" పిరమిడ్ గ్రాండ్ మాస్టర్ Dr.V. హరికుమార్ తో మారం శివప్రసాద్ ప్రత్యేక ఇంటర్వ్యూ "

 

మారం శివప్రసాద్ : హరికుమార్ గారు! మీకు ఆత్మప్రణామాలు! మిమ్మల్ని ధ్యానాంధ్రప్రదేస్ కోసం ఇంటర్వ్యూ చేయడం చాలా ఆనందంగా ఉంది. మీ గురించి, మీ కుటుంబం గురించి చెప్పండి.

Dr.V. హరికుమార్ : నా పేరు వల్లపురెడ్డి హరికుమార్. స్వగ్రామం కర్నూలు జిల్లా నంద్యాల. నా వయస్సు 36 సంవత్సరాలు. తండ్రి-మద్దిలేటి, తల్లి -ఋషేంద్రమణి, భార్య- రజని, డిగ్రీ చేసింది, గృహణి, కూతురు -వైష్ణవి, 13 సం||, కొడుకు - సోహన్, 10 సం||.

నేను M.B.B.S. చేసిన తరువాత M.S. చేశాను. M.C.H. ప్లాస్టిక్ సర్జరీ, సూపర్ స్పెషాలిటీ - హైదరాబాద్ ఉస్మానియాలో ఆరునెలలే చెశాను. తర్వాత పుర్తిగా ధ్యానప్రచారంలోనె ఉండాలి అని అనిపించి, స్టేట్ సెకండ్ ర్యాంకుతో ప్లాస్టిక్ సర్జ్రీలో కాంపిటీటీవ్ ఎగ్జామ్‌లో సీట్ పొంది కూడా, ఆరునెలలు అందులోని మెళకువలన్నీ తెలుసుకున్న తరువాత, సమయం ఇక ఏమాత్రం ఇతర కార్యక్రమాలకు వెచ్చించకుండా, ధ్యాన జగత్ కార్యక్రమంలోనే పూర్తి సమయాన్ని వెచ్చించాలని నిశ్చయించుకొని చదువు ఆపివేసి, "Past Life Regression" ఇప్పుడు "Anti Age Foundation" ని చేస్తూ, నా ఆత్మ ఎదుగుదలను అమితంగా పొందగలుగుతున్నాను.

మారాం : మీరు స్పిరిచ్యువాలిటీలోకి ఎలా వచ్చారు? పత్రీజీ ని మొదటిసారి ఎప్పుడు కలిశారు? మీరెలా పీలయ్యారు?

Dr V. హరికుమార్ : 1995 లో హౌస్ లో హౌస్ సర్జర్ (House Surgeon) చేసేటప్పుడు Dr. యుగంధర్ -సీనియర్ పిరమిడ్ మాస్టర్ మెడిసిన్‌లో నా సీనియర్‌తో కర్నూల్లో స్పిరిచ్యువాలిటీ కి సంబంధించిన డిస్కషన్స్ జరిగాయి. భూధృవ పరిణామాల (Axis shift) గురించి, ఆస్ట్రల్ ట్రావెల్ గురించి, ఒక పరిపూర్ణమైన వైద్యుడి గా ఎలా ఉండాలి అనే విషయాల మీద చర్చ జరిగింది. 1995 ఫిబ్రవరి నెల అది. ఆ తర్వాత పత్రీజీ ని కలిసాను యుగంధర్ తో కలిసి. అప్పుడు పత్రీజీ అందరితో ధ్యానం చేయించారు. నేనూ ధ్యానం చేసిన తరువాత వారికి నన్ను యుగంధర్ పరిచయం చేసేలోపే, "Today, another doctor has come!" అన్నారు పత్రీజీ నన్ను చూసి. నేను ఆ ధ్యానంలో నా అనుభవం వారికి చెప్పాను. ఆ ధ్యానంలో నేను ఎన్నో గొప్ప అనుభవాలు పొందాను. కూర్చున్న అయిదు నిమిషాలలోనే కుండలినీ అనుభవం, థర్డ్ ఐ విజన్స్ రావడం, కొత్తగా అనిపించడంతో కళ్ళు తెరిచాను. పత్రీజీతో చెప్పినప్పుడు "Wonderful and great experience!" అని అందరితో చప్పట్లు కొట్టించారు."

మారం : ఆ తరువాత?

Dr V. హరికుమార్ : ఆ తరువాత మూడు రోజులలోనే ఇంకా ఎన్నో థర్డ్ ఐ విజన్స్, నా పుర్ణాత్మను నేను చూసుకోవడం జరిగింది.

"నాపూర్ణాత్మ షిర్డీసాయి" అని తెలిసినప్పుడు ఎంత ఆనందం కలిగిందో! అలాగే నా గతజన్మ నేను చూసుకోవడం జరిగింది. గత జన్మలో నేనొక మాస్టర్‌గా, దాదాపు అరవై సంవత్సరాల వయస్సు ఉన్న గురువుగా, అందరికీ బోధిస్తున్న దృశ్యాలను చూశాను. చాలా చక్కని అనుభవాలు, ఆధ్యాత్మికమార్గంలో స్థిరపరిచే అనుభవాలు అవి!

నా యొక్క "చైతన్యం (కాన్షియస్‌నెస్)" బాగా పెరగడం, నాలోని పరిమిత దృక్పధం విశాలంగా మారడం జరిగింది. కేవలం మూడురోజుల తీవ్రధ్యానం నన్ను పూర్తిగా మార్చివేసింది. నేను కెవలం కర్నూలుకే పరిమితమయిన వాడిని కాను, కేవలం ఒక డాక్టరును కావడం మాత్రమే కాదు, "ఈ ఆత్మ లోకకళ్యాణం కోసం ఎన్నుకోబడింది" అనే స్పృహ నాలో కలిగింది.

మారం : ఒక డాక్టర్ అయిన మీరు ఒక స్పిరిచ్యువల్ సైంటిస్ట్ కూడా అయ్యారు కదా. ఈ అరుదైన అనుసంధానం లో మీ అనుభూతులు?

Dr V. హరికుమార్ : వాస్తవానికి డాక్టర్లు మెడిసిన్ చదివే సమయంలో భౌతిక శరీరం యొక్క స్థితులను, శరీరంలోని అంతర్‌భాగాలకు చెందిన విషయాల బోధనలను వింటూ, మరణించిన వారి ఆయా శారీరక భాగాల్ని చూస్తూ, భౌతిక అనుభవాలను ఎక్కువగా పొందుతారు. మృతశరీరంలో మనస్సు, ఆత్మ ఉండవు. ఇదే శారీరక భావంలోనే ఆ తరువాత వైద్యం చేస్తారు. మనస్సుకు సంబంధించిన పరిజ్ఞానం లేకపోవడం వల్ల అంటే ఆధ్యాత్మికత అంటే తెలియకపోవడం వల్ల ట్రీట్‌మెంట్ అంతాశరీరస్థితికి మాత్రమే సంబంధించి ఉంటోంది.

అయితే ఇటువంటి నేపథ్యంలో "ప్రతి జబ్బుకూ కారణం మనస్సు నుండే ఉద్భవిస్తుంది". "ప్రతి వ్యాధి కూడా మానసిక జనిత శారీరక రుగ్మతయే" అన్నటువంటి విషయాలను అవగాహన చేసుకున్నటువంటి ఒక స్పిరిచ్యుల్ డాక్టర్‌గా జబ్బును పరిపూర్ణంగా ఎలా అధ్యయనం చేయాలో అర్థమయ్యింది నాకు.

1995 నుంచే నేను ఉధృతంగా ధ్యానప్రచారం చేసేవాణ్ణి. గ్రామాల్లో, ఎన్నో ప్రభుత్వ మరి ప్రభుత్వేతర కార్యక్రమాల్లో కుడా. మనం ఎంచుకున్న లక్ష్యాన్ని బట్టే మన మాట, ఆలోచన, ప్రవర్తన దానివైపు నడుపుతున్న,నడుస్తున్నదాన్నిబట్టే మన ఎనర్జీస్ ఉంటాయి. అలా ఉధృతంగా ధ్యానప్రచారం చేస్తున్నప్పుడు, నేనొక అద్భుతమైన దైవికమాధ్యమంగా ఉన్నాను. ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా, నా జ్ఞానాన్ని చైతన్యపరిధిని విస్తరించే విధంగా ఎంతో అద్భుతంగా తయారు కాగలిగాను!

మారం : మీరు సర్జరీలు చేస్తున్నప్పుడు, ట్రీట్ చేస్తున్నప్పుడు మీకు దైవిక సహాయం అందిన సందర్భాలను వివరించి చెప్పండి!

Dr. V హరికుమార్ : నేను M.S. జనరల్ సర్జరీ పూర్తిచేసిన తర్వాత, అనంతపూర్ జిల్లాలోని ఒక గ్రామంలోని 30పడకల ఆసుపత్రిలో నాకు ఉద్యోగం వచ్చింది. నేను M.S. చేస్తున్నాను. కేవలం విన్నటువంటివి, ఏ మాత్రం నేర్చుకోనటువంటివి అయినటువంటి సర్జరీస్ ఎంతో అద్భుతంగా చేయగలిగాను. ఆధునికమైన అనస్థీషియా సదుపాయాలు లేని ఆ ప్రాధమిక ఆరోగ్యకేంద్రం లో ఎంతో చక్కగా ఏ సమస్యలూ లేకుండా, ట్రైనింగ్ లేని నర్సుల యొక్క సహాయం మాత్రం పొందుతూ, ఒక్క సంవత్సరం కాలంలో ఒక వేయికి పైగా ఆపరేషన్లు అత్యంత విజయవంతంగా చేయగలిగాను. ఏ ఒక్క ఇబ్బందీ .. కాంప్లీకేషన్ .. రాలేదంటే, అతిశయోక్తి కాదు. సర్జరీ అయిన తరువాత ఆ పేషంట్స్‌ని సీనియర్స్‌కి చూపించినప్పుడు, నేనెన్నో ప్రశంసలు పొందాను.

అక్కడ ఆ సర్జరీస్ చేసేటప్పుడు నాకెలా ఉండేదంటే, "ఇదంతా నా పూర్వజన్మ జ్ఞానం" అనిపించేది. ’నాకెప్పుడో ఇవన్నీ తెలుసు"అనిపించేది. ఎంతోమంది మాస్టర్స్ అక్కడ ఉన్నట్లుగా ఫీలవుతూ, వారి అజ్ఞాత సహాయం అందుకుంటూ సర్జరీలు చేసేవాడిని ఈ జ్ఞానం అంతా ధ్యానఫలమే.

మారాం : "చాలామంది సర్జన్స్ ఆపరేషన్లు అనవసరంగా చేస్తారు" అనే అపోహ ప్రజల్లో ఉంది. ఒక సర్జన్ గా మీ కామెంట్ ప్లీజ్;

Dr V. హరికుమార్ : నా వరకు నేను ఎప్పుడు నా సీనియర్స్ యొక్క సలహాలను పాటించేవాడిని. ఒక సినియర్ సర్జన్ ఏమన్నారంటే ... "ఒక మంచి సర్జన్ అనవసరమైన సర్జరీస్ ఎప్పుడూ చేయడు. అవసరమైన మందులతోనే, సర్జరీలు లేకుండానే నయం చెసేవాడే, అవసరమైన సందర్భాల్లో మాత్రమె సర్జరీ చేసేవాడే నిజమైన వైద్యుడు" అని చెప్పారు. అనవసరమైన మందులు వాడడం కానీ, సర్జరీలు కానీ చేయకుండా నేను సంతృప్తికరమైన వైద్యుడిగా తయారయ్యాను. అలాగే జీవించాను.

మారం : ధ్యానం బోధించి, తద్వారానే ఉన్నతమైన వైద్యాన్ని సాధించగలమని ప్రపంచానికి మనం చాటవచ్చు కదా;

Dr. V హరికుమార్ : దేహపరమైన శిక్షణ మాత్రమే ఉంది, నేటి వైద్య బోధనాపద్ధతుల్లో అలాగే చికిత్స చేస్తున్నాడు వైద్యుడు పూర్తిగా. దేహాన్ని నడుపుతూ ఉన్న చైతన్యం గురించి, ఆత్మ గురించి అవగాహన లేనందువల్ల చాలా జబ్బులు క్యూర్ కానప్పుడు, వైద్యులు చాలా అసంతృప్తి చెందుతూ ఉంటారు. మానసికపరమై, ఆధ్యాత్మికపరమైన ఎదుగుదలకు సంబంధించిన జబ్బులు వస్తాయి ... కొంతమందికి వారి పూర్వజన్మకర్మల వల్ల, వారి సెల్ఫడిజైన్ వల్ల; అప్పుడు ఒక స్పిరిచ్యువల్ డాక్టర్ అయితె “దేహానికి మూలం మనస్సు” అనీ, "మనస్సుకు మూలం ఆత్మ" అనీ తెలుసుకొని, తదనుగుణంగా చికిత్స చేస్తాడు కనుక అతడు పరిపూర్ణంగా ఉంటాడు. తాను "కేవలం రోగిలోని వైద్యుడిని మేల్కొలుపుతున్నాను" అని అతడికి తెలుసు, కనుక ధ్యానం ద్వారా అతి తక్కువ మోతాదులోనే మెడిసిన్స్ ప్రిస్ఖైబ్ చేయడం ద్వారా, అత్యవసరమైన సర్జీరీలు మాత్రమే చేస్తూ ట్రీట్ చేయవచ్చు. చాలామంది డాక్టర్లకు అత్మసంతృప్తి లేకపోవడానికి స్పిరిచ్యువల్ మాస్టర్ అయిన డాక్టర్ సంతృప్తికరంగా ఉండడానికి కారణం అంతా అలాంటి ఆధ్యాత్మిక పరిజ్ఞానమే.

మారం : ఏ జబ్బు వచ్చినా సరే ధ్యానం చేయడం ద్వారా ఆ జబ్బులను అధిగమించడం ఎలా సాధ్యమో వివరించండి?

Dr. V హరికుమార్ : జబ్బు లేదా వ్యాధి అంటే స్వస్థితి నుండి వైదొలగడమే. అందుకు కారణం అశాస్త్రీయమైన, అసంబద్ధమైన ఆలోచనలు, మాటలు, కర్మలూను. ఇలా వచ్చిన వ్యాధులు మళ్ళీ స్వస్థితికి వెళ్ళినప్పుడు తొలగిపోతాయి. ధ్యానమంటే స్వస్థితితో కలిసి ఉండడం. పరాధ్యానం అంటే స్వస్థితికి దూరం కావడం. స్వస్థితి ద్వారా స్వస్థత వస్తుంది మరింత త్వరగా.

"పూర్వజన్మ కృతం పాపం వ్యాధిరూపేణ పీడ్యతే"_ అని ఉవాచ. గత జన్మలలో మన యొక్క సరికాని అనుభవాలు, అసంపూర్తిగా ఉన్నటువంటి నేర్చుకోవడాలు, తీసుకున్న నిర్ణయాలు, ఒప్పందాలు మనం ఈ జన్మవరకు తీసుకుని వస్తాం.

పూర్వజన్మ కర్మల వల్ల వచ్చిన ఈ రుగ్మతలకు మనం కారణాన్ని ధ్యానం ద్వారా అర్థం చేసుకుంటాం. అంగవైకల్యం లాంటి జబ్బులను ... అవి ఎందుకు వచ్చాయో ధ్యానంతో తెలుసుకోవడం వలన, వాటితో సహజీవనం ద్వారా, వాటిని అంగీకరించి జీవించడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందడం జరుగుతుంది! మనస్సే కదా అన్నిటికి ములం, మరి ప్రధానం.

మారం : "ధ్యానం - అంతర్గత యానం" అని మనం బోధిస్తూ ఉంటాం కదా, దీనిని గురించి వివరించండి

Dr. V హరికుమార్ : సమస్యలు రానంతవరకు "మనకు ఎవ్వరి సహాయం అవసరం లేదు" అనిపిస్తుంది. సమస్య వచ్చినప్పుడు దానికి సమాధానం బయటవెతకడం ప్రారంభిస్తాం. వెదుకుతాం, వెదుకుతాం. అంతర్గతమయిన అవసరం లోపల ఉండడం వల్లనే, బయట సమస్య వస్తుంది. ధ్యానం చెయడం తెలిసిన వారికీ, ధ్యానం చేస్తున్న వారికీ మాత్రమే ఇది అర్థమవుతుంది. కాబట్టి సమస్య యొక్క సమాధానం వైపు అంటే సమమైన స్థితివైపు దృష్టి సారించడం మొదలుపెడతాడు ఒక ధ్యాన సాధకుడు. సమస్యవైపు బయటకు కాకుండా, దానివైపు కేవలం సరియైన అవగాహనతో ఆ సమస్య మూలంవైపు దృష్టి సారించడం వల్ల ఆ సమస్య ఎందుకు వచ్చిందనేది సులభంగా అవగతం అయిపోతుంది. చిక్కుముడి విడిపోతుంది. కనుకనే "ధ్యానం అంతర్గతయానం" అంటారు పత్రీజీ.

మారం : ధ్యానానికీ, నిద్రకూ ఉన్న తేడా?

Dr.V హరికుమార్ : "నిద్ర" అనేది ప్రకృతి ప్రాణులకు ఇచ్చిన వరం. చైతన్య పరిధి పెంచుకోవడానికి ప్రకృతి చేసే సహాయం నిద్ర. అయితే ధ్యానం మానవ ప్రయత్నం. చైతన్యపరిధి పెంచుకోవడానికి నిద్ర, ధ్యానం రెండూ ఉపకరించినా, చిక్కంతా ఎక్కడ వచ్చిందంటే, నిద్రలో ఉన్న వ్యక్తి ధ్యాని కానప్పుడు, అచేతనంగా ఉంటాడు. ధ్యానం చేయని వారు నిద్ర వల్ల ఎంత విశ్రాంతిని పొందినా, అది శారీరక పరమైనదే అవుతుంది. అయితే ధ్యానం చెసే వారికి ‘నిద్ర’ శారీరకపరమైన విశ్రాంతి మాత్రమే కాకుండా .. జ్ఞానం, అవగాహన ఇవన్నీ పెరుగుతాయి, ఇంకా ధ్యాని ఎరుకతో ఉంటాడు కాబట్టీ, ధ్యాని నిద్రలో విశ్రాంతితో పాటు, తన ఎరుకతో పరిశోధనా ప్రగతి - రిసెర్చి అండ్ డెవలప్‌మెంట్ కూడా పొందుతాడు. మానసిక ఉల్లాసం, ఎనర్జీ ఫీలింగ్, దేహం ఆరోగ్యంగా ఉండడం, గాడ నిద్ర రావడం అనుభూతి పొందుతారు ధ్యానులు.

ఒక వ్యక్తి తన నిద్రలో రోజూ ఒక గుంపుతో తరమబడుతూ, చటుక్కున లేచి అవి పీడకలలుగా భావించి అందోళన చెందుతున్నాడు చాలాకాలంగా. నా దగ్గరకు వచ్చి Past Life Regression చేయించుకున్నాడు. ఈ పూర్వజన్మ ప్రతిగమన చికిత్సలో మైండ్ చాలా ఎరుకతోనూ, విశ్రాంతి గానూ ఉంటుంది. కాబట్టి, తనను ఎంతోకాలంగా నిద్రలో భయపెడుతున్న ఈ కలను మననం చేసుకున్నాడు. తాను గతజన్మలో ఒక తప్పు చేసి పారిపోతూ ఉంటే, వారు తనను తరమడం వల్లనే తాను తప్పించుకుపోతూ ఉన్నందువల్లనే, వారు మరింతగా తనను తరిమారని తెలుసుకున్నాడు. అయితే ఆ తరువాత వారికి తాను క్షమాపణ కూడా చెప్పకున్నాడు. కానీ ఆ కలను పూర్తిగా అనుభవించకుండానే, కలత చెంది లేవడం వల్ల "అది పీడకల" గా భావిస్తున్నాడు. రిగ్రషన్ లో అతడు తనను తాను ఆ కలను పూర్తిగా అనుభవించినప్పుడు, చూసుకున్నపుడు తనలో తాను పూర్తిగా ప్రశాంతత పొంది, ఆ తరువాత ధ్యానం చేస్తూ, ఏ కలతా లేకుండా ఉన్నాడు.

మారం : మీరు మెడిటేషన్ మొదలు పెట్టి, ఆ తర్వాత ధ్యానప్రచారం చేశారు. ధ్యానప్రచారం తర్వాత జరిగిన ప్రగతి ఎలా ఉంది?

Dr. V హరికుమార్ : నేను కర్నూల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసిన తర్వాత నాకు మార్పు అవసరం అనిపించింది. అప్పటికే కర్నూలులో ఎన్నో గ్రామాల్లో నేను ఎన్నో ధ్యాన కార్యక్రమాలు, మెడికల్ క్యాంపులు నిర్వహించి ఉన్నాను. దాదాపు వారానికి రెండుసార్లు నా పేరు పేపర్లలో రావడం, Govt & Non Govt. Organizations లో ఎన్నో ధ్యాన అవగాహన సదస్సులను నిర్వహించడం వల్ల రెండుసార్లు "ఉత్తమ వైద్యుడు" అవార్డు కూడా వచ్చింది. ఆ తర్వాత "ఇక కర్నూల్లో నా అవసరం తీరిపోయింది" అనిపించింది. "ఇక వైద్యవృత్తి వదిలిపెడదామా? పూర్తిగా స్పిరిచ్యువాలిటీలో దిగిపోదామా?" అని అనిపించింది. అయితే "స్పిరిచ్యువాలిటీ లో ఉన్నవాళ్ళు భౌతికమైన విషయాలు వదిలేస్తారు" అని అనిపించుకోవడం అస్సలు ఇష్టం లేదు. "కర్నూలు వదలాలి" అనే నిశ్చయంతో ప్లాస్టిక్ సర్జరీలో సీట్ కోసం పరీక్ష వ్రాశాను. " Dr. హరి స్పిరిచ్యువాలిటీ లో ఉండి కూడా, ఆ ప్రవెశపరీక్ష రాష్ట్రంలోనే రెండవర్యాంకుతో సీటు తెచ్చుకున్నాడు" అని పేపర్లలో, TV ల్లో కూడా వచ్చింది. ధ్యానికి ఎక్కడైనా, ఎప్పుడైనా కూడా విజయవంతమైన జీవితం ఉంటుంది" అని నిరూపించబడింది.

ఆ తర్వాత హైదరాబాద్‌లో కేవలం ఆరునెలలు మాత్రమే ప్లాస్టిక్ సర్జరీ కోర్సు చేశాను మా ప్రొఫెసర్ కూడా నా నిర్ణయాన్ని ఆమోదించారు. ఈ మధ్య మా ప్రొఫెసర్‌కు నేను ఆయనకు Anti Aging Foundation సంస్థ ద్వారా "ఉత్తమ ఉపాధ్యాయుడు’ అవార్డును నా స్వహస్తాలతో అందించినప్పుడు ఆయన ఎంతో సంతోషిస్తూ, "హరికుమార్! మీరు బాహ్యంగా ప్లాస్టిక్ సర్జరీ ద్వారా బాహ్య సౌందర్యానికి సంబంధించిన జీవితంలోనే మాత్రమే ఉండేవారు, ఇప్పుడు అంతఃసౌందర్యానికి సంబంధించిన ప్రొఫెసర్ కూడా అయ్యారు అని అభినందించారు.

మారం : Dr. న్యూటన్ గురించి చెప్పండి

Dr V. హరికుమార్ : హైదరాబాద్ వచ్చిన తర్వాత ప్లాస్టిక్ సర్జరీ కోర్సు చేస్తూ, ఆ తర్వాత డెక్కన్ మెడికల్ కాలేజిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గానూ, ఆ తర్వాత Care హాస్పిటల్ లోనూ పనిచేశాను. ఆ తర్వాత పూర్తిగా "స్పిరిచ్యువల్ డాక్టర్" గా మారిపోయి ధ్యానం, శాకాహారం, పాస్ట్‌లైఫ్ రిగ్రెషన్, ఆధ్యాత్మిక శాస్త్రం వంటి వాటిపైన వర్క్‌షాప్స్ నిర్వహిస్తూ ఎంతోమందిలో ఆధ్యాత్మిక జాగృతిని కల్పించడానికి బ్రహ్మర్షి పత్రీజీ సూచనలను పాటిస్తూ నా జీవితాన్ని పూర్తిగా సార్థకం చేసుకుంటున్నారు. ఇక "పాస్ట్ లైఫ్ రిగ్రెషన్" ని మెడిసిన్‌లో నా సీనియర్ అయిన Dr. న్యూటన్ దగ్గర నేర్చుకున్నాను.

"ధ్యానమొక్కటే అన్ని సమస్యలకూ సమాధానం" అని పూర్తిగా నమ్మిన వ్యక్తిని నేను."కారణాన్ని పూర్తిగా అవగాహన చెసుకోకపోతే, కారణం తెలియకపోతే జబ్బు దూరంకాదు" అని తెలుసుకొని, ఈ విషయంపై ఎంతో పరిశోధన చేశాడు నా ఫ్రెండ్ డాక్టర్ న్యూటన్. ఎంతో చక్కగా ఆ ఫీల్డ్‌లో రీసెర్చ్ చేస్తూ, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్లో ఎంతో ప్రావీణ్యం సంపాదించి ఎంతోమందికి ఈ సబ్జెక్టుని బోధించాడు Dr. న్యూటన్. ఎన్నో జబ్బులకు పరిష్కారాలను రిగ్రెషన్లో బయటకు తీయవచ్చని తన పరిశోధనలో నిరూపించాడు న్యూటన్. న్యూటన్ నేర్పించిన పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ కోర్సుని ఆరురోజులు చేయడం, ఎంతోమందికి రిగ్రెషన్ చేయడం, చాలా జబ్బులున్నవారు రిగ్రెషన్స్ లో సమాధానం పొందుడం, ఈ అనుభవాల వల్ల రిగ్రెషన్స్ చేయడం వల్ల ధ్యానం ద్వారా పరిపూర్ణ ఆరోగ్యాన్ని అందించగలగడంలో నేను ఉత్తీర్ణుడనయ్యాను.

మారం : ఇప్పటివరకు మిరు ఎంతమందికి రిగ్రెషన్స్ చేశారు? పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ లో మికు తృప్తి కలిగించిన ఒక కౌన్సిలింగ్ గురించి వివరించండి.

Dr. V. హరికుమార్ : వ్యక్తిగతంగా ఒక ౩౦౦౦ మందికి రిగ్రెషన్ చెసినప్పటికి గ్రూప్స్‌గా చాలామందినే చేశాను. పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ అంతటా అవగాహన కలిగించటానికి తిరుగుతూ వారికి ప్రాక్టికల్ గా అవగాహన ఇవ్వడం ద్వారా, పుస్తకాల ద్వారా, మీడియా ద్వారా ఎంతో విరివిగా తరగతులు నిర్వహించాము.

తన భర్త త్రాగుబోతుగా ఉండడం వల్ల, తనకు సన్నిహితుడిగా వచ్చిన తన సహోద్యోగికి దగ్గర కావాలని అనిపించి ఎటూ తేల్చుకోలేక నా దగ్గరికి వచ్చిన ఒక యువతికి సంబంధించిన విషయం ఇది.

ఆ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ లో తాను త్రాగుబోతుగా ఉన్న భర్తను ఎందుకు ఎంచుకున్నదో తనకు తెలిసివచ్చింది. మరి తన కొలీగ్ పట్ల ఎందుకు తనకు ఇష్టం కలిగిందో కూడా తన రిగ్రెషన్‌లో తనకు ఎన్నో జన్మల్లో తన కొలీగ్ ఫ్రెండ్‌గా ఉన్నది తెలుసుకోవడం జరిగింది. తద్వారా తన భర్త జీవితాన్ని మార్చుకోవడానికి ఆమె నిర్ణయం తీసుకోవడం, "ఫ్రెండ్‌తో ఫ్రెండ్‌గా మాత్రమే ఉండాలి, జీవిత భాగస్వామిగా కాదు" అని స్పష్టత తెచ్చుకోవడం వల్ల అ రిగ్రెషన్ ఆమె గందరగోళాన్ని తొలగించింది.

అలాగే సర్వైకల్ స్పాండిలైటిస్ తో వచ్చిన ఒక వ్యక్తి తన గతజన్మలో ఒక రాజుగా యోద్ధుడిగా ఉండి, ఒక యుద్ధంలో తనను శత్రువులు వెంబడిస్తూ తల నరికినప్పుడు కలిగిన బాధ ఈ జన్మలో కొనసాగటం వల్ల ఆ నొప్పి సర్వైకల్ స్పాండిలైటిస్ గా ఇబ్బంది పెడుతూ ఉందని రిగ్రెషన్‌లో తెలుసుకుని, ధ్యానం చేసి ఆ జబ్బుని తొలగించుకున్నాడు.

మారం : రాబోయే జన్మలో లేదా రాబోయే కాలంలో జరిగే విషయం కూడా ఈ రిగ్రెషన్లో సాధ్యమా.

Dr.V. హరికుమార్ : దీన్ని "రిగ్రెషన్" అనరు ... "ఫ్యూచర్ పోగ్రెషన్" అంటారు. జబ్బు పడి, దీర్ఘకాలికంగా జబ్బుతో ఉన్న ఒక వ్యక్తి, ఫ్యూచర్ ప్రోగ్రెషన్ లో భవిష్యత్తులోకి వెళ్ళినప్పుడు తాను ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్లు చూసుకుని ఎంతో ఆనందం పొందాడు. బగా ధ్యానం చేసి, చక్కటి ఆహారం, అరోగ్యం నియమాలు పాటించి తాను పూర్తి స్వస్థతను పొందడం సాధ్యమని అతడికి అర్థమయింది. అలాగే పరీక్షలలో ఫెయిలవుతూ, ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్న ఒక స్టూడెంట్, తన ఫ్యూచర్ పోగ్రషన్ లో తాను బాగా చదువుకుని స్థిరమైన జాబ్‌లో ఉన్నట్లు, ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుసుకోవడం వల్ల ఆ జీవితం బాగుపడుతుంది. అలాగే ఒక అమ్మాయి తాను ఒక 70 సం||ల తర్వాత తనకు "మరణాంతరం మరొక జన్మలేదు" అని తెలుసుకున్నప్పుడు, "ఇదే ఆఖరుజన్మ" అని తనకు తెలిసివచ్చి తన ఆలోచన, మాట, జీవనవిధానం అంతా దాని వైపే నడిపి తన జీవితాన్ని ధన్యం చేసుకుంటుంది. మరింత మదురంగా జీవితం గడుపుతుంది. ఇలాంటివెన్నో ఫ్యూచర్ పోగ్రెషన్ వల్ల లాభాలు.

మారం : "యాంటి ఏజ్ ఫౌండేషన్" గురించి చెప్పండి

Dr.V. హరికుమార్ : నా యొక్క మాస్టర్ మహావతార్ బాబాజీ. వారు దాదాపు అయిదువేల సంవత్సరాల నుండి జీవిస్తున్నవారు. అలాంటివారే ఆంజనేయుడు, వేదవ్యాసుడు, మార్కండేయుడు, ఆగస్తుడు మొదలైన మహామునులంతా. వీరందరూ చిరంజీవత్వానికి ప్రతీకలు.

చిరంజీవత్వమంటే ఎన్నోవేల సంవత్సరాలు జీవించడం మాత్రమే కాదు. తమ జీవితలక్ష్యం పరిపూర్ణమయే వరకు శరీరపరంగా భూమి మీద జీవించడం. ఈ చిరంజీవత్వమే యాంటి ఏజింగ్ అంటే.

" కేవలం వయస్సు పరంగానే కాకుండా అందంగా, ఆధ్యాత్మికంగా, ఆరోగ్యంగా కూడా ఉన్నతంగా ఉండడమే చిరంజీవత్వం" అని చెప్పడం కోసం ఈ సంవత్సరం ఫిబ్రవరి 22 న యాంటి ఏజ్ ఫౌండేషన్ అనే సంస్థను ప్రారంభించడం జరిగింది. ఈ సంస్థకు Dr. కార్తికేయన్ ఛైర్మన్‌గా, ఫార్మాక్సిల్ కంపెనీ ప్రెసిడెంట్ శ్రీ అప్పాజీ గారు అధ్యక్షుడుగా,, నేను సెక్రెటరీగా ఈ సంస్థను స్థాపించడం జరిగింది. "బాహ్య సౌందర్యం కంటే అంతఃసౌందర్యం మిన్న" అని నిరూపించడం కోసమే, ఈ యాంటి ఏజ్ ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. అంతఃసౌందర్యం ఉన్నప్పుడు బాహ్యసౌందర్యం ఆటోమేటిక్‌గా వస్తుంది. శరీరపరంగా బ్యూటీగా చేయడానికి ఎన్నో మార్గాలున్నాయి. అయితే మనస్సు ఆత్మ అందంగా ఉండాలంటే ధ్యానం, ఆత్మజ్ఞానం తప్పనిసరి. కాబట్టి ఈ విజ్ఞానాన్ని అందరికీ అందిస్తూ, బ్రహ్మర్షి పత్రీజీ ఆశయమైన "2012 ధ్యాన జగత్" నిర్మాణం కోసం మరింత కృషి చేయడమే యాంటి ఏజ్ ఫౌండేషన్ యొక్క ముఖ్యఆశయం.

మారం : లిండా గుడ్‌మ్యాన్ చెప్పిన అమరత్వం, మీరు చెప్పే చిరంజీవత్వం రెండూ ఒకటేనా?

Dr.V.హరికుమార్ : లిండా గుడ్‍మ్యాన్" స్టార్‌సైన్స్", "సన్‌సైన్స్" తదితర గ్రంధరాజాలను రచించిన దీర్ఘాయుష్కురాలు. ఆమె 300 సం|| పైగా జీవించారు! ఆహారం, ఆలోచనలను బట్టే జీవితం ఆధారపడి ఉంటుందని చెప్పారావిడ. ముఖ్యంగా అలసత్వపు ఆలోచనలు, జీవితం దుర్బరం అనేటటువంటి భావనలు మనుష్యులను త్వరగా వృద్ధులుగా కావడానికి దారితీస్తాయి. అలాకాక, నిత్యనూతనంగానూ, విభిన్నకోణాల్లోనూ ఆలోచించడం, ప్రకృతి నియమాలకు దగ్గరగా ఉండడం, "శాకాహారం, ఫలహారం, శ్వాసాహారం పద్ధతులను పాటించడం మానసికంగా కాలంలో వెనక్కి వెళ్ళడం ద్వారా, నిత్యనూతనంగా, యవ్వనంగా అమృతత్వంతో చిరకాలం జీవించవచ్చును" అని "లిండా గుడ్‌మ్యాన్" సందేశం. ఇవన్నీ ఆమె చెప్పిన సందేశాలు.

మారం : మీరు బోధించే "యాంటి ఏజింగ్" గురించి వివరించండి!

Dr.V.హరికుమార్ : శ్వాసను సహజమైన స్థితికి తీసుకుని రావడం ద్వారా మనలోని వ్యతిరేక భావోద్రేకాలు, భయాందోళనలను వదిలేస్తూ పరిశుద్ధంగా తయారవుతాం మనం! అలాగే పాస్ట్ లైఫ్ రిగ్రెషన్‌లో ఏజ్ రిగ్రిషన్ జరిగినప్పుడు, ముఖ్యంగా తల్లిగర్భంలో ఉన్నప్పుడు ఏర్పర్చుకున్న ఎన్నో అపసవ్యతలను, అవరోధాలను తొలగించుకోవడం జరుగుతుంది. ఇలా పరిశుద్ధంగా అవడం ద్వారా "పసితత్వం" అన్నది పునర్జీవనం చెందుతుంది. అప్పుడు "నా శరీరానికి వయస్సు ఉండవచ్చు కానీ ఆత్మ నిత్యనూతనమైనది" అనే అవగాహనతో ఎల్లప్పుడూ ఉత్సాహంగా, ఉల్లాసంగా, స్వేచ్ఛగా, హుందాగా జీవించగలుగుతాం. అదే నిత్యనూతనత్వానికీ, యవ్వనత్వానికీ, అందానికీ మార్గం.

మారం : మీ ’లవ్ గురు" ప్రోగ్రాం గురించి "ప్రేమ" గురించి చెప్పండి!

Dr. V. హరికుమార్ : ఇప్పటికి ఒక 30 ఎపిసోడ్స్ చేశాను, ఈ "లవ్ గురు కాన్సెప్ట్" లో! దాదాపు 90% ప్రేమను గురించి, అందులోని సమస్యలను గురించి రకరకాల కాన్సెప్ట్స్ చెప్పడం జరిగింది.

ప్రేమ అంటే తనను తాను పరిపూర్ణంగా అంగీకరించడం. అలా తనను అంగీకరించడంలో, బయట నుండి కోరుకునేదే మనం చూస్తున్న ప్రేమలు. అది తల్లిదండ్రులతో కావచ్చు, అన్నదమ్ములతో,అక్కచెల్లెళ్లతో కావచ్చు స్నేహితుల మధ్య కావచ్చు. ఇవన్నీ ప్రేమకు సహాయకారులు.బాహ్యపరమైన ప్రేమలన్నీ కూడా నీపట్ల నీ ప్రేమను పెంచుకోవడానికే ఉపయోగపడతాయి. ఒకవేళ అలా ఉపయోగపడకపోతే, అవన్నీ సరికాని ప్రేమలే. సరియైన ప్రేమ ధ్యానం వల్లనే ఏర్పడుతుంది. "నేను అందంగా ఉన్నాను" అని అద్దంలో చూసుకుంటేనే ఎలా తెలుస్తుందో, బాహ్యమైన ప్రేమలన్నీ అలా మనల్ని మనం పెంపొందించుకోవడానికే ఉపయోగపడాలి. తనపట్ల తనకు నిజమైన ప్రేమ ధ్యానంలో మొదలు అవుతుంది. ఎవరైతే ధ్యానంతో స్వస్థితిని పొందుతారో, వారు ఈ బాహ్యమైన రిలేషన్స్ ద్వారా ప్రేమను మరింత పొందగలగుతారు.

మారం : ప్రేమ సఫలం కానప్పుడు కానీ, పెద్దవాళ్ళు అంగీకరించనప్పుడు కానీ, సమాజం అమోదించనప్పుడు కానీ, ప్రేమికులు ఎలా ప్రవర్తించాలి?

Dr. V. హరికుమార్ : "ప్రతీదీ ఒక అనుభవమే" అనుకున్నప్పుడు అంతా బాగే ! సంఘం ప్రతిఘటించినా, ఇరువైపులా కాని, ఒకవైపు కాని తల్లిదండ్రులు, సమీప బంధువులు అంగీకరించకపోయినా, వారు ధ్యానులైతే వారికి సంయమనం ఉంటుంది. "దీనికి కారణం తామే కదా" అనే స్వంత బాధ్య్తగా భావిస్తారు. అనుభవంగానే, ఒక పాఠంగానే భావించి, అది విఫలమయినా కూడా అంగీకరించగలుగుతారు. లేకపోతే ధైర్యంగా అందరినీ ఎదిరించి ప్రేమను ఫలవంతం చేసుకుని పెళ్ళిద్వారా దాన్ని స్థిరపరుచుకుంటారు.

కనుక ప్రతివ్యక్తీ ధ్యానం చేయాలి. ధ్యాని కావాలి. క్రమంగా మాస్టర్ కావాలి. మన మనస్సుపైన మనం ఆధిపత్యం పొందుడమే "మాస్టరీ" అంటే, మాస్టర్ అవడం ద్వారా అన్నీ సాధ్యమే.

మారం : ఆత్మహత్యలు ఎందుకు జరుగుతాయి ?

Dr. V. హరికుమార్ : ఆత్మహత్య అనేది సమస్యలకు పరిష్కారం ; జీవితానికి ఇది ముగింపు; సమస్యలు తొలగిపోతాయి అనుకుని అజ్ఞానంతో, అయోమయంతో వేగిరపాటుతో, ఉద్రేకంతో చేసుకుంటారు. ధ్యానం చేయనివారు సమస్యకు సమాధానం పొందలేక ఆత్మహత్య చేసుకుంటారు. "సరీరాన్ని వదిలేస్తె సమస్యలు తొలగిపోతాయి" అనుకుంటారు. సమస్య అనెది ఎందుకుంది? సమధానం పొందుతూ, మనం ఎదగడానికే సమస్యలు వస్తాయి. సమస్యలు ఎక్కువభాగం మనకు మనం కల్పించుకున్నవే. సమాధానం తెలుసుకోకుండా మరణం పొంది సమస్యను త్రుంచి వేయాలనుకునేదే "ఆత్మహత్య".

సమస్యకు సమాధానం పొందక, ఆత్మహత్య చెసుకున్నప్పుడు ఆ తరువాత ఆ ఆత్మ ఎంతోకాలం గందరగోళంలో, ఏమితోచని స్థితిలో అయోమయంగా ఉండి, వృధా అయిన జీవితాన్ని మరల పొందడానికి ఆ ఆత్మ కోరుకుని మరీ అటువంటి జివితాన్నే ఎన్నుకుని, మరల అదే అనుభవం పొందుతుంది. మళ్ళీ షరా మామూలే. ఆత్మ సత్యంతో ఉంటుంది కనుక తప్పించుకోవాలని అనుకోకుండా, మళ్ళీ మళ్ళీ మరల అదే జీవితాన్నే ఎన్నుకుని, ఆసమాధానాన్ని, అనుభవాన్ని పొందుతుంది. అందుకే పునరపి జననం, పునరపి మరణం" ... అంటూ ఇలా ఉంటుంది!

ధ్యానం చేయడం వల్ల సమస్యలను చక్కగా దానివైపు చూసే, గమనించే అవకాశం వస్తుంది. నిజానికి సమస్యలు రావాలి. ధ్యానం ద్వారా మనలోకి మనం వెళ్ళిపోవాలి. మరింత అనుభవజ్ఞానం పొందాలి, ఇది సత్యం.

నా దగ్గరికి ఆత్మహత్య చేసుకోవాలను కున్నవారు, తీవ్రమైన డిప్రెషన్స్‌కు లోనయిన వారూ వస్తూ ఉంటారు. "జీవితం నిరర్థకం" అనుకునేవారిని, అలాగే ఆత్మహత్యా దృక్పథం ఉన్నవారు ... రిగ్రెషన్‍కు వచ్చిన తర్వాత "అటువంటి జీవితాన్ని మనమే ఆహ్వానించి జన్మ తీసుకున్నాం" అని తెలుసుకుంటారు. ఈ డిప్రెషన్‌కు, ఆత్మహత్యాభావనకు గత జన్మ, ఆ జన్మలోని అసంపూర్ణ అనుభవాలే కారణం అని, అటువంటి జీవితాలను కోరి ఆహ్వానించామని తెలుసుకుని, ధ్యానం చేసి ఆ డిప్రెషన్ నుండి బయటపడతారు. ఈ అనుభవాల సర్కిల్‌ను ధ్యానం వల్ల పొందిన జ్ఞానంతో పూర్తి చేసుకుంటారు.

ధ్యానం అంటేనే స్వస్థితిలోకి రావడం. ఎపుడైతే ఎవరైనా సరే స్వస్థితిలోకి వస్తారో వారికి ఏ రిగ్రెషన్ అవసరం లేదు. చక్కగా ధ్యానం చేసే వాళ్ళ జీవితం - ట్రైన్స్‌లో రిజర్వేషన్ సీట్‌లో పడుకుని, తెల్లవారి గమ్యస్థానం చేరుకునే సమయానికి నిద్రలేచి ట్రైన్ దిగి వెళ్ళిపోతారు. అలా ఉంటుంది. కనుక సరియైన ధ్యానం "ఆనాపానసతి" ని సరిగా ఆచరించడమే అన్నిటికీ ముఖ్యం.

మారం : మొట్టమొదటిసారి పత్రీజీ ని చూసినప్పుడు మీరు ఎలా ఫీలయ్యారు?

Dr. V. హరికుమార్ : పత్రీజీ ని చూసిన వెంటనే "నేనొక మాస్టర్ ని కలిశాను" అదే ఫీలింగ్ నాలో కలగడం, ఆ వెంటనే వారి ముందు కూర్చుని ధ్యానం చేయడం! ఆ సింప్లిసిటీ, సైంటిఫిక్ టెంపర్, కమిటెడ్‌నేచర్, కరేజ్, కంపాషన్, కామన్ సెన్స్, క్లారిటీ .... ఇవన్నీ పత్రీజీ లో చాలా నచ్చిన గుణాలు.

పత్రీజీ ని కలిసినప్పుడు ఒక "కంప్లీట్ మ్యాన్" ని కలిసిన ఆనందం కలిగింది. ఆధ్యాత్మికత తెలియనంతవరకు మనకు మనం హితులం కాలేము అని తెలుసుకుని, మనలను మనం పూర్తిగా పరిపూర్ణులుగా చేసుకోగలమని, వారిని క్రమంగా స్టడీ చేసి, ఫాలో అయినప్పుడు జీర్ణమైంది. వ్యాధులకు గల కారణం, సమూలంగా దాన్ని తీసివేయగలిగే మార్గం పత్రీజీ ద్వారా తెలిసింది.

మారం : స్వాధ్యాయం గురించి చెప్పండి

Dr.V.హరికుమార్ : "ఒక యోగి ఆత్మకథ" నేను చదివిన మొదటి స్పిరిచ్యువల్ బుక్. చాలా పుస్తకాలే చదివాను నేను. చదువుతూనే ఉంటాను. ప్రస్తుత్తం "బ్రియాన్ వైస్" వ్రాసిన "Only Love is Real" చదువుతున్నాను.

మారం : మీకు ప్త్రీజీ అప్పజెప్పిన ముఖ్యబాధ్యతలు?

Dr.V. హరికుమార్ : పత్రీజీ ఒక మాట చెప్పేవారు, "నువ్వుక పిరమిడ్ అంబాసిడర్ వయ్యా" అని ఆధ్యాత్మిక భావాలు, చింతన ఉన్న అందరినీ ఒక వేదిక మీదకు తీసుకురావడంలో నీ పాత్ర అతిముఖ్యమైనది" అన్నారు పత్రీజీ. వ్యక్తిగా ప్రతిఒక్కరూ గొప్పవారే, పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ పరపూర్ణయోగుల సమాహారం. దానికి మూలపురుషుడు పత్రీజీ . అందరు వ్యక్తులనూ పిరమిడ్ ప్లాట్ ఫాం మీదకు తీసుకుని వచ్చి, అందరినీ ధ్యానయోగులుగా మార్చాలనేదే పిరమిడ్ సొసైటీ మూలసూత్రం "పత్రీజీ ఆలోచనలను మిగతా ఆధ్యాత్మిక సొసైటీల వారికి వివరిస్తూ, నా కృషి నేను పరిపూర్ణంగా చేస్తూ, పిరమిడ్ అంబాసిడర్ గా ఉన్నాను"అని చెప్పుకోవడానికి గర్విస్తున్నాను.

మారం : మరి గ్లోబల్ కాంగ్రెస్ లో మీరు కూడా పాల్గొన్నారు కదా, అక్కడ మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి?

Dr.V. హరికుమార్ : నేనెంత ఆనందంగా ఫీలయ్యానో చెప్పలేను. అలెక్స్ అర్బిటో నా స్పీచ్ విని "డాక్టర్ హరికుమార్, నువ్వొక అద్భుతమైన డాక్టర్‌వి. మనం మళ్ళీ కలుద్దాం" అన్నప్పుడు నేను ఎంత ఆనందించానో చెప్పలేను. ఇక ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత Dr. న్యూటన్ ఎంత పరాశించిపోయారో, అలాగే పత్రీజీ కళ్ళలో ఆనందం మాటల్లో వర్ణంచలేనిది. నా చైతన్యపరిధి ఎంతో విస్తరించింది.

మారం : జుబ్లీహిల్స్ నుండి "పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రతినిధి" గా మీరు ఎన్నికలలో పోటీ చేసినప్పుడు మీఅనుభవాలు ఎలా ఉన్నాయి, ఎలా ఫీలయ్యారు మీరు?

Dr.V. హరికుమార్ : అద్భుతమైన కరుణకూ, ధర్మానికీ నిర్వచనం మన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. "ఆత్మజ్ఞానులే పాలకులు కావాలి" అన్న సత్యం నాకు పూర్తిగా తెలిసి వచ్చింది రాజకీయ నాయకుల పట్ల ప్రజల్లో ఉన్న అసహ్యం తొలగడానికి మన కృషి ఎంతో అభినందనీయమని మేధావర్గం నుంచి, సాధారణ వ్యక్తుల నుంచి ఎంతో గొప్ప ప్రతిస్పందన వచ్చింది.

మారం : మీ భవిష్యత్ ప్రణళికలు?

Dr.V. హరికుమార్ : "2012 కల్లా ధ్యాన అరోగ్య జగత్" "అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవితం గడపాలి, ధ్యానం చేసి అనేదే" నా ఆకాంక్ష. 2009 లో నా "ధ్యానారోగ్యజగత్ యాత్ర" ఎన్నో దేశాల్లో ప్రారంభం కాబోతుంది త్వరలో.

మారం : ఏఏ ఛానల్స్ ప్రస్తుతం మీ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి? ఇంకా ఏ ఛానెల్స్‌లో రాబోతున్నాయి?

Dr.V. హరికుమార్ : 2005 లోనే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఆధ్యాత్మిక విజ్ఞానాన్నీ, ధ్యానశాస్త్రాన్నీ అందరికీ అందించమని పత్రీజీ నన్ను అదేశించారు. పత్రీజీ నాకు ఇచ్చిన సజెషన్స్ అన్నీ నేను క్రమంగా అమలుపెట్టగలిగాను. వారి వాక్కులు, అవగాహనతో ఎంతో చైతన్యపరిధిని పొందాను. 2005 లో Z- Telugu లో "లైఫ్ సైన్స్" పైన రావడం, 2008 భక్తి ఛానెల్‌లో "వైద్యో నారాయణో హరి" ప్రోగ్రాం, అలాగే "Back to Future""ఎన్నెన్నో జన్మలబంధం" " Progressive Regression Programme"సంస్కృతి ఛానెల్ లో రావడం, "లవ్ గురు" ప్రోగ్రాం ద్వారా TV-1లో రావడం జరుగుతుంది.

మారం : "ప్రశ్న లేకుండా చెప్పాలి" అని మీరు అనుకున్న ఏదైనా విషయం? అలాగే ధ్యానాంధ్రప్రదేశ్ పాఠకులకు మీ సందేశం?

Dr.V. హరికుమార్ : చాలాబావుంది ఇలా అడగడం. మనం ఏదిస్తే మనకది వస్తుంది కాబట్టి అందరికీ ఆరోగ్యం, ఆనందం ఇచ్చే ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుదాం. ధ్యానమయ, జ్ఞానమయ, ఆరోగ్యమయ, ఆనందమయ జీవితాన్ని గడుపుదాం.

అలాగే "ధ్యానం" పరిపూర్ణతకు సూచిక. నిర్వచించలేని ఎన్నో అనుభవాలను, ఆర్టికల్స్‌ను, ఆధ్యాత్మిక సందేశాలను, బ్రహ్మర్షి పత్రీజి ఆత్మను పరిపూర్ణంగా ప్రెజెంట్ చేస్తున్నది "ధ్యానాంధ్రప్రదేశ్" మ్యాగజైన్. కనుక ఒక్క వాక్యం కూడా మిస్ కాకుండా ధ్యానాంధ్రప్రదేశ్ చదవండి, చదివించండి, చందాదారులు కండి, చందాదారులను చేర్చండి. ఇదే నా వినయపూర్వక విన్నపం.

 

Dr.V. హరికుమార్
హైదరాబాద్

Go to top