"ధర్మ సంస్థాపన కోసం అందరూ పాటుపడాలి"

 

 

మారం శివప్రసాద్ : రఘురామ్ గారూ! నమస్కారం;మీ కుటుంబం గురించి చెప్పండి!

కంచి రఘురామ్ : నా పూర్తి పేరు కంచి రఘురామ్; నా భార్య లీల; బాబు ప్రేమ్‌సాయి, కంప్యూటర్ ఇంజనీర్‌గా జాబ్ చేస్తున్నాడు. అమ్మాయి BDS చేస్తోంది; మా కుటుంబమంతా ధ్యాన కుటుంబమే.

మారం : బ్రహ్మర్షి పత్రిజీ పరిచయం ఎప్పుడు ఎలా జరిగింది? ధ్యానంలోకి మీరు ఏ సంవత్సరంలో ప్రవేశించారు?

కంచి రఘురామ్ : "ధ్యానం" గురించి అంతవరకు "వినేవాళ్ళమే" కానీ "చెసేవాళ్ళం" కాదు 1994 లో పత్రీజీ తిరుపతి రావడం జరిగింది. అప్పట్లో తిరుపతి జూనియర్ ఛాంబర్ JAYCE కి నేను ప్రెసిడెంట్‌గా, నా స్నేహితుడు మునిస్వామి సెక్రెటరీగా ఉండేవాళ్ళం. ఒకరోజు మునిస్వామి "‘సుభాష్ పత్రి’ గారు అని ఒకాయన వచ్చారు; ధ్యానం నేర్పుతారట వెళదామా?" అన్నాడు. "ధ్యానం నెర్చుకోవాలంటే మనకు ఇక్కడ తిరుపతిలో ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి కదా, ఎక్కడి నుండో వచ్చిన వారితోనే ఎందుకు? అయినా, నువ్వు చెపుతూ ఉన్నావు కనుక వెళదాం" అన్నాను.

అది 12-5-1994. ఉదయం 5 గం||లకే అలిపిరి వద్ద "బాలాజీ సత్సంగ్‌" - "దివ్యారామం" లో ఉంది అక్కడికి వెళ్ళాం, "పత్రి గారు" అప్పటికే అక్కడ ఒక్కరే కూర్చొని ఉన్నారు. వెళ్ళి ఆయన్నే అడిగాం, "సుభాష్ పత్రి’ గారు అంటే ఎవరు? ఎక్కడ ఉన్నారు?" అని. "నేనే" అన్నారు ఆయన! నాకు మంచి ఇంప్రెషన్ కలుగలేదు. "ఈయనేమిటి? జీన్స్ ప్యాంట్, షర్ట్ ‘టక్’ చేసి, స్టైలిష్ గా ఒక ఆఫీసర్‌లా ఉన్నాడు ఈయన ధ్యాన గురువేంటి?" అనుకున్నాను. అంతలో ఆయన వేదిక దిగి "రండి! నాకు తెలుసు మీరు వస్తారని" అన్నారు. "నేనెవరొ తెలియదు ... నేనొస్తానని నాకే తెలియదు ..." అనుకుని, "సరేలే కానీ! కాస్సేపు కూర్చునిపోతే అయిపోతుంది" అనుకున్నాను. "ధ్యానం చేసే పద్ధతి తెలుసా?" అన్నారు. అంతవరకు మనకు పూజలు, పునస్కారాల గురించి మాత్రమే తెలుసు. "ధ్యానం తెలియదు" అన్నాను. "సరే ఒక ఇరవై నిమిషాలు కూర్చుని ’శ్వాస మీద ధ్యాస’ పెట్టండి" అన్నారు; కుర్చున్నాం. అది ‘పత్రీజీ’తో మొట్టమొదటి కలయిక.

మారం : ఎలా అనిపించింది మొదటిసారి ధ్యానానికి కూర్చున్నప్పుడు?

కంచి రఘురామ్ : మొదటిసారి ధ్యానం చేశాను కానీ, పత్రీసార్ మీద మంచి ఇంప్రెషన్ కలుగలేదు. కనుక శ్రద్ధగా చేయలేదు. కానీ "ఏదో, ఒకానొక తెలియని అనుభూతి" కలిగింది. అదే చెప్పాను వారితో. "మీరు మనస్సులో ఏదో పెట్టుకుని ఉంటారు, అందుకే కుదరలేదు. అభిప్రాయాలు పెట్టుకుని ధ్యానం చేయకూడదు; ఏ అభిప్రాయం లేకుండా ధ్యానం చేయండి, అప్పుడు కుదురుతుంది" అని సబ్జెక్టు చెపుతూ వచ్చారు, " ఈ రోజు సాయంత్రం మళ్ళీ 5 గం||ల నుండీ 6 గం||ల వరకు నేనిక్కడే ఉంటాను రండి " అన్నారు. "సరే వస్తాను" అని చెప్పి వెళ్ళిపోయాను. అప్పుడు నేను "తిరుపతి AGS జూనియర్ కాలేజీ" కి ప్రిన్సిపాల్ గానూ, "తిరుపతి రెసిడెన్సియల్ కాలేజీ" కి కరెస్పాండెంట్ గానూ ... ఇంకా "రాయలసీమ స్టడీ సర్కిల్" కి ఇన్ఛార్జ్ గానూ వివిధ పదవులు నిర్వహిస్తూ చాలా బిజీగా ఉండేవాడిని. ఆ రోజు పనులన్నీ చూసుకుని ఇంటికి వచ్చేసరికే సాయంత్రం 5.45 గం||లు అయింది .. హడావుడిగా వెళ్ళిపోయాను స్కూటర్ పై .. సమయం 6.20 గం||లు అయింది "దివ్యారామం" కు చేరేసరికి.

పత్రీజీ వెయిట్ చేస్తున్నారు. "సారీ, లేటయింది” అన్నాను. "నోనో, నాకు తెలుసు మీరు తప్పక వస్తారని" అన్నారు. "ఇదేంటి? ఉదయం కూడా ఇలాగే ‘మీరు వస్తారని నాకు తెలుసు’ అన్నారు. ఇప్పుడేమో ‘మీరు తప్పక వస్తారని ఎదురుచూస్తున్నాను’ అంటున్నారు. ఏమిటీయన?" అంటూ వారి గురించి నేను అంతకుముందు ఏర్పరచుకున్న అభిప్రాయం నెమ్మదిగా మారడం మొదలైంది. అప్పుడాయన నాకు మరికొన్ని విషయాలు చెప్పారు. "రేపు ఉదయం కూడా నేను ఉంటాను రండి" అన్నారు. అలాగే వెళ్ళాను. కొన్ని ప్రశ్నలు అడిగాను. "ఈ ప్రశ్నలు నాకూ ఉండేవి .. పదిహేను సం||ల క్రింద. నన్ను నేను తెలుసుకోడానికి నాకింత సమయం పట్టింది. ఇప్పుడు నేను చకచకా సబ్జెక్టు చెపుతున్నాను. ఇప్పుడు నేను చెప్పేది వింటే, 15 సం||లు పాటు నేను తెలుసుకున్నది మీరు ఇప్పుడే తెలుసుకొని అక్కడ నుంచే ప్రారంభస్తారు" అన్నారు.

నేను ఏర్పేడు శ్రీ మళయాళస్వామి వారి ’వ్యాసాశ్రమం" లో ఇంకా ఎన్నోచోట్ల ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, ఇంకా ఎన్నో ఆధ్యాత్మిక ప్రవచనాలు విన్నాను. అయితే ఇంత ఖచ్చితంగా చెప్పినవారు లేరు ... అరగంట చాలా ఇష్టంతో ధ్యానంలో కూర్చున్నాను. మైండ్ అంతా ఏదో అయిపోయినట్లు ... ఏదో దిమ్ముగా ఉంది ; చాలా చక్కగా ఉంది. శరీరం అంతా ఏదో జర్క్స్ ఇస్తున్నట్లుగా ఉంది. అది మూడవ సిట్టింగ్ ధ్యానంలో.

మారం : అంటే ... మొదటిసారి నిర్లక్ష్యంగా, రెండవసారి సహజంగా, మూడవసారి శ్రద్ధగా ధ్యానం చేశారన్నమాట.

కంచి రఘురామ్ : అవును! అప్పుడు పత్రీజీ అన్నారు ... "నిన్నఒకమాట చెప్పాను మీకు అందుకే! అభిప్రాయాలు పెట్టుకుని ధ్యానం చెయ్యవద్దని. ఇప్పుడు ఏ అభిప్రాయం లేకుండా, ‘సత్యం చెపుతున్నాడు, విందాం’ అనే ‘దృష్టి’ వచ్చింది, ఈ దృష్టి అనే విషయంలో జాగ్రత్త వహించాలి" అన్నారు.

"చెప్పేది ‘మంచి మాట’ అయినప్పుడు, ఇష్టాయిష్టాలు లేకుండా, అవతలివాళ్ళు చెప్పేది శ్రద్ధగా విని, దృష్టి పెట్టుకుని ఆచరిస్తే, దృష్టి ఆ చెప్పే ‘సత్యం’ పైన పెడితే, అది ఫలవంతమవుతుంది" అన్నారు.

ఇంకా స్పష్టంగా పత్రీజీ ... "విషయాన్ని ఏకాగ్రతగా విని ఆచరించాలి. ‘ఏకాగ్ర దృష్టి’ పెట్టుకుని చూడాలి. అప్పుడే విషయం అర్థమవుతుంది. ఇపుడు మీరు దృష్టి పెట్టుకుని ధ్యానం చేయడం వల్లనే కదా ధ్యానం బాగా కుదిరింది" అన్నారు.

మారం : "దృష్టి నిలిపెనేని దేవుడు దిగివచ్చును" అన్నట్లుగా

కంచిరఘురామ్ : ఇదేమాట అన్నారు పత్రీజీ. ఆరోజు నుంచి నేను ఏ పని చెయ్యాలన్నా, దృష్టి పెట్టి చేసి, సత్ఫలితాలను పొందగలిగాను. ఆ రోజు పత్రిగారు చెప్పింది నాకు ఇప్పటికీ చెవుల్లో మారుమ్రోగుతోంది. "నీకు నువ్వుగా తెలుసుకోవాలంటే పదిహేను సంవత్సరాలు పడుతుంది. దృష్టి పెట్టి నేను చెప్పేది వింటే ఇప్పుడే ... దేవుడు దిగివస్తాడు" అని, గొప్ప లాభం పొందాను పత్రీజీని కలిసిన రెండవ రోజే.

మారం : ఆ తర్వాత మళ్ళీ పత్రీజీని ఎప్పుడు కలిశారు? కర్నూలు బుద్ధా పిరమిడ్‌ని మీరు ఎప్పుడు దర్శించారు?

కంచి రఘురామ్ : మూడవసారి మళ్ళీ నెల తరువాత నేను, కేశవరాజు, మునిస్వామి ముగ్గురం కలిశాం పత్రీజీని... ఇష్టంగా. నేను, కేశవరాజు, మునిస్వామి ... అప్పుడు తిరుపతిలో ఏం చేసినా కలిసే చేసేవాళ్ళం. కేశవరాజు కూడా చాలా ఇంప్రెస్ అయ్యాడు మొదటిసారి పత్రీజీని కలిసినప్పుడే, ఆ పై నెల గురుపౌర్ణమికి "నందవరం సదానందయోగి ఆస్రమం" వద్దకు రమ్మని ఆహ్వానించారు పత్రీజీ. "మేం ముగ్గురం వస్తాం"అని మాట ఇచ్చాం. అయితే తీరా బయలుదేరే ముందే మా తండ్రి గారు దేహత్యాగం చేయడం వల్ల మా ప్రయాణం రద్దు అయ్యింది.

తర్వాత ఆగస్టులో పత్రీజీ వచ్చారు, "‘భీమాస్ డీలక్స్ హోటల్’ లో మూడురోజులు ఉంటారు" అని తెలిసి, పత్రీజీ ని కలిసాను. మా తండ్రిగారు దేహత్యాగం చేశారని వారికి తెలుసు. మనవాళ్ళు చెప్పారు. "ఆయన నన్నేమైనా పరామర్శిస్తారేమో" అని చూశాను. మొదటిరోజు లేదు, రెండవరోజూ పరామర్శించలేదు. "ఈయన ఏం ‘గురువు’ అబ్బా? నాకింత కష్టం వస్తే కనీసం పలుకరించడు, పరామర్శించడు ... ఛీ ఛీ .. ఈయనతో ఇక సంబంధం అవసరం లేదు .. ‘కట్’ చేద్దాం" ... అనుకున్నాను. అప్పుడు రాత్రి 9గం||లు అయింది, "ఏమండీ ఈ పుస్తకం చదవండి" అని ఒక పుస్తకం ఇచ్చారు. అది "Life after Death" అనే పుస్తకం. "ఈ పుస్తకం చదివి చెప్పండి" అన్నారు. "సరే" అని ఇంటికి వచ్చి, భోజనం చేసి రాత్రి 11 గం||లకు పుస్తకం తెరిచాను. తెల్లవారుఝామున 4 గం||లకు పుస్తకం అయిపోయేవరకు ‘దృష్టి’ మరలలేదు! అంతగా లీనం అయ్యాను పుస్తకంలో!! పుస్తకం పూర్తి అయ్యేసరికి నా కళ్ళనిండా నీళ్ళు ... ధారాపాతంగా.

"మరణించిన తర్వాత ‘ఆత్మస్థితి’ ఎలా ఉంటుంది?", "మరణించిన వారి గురించి మనం ఎందుకు దిగులు చేయకూడదు?" అన్న విషయాలు అద్భుతంగా ఆ గ్రంథంలో వున్నాయి. అప్పుడు అర్థమయ్యింది వారి మధురస్మృతులను మాత్రమే గుర్తు చేసుకోవాలి అని, ఎంతగా ఆ పుస్తకం నన్ను ప్రభావితం చేసిందో చెప్పలేను. ఈ సబ్జెక్ట్ అసలు అంతకుముందు తెలిసిన సబ్జెక్ట్ కాదు. "అవగాహనా లోపంతో పత్రీజీ కి దూరం అవుదామనుకున్నానే" అని వితర్కించుకుంటూ, ధ్యానంలోకి వెళ్ళిపోయాను. మొట్టమొదటిసారి నాకై నేను నిండుగా, తృప్తిగా ధ్యానం చేశాను అరగంట సేపు. 15రోజుల క్రింద మరణించిన మా తండ్రి ధ్యానంలో నా ముందు కూర్చుని ఉండడం చూశాను, అయితే అది ఆయన ‘ఆత్మస్థితి’ అని వెంటనే అనుకోలేకపోయాను. మా తండ్రి గారి ఆత్మ నన్ను పలకరించి, ‘నువ్వు ధ్యానం చేయడం వల్లనే నన్నిప్పుడు ధ్యానంలో చూడగలిగావు ; చాలా మంచి మార్గంలోకి వచ్చావు నువ్వు. జీవితంలో ఎప్పుడూ ధ్యానాన్ని విడవద్దు" అని చెప్పారు. "ఆత్మతో అలా మాట్లాడగలుగుతాను" అన్నది నేను అస్సలు ఊహించలేదు. నమ్మశక్యంకాని అనుభూతి, ఉద్విగ్న క్షణాలవి! భాషకు అందనివి! ధ్యానంలోంచి బయటకు వచ్చిన తర్వాత కూడా దాదాపు 15 ని|| లు ఆ స్థితిలోంచి బయటకు రాలేకపోయాను.

మరునాడు నేను స్నానం చేసి 6గం||ల కంతా పత్రీజీ దగ్గరికి వెళ్ళాను. "నాకు తెలుసు! నువ్వు ఉదయం 6 గం||ల కల్లా నా దగ్గరికి వస్తావు” అని అన్నారాయన. వారికి చెప్పాను నా నమ్మశక్యం గాని అత్యద్భుతమైన ఆత్మానుభవాన్ని!!! ఆ తరువాత ఆయన రెండు గంటలసేపు జనన, మరణ స్థితుల గురించి, ఆత్మల గురించి మన అనుభవజ్ఞానం గురించి ఎంతో స్నేహంగా, ఆత్మీయంగా, విపులంగా విశదీకరించారు. "మన నుంచి దూరమైపోయిన ఒక ప్రియతమ ఆత్మను ఎలా చూడగలం ..." అనే విషయం గురించి ఎంత బాగా వివరించారో!

ఈ సంఘటన తర్వాత పత్రీజీతో నా స్నేహం మూడు పూవులు, ఆరు కాయలుగా విస్తరించింది. నేను, భీమాస్ రఘు, కేశవరాజు .. ఇంకా ఇతర మాస్టర్లు దినాలతరబడి, రాత్రుళ్ళు తరబడి స్పిరిచ్యువాలిటీలోని ఎన్నెన్నో లోతైన విహయాలు పత్రీజీ నోటివెంట వినేవాళ్ళం, ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు అత్యంత సంతృప్తికరంగా లభించేవి.

మారాం : "భీమాస్ రఘు" గారితో మీ పరిచయం పత్రిగారి ద్వారానే అయిందా?

కంచి రఘురామ్ : అంతకుముందు నేనొక కాలేజి ప్రిన్సిపాల్‌ని, మరి జూనియర్ ఛాంబర్ ప్రెసిడెంట్‌ని కనుక శ్రీ భీమాస్ రఘు గారితో గౌరవపూర్వమైన పరిచయం ఉండేది. భీమాస్ రఘు పత్రీజీకి అంతకుముందే వారి మేనమామ "తులసీప్రసాద్ బారు" గారి ద్వారా ఆత్మీయ పరిచయం అయ్యారు. అటుపైన పత్రీజీ రెగ్యులర్‌గా "భీమాస్ డీలక్స్" లోనే ఉండేవారు. ఆ తర్వాత ధ్యానం నన్ను, భీమాస్ రఘును, కేశవరాజును, కుప్పుస్వామి, సంగీతబాబులను మరింత సన్నిహిత మిత్రులుగా చేసింది.

మారం : "పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా" కు ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా ప్రేరణ జరిగింది?

కంచిరఘురామ్ : 1998 డిసెంబర్ 27 .. కడప జిల్లా రైల్వే కొండాపురం లో పత్రీజీ ధ్యానం క్లాసులో ఉండి ఎ.వి. సాయికుమార్ రెడ్డితో ఫోన్ చేయించారు. అది సాయికుమార్ స్వస్థలం కూడా. ఇక నేను వెంటనే తిరుపతి నుంచి బయలుదేరి రైల్వే కొండాపురం వద్దనున్న పత్రీజీ, దగ్గరకు వెళ్ళాను. ఆ రోజు రాత్రి ఆయనకు గొంతు బాగా వాచి ఉండి మాట్లాడలేక పోయి సైగలు చేశారు. రాత్రి అక్కడే పడుకున్నాం ఉదయం లేస్తూనే, "రఘురాం! రాత్రి గొంతు ఎండుకుపోయి నేనసలు మాట్లాడలేకపోయాను. ఎందుకో తెలుసా?" అన్నారు. "గురూజీ! మీరు ఎన్నో ప్రోగ్రామ్స్‌లో పాల్గొంటూ ఉంటారు. ఎక్కువగా మాట్లడుతూ ఉండడం వల్ల గొంతు బొంగురుపోయి ఉంటుంది" అన్నాను.

"అదేం కాదు నిన్న రాత్రి అంతా వేరే డైమెన్షన్స్ మాస్టర్స్ నా గొంతుకు వివిధ పద్ధతుల్లో ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ లెవల్‌కు ఆపరేషన్ చేశారు. వెంటనే ఒక రాజకీయ పార్టీ పెట్టమని అదేశం వాళ్ళ నుంచి వచ్చింది. అది ఎలా చేస్తావో ఏమో .. అంతా నువ్వే చేయాలి" అన్నారు. ’ అలాగే గురూజీ, చేద్దాం" అన్నాను. "మరి నువ్వా విషయసేకరణ చేసి, ఆ పద్ధతులన్నీ బాగా గమనించు.. ఈ పని నువ్వే చేయాలి" అన్నారు. "సరే" అని తిరుపతికి వచ్చి లాయర్ అయిన మా అన్నని అడిగాను. "అది ఎలక్షన్ కమీషన్ సంబంధించిన వ్యవహారం అక్కడే తెలుసుకోవాలి" అన్నారు మా అన్న.

మారం : మన పార్టీ ప్రారంభోత్సవ సభకి "శ్రీ టి.న్.శేషన్ గారు" వచ్చారు కదా అది ఎలా సాధ్యమయింది?

కంచి రఘురామ్ : పార్టీ పెట్టాలనుకోవడం ఎంత చిత్రమో, శ్రీ టి.న్. శేషన్ గారిని కలవడం అదొక మహావిచిత్రం! "ఎలక్షన్ కమీషన్‌ను సంప్రదించడానికి ఏం చేయాలి?" అని భీమాస్ రఘుతో చర్చించాను. టి.న్. శేషన్ గారు రిటైర్ అయి, చెన్నైలో సెటిల్ అయి ఒక నెల అయింది అప్పటికి. భీమాస్ రఘు, శేషన్ ఫోన్ నెంబర్ సంపాదించి ఇచ్చారు. నేను ఫోన్ చేశాను ఆ నెంబర్‌కి. "శేషన్ ఊళ్ళో లేరు" అని జవాబు వచ్చింది. నేను ఆ రోజు నుండి ప్రతిరోజు ప్రయత్నిస్తూనే ఉన్నాను. లక్కీగా ఒకరోజు శేషన్‌గారు ఫోన్ ఎత్తి మాట్లాడినప్పుడు "సర్! నేను ఒక ఆధ్యాత్మిక సంస్థ నుంచి మాట్లాడుతున్నాను. మేం ఒక రాజకీయ పార్టీని స్థాపిద్దామనుకుంటున్నాం. ఇందుకు మీ సహాయ, సహకారాలు కావాలి". అని ఇంగ్లీషులో అడిగాను. ఆయన "ఓకే" అని ఒక తేది చెప్పి, "ఆ రోజు మధ్యాహ్నం 3గం||లకి వచ్చి కలవండి" అన్నారు.

ఆయన చెప్పిన ప్రకారం నేను, నెల్లూరు ఆనందరావు, కేశవరాజు, జయరాం కారు తీసుకుని చెన్నైలోని ఆయన ఇంటికి వెళ్ళాం. శేషన్ గారికి "ధ్యానం" గురించి, "పత్రీజీ" గురించీ, మన కార్యకలాపాల గురించి చెప్పాం. ఈ వివరాలన్నీ విని శేషన్ ఎంతో ఆనందించారు. ఆ తర్వాత ఫిబ్రవరిలో నేను. భీమాస్ రఘు, పత్రీజీ కలిసి వెళ్ళి మళ్ళీ శేషన్ గారిని కలిసి "బుద్ధా పిరమిడ్ పార్టీ" ప్రారంభోత్సవానికి ఆహ్వానించాం, చాలా సంతోషపడ్డారాయన పత్రీజీ ని కలిసి.

25-02-1999 న ఆయనను నేను చెన్నై నుండి పిలుచుకుని వచ్చి భారీ ర్యాలితో ఆంధ్రప్రదేశ్ లోని సీనియర్ మాస్టర్స్ ఆధ్వర్యంలో తిరుపతి పట్టణంలోని "త్యాగరాజ మండపం" లో బ్రహ్మర్షి పత్రీజీ ఆధ్వర్యంలో టి.న్.శేషన్ ముఖ్య అతిథిగా వైభవంగా పాటీ ప్రారంభోత్సవం జరిపాం.

ప్రారంభోత్సవం అయిన తర్వాత, "దీనిని వెంటనే ఢిల్లీ ఎలక్షన్ కమీషనర్ రిజిస్ట్రేషన్ చేయించండి" అని చెప్పారాయన. ఆయన సలహాలతో, అడ్రసుతో ఢిల్లీకి వెళ్ళాం. ఆంధ్రప్రదేశ్ అంతా వేరువేరు ప్రాంతాల నుండి. నియమ నిబంధనల ప్రకారం అన్నీ తయారుచేసుకొని, "బుద్ధా పిరమిడ్ పార్టీ’ అని పేరు పెట్టడానికి వీల్లేదు. ‘బుద్ధా’ పేరు ఉండడానికి వీల్లేదు" అన్నారు. అప్పుడు పత్రీజీ మహారష్ట్ర‌లో ఉన్నారు. చెప్పాం వారికి. "మరి ‘శివసేన’ ఉంది కదా?" అన్నారు పత్రీజీ. అడిగాం ఎలక్షన్ కమీషనర్ ని. "ఈ రూల్ రాకముందు పెట్టిన పేరు అది, ఇప్పుడు అలా వీల్లేదు" అన్నారు. మరి "పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా’ అని పెడదాం సార్" అన్నాను నేను పత్రీజీతో. "ఓకే రఘురామ్ ‘పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా’ అనే పేరు చాలా బాగుంది. అదే ఖాయం చెయ్యండి" అన్నారు పత్రీజీ.

పేరు మార్చడం వల్ల మేం తీసుకెళ్ళిన పేపర్లేవి పనికిరాలేదు. మళ్ళీ తిరుపతికి వచ్చి అన్ని పేపర్లు కొత్తగా "పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా" పేరుతొ తయారు చేసి మళ్ళీ ఢిల్లీ వెళ్ళాం. ఫారాలన్నీ దాఖలు చేసిన తరువాత ఇంటర్వ్యూకు ఒక తేదీ ఇచ్చారు. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరుపున నేను వెళ్ళాను. అన్నీ అడిగారు. నేను చెప్పిన దానికి వాళ్ళు సంతృప్తి చెందడమే కాకుండా చాలా సంతోషించారు కూడా.. మన సిద్ధాంతాలు ధ్యానం, శాకాహారం గురించి విని ఆధ్యాత్మికవాదులు పాలకులు కావాలనే మన సిద్ధాంతం వారిని ముగ్ధులను చేసింది. మే నెల 1999 సం||లో రిజిస్ట్రేషన్ జరిగింది "పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా" పేరున.

మారం : "పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా" తొలి సమావేశం ఎప్పుడు ఎక్కడ జరిగింది?

కంచి రఘురాం : మే 1999 సం||లో తిరుపతికి 30 km దూరంలో "పులిబోను బావి" అనే ప్రదేశంలో "పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా" కి సంబంధించి. మొట్టమొదటి పార్టీ సమావేశం జరిగింది.

మారం : 1999 సం|| ఎలక్షన్స్ లో ఎంతమంది పాల్గొన్నారు? 2004 సం||లో ఎంతమంది పోటీ చేశారు?

కంచి రఘురామ్ : తర్వాత మూడు రోజులకే లోక్‌సభకి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కి ఎలక్షన్స్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. పత్రీజీ "మనం ఎన్నికల్లో పాల్గొనాలి" అన్నారు. సమరోత్సాహంతో పాల్గొన్నాం! 47 మంది అసెంబ్లీ కి, 7 మంది పార్లమెంట్ కి మొదటిసారిగా పోటీ చేశాం! 2004 సం||లో సుమారు 90 మందితో అసెంబ్లీకి, పార్లమెంట్ కు పోటీ చేశాం! కర్ణాటక నుండి బళ్ళారి పార్లమెంట్ కూ, హోస్పేట అసెంబ్లీకీ పోటీ చేశాం!!

మారం : "పిరమిడ్ పార్టీ పెట్టాలి" అని పత్రీజీ చెప్పినప్పుడూ, భీమాస్ రఘుతో మీరు చర్చించినప్పుడూ మీ యొక్క, భీమాస్ రఘు గారి యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయి?

కంచి రఘురామ్ : పత్రీజీ చెప్పిన వెంటనే ముందుకు దూకాం అంతే, "ధ్యానప్రచారంలో ఇదీఒక భాగం" అనుకున్నాం .. నేను, భీమాస్ రఘు కూడా. మాకు ఏ విధమైన సందిగ్ధాలు లేవు. అయితే ప్రజల్లో రకరకాల వ్యాఖ్యానాలు. "వీళ్ళకెందుకు రాజకీయాలు?" అంటూ ఇంకా ఏమేమో వ్యాఖ్యలు, విమర్శలు ముందు, వెనుకా కూడా. మేమస్సలు పట్టించుకోలేదు. మా స్నేహితులు, బంధుగణం ... అందరిలో చర్చలే చర్చలు.

1999 సం|| ఎలక్షన్స్‌లో ఫస్ట్ నామినేషన్ నేనే వేశాను ... అందర్ని ఉత్సాహపరుస్తూ!

మారం : 1999 సం|| అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు పిరమిడ్ పార్టీ మీకు ఎలాంటి అనుభూతినిచ్చింది? మిగతా పిరమిడ్ మాస్టర్ల ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి?

కంచి రఘురామ్ : నిజం చెప్పాలంటే, పిరమిడ్ పార్టీ వర్క్ చేసినప్పుడు, ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు వంద రెట్లు ఎక్కువగా నేను ఎనర్జిటిక్‌గా ఫీలయ్యాను. పత్రీజీ నాలుగురోజులు మాతోనే ఉన్నారప్పుడు. నేను, భీమాస్ రఘు, మా బ్రదర్స్, ఇతర మాస్టర్స్‌తో కలిసి పత్రీజీ వెంట నడుస్తూ "పిరమిడ్ పార్టీ జిందాబాద్! ధ్యానం చేయాలి! శాకాహారం తీసుకోవాలి! ఆధ్యాత్మిక వాదులే పాలకులు కావాలి" అని నినాదాలు చేస్తూ, ర్యాలీలు తీస్తూ, బ్రోచర్లు పంచుతూ తిరుగుతూ ఉంటే, పెరిగిన ఎనర్జీ లెవల్ అంతా ఇంతా కాదు! ఒక చిత్తూరు జిల్లా నుండే మదనపల్లి -"విజయలక్ష్మి", పుత్తూరు-"కేశవరాజు", వాయల్పాడు -"రెడ్డి సుధాకర్", పీలేరు "రాజకుమార్" అనే అడ్వకేట్, వేపంజెర్రి -"ఆనంద్" ఇలా ఇల నిజం చెప్పాలంటే ఎన్నికల్లో పాల్గొన్న పిరమిడ్ మాస్టర్స్, ప్రచారంలో పాల్గొన్న మాస్టర్స్ ఎంతో బాగా స్పందించారు. "ధ్యాన అనుభవాల కన్నా, ఎలక్షన్స్‌లో పాల్గొన్నప్పుడు మాకు ఎన్నో రెట్లు శక్తివంతంగా అనిపించింది" అన్నారు.

1999 సం||లో నాకు 1305 ఓట్లు వచ్చాయి. తిరుపతిలో అప్పటికి అంతా కలిసి వెయ్యి మంది పిరమిడ్ ధ్యానం చేసేవాళ్ళుంటే, "1305" ఓట్లు నాకు వచ్చాయంటే, ఆధ్యాత్మిక వాదులు రాజకీయాల్లోకి రావాలనే ఆకాంక్ష ప్రజల్లో బలంగా వుంది అనేది ఋజువైంది.

ఈ విధంగా 1999 సం||లో కొన్ని వందలమంది, 2004 సం||లో కొన్ని వేలమంది మనకు ఓట్లు వేసారు.

పత్రీజీ ఏమన్నారంటే "ఇష్టం ఉండే వాళ్ళు వస్తారు ; కష్టం ఉన్న వాళ్ళు పోతారు. మనం విచారించవలసిన పనిలేదు" అన్నారు. పిరమిడ్ ధ్యానం చాలా గొప్పది, పిరమిడ్ పార్టీ కార్యక్రమాలు ధ్యానానికి పరాకాష్ట.

మారం : 1999 సం|| ఎన్నికలప్పుడు కానీ, ఎన్నికల తర్వాత కానీ, 2004 సం|| ఎన్నికలప్పుడు కానీ, ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ నుంచి మీకేమైనా సందేశాలు వచ్చాయా?

కంచి రఘురామ్ : 2004 సం|| ఎన్నికల్లో విజయవాడలో అందరికీ B. Forms ఇచ్చి, రాత్రి 3గం||లకు పడుకున్నాను. ఎవరో మాస్టర్స్ నన్ను నిద్రలో ఎక్కడికో తీసుకుని వెళ్ళారు. "చెప్పండి!" అన్నారు. "ఏం చెప్పాలి?" అని అడిగాను నేను. పిరమిడ్ పార్టీ వ్యవహారాల గురించి చెప్పండి" అని అడిగారు. నేను అన్నీ వివరించాను "పిరమిడ్ పార్టీలో ప్రజలందరూ ఎందుకు ఇన్‌వాల్వ్ కావడం లేదు?" అని వారిని ప్రశ్నించాను నేను. "ఈ రోజు ఉండి, రేపు వెళ్ళిపోయేవారితో మనకు అవసరం లేదు. ఆత్మజ్ఞానులే ఇందులో పాల్గొంటే చాలు. ఫైనల్‌గా మీరు చేయవలసిందేమంటే పిరమిడ్ పార్టీని ముందుకు తీసుకెళ్ళడమే" అన్నారు.

ఉదయం పత్రీజీ కి ఈ అనుభవం చెప్పాను. "అది ‘అనుభవం’ కాదయ్యా రఘురామ్. ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ మాస్టర్స్ నీతో చేసిన సంభాషణ. ‘ఎందుకు అందరూ రావడం లేదు?’ అనే సందేహానికి వాళ్ళు నీకు ఇచ్చిన వివరణ అది, అందరితో మనకు సంబంధం లేదు. అసలైన ఆత్మజ్ఞానులందరూ వందశాతం బయటకు వస్తారు” అని చప్పట్లు కొట్టించారు పత్రీజీ.

మారం : ఇంకా మీకు ఏమైనా ప్రేరణలున్నాయా?

కంచి రఘురామ్ : నాకేమి ప్రేరణలు వేరే లేవు. అయితే చాలామంది మాస్టర్స్ కు అనుభావాలు, సందేశాలు, ప్రేరణలూ ఉన్నాయి. పిరమిడ్ పార్టీ మంచి ఉన్నతస్థితిలో ఉన్నట్లు వర్క్ బాగా జరుగుతూ ఉన్నట్లు ప్రపంచమంతా ధ్యానులే ఉంటూ, పిరమిడ్ పార్టీమయమైనట్లు, పత్రీజీ మొత్తం విశ్వంలో ఉన్నట్లు ... ఇలా ఇంకా చాలాచాలా అనుభవాలు ఎంతోమంది మాస్టర్లకున్నాయి. ఆ స్పూర్తి ఈ 2009 సం|| ఎన్నికల్లో మనం ఇంకా బాగా అన్ని స్థానాలకూ పోటీ చేసి, మంచి ఊపు తీసుకొని వస్తోంది.

మారం : మన పిరమిడ్ మాస్టర్లలో కూడా పార్టీపై ఎన్నో వైవిధ్యమైన అభిప్రాయాలు ఉన్నాయి. "పిరమిడ్ పార్టీ అధ్యక్షుని" గా మీరేం చెప్పదలుచుకున్నారు?

కంచి రఘురామ్ : బ్రహ్మర్షి పత్రీజీ ఆలోచనల రూపం ధ్యానం. ధ్యానం యొక్క రూపాలు "ధ్యానాంధ్రప్రదేశ్", "ధ్యానభారత్", "ధ్యానజగత్" కార్యక్రమాలు. "ధ్యానాంధ్రప్రదేశ్" మాసపత్రిక, "స్పిరిచ్యువల్ ఇండియా", "ధ్యాన కస్తూరి", “ధ్యాన తమిళనాడు", "ధ్యాన భారత్" ఈ పత్రికలన్నీ "ధ్యాన భారాత్ యజ్ఞం" యొక్క వివిధ రూపాలు. మరి "ధ్యానగ్రామీణం", "పైమా" ఇవి ధ్యానప్రచారంలో విస్మృత బృహత్ప్రణాళికలు. ఇక "పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా" అన్నది ధ్యానరూపం యొక్క పరాకాష్ఠ .

అంటే "పిరమిడ్ పార్టీ" ద్వారా ప్రజల్లోకి ధ్యానాన్ని, శాకాహారాన్ని తీసుకుని వెళ్తే, అది ప్రపంచవ్యాప్తంగా ప్రజల మనసుల్లోకి చొచ్చుకొని వెళ్ళి, ప్రతి మనిషి ఆత్మజ్ఞాని కావాలని కనీసం ఆలోచిస్తారు వాళ్ళు. మరి "పిరమిడ్ పార్టీ" ద్వారా మనం ప్రజల్లోకి వెళ్ళినప్పుడు 1999, 2004 లో సగం మంది మాస్టర్లు రాలేదు. అయితే 1999 సం|| కంటే 2004 సం||లో, 2004 సం|| కంటే 2009 సం||లో ఇప్పుడు అంతకుముందు రాని వాళ్ళు, పత్రీజీ కాన్సెప్ట్ అర్థం చేసుకుని, ఇవాళ రాజకీయం చాలా అవసరం, మనం మరింత ప్రజల్లోకి వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది" అని ఎందరో ప్రముఖులే ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకు వచ్చారు.

చూస్తూ ఉండండి .. మరి 2012 తరువాత ఎంత గొప్ప మార్పు వస్తుందో! ఈ ఎలక్షన్ తర్వాత క్రమంగా జరిగే మార్పు మీరే చూస్తారు. ప్రతి పిరమిడ్ మాస్టర్ ఈ సత్యాన్ని గ్రహించి, ఈ ధర్మరాజ్యస్థాపనకు నడం బిగించాలి ఈ క్షణం నుండే.

మారం : మరి మన "పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా" ఆంధ్రప్రదేశ్ నుంచే కాక మరి ఏ ఇతర రాష్ట్రాల నుండి పోటీ చేస్తోంది?

కంచి రఘురామ్ : ఈ 2009 ఎన్నికల్లో ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు ఆంధ్రప్రదేశ్ తో బాటు కర్నాటక, తమిళనాడు, ఒరిస్సా, ఛత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర, అండమాన్‌లలో కూడా నామినేషన్లు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అయితే అసెంబ్లీ, పార్లమెంట్ కలిసి 200 పైగానే స్థానాల్లో పిరమిడ్ పార్టీ ప్రతినిధులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అంటే మనలో ఎంతమంది ఎన్ లైటెన్డ్ మాస్టర్స్ ఉన్నారో, ఎంత ఆత్మజ్ఞానం వెల్లివిరుస్తోందో చూడండి మరి.

అంతేకాక పత్రీజీ రాబోయే కాలంలో "పిరమిడ్ పార్టీ ఆఫ్ అమెరికా","పిరమిడ్ పార్టీ ఆఫ్ ఈజిప్ట్ ", "పిరమిడ్ పార్టీ ఆఫ్ రష్యా" .. ఇలా ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ పార్టీ ద్వారా ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని మరింతగా ప్రజల్లో చొచ్చుకుపోయేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఒక్కొక్క నగరంలో లేదా పట్టణంలో, గ్రామంలో ధ్యానప్రచారం మొదలుపెడితే, అది ప్రజల్లోకి వెళ్ళిపోవడానికి సంవత్సరాలు పడితే, అదే ఎన్నికల ద్వారా రెండు నెలల్లోపలనే మన మ్యానిఫెస్టోను ప్రతి ఇంటికీ చేర్చడం ద్వారా శరవేగంగా ధ్యాన, శాకాహర ప్రచారం సాగుతుంది .

ఈ సత్యాన్ని ప్రతి పిరమిడ్ మాస్టర్ అర్థం చేసుకుని ఎన్నికల ప్రచారంలో దూకాలి.

ప్రతిక్షణమూ కష్టపడుతూనే ఉన్నారు పత్రీజీ, మనం కూడా ఆయన మార్గంలో ముందుకుసాగాలి. "పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మన ధ్యానుల పార్టీ, యోగులందరి పార్టీ, ఆత్మజ్ఞానులందరి పార్టీ" అని తెలుసుకోవాలి ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా.

మారం : మన ఆధ్యాత్మిక రాజకీయ సదస్సులకు హాజరైన ఇతర ఆధ్యాత్మిక సంస్థలు ఎలా స్పందించాయి? వారి అభిప్రాయాలు ఎలా ఉన్నాయి మన పార్టీ విషయంలో?

కంచి రఘురామ్ : ఇతర ఆధ్యాత్మిక సంస్థలు మనకు ఇస్తున్న సహకారం ఎంతో గొప్ప విషయం. పోయిన డిసెంబర్‌లో మనం "విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం" లో చేసిన ఆధ్యాత్మిక గురువుల రాజకీయ సమ్మేళనంలో పాల్గొన్న ప్రతి ఆధ్యాత్మిక సంస్థ ఆత్మజ్ఞానులు పాలకులు కావాలనే ప్రగాఢ కాంక్ష వ్యక్తం చేసాయి. మార్చిలో "హరిద్వార్" కు వెళ్ళి "రామ్‌దేవ్ బాబా" ను కలిసాం. ఆయన మన మ్యానిఫెస్టోని చూసి ఎంతగా ఆనందించారో. కదిలిపోయారు ఆయన పిరమిడ్ పార్టీ ఆశయాలకు, "బ్రహ్మకుమారీస్" వాళ్ళు కూడా మన వేదికలకు వచ్చారు. తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు, "ఆధ్యాత్మిక వాదులు పాలుకులైతే ఎంత బాగుంటుందో" అని మొన్న మార్చి 8 న హైదరాబాద్‌లో, మరి మార్చి 21 న విశాఖపట్నంలోని మన ఆధ్యాత్మిక రాజకీయ సదస్సుకు "స్వామి మైత్రేయ" హాజరై ఎంతో హర్షం వ్యక్తంచేశారు కదా. ఇంతకంటే ఏంకావాలి మనకు.

మారం : మరి ఒక సామాన్య మానవుడికి, గ్రామీణుడికి, ఒక సాధరణ వ్యక్తికి ఏం చెప్పాలి మనం ? భక్తులకు రాజకీయాల గురించి ఏం చెప్పాలి మనం?

కంచి రఘురామ్ : సాధారణ మానవుడికి ఆత్మజ్ఞానం అంటే వెంటనే అర్థం కాకపోయినా, మన ఆశయాలు చూసి ఓటు వేస్తారు, మీరు యోగులు, గురువులు అని అర్థం చేసుకుని. వాళ్ళకు మనం చిన చిన్న పదాలలో ధ్యానం, శాకాహారం గురించి అర్థమయ్యేలా చెప్పగలిగితే చాలు. ధ్యానప్రచారంలో మనం చేస్తున్నదదే .

ఇక "భక్తులకు" చెప్పడం మరింత సులభం, భక్తులు సహజంగా భయస్థులుగా ఉంటారు. వారికి మన మ్యాని ఫెస్టో ఇవ్వడం వల్ల వాళ్ళు బయటకు చెప్పుకోకపోయినా మనకు తప్పక సపోర్టు చేస్తారు. ఇప్పుడు "పిరమిడ్ మాస్టర్లు" గా ఉన్నవాళ్ళు 80% మంది గతంలో భక్తులే కదా. భక్తులకు మరింత అవగాహన కల్పిస్తే చాలు ... కుళ్ళు రాజకీయాలు ఇక ఉండవు. "ఆత్మజ్ఞానులు పాలకులైతే, హింసాప్రవృత్తి ఉండదు, దోపడీ ఉండదు. ధర్మపాలన ఉంటుంది" అని చక్కగా చెప్పగలిగితే చాలు వాళ్ళకు.

మారం : పిరమిడ్ పార్టీకి ఎవరెవరి నుండి ఓట్లు వస్తాయి? ఏఏ వర్గాలు మనకు సపోర్ట్ చేస్తారు అని మీరు అనుకుంటున్నారు?

కంచి రఘురామ్ : ప్రతి వ్యక్తికీ "మంచి పరిపాలన కావాలి" అనే ఉంటుంది. అయితే అది ఎలా వస్తుందో తెలియదు. " మంచిరోజులు వస్తే బాగుంటుంది" అని అందరూ ఎదురుచూస్తున్నారు. హింసాప్రవృత్తి కలిగిన రాజులు, చక్రవర్తలు, హిట్లర్, బిన్ లాడెన్, వీరప్పన్ లాంటి వాళ్ళు ఎంతోమంది అహంకారపూరితులైన వాళ్ళు చరిత్రలో కలిసిపోయారు. మరి ఒక రాముడు, జనకుడు, ఒక కృష్ణుడు, ధర్మరాజు, మరి మహాత్మాగాంధీ మరి వీరి పేర్లు సూర్యుడు, చంద్రుడు ఉన్నంతకాలం ప్రజలు గుర్తుంచుకుంటారు.

మనకు ఓట్లు వస్తాయి. మేధావుల నుండి, భక్తుల నుండి, యోగుల నుండి, శాకాహారుల నుండి, ఆత్మజ్ఞానుల నుండి, ధ్యానుల నుండి, మంచివారి నుండి, ధర్మపరుల నుండి ఓట్లు వస్తాయి. వారి సంకల్పశక్తే మనకు మరింత మరింత బలం.

మారం : ఒక శాకాహారి పరిపాలకుడైతే కలిగే ప్రయోజనాలను వివరించండి?

కంచి రఘురామ్ : మాంసాహారి అంటే హింసాప్రవృత్తి. ఆలోచనలో కానీ, వాక్కులో కానీ, పనిలో కానీ వారిలో ప్రశాంతత ఉండదు. తద్వారా నిర్ణయాలు, మాటలు, చేసే పనులు దాని కనుగుణంగానే ఉంటాయి. అదే శాకాహారి అయితే ప్రశాంతంగా ఉంటాడు. 1994 సం|| ముందు, నేను పత్రీజీ ని కలవకముందు మాంసాహారిని. ఎంతో ఆవేశం ఉండేది ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు. మరి ఈ 15 సం||ల్లో పూర్తి శాకాహారిగా ఉన్న తరువాత, నా నిర్ణయాల్లో ఆవేశం లేదు. మాంసాహారం - శాకాహారం నిర్ణయాలు తీసుకోవడంలో ఎంతో ప్రభావాన్ని కలిగిస్తాయి. మరి రాజకీయ నాయకులు - పాలకుల్లో తీసుకునే నిర్ణయాలే కదా ప్రజలపైన ప్రభావం చూపేది, పరిపాలనలో చోటు చేసుకొనేది.

మారం : మరి ఆత్మజ్ఞానులు పాలకులైతే వారు ఒత్తిడులకూ, బెదిరింపులకూ లొంగకుండా ఉండడం సాధ్యమవుతుందా? ఆత్మజ్ఞానుల దిశానిర్దేశం ఎలా ఉంటుంది?

కంచిరఘురామ్ : నూటికి నూరుశాతం చెప్పగలను ఆత్మజ్ఞానులు పాలకులైతే “ధర్మపాలన” పూర్తిగాచేయగలరని, కారణం ఒక వ్యక్తి మామూలు స్థితి నుండి ధ్యాని కావడంలోనే, మాంసాహారం నుండి శాకాహారంలోకి రావడంలోనే మనస్సులో, మాటల్లో, చేతల్లో పూర్తి మార్పు వస్తుంది.

రాముడికి గైడ్ వశిష్టుడు. జనకుడు నిత్యం నారదుడు, అష్టావక్రుడు, మార్కండేయుడు లాంటి బ్రహ్మర్షులతో సలహాలు తీసుకునేవాడు.ధర్మరాజు ఎప్పుడూ శ్రీ కృష్ణుని మార్గదర్శకత్వంలో వుండేవాడు.

అలాగే మనకు ఆద్యులు,గురువు బ్రహ్మర్షి పత్రీజీ ఎల్లవేళలా వేయికళ్ళతో గమనిస్తూ ఉంటారు అందరినీ ఎదుటి మనిషి మనోభావాలను క్షణంలో గుర్తించగలుగుతున్నాం కదా. ఆత్మజ్ఞానుల గైడెన్స్ ఎంత గొప్పగా ఉంటుందో ధ్యానం చేసి శాకాహారం తీసుకుంటేనే కదా తెలిసేది.

మారం : మనం మన మ్యానిఫెస్టో ద్వారా ఇతర పార్టీల రాజకీయ నాయకులను ప్రభావితం చెయ్యగలుగుతామా?

కంచి రఘురామ్ : తప్పకుండా, మనం ఒక ఆప్షన్ ఇస్తున్నాం. “ఇవీ మన లక్ష్యాలు, చేయబోయే పనులు, ప్రజలకు అందించబోయే సౌకర్యాలు" అని వివరించాం. మన మ్యానిఫెస్టోలో అన్ని పార్టీల వాళ్ళు చూస్తారు దీన్ని. వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే కదా , పార్టీ పార్టీయే , ఆధ్యాత్మికం ఆధ్యాత్మికమే! ధ్యానం, యోగం దేని విలువ దానిదే! శాకాహారం విలువ శాకాహారానిదే.

మనది అన్నీ కలిసిన ఆత్మజ్ఞానపు "సూపర్ బజార్"! మిగతా పార్టీలవాళ్ళు వెంటనే తమ తమ స్థితులను వదిలి ఆత్మజ్ఞానులుగా మారకపోయినా, తప్పక ఆలోచనలో పడతారు, బయటికి చెప్పకపోయినా "ధ్యానం చేయడం వలన, శాకాహారం తీసుకోవడం వలన ఇంత గొప్పవాళ్ళుగ మారతామా మనం కూడా" అనే ఆలోచనా బీజాలను మనం వాళ్ళలో కూడా వేస్తున్నాం. ఇది వెంటనే కాకపోయినా, తొందరలోనే తపక అందరిలో మార్పును తెస్తుంది. వాళ్ళందరూ మనవైపు వచ్చేరోజు తప్పకుండా వస్తుంది శాంతంగా ఎదురుచూద్దాం.

మారం : అంటే "కౌశికుడు" విశ్వామిత్రునిగా, "విశ్వామిత్రుడు" వశిష్ఠునిగా మారాతాడు అని మీ అభిప్రాయమా?

కంచిరఘురామ్ : అవును. తప్పకుండా ఒక రాజు అయిన కౌశికుడు రాజర్షి అయిన విస్వామిత్రుడిలా, క్రమేణా ఒక బ్రహ్మర్షిగా, ఒక వశిష్టుడిలా తప్పక మారతాడు. ఇది సత్యం! ప్రజల్లో మార్పు వస్తుంది. రాజకీయ నాయకుల్లో మార్పు వస్తుంది. ఇప్పుడు మనం స్కూళ్ళల్లో విద్యార్థులకు ధ్యానం నేర్పుతున్నాం. రాబోయే యువతరం అంతా తప్పక ఆత్మజ్ఞానులే ఉంటారు. వారే పాలకులు కూడా అవుతారు. ఇందుకు మన ధ్యానగ్రామీణం పైమా ఎంతో తోడ్పడుతాయి.

మారం : సత్యాగ్రహంలో నిరసన దీక్షతో, ఉపవాసంతో మౌనంతోనే మహాత్మాగాంధీ మన దేశానికి స్వాతంత్య్రం సంపాదించిపెట్టారు. కానీ ఇప్పుడు ప్రజలు సంతోషంగా లేరు. సంతృప్తి చాలా తక్కువ మందిలోనే కనపడుతుంది. మరి పిరమిడ్ పార్టీ అధికారంలో ఉంటే?

కంచి రఘురామ్ : భారతదేశానికి సంపూర్ణ సాతంత్య్రం వచ్చింది. గాంధీ మహాత్ముడి మరి ఆరి అనుయూయుల కృషి వల్ల. అయితే ఇవాళ మన సమాజం ఒక మేడిపండులా ఉంది. దేశానికి స్వాతంత్ర్యం ఉంది, స్వేచ్ఛ ఉంది. కానీ, ఆత్మస్వేచ్ఛ పొందాలి ప్రతి ఒక్కరూ. ఒక్క భారతదేశంలోనే కాక, ప్రపంచమంతా. మనలో హింసాప్రవృత్తిని తొలిగించుకొని, మన స్వయం పరిపాలన మనం చేసుకోగలిగినప్పుడే అది ఆత్మకు స్వేచ్ఛ. నేను నా హింసాప్రవృత్తిని తొలగించుకున్నాను. ధ్యానం ద్వారా, శాకాహారం ద్వారా. అలాగే ప్రతి ఒక్కరూ ప్రపంచమంతా "హింసా ఛోడో - హంసా పకడో" అనే మన నినాదాన్ని పట్టుకోవాలి, ఆత్మజ్ఞానులుగా తయారుకావాలి , ఇదే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ద్వారా మనం చాటిచెపుతున్నది. అప్పుడే అది "యథా ప్రజా ... తథా రాజా" అవుతుంది. సత్యమేజయిస్తుంది. అపుడే ప్రజలు సంతృప్తిగానూ ఉంటారు. సంతోషంగానూ ఉంటారు. ధ్యానం ద్వారా శాకాహారం ద్వారా వ్యక్తిత్వ వికాసం, పిరమిడ్ పార్టీ ద్వారా వ్యవస్థ వికాసం . అందుకే పత్రీజీ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాను స్థాపించారు .

మారం : పిరమిడ్ పార్టీ ప్రతినిధులు అసెంబ్లీలో, పార్లమెంట్‌లో అడుగిడినప్పుడు, మనం ప్రతిపాదించబోయే మొదటి అజెండా??

కంచి రఘురామ్ : ఎవరు రూల్ చేసినా ప్రాథమిక విద్యతో పాటు ఆధ్యాత్మిక ధ్యానవిధ్యను విధిగా ప్రవేశపెట్టాలి. హింసాప్రవృత్తి ఆగిపోవాలి. శాకాహారం ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. క్రమంగా ప్రజలు, పాలకులు అందరూ ఆత్మజ్ఞానులవుతారు. ఆత్మజ్ఞానులే పాలకులు కావాలి లేదా పాలకులు ఆత్మజ్ఞానులు కావాలి. అంతటా "ధ్యానం" మరి "శాకాహారం" - ఇదే మన మొదటి అజెండా!!

మారం : మరి ధ్యానగ్రామీణం, పైమా, ఎలక్ట్రానిక్ మీడియా .. ఈ మూడూ విభాగాలూ ఎంతగా తోడ్పడుతున్నాయి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకు! కొంచెం వివరిస్తారా? 2004 సం||కూ 2009 సం|| కూ ఉన్న తేడా?

కంచి రఘురామ్ : 1999 సం||లో, 2004 సం||లో "ధ్యానం" మరి "ధ్యానప్రచారం" రెండే ఉన్నాయి. అయితే 2009 సం|| కల్లా "ధ్యానగ్రామీణం", పైమా" , "పిరమిడ్ స్పిరిచ్యువల్ మీడియా" వచ్చి కలవడం జరిగింది. "ధ్యానగ్రామీణం" ద్వారా ఎన్నో గ్రామాల్లో ధ్యానప్రచారం ముమ్మరంగా జరిగింది. "ఇంటింటా ధ్యానం", మండల ధ్యానం" ఇలా ఎన్నో ప్రోగ్రామ్స్ జరిగాయి గ్రామాల్లో. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో, తమిళనాడులో, కర్నాటకలో ఎంతోమంది పైమా మాస్టర్స్ ... యువత ఎనలేని ఉత్సాహాన్ని నింపి, చైతన్యవంతులను చేశారు. "ధ్యానగ్రామీణం" ద్వారా గ్రామాల్లో, "పైమా" ద్వారా యువతలో ఎన్నో లక్షలమంది అదనంగా ధ్యానులయ్యారు. ఇక "పిరమిడ్ స్పిరిచ్యువల్ మీడియా" ద్వారా బ్రహ్మర్షి పత్రీజీ ప్రవచనాలు ఇతర పిరమిడ్ మాస్టర్ల ప్రవచనాలు వివిధ చానళ్ళలో ప్రసారమవుతున్నాయి, అలాగే "నరకం - స్వర్గం" C.D, "ధ్యాన గ్రామీణం" ప్రోగ్రాంలో ఎంతోమందిని ధ్యానులుగా తీర్చిదిద్దింది, అలాగే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా కోసం ప్రత్యేకంగా తీసిన "గట్టిమేలు తలపెట్టవోయ్" ప్రజలను చాలా ప్రభావితం చేసింది.

మారం : నాకంటే ఇంకా నాలుగు సంవత్సరాల ముందు .. అంటే 1994 లోనే .. మీరు పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీలోకి వచ్చారు. మేం ఉన్నంతగా ఇప్పటివాళ్ళు ఉండలేరు. 1994 సం||లో మీరు గమనించిన పత్రీజీ, 1999, 2004, 2009 సం||లో ఈ నాలుగు దశలలో మీరు గమనించిన పత్రీజీ గురించి వివరించండి.

కంచి రఘురామ్ : పత్రిగారిని ఈ నాలుగు స్థితుల్లో నేను ఒకేరకంగా చూస్తున్నాను. నాకేమి తేడా కనబడలేదు ఈ నాలుగు స్థితులలో కూడా. అయితే వారి ఎనర్జీ లెవెల్ మాత్రం దినదినప్రవర్థమానవుతోంది! ఇంకా ఒక గొప్ప విషయం 1999 లో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా రిజిస్ట్రేషన్ టైమ్‍లో, మరి 1999 ఎలక్షన్‍లో పాంప్లెట్స్ ప్రింట్ చేయడానికి డబ్బు అవసరమైనప్పుడూ మేము అవస్థపడుతూంటే ఆయన గమనించి, "రఘురాం! నీకు డబ్బు సర్దుబాటు కావడం ఇబ్బంది అయ్యేట్లుంటే నాకు ఇల్లుందికదా! అది అమ్మి డబ్బు తీసుకో!" అన్నారు. నాకు కళ్ళలోకి నీళ్ళు వచ్చాయి అయన చెప్పింది వినగానే. ఆయన ఆ మాట అన్నప్పుడు నా మెదడు స్తంభించిపోయింది. ఇద్దరు ఆడపిల్లలు ఉండి, ఉద్యోగానికి రాజీనామా చేసి, దినసరి అవసరాలకు ఇతరుల మీద ఆధారపడిన స్థితిలో, ఆయన "ఇల్లు అమ్మేద్దాం" అంటే నేను నిశ్చేష్ఠుడినయ్యాను, అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ ఆయన డబ్బుకు ఇచ్చిన ప్రాధాన్యత అస్సలు లేదు.

1999 సం|| లో పిరమిడ్ పార్టీ రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఎలక్షన్స్ వచ్చాయి. 2004 సం||లోను అది జనరల్ పీరియడ్. ఈసారి మాత్రం 2008 జూన్ నుండే పూర్తిస్థాయిలో ధ్యానప్రచార పరాకాష్ఠ, శాకాహార ప్రచార పరాకాష్ఠ, ఎందరో ఆత్మజ్ఞానులు, ఎన్‌లైటెన్‌డ్ మాస్టర్స్ ఉన్న స్థితిలో మనం ఆంధ్రరాష్ట్రంలో పూర్తిస్థాయిలో దాదాపు 200 అసెంబ్లీ స్థానాల్లో, ఇంకా దాదాపు 35 పార్లమెంట్ స్థానాల్లో వివిధ రాష్ట్రాల్లో పోటీ చేస్తున్నాం మరింత బిజీగా పత్రీజీ పర్యటిస్తున్నారు!!

మారం : థాంక్యూ వెరీమచ్ రఘురాం గారూ , ఇంత సుదీర్ఘమైన ఇంటర్వ్యూలో మీరు చెప్పిన ఎన్నో గొప్ప విషయాలు ఎందరికో ఉపయోగపడతాయి. కృతజ్ఞతలు!

కంచిరఘురామ్ : నూటికి నూరుశాతం చెప్పగలను ఆత్మజ్ఞానులు పాలకులైతే "ధర్మపాలన" పూర్తిగా చేయగలరని , కారణం ఒక వ్యక్తి మామూలు స్థితి నుండి ధ్యాని కావడంలోనే, మాంసాహారం నుండి శాకాహారంలోకి రావడంలోనే మనస్సులో, మాటల్లో, చేతల్లో పూర్తి మార్పు వస్తుంది.

రాముడికి గైడ్ వశిష్ఠుడు. జనకుడు నిత్యం నారదుడు, అష్టావక్రుడు, మార్కండేయుడు లాంటి బ్రహ్మర్షులతో సలహాలు తీసుకునేవాడు. ధర్మరాజు ఎప్పుడూ శ్రీకృష్ణుని మార్గదర్శకత్వంలో వుండేవాడు.

అల్లాగే మనకు ఆద్యులు, గురువు బ్రహ్మర్షి పత్రీజీ ఎల్లవేళలా వేయికళ్ళతో గమనిస్తూ ఉంటారు అందరినీ! ఎదుటి మనిషి మనోభావాలను క్షణాలో గుర్తించగలుగుతున్నాం కదా. ఆత్మజ్ఞానుల గైడెన్స్ ఎంత గొప్పగా ఉంటుందో ధ్యానం చేసి శాకాహరం తీసుకుంటేనే కదా తెలిసేది.

 

కంచిరఘురామ్
తిరుపతి

Go to top