" జీవితమే ఒక నాటకం "

 

ఒక నాటకంలో మనకిష్టమైన మరి మనకు తగిన పాత్రను ధరించి స్టేజీ మీదకు వచ్చినప్పుడు, ఆ నాటకంలోని పాత్రకు తగినట్లుగా మన వేషధారణ, మేకప్ ఉంటాయి. ఉదాహరణకి కృష్ణుడి పాత్రధారికి నెమలిఫించం, కిరీటం, పట్టుపంచెకట్టు ఉంటాయి. అలాగే కంసుడికి తగినట్లుగా భీకరమైన మేకప్, వస్త్రధారణ ఉంటుంది. సేవకులకు తగిన మేకప్ వారికి ఉంటుంది. అలాగే ఎవరికి తగిన డైలాగులు వారికుంటాయి.

అయితే ఇదంతా తాత్కాలికమే. నాటకం నడుస్తున్నంత సేపే ఒకడు సేవకుడు, ఒకడు రాజు, మరొకరు మహాయోగి. డ్రామా పూర్తికాగానే వాళ్ళు మేకప్ కడిగేసుకుని సాధారణ వస్త్రధారణకు వచ్చేస్తారు. అప్పుడంతా సమానులే.

అలాగే ‘ జీవితం ’ అనే వేదిక మీద మనం కూడా మన ఇష్టమైన పాత్ర ధరించి వస్తాము. ఇక్కడికి మన ఇష్టంతో వచ్చాము కనుక ఆ పాత్ర ( సోల్ ) ఎటువంటిదైనా సక్రమంగా పోషించాలి. సరియైన న్యాయం చేయాలి. నాటకం ( డ్రామా ) ముగిసిన తర్వాత అందరూ సమానులే. ఒకే చైతన్య పదార్థం నుంచి వచ్చిన వారమే.

ఈ రహస్యాన్ని గ్రహిస్తే .. ఏదీ శాశ్వతం కాదని తెలిస్తే మనకే బాధా ఉండదు.

డ్రామాలో పాత్రధారుడు ఒక్కోసారి సంభాషణలు మరచిపోవచ్చు. అప్పుడు తెరవెనుక నుంచి prompting అందుతుంది. అది జాగ్రత్తగా వినాలి. లేకపోతే అభాసుపాలే.

అలాగే ఎలా బ్రతకాలో నిర్ణయించుకునే ఈ భూమిమిదకు మనం వచ్చినప్పటికీ .. వచ్చిన కారణం మరిచిపోయి బలహీనులమైనప్పుడు మనం ధ్యానం చేస్తే prompting మనకు మన అంతర్వాణి నుంచి అందుతుంది.

డ్రామాలో శ్రీకృష్ణుని పాత్ర గొప్పదని, అతని డైలాగులు కంసుడు చెప్పినా, కంసుడి డైలాగులు కృష్ణుడు చెప్పినా హాస్యాస్పదమౌతుంది. జనం ఈల వేసి మరీ గోల చేస్తారు. కనుక ఎవరిపాత్రకు తగినట్లుగా వారు ప్రవర్తించడం సబబు.

అయితే కోరుకున్నంత మాత్రానే ఆ పాత్ర లభించదు. అందుకు తగిన అర్హత ఉండాలి. అదే కర్మఫలం. సన్నగా పొట్టిగా ఉన్న వ్యక్తి తనకు భీముని పాత్ర కావలంటే కుదరదు. భీముని పాత్రకు తగిన శరీరదారుఢ్యం, కండబలం ఉండాలి. అప్పుడే అది తగినపాత్రగా అంగీకరింపబడుతుంది. కనుక మనం కోరుకున్నా కూడా మన పూర్వజన్మల కర్మఫలాన్ని బట్టి అర్హమైన పాత్ర మాత్రమే ఇవ్వబడుతుంది. కాదనుకుంటే ఆ అర్హతకు తగినశక్తిని అతను పెంపొందించుకోవలసి వస్తుంది. అది ధ్యానం వల్లనే లభ్యమవుతుంది. తక్కువ నోములు నోచి ఎక్కువ ఫలం కావాలంటే దొరకదు మరి.

నాటకం నడుస్తూన్నంతసేపు స్టేజీని సమయానుకూలంగా రకరకాల కర్టెన్లతో, వస్తువులతో అలంకరణ మార్చవలసి ఉంటుంది. శ్రీరాముని రాజాస్థానం చూపించినప్పుడు ఒక విధంగానూ రావణుని లంక సీను ఒక విధంగానూ మార్చవలసి ఉంటుంది.

అలాగే ప్రకృతి కూడా మనకు అవసరమైన రకరకాల వనరులతోనూ, కొండలు, జలపాతాల వంటి సుందరదృశ్యాలతోనూ మనకోసం సృష్టించబడింది. ఇందులో అవసరమైన భోగాలన్నీ ఒకప్పుడు మనకున్నాయి.

కానీ మనం లంకలోని రాక్షసుల్లా మారి నందనవనం అయిన కామధేనువు లాంటి ప్రకృతిని రావణాసురుని లంకగా చేసాము. అంటే మనస్సులోని రాక్షస భావాలు ప్రకృతిపై పడి దానికి తగిన బ్యాక్గ్రౌండ్ సీను ఏర్పడింది.

నాటకం ముగిసిన తర్వాత ఒక గ్రూప్ ఫోటో ఉంటుంది. అక్కడ పాత్రధారులందరూ నవ్వుతూ సహజస్థితిలో ఉంటారు. అలాగే ఎవరిపాత్ర పుర్తికాగేనే వారు స్టేజీ నుంచి నిష్క్రమించి, మేకప్ తీసేసి, సహజస్థితికి వస్తారు .. దేహం విడిచి ఆత్మల్లా. డ్రామా ముగిసిన తర్వాత మరో డ్రామా వేయడానికి స్టేజీ శుభ్రం చేయడానికి కొంత సమయం పట్టినట్లే ఒక యుగం పూర్తయ్యాక అన్ని రకాలుగా బలహీనమైన, పాడైపోయిన భూమి సహజస్థితికి రావడానికీ, శుభ్రం కావడానికీ యుగాంతంలో ప్రళయం వస్తుంది. అప్పుడు సకల జీవరాసులు, కొండలు, సముద్రాలు సర్వం ఏకమై సమతాస్థితి పొందుతాయి.

అలాగే భూమి చల్లబడటానికీ, తిరిగి స్వచ్ఛతను పొందడానికీ కొంతకాలం పడుతుంది. అదే యుగానికీ, యుగానికీ మధ్య ఉండే " యుగసంధి కాలం ", ఇదే సృష్టి రహస్యం.

కేవలం ధ్యానం ద్వారా ఇంత అనుభవాన్ని పొందినందుకు, ఈ ధ్యానన్ని ( ఆనాపానసతి ) లోకానికి అందించిన బుద్ధ భగవానునికీ, బ్రహ్మర్షి పత్రీజీ గారికీ, ఈ ధ్యానానుభవాలు ముద్రించడం ద్వారా అందరికీ తెలియజేస్తోన్న ధ్యానాంధ్రప్రదేశ్ పత్రికకూ నా హృదయపూర్వక ధన్యవాదాలు.

 

G. జయలక్ష్మి
సెల్ : +91 9885214997

Go to top