళు అమరావతిలో అంత పెద్ద ప్రోగ్రామ్ నిర్వహించినప్పుడు ఇంత పెద్ద సొసైటీ, ఇంతమంది మాస్టర్లు వుండి స్థానికులమైన మనం ఇంకా బాగా నిర్వహించగలం " అని పత్రీజీకి విన్నవించుకున్నాను నేను.

పత్రీజీ .. " ఇక అన్నీ ధ్యానమహాచక్రాలు. మొట్టమొదటిది అమరావతిలో " అని ప్రకటించి నా విన్నపాన్ని మన్నించి నన్ను ధన్యుణ్ణి చేసారు. సమిష్టి కృషితో పిరమిడ్ మాస్టర్లు అందరం కలిసి అమరావతిలో ఒక అద్భుతాన్ని చేయగలం. ఈ రోజు ఈ అవకాశం రావడం నా మాహాభాగ్యం .

2010 జనవరి 2 తేదీనే అమరావతి వెళ్ళాను. " ప్రోగ్రామ్ ఎక్కడ చేస్తే బాగుంటుంది ? " అని స్థలాలు చూశాం. నాకు గుంటూరు జిల్లాలో ధ్యాన ప్రచారానికి కుడిభుజం నెక్కల్లు అబ్బూరి కోటేశ్వరరావు. ఏం చేసినా మేమిద్దరం కలిసే చేస్తాం. మరి అలాగే 2010 జనవరి 2 వ తేదీన అమరావతిలో ఎన్నో స్థలాలు చూశాం. అన్నిటికంటే కూడా A.P. టూరిజమ్ వారి నిర్మాణంలో వున్న గౌతమబుద్ధుని విగ్రహం ఎదురుగా .. కృష్ణాతీరంలో ఉత్తరం, తూర్పుల్లో కృష్ణానది ప్రవహిస్తోంది. అక్కడ " పదహారు ఎకరాల " స్థలం వుంది. " కాలచక్ర " ప్రోగ్రామ్ అక్కడే జరిగింది. చాలా చక్కటి స్థలం. అందుకని వెంటనే ఆ స్థలాన్ని ఒక సంవత్సరం పాటు కౌలుకు తీసుకున్నాం. ఇక మిగతా కార్యక్రమాల పట్ల మా ప్రణాళికను రూపొందించుకోవడం మొదలుపెట్టాం క్రమంగా.

మార్చి నెల 11 వ తేదీన పత్రీజీ అమరావతి వచ్చినప్పుడు అక్కడ మేము పత్రీజీచే ఒక " స్పిరిచ్యువల్ కేర్ సెంటర్ " ప్రారంభింపజేసాం. ఆ రోజే పత్రీజీ ఆ స్థలాన్ని చూసి " చాలా బాగుంది " అని అభినందించి ‘ o.k ’ చేశారు. ఇక మా ప్రణాళికలోని పనులు మొదలయ్యాయి.

" ధ్యానమహాచక్ర " జరుపుకోబోయే స్థలంలో నిర్మాణంలో వున్న బుద్ధవిగ్రహం చాలా పెద్దది. ఆ నిర్మాణంలో ఇంకా పనులున్నాయి. ఆ విగ్రహం తుదిమెరుగులు పెట్టించి రంగులు వేయించేలా A.P. టూరిజమ్ డిపార్ట్మెంట్ వైపు అడుగులు వేస్తున్నాం. ఆ పని పూర్తిచేసి ధ్యానమహాచక్రానికి హంగు తీసుకువస్తాం. పదహారు ఎకరాల స్థలం కౌలుకు తీసుకున్నాం కదా , స్థలం అంతా సర్వే చేయిస్తున్నాం. శ్రీశైలం కంటే మూడునాలుగురెట్లు అధికంగా ధ్యానులు వస్తారు కనుక ఆ స్థాయిలో పనులు చేయడానికి వీలుగా ఆ స్థలంలో పంట వేయకుండా మనపరం చేసుకున్నాం. కౌలుకు డబ్బు కట్టేశాం. అమరావతి సర్పంచ్ గారి సహాయం తీసుకున్నాం.

ఈ క్రమంలో .. ఫిబ్రవరి 15 ప్రాంతంలో .. ఒకరోజు నేను రేపల్లెలో వుండగా పత్రీజీ నాకు ఫోన్ చేసి " నీ గుండె ఆగిపోయే ఒక విషయం చెబుతాను జీర్ణించుకుంటావా ? " అన్నారు. " మీకు ఇష్టమైన శిష్యుడిని అయిన తర్వాత నా గుండె ఎందుకు ఆగిపోతుంది సార్ చెప్పండి " అన్నాను. " అలా కాదమ్మా నీకు ఖర్చు ఎక్కువవుతుంది " అన్నారు. " ఫర్వాలేదు, చెప్పండి సార్ " అన్నాను. " ‘ ధ్యానమహాచక్రం అమరావతిలో ’ అని ప్రకటించాను శ్రీశైలం వేదికపైన. అయితే దాన్ని ఇప్పుడు ఏడురోజులకు బదులుగా పదకొండురోజులు డిసెంబర్ 21 నుంచి 31 వరకు నిర్వహించబోతున్నాం , సిద్ధమేనా ? " అని అడిగారు.

" నాకేంటి సార్ , మీరు పైన వున్నారు. మధ్యలో ప్రకృతి వుంది. క్రింద పిరమిడ్ మాస్టర్స్ వున్నారు. నాకేం భయం సార్ ? మరింత అద్భుతంగా చేద్దాం " అన్నాను.

మారం : మరి " ఒక లక్షమంది తక్కువ లేకుండా ప్రతిరోజూ ధ్యానులు హాజరవుతారు " అని అంచనా స్థిరమైంది. దానికి తగినట్లుగా ఎంత స్ట్రక్చర్ వేయించబోతున్నారు ? మిగతా ఏర్పాట్లు ఏంటి ? మరి కిచెన్, డైనింగ్‌హాల్ వివరాలు ?

లక్ష్మణరావు : స్ట్రక్చర్ 650 అడుగులు * 450 అడుగులు. మెయిన్ మీటీంగ్ హాల్‌గా నిర్ణయించుకున్నాం. అంటే మూడులక్షల చదరపు అడుగుల షెడ్ ధ్యానులు కూర్చోవడానికి. ఆ తరువాత భోజనాల కోసం నాలుగుమూలలా నాలుగు డైనింగ్‌హాల్స్ ఒక్కొక్కటి పాతికవేల మందికి మొత్తం లక్షమంది భోజనం చేసేవిధంగా. వంటశాల మాత్రం నాలుగింటినీ అనుసంధానం చేసేలా ప్లాన్ చేస్తాం. ఎవ్వరూ ఇబ్బంది పడకుండా వుండాలి. రోజుకు లక్షమంది దాటినా మనం సముదాయించుకోగలుగుతాం. శ్రీశైలంలో అత్యధికంగా ఒక్కరోజు 30,000 మంది టచ్ అయ్యారు అనుకుంటే అక్కడ మొత్తం 95,000 చదరపు అడుగుల షెడ్ వేశారు. మనం ఇక్కడ దానికంటే ఐదురెట్లు మొత్తం మెయిన్ స్ట్రక్చర్, కిచెన్, డైనింగ్‌హాల్ కలిపి ఐదు లక్షల చదరపు అడుగులు వచ్చేలా ప్లాన్ చేస్తున్నాం.

" పదహారు ఎకరాల ఏరియా " ను సమగ్రంగా సర్వే చేయించి స్కెచ్ వేయిస్తాం. దగ్గరలో వున్న కాలేజీలు, స్కూళ్ళ వాళ్ళందరినీ వారి వారి స్థలాలు ఇమ్మని రిక్వెస్ట్ చేశాం. అందరూ సహకరించడానికి సిద్ధంగా వున్నారు. స్థానిక సర్పంచ్‌తో, ఇతర నాయకులతో సహాయం పొందుతున్నాం. అమరావతివాసులు కూడా ఈ ప్రోగ్రామ్ గురించి ఎదురు చూస్తున్నారు. లక్ష కాదు కదా లక్షపాతికవేలు అంచనాతో పనులు మొదలుపెడుతున్నాం. వేదికకు దారులు కూడా V.V.I.P. లకు, V.I.P. లకు, వృద్ధులకు, పిల్లలకు ఎలా ఎలా ఇబ్బంది కాకుండా, మరింత వసతి వుండేలా ప్లాన్ చేస్తున్నాం. ఎక్కడా ఏ త్రొక్కిసలాట లేకుండా మన పిరమిడ్ మాస్టర్ల సహాయం పూర్తిగా తీసుకుని పనిచేస్తాం.

అలాగే పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్మెంట్ వెబ్సైట్లో వున్న కార్యక్రమాల్లో ఎన్నో అద్భుతమైన విషయాలు వున్నాయి. మరి ఇతర వెబ్సైట్లలో శాకాహారం, ధ్యానం వున్న వెబ్సైట్లకు బ్రహ్మర్షి పత్రీజీ అనుమతి తీసుకుని వారందరికీ సమాచారం అందేలా చూడాలి , మన ప్రోగ్రామ్ గురించి మరి ఆ పదకొండురోజులూ లైవ్‌గా ఇతర ఆ యా వెబ్సైట్లకు కూడా అందేలా ప్లాన్ చేస్తాం.

అంతేకాకుండా పదకొండురోజులు కూడా ఇతర ఆధ్యాత్మిక సంస్థల గురువులు పదకొండుమందిని కూడా పదకొండు రోజుల్లో హాజరయ్యేట్లుగా బ్రహ్మర్షి పత్రీజీ అనుమతితో ఆహ్వానాలు అందించి " గురువులందరూ హాజరయ్యేలా చూడాలి " అనేది మా ప్రణాళికలో ఒక భాగం , అంతేకాకుండా ప్రారంభోత్సవ కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి రోశయ్య గారు, అలాగే మరొకరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఇతర రోజుల్లో మరికొంతమంది ప్రముఖులు, ఇతర విద్వాంసులూ, మేధావులూ పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నాం.

అలాగే మొన్న " మాతాజీ " తో ఆస్ట్రల్ బాడీతో మాట్లాడినప్పుడు ఆమె ఏం చెప్పారంటే " నేను రోజూ ధ్యానంలో బుద్ధుడితో కలుస్తుంటాను. అమరావతి ధ్యానమహాచక్రం విషయంలో బుద్ధుడు మహదానందంగా వున్నాడు " అని ఆమె ద్వారా తెలిసింది. అంతేకాకుండా అమరావతిలో వెలిసిన అమరలింగేశ్వరస్వామి ఆనందంతో కృష్ణానదిపై తాండవనృత్యం చేస్తున్న దృశ్యాన్ని మాతాజీ ధ్యానంలో చూశారట. ఎంతోమంది దేవతలు, ఋషులు, ఆస్ట్రల్ మాస్టర్స్ భౌతికంగా దిగివచ్చి మనకు సహాయం చేయబోతున్నారని కూడా ఆవిడ చెప్పారు. అలాగే లక్షలమంది పాల్గొనబోయే ఈ కార్యక్రమాల్లో .. అద్భుతరీతిలో సాంస్కృతిక కార్యక్రమాల రూపకల్పనకు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం.

మారం : గుంటూరు జిల్లా పూర్తిగా ధ్యానమయం కావాలని మీ ఆకాంక్ష అన్నారు కదా మరి ఈ నవంబర్ 30 లోపు దీనికోసం ఏ ఏ ఏర్పాట్లు చేస్తున్నారు ?

లక్ష్మణరావు : గుంటూరు జిల్లాలో దాదాపు 1150 గ్రాములు వున్నాయి. అన్ని గ్రామాల నుంచి .. కనీసం ఒక్కొక్క గ్రామం నుంచి యాభైమంది అంటే ఒక్క గుంటూరు జిల్లా నుంచే 50,000 .. మంది రావాలని మా ఆకాంక్ష. దానికి తగినట్లుగానే మేం ధ్యాన ప్రచారం చేస్తున్నాం.

మరి పశ్చిమగోదావరి జిల్లాలో దాట్ల రాయజగపతిరాజు గారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్, జిల్లా పరిషత్ ఛైర్మన్ గార్ల అధికారక కార్యక్రమాల్లో ధ్యాన విజ్ఞాన జ్యోతి కార్యక్రమం జిల్లా అంతా ధ్యాన ప్రచారం జరగడానికి ఎంతగానో ఉపకరించింది కదా. అలా గుంటూరు, నల్గొండ, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో జూన్, జూలై నెలల్లో ఈ ప్రోగ్రామ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నాం.

గుంటూరు జిల్లాలోని తెనాలి, గుంటూరు, నరసరావుపేట మూడు రెవెన్యూ డివిజన్లు వున్నాయి. డివిజన్ వారీగా, మండలం వారీగా ధ్యాన ప్రచారం జరగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.

" ప్రతి జిల్లా నుంచి ఐదు నుంచి పదిమంది మాస్టర్లు వచ్చి గుంటూరు జిల్లాలో ధ్యాన ప్రచారం చేయాలి " అని మా ఆకాంక్ష. కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విశాఖపట్నం నుంచి ఇప్పటికే చాలామంది మాస్టర్లు రావడానికి సిద్ధంగా వున్నారు. అలాగే హైదరాబాద్ మరి ఇతర దూరప్రాంతాల నుంచి కూడా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు శనివారం రాత్రి బస్ లేదా ట్రెయిన్ ఎక్కి ఆదివారం ఉదయం గుంటూరు వచ్చి చుట్టుప్రక్కల నిర్ణయించబడిన స్థలాల్లో వారి ప్రవచనాన్ని ఇచ్చి మళ్ళీ ఆదివారం రాత్రి తిరిగి వెళ్తున్నారు.

వీరందరికోసం " ధ్యాన ప్రచార రథాలను " సిద్ధం చేస్తున్నాం. గ్రామగ్రామాల్లో నలభైరోజుల ధ్యానశిక్షణ, ఇంటింటా ధ్యానం ఇప్పటికే మొదలుపెట్టాం. గుంటూరు జిల్లాలోని ప్రతి గ్రామంలో, ప్రతి స్కూల్లో ధ్యానం క్లాసులు వుండేలా ఫ్లాన్ చేస్తున్నాం.

మారం : గుంటూరు జిల్లాలో గతంలో చేసిన ఏడురోజుల ధ్యానయజ్ఞం లా పెద్ద ప్రోగ్రామ్స్ ఇంకా ఏం చేస్తున్నారు ?

లక్ష్మణరావు : మార్చిలో " తెనాలి " లో ఏడురోజుల పెద్ద ప్రోగ్రామ్ జరిగింది, మరి ఆఖరిరోజు పత్రీజీ వచ్చారు. అలాగే ఈ నెలలో " నరసరావుపేట " లో జరిగిన ప్రోగ్రామ్‌కి కూడా ఆఖరి రోజు పత్రీజీ వచ్చారు. ఏడురోజుల ప్రోగ్రామ్ అద్భుతంగా జరిగింది. " నెక్కల్లు " లో ఈ ఏప్రిల్ నుంచి ప్రతి నెలా 1 వ తేదీ నుంచి 11 వ తేదీ వరకు ప్రతి నెలా పదకొండురోజులు అమరావతి ధ్యానమహాచక్రం కోసం సంకల్ప ధ్యానం చేస్తున్నాం. ఇంకా ఏమేం చేయాలో అదంతా చేయగలుగుతాం ; చేస్తాం.

మారం : ధ్యానమహాచక్ర ఏర్పాట్లు గురించి ఇంకాస్త వివరించండి.

లక్ష్మణరావు : 2009, డిసెంబర్ 31 నుంచి నా ఆలోచనల్లో అమరావతి ధ్యానమహాచక్రం గురించి తప్ప వేరే ఆలోచన అస్సలు లేనేలేదు. శ్రీశైలంలో డిసెంబర్ 26, 27 తేదీల్లో పత్రీజీ నన్ను తమ కాటేజీకి పిలిపించి " నీకు ఇంకా ఒకరోజు టైముంది అమరావతి గురించి ప్రకటించడానికి బాగా ఆలోచించు " అని గ్రుచ్చి గ్రుచ్చి అడిగారు. " ఆలోచించేది ఏమీలేదు సార్. చేయడం .. చేయడమే " అన్నాను నేను.

మాకు మంచి టీమ్ వుంది గుంటూరు జిల్లాలో. మేం ఎంత గొప్ప కార్యక్రమాన్నైనా పూర్తిచేస్తాం. ఇంకా చాలామంది మాస్టర్లు వున్నారు. మేం మరింత ఉత్సాహంతో ఈ గొప్ప కార్యక్రమాన్ని పూర్తిచేస్తాం. వెనక్కి వెళ్ళే ప్రశ్నేలేదు. ఇందుకు నా ధ్యానశక్తి, నా మేధస్సు, నా వ్యాపార అనుభవం, పలుకుబడి, పరిచయాలు అన్నీ ఉపయోగిస్తాను.

ఇక ఐదులక్షల చదరపు అడుగుల స్ట్రక్చర్ లెక్కవేస్తే అది దాదాపు పదకొండురోజులకి ఎంతో అవుతుంది. దాన్ని మనమే డిజైన్ చేసి చేయిస్తే ఎంత అవుతుంది అని లెక్కవేస్తున్నాం. భద్రాచలంలో శ్రీరామనవమి ఉత్సవాలకు పందిళ్ళు వేసినవాళ్ళతో చర్చించాం. అలాగే క్రింద పరిచే కార్పెట్, ఎలక్ట్రికల్ వైరింగ్, బల్బ్స్ రెంట్ ఎంత అవుతుంది, కొంటే పదకొండురోజుల రెంట్ కంటే తక్కువ కూడా అయ్యే అవకాశం వుందా ? అన్నీ కొనేస్తే మా గోడౌన్స్ చాలా వున్నాయి ఆ సామాగ్రి అంతా ప్రతి సంవత్సరం మన ధ్యానమహాచక్ర ప్రోగ్రామ్‌కు ఉపయోగపడుతుంది. మనకు ఆ ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. అన్నీ లెక్కవేస్తున్నాం " ఏది సబబు ? " అని అన్నీ సరిచూసి పత్రీజీతో చర్చించి తుదినిర్ణయం తీసుకుంటాం.

ఇక వసతి సౌకర్యాలు .. శ్రీశైలంలో 2000 రూములు, 100 హాల్స్ వున్నాయి. ఇక్కడ ఆ వసతులు లేవు. పూర్వం " కాలచక్ర " లాగా టెంట్లు, టెంపరరీ షెడ్స్ వేసి ఒక యాభైవేలమందికి కనీసం వసతి ఏర్పాటు చేయగలుగుతాం. ఆ తరువాత అమరావతి మరి చుట్టుప్రక్కల గ్రామాల్లో ఎంతమంది ఇళ్ళలో వీలైతే అన్ని ఇళ్ళల్లో ఇంటికి పదిమంది ఐదుమంది ఇలా ఏర్పాటుచేస్తాం. ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో ధ్యానం నేర్పించడం వల్ల ఇది సాధ్యమవుతుంది. చుట్టుప్రక్కల అన్ని స్కూళ్ళు, ఇతర భవనాలు కేటాయించుకుంటాం.

నేను వాటర్ పైప్‌లైన్ కాంట్రాక్టర్‌ని. ప్రక్కనే కృష్ణానదిలో సౌలభ్యంగా నీళ్ళు వున్నాయి. అది అమరావతికి వరం. పైప్లైన్లు వేసి నీటి వసతిని పొందుతాం.

ఇక శానిటేషన్. కాలచక్రలో " సులభ్ " వాళ్ళు ఈ బాధ్యతను తీసుకున్నారు. ఎంతో నీట్‌గా మెయిన్‌టెయిన్ చేశారు. ఒక వెయ్యో, రెండువేలో టాయిలెట్స్ కమ్ బాత్రూమ్స్ కట్టిస్తాం. ఆ బాధ్యతను " సులభ్ " వాళ్ళకు అప్పజెబుతాం. నీళ్ళకు లోటు లేదు కనుక ప్రాబ్లమ్ లేదు.

అలాగే నేను పత్రీజీకి ముందే చెప్పాను V.I.P ల అకామడేషన్ ప్రక్కన వున్న పెద్ద ఊళ్ళల్లో వాళ్ళే చూసుకోవాలని. అమరావతి నుంచి మంగళగిరికి 30 కిలోమీటర్లు, గుంటూరు 35 కిలోమీటర్లు, విజయవాడ 40 కిలోమీటర్లు, సత్తెనపల్లి 30 కిలోమీటర్లు .. ఇవన్నీచాలా పెద్ద ఊళ్ళు. వాహనాలు ఉన్నవాళ్ళు, వెళ్ళి రాగలిగినవాళ్ళంతా కూడా రూముల్ని టౌన్స్‌లో బుక్ చేసుకుంటారు. విజయవాడ, గుంటూరు, మంగళగిరి, సత్తెనపల్లెల్లో కలిసి లాడ్జిల్లో విస్తారంగా రూములు దొరుకుతాయి. అంతేకాక ఒక వెయ్యి కళ్యాణమండపాలు కూడా దొరుకుతాయి. డబ్బు ఉన్నవాళ్ళు ఆ ఏర్పాట్లు చేసుకుంటారు. ఈ టౌన్స్‌లో కూడా 30% రెంట్లో డిస్కౌంట్ లభ్యమయ్యేలా మేం అరేంజ్ చేసి ఆ యా డిటైల్స్ " ధ్యానంధ్రప్రదేశ్ " మాసపత్రికలో ఇస్తాం. " విజయవాడ " కానీ, " గుంటూరు " కానీ, " మంగళగిరి " కానీ, " సత్తెనపల్లి " కానీ బస్సు అయితే ఒక గంట, కారులో అయితే అరగంట నుంచి నలభైఅయిదు నిమిషాల వ్యవధిలో అమరావతి చేరవచ్చు. ఈ విషయంలో శ్రీశైలంలో లేని ఈ అవకాశం సదుపాయం అమరావతి వుంది .. నాలుగుప్రక్కలా టౌన్లు అతిదగ్గరలో వుండడం వల్ల.

" అమరావతి " గ్రామంలో ఒక ఐదువందల ఇళ్ళు తీసుకోవాలనుకుంటాం. ప్రక్కనే " ధరణికోట " గ్రామం వుంది. ఇంకా చుట్టు ప్రక్కల ఉళ్ళ నుంచి " మా ఇళ్ళు అద్దెకు ఇస్తాం " అని ముందుకు వస్తున్నారు. అన్నీ జాగ్రత్తగా ప్లాన్ చేసి వీలైనంతగా అన్ని అవకాశాలను మనం ఉపయోగించుకుంటాం. ఇక్కడ దగ్గరలో " ఇందుపల్లె " అని వుంది. ఆ ఊరు వంటవాళ్ళకు ప్రఖ్యాతి. అ ఊరంతా మేం ద్యానం నేర్పుతాం.ఆ ఊరి వంటవాళ్ళు చెన్నై వెళ్ళి వేలాదిమందికి భోజనం వండిపెట్టినవాళ్ళు. అలాంటి ఒక నాలుగు గ్రూపులు తీసుకుంటాం. నాకు శ్రేష్టమైన కోస్తా భోజనం, పచ్చళ్ళు అందరికీ రుచి చూపించాలని కోరిక. అలాగే వాలంటీర్స్ను, భోజనం వడ్డించడానికి విడివిడిగా స్టాఫ్‌ను తీసుకుంటాం. ఒక్కొక్క భోజనశాలలో 80 స్టాల్స్ వుంటాయి. అంత స్టాఫ్‌ను తీసుకుంటాం.

శ్రీశైలంలో 30,000 మంది వస్తే కూడా ఒక్క పోలీస్ కానిస్టేబుల్ సహాయం అవసరం లేకుండా మన పట్ల మనకున్న క్రమశిక్షణ. కనుక మన పిరమిడ్ మాస్టర్లు వాలంటీర్లుగా గమనించుకునేట్లు, జిల్లావారీగా మాస్టర్లకు బాధ్యతలు అప్పజెప్పుతాం. అలాగే ఆ యా V.I.P ల బాధ్యత ఆ యా జిల్లాల సీనియర్ మాస్టర్లకు అప్పజెపుతాం.

" చుట్టుప్రక్కల గ్రామాల్లో అందరూ ధ్యానం చేసి వాళ్ళంతట వాళ్ళు గృహ యజమానులు ముందుకువచ్చి వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో వసతి ఇచ్చి, వాళ్ళ ఇళ్ళల్లో వండుకోకుండా, ధ్యానమహా చక్రానికి వచ్చి, ధ్యానం చేసి, ప్రవచనాలు విని ఇక్కడే భోజనాలు చేసి వెళ్తారు. ఇలాగే జరుగుతుంది " .. అని నా అంతరంగం చెబుతోంది.

ఇక మొత్తంగా అయ్యే ఖర్చు ఎంత అయినా మాస్టర్ల ద్వారా, ప్రజలు ద్వారా, పెద్ద పెద్ద సంస్థల ద్వారా, అన్నదాన ప్రియులైన దాతల ద్వారా ప్రోగు చేస్తాం. మిగతాది నేను చూసుకుంటాను. ప్రోగ్రామ్ అయిన తర్వాత అందరికీ లెక్కలు చూపిస్తాను.

మారం : మీ గుంటూరు జిల్లా టీమ్ గురించి చెప్పండి.

లక్ష్మణరావు : నా కుడిచేయి మరి ఎడమచేయి అబ్బూరి కోటేశ్వరరావు, రేపల్లె సుధాకర్, వినుకొండ సుబ్బారవు, నరసరావుపేట చంద్రశేఖర్, మంగళగిరి శంకరరావు, బుజ్జి, తెనాలి మల్లిఖార్జునరావు. మరి బాపట్ల రాజేశ్వరరావు .. ఇలా ఎంతోమంది గుంటూరు జిల్లా మాస్టర్స్ .. అంతేకాక గురువు గారు సూచించిన మాస్టర్స్ అందరియొక్క సహాయ సహకారాలను తిసుకుంటాం.

గుంటూరు జిల్లా ధ్యాన ప్రచారంలో నా పాత్ర మాస్టర్లతో క్లాసులు చెప్పించడం. అబ్బూరి పాత్ర మాస్టర్లను తీసుకురావడం. ఆయన ఏ మాస్టర్ని కలవాలన్నా .. ‘ S.P ’ ని కలవాలన్నా, ఇంకెవరైనా ఆఫీసర్ని కలవాలన్నా .. ముందు వుంటాడు. ప్రతిరోజూ ఉదయం 6.00 గంటలకు నెక్కల్లు నుంచి గుంటూరుకు నా దగ్గరికి వస్తాడు. ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్తాడు. ఎవరినైనా చొరవగా, ధైర్యంగా వెళ్ళి కలుస్తాడు. నిన్న ఏప్రిల్ 1 నుంచి నెక్కల్లులో పదకొండురోజులు " ఫుల్ డే క్లాసులు " పెట్టాడు. ఎవరో కొంతమంది ముఖ్యమైన మాస్టర్స్వి తప్ప మిగతా ఫోన్ నంబర్లన్నీ అబ్బూరి దగ్గరే వుంటాయి. సమయానుకూలంగా సమయస్ఫూర్తితో మాట్లాడతాడు. ఎవరితోనైన స్నేహం చేస్తాడు. అంతెందుకు బ్రహ్మర్షి పత్రీజీతో కూడా ఎంతో చనువుగా, చొరవగా మాట్లాడే అతికొద్దిమందిలో అబ్బూరి ఒకడు . ధ్యాన ప్రచారమే జీవితంగా గడుపుతున్నాడు. ఆధ్యాత్మికంగా చాలా ఎదిగాడు. భౌతికంగా కూడా ఆయన పెద్ద కొడుకు ‘ M.S. ’ చేయడానికి అమెరికా వెళ్ళాడు. చిన్నావాడు కూడా త్వరలో వెళ్తాడు. " ప్రకృతికి మనం పనిచేస్తూంటే దానికి పదిరెట్లు ప్రకృతి ఇస్తుంది " అనడానికి అబ్బూరి కోటేశ్వరరావు ఒక నిదర్శనం.

మారం : మరి గత నాలుగు సంవత్సరాల నుంచి మీ ధ్యాన ప్రచారానికైతేనేం .. ఇప్పుడు మీరు నిర్వహించబోయే " అమరావతి ధ్యానమహాచక్ర " కోసం అయితేనేం .. మీ పాత్ర గురించి మీ కుటుంబ సభ్యుల స్పందన ఎలా వుంటోంది ? మీ అన్నదమ్ములు ? మీ భార్య, మీ అబ్బాయిలు ??

లక్ష్మణరావు : మాది ఉమ్మడికుటుంబం. మాకు ఎవరి వ్యాపారాలు వాళ్ళకు వున్నా ఎవ్వరూ ఎవ్వరికీ లెక్కలు చెప్పరు. ఎవరికీ ఎవరి పట్ల ఏ సందేహాలు లేవు. అంతగా అందరం ఎదిగి వున్నాం. ధ్యానప్రచారనికి నేను పెట్టే ప్రతి రూపాయికీ పది రూపాయలు నేను అదనంగా పొందుతున్నాను , ప్రకృతి అలా ఇస్తోంది . నాకు నా కుటుంబసభ్యుల పూర్తి సహాయ సహకారాలు వున్నాయి . నా భార్య ఉష నాకు 100% సపోర్ట్. ఆమె " అన్నపూర్ణ " లాంటిది. రోజూ నేను ఎంతోమందిని తీసుకువస్తూంటాను. వారందరికీ చిరునవ్వుతో భోజనం వడ్డిస్తుంది నా భార్య , మా బంధువులు కూడా ఎందరో వస్తూంటారు. మా ఇంట్లో విసుక్కోకుండా జరిగే కార్యక్రమం " అన్నసేవ ". అలాగే మా అబ్బాయిలు ఇద్దరూ కూడా U.K లో చదువుకుని వచ్చిన గొప్ప సంస్కారులు. నా వ్యాపారమంతా వాళ్ళే చూస్తున్నారు. వాళ్ళు నా కార్యక్రమాల గురించి ఎప్పుడూ వ్యతిరేకంగా మాట్లాడి ఎరుగరు.

మారం : బ్రహ్మర్షి పత్రీజీ సాహచర్యంలో మీరు కేవలం నాలుగు సంవత్సరాల్లో ఇంతగా ఎదిగారు. మరి పత్రీజీ గురించి మీ అనుభూతులు వివరించండి.

లక్ష్మణరావు : పత్రీజీ అంత గొప్ప గురువు నాకు దొరకడం నేను నా మహాద్భాగ్యంగా భావిస్తున్నాను. ఒక చిన్న మాస్టర్ ఇంటికి వస్తే కూడా వారితో గడిపి వారు వెళ్ళేవరకు వారిని గమనించి గేటు దాకా వచ్చి వారిని సాగనంపుతారు. ఎంత మహద్భాగ్యమో పిరమిడ్ మాస్టర్లకు ఇంత గొప్ప గురువు లభించడం. అందరూ ఆయన కోపాన్నే చూస్తారు కానీ ఆయనలోని కరుణను గమనిస్తేనే ఆయన అర్థమవుతారు.

మా ఇంటికి ఆయన మొదటిసారి వచ్చినప్పుడు, నేను ఆయన ప్లేట్లో ఎక్కువ మోతాదులో దోసకాయ పచ్చడి వడ్డించి " సర్ , మా ఆవిడ ఈ పచ్చడి అద్భుతంగా చేస్తుంది " అన్నాను. ఆయనకు గట్టి పదార్థాలు నలగవు అని నాకు అప్పటికి తెలీదు. ఇవేమీ చెప్పకుండా ఆయన తన ప్లేట్లో నేను ఎక్కువగా వడ్డించిన దోసకాయపచ్చడి అన్నంలో కలుపుకుని పూర్తిగా తినేశారు. కాసేపయ్యాక నేను నా ప్లేటులో దోసకాయపచ్చడి వేసుకుని తిన్నాను. ఆ దోసకాయపచ్చడి పరమచేదుగా వుంది. మరి ఆ గ్రేట్ మాస్టర్ ఏ మాత్రం కామెంట్ చేయకుండా అంత చేదు పచ్చడి ఆయన పంటిక్రింద నలగని పచ్చడి ఎలా తిన్నారో ?

ఆయనను కార్లో కూర్చోబెట్టుకుని ఎన్నో కిలోమీటర్ల ప్రయాణంలో వారితో ఎన్ని కాన్సెప్టులో , ఎన్ని అనుభవాలో , ఆయన ఈ ప్రపంచంలో మార్పు తీసుకురావడానికి, ప్రపంచమంతా ధ్యానమయం చేయడానికి తద్వారా అందరూ ఆనందంగా ఉండడానికి మార్గదర్శకత్వం చేయడం కోసం భూమి మీదకు వచ్చిన గొప్ప శక్తి. మామూలు మనిషి కాదు. నా ఆఖరి శ్వాస వరకు " ‘ పత్రీజీ ’ అనే రైలింజన్ " వెంటే వుండే పెట్టెల్లో నేనుంటాను.

నేను ఎంతో ఆనందంగా వున్నాను ఇప్పుడు. . నా స్నేహితులందరూ ఆశ్చర్యపోతూంటారు ఇప్పుడు నన్ను చూసి. ప్రతి క్షణమూ వ్యాపారంలో మునిగితేలుతున్న నేను గత ఒకటిన్నర సంవత్సరాల నుంచి ప్రతి క్షణమూ ఆధ్యాత్మికతలో జీవిస్తున్నాను. ఎదిగిన నా కుమారులు మొత్తం వ్యాపారాన్ని చూస్తున్నారు. నేను ధ్యానంలోకి వచ్చిన తరువాత నా వ్యాపారం ఎన్నోరెట్లు పెరిగింది.

పత్రీజీ ఒక్క మాటతో హార్ట్‌ను ‘ టచ్ ’ చేస్తూ వుంటారు. వారానికి ఒక్కసారైనా ఫోన్ చేస్తూంటారు. ఆయన ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు మేం కాశ్మీర్లో వున్నాం. మరి మన పిరమిడ్ మాస్టర్లు ఆర్గనైజ్ చేసిన టూర్ అది. పత్రీజీ ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేసి " ఎలా వుంది టూర్ ? " అని అడిగారు. " సార్ , టూర్ బాగుంది . దీనికన్నా మీరు ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేయడం బాగుంది “ అన్నాను. నన్నే కాదు ప్రతి పిరమిడ్ మాస్టర్ పట్ల కూడ ఆయనకు శ్రద్దే . ఎందుకంటే ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా అంత అద్భుతంగా పనిచేస్తున్నారు ఎవరికి వారే పత్రీజీ మార్గదర్శకత్వంలో.

మారం : పిరమిడ్ మాస్టర్లకు మీ సందేశం ?

లక్ష్మణరావు : ఏదో మీరు సాధించుకున్నారనో, ఏదో కొంత ఆకర్షణ మీ పట్ల ఇతరులలో వుందనో, ఏదో శక్తి మీకు కలిగిందనో, ఎవరో మీ వెంట పడుతున్నారనీ, మీరేదో అప్పుడే పొందేశారనో భ్రమించి పత్రీజీ అనే వటవృక్షాన్ని ఎవ్వరూ వదలవద్దు అని నా విజ్ఞప్తి. ఆ మహామహనీయుడైన మైత్రేయబుద్ధుని మార్గంలో, ఆ వటవృక్ష ఛాయలో మనమంతా ముందుకుసాగి జీవన్ముక్తి పొందాలి .. మరి క్రమంగా ఒక పూర్ణాత్మగా రూపుదిద్దుకోవాలి.

మారం : ధ్యానంలోకి రాకముందు మీరు మాంసాహారి. ఇప్పుడు పూర్ణశాకాహారి. మరి మాంసాహారానికీ శాకాహారానికీ వున్న, మీరు గమనించిన తేడా ?

లక్ష్మణరావు : ధ్యానంలోకి రాకముందు నాకు శాకాహారం గురించిన అవగాహన లేదు. తిన్నాను. ధ్యానంలోకి వచ్చిన తర్వాతే తెలిసింది జీవకారుణ్యం గురించి " ‘ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్మెంట్ ’ మనుష్యుల కోసం కాదు, మూగజీవులను కాపాడడానికి " అని చెప్పారు పత్రీజీ. అందుకే ప్రతిఒక్కరినీ ఇప్పుడు మాంసాహారం మానేయమని డిమాండ్ కూడా చేస్తున్నాను. దైవం దృష్టిలో ఒక మనిషికి ఎంత విలువో ఒక చీమ పట్ల కూడా అంతే విలువ. మాంసాహారం తినేవాళ్ళను నేను అసహ్యించుకోకుండా వారిపట్ల ప్రేమతత్వంతో శాకాహారులుగా, ధ్యానులుగా మారమని బోధిస్తున్నాను. ఒకరోజు మా మనుమడికి నోట్లో అంగిట్లో కొండనాలుక తెగింది. ఆ రోజంతా వాడు ఎంతగా బాధపడ్డాడో , నేను మా వాళ్ళకి " మన పిల్లాడికి నోట్లో ఒక చిన్న బాధ కలిగితే మనం ఇంతగా పరితపిస్తున్నాం కదా మరి సృష్టిలోని అన్ని జీవరాసులు కూడా అలాగే కదా " అని చెప్పాను.

మారం : " ధ్యానాంధ్రప్రదేశ్ " మ్యాగజైన్ గురించి చెప్పండి.

లక్ష్మణరావు : ఇప్పుడు " ధ్యానాంధ్రప్రదేశ్ " మ్యాగజైన్ చదువుతూ వుంటే " మరిక ఏ పుస్తకమూ చదవనక్కరలేదు " అనిపిస్తోంది. అంత బాగా వుంటోంది ప్రతి పేజీలోని మ్యాటర్ కూడా. ప్రతి నెలా అద్భుతమైన రీతిలో దర్శనమిస్తోంది. ప్రతి పిరమిడ్ మాస్టర్ ఇంట్లో ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్ వుండాలి. ఇప్పుడు గుంటూరు జిల్లాలో ధ్యానప్రచారంతో పాటు ధ్యానాంధ్రప్రదేశ్ సబ్స్క్రిప్షన్స్ ఒక ఇరవైవేలు అయ్యేట్లు చేసి బ్రహ్మర్షి పత్రీజీకి జన్మదిన కానుకగా సమర్పించాలని నా అభిలాష .

" ధ్యానాంధ్రప్రదేశ్ " పాఠకులందరికీ .. " ధ్యానమహాచక్ర శుభాకాంక్షలు ". అందరూ ధ్యానం చేస్తూ, ధ్యానం భోధిస్తూ, " ధ్యానాంధ్రప్రదేశ్ " చదువుతూ, చదివిస్తూ, అందరినీ " ధ్యానమహాచక్రం " కు అమరావతికి తీసుకురావాలని నా విజ్ఞప్తి.

 

వెలగపూడి లక్ష్మణరావు
గుంటూరు

Go to top