" ఇంత అపురూపమైన ధ్యాన ఫలితాలను అందరూ పొందితే బాగుంటుంది "

 

రాజశేఖర్ : హలో శ్రీనివాస్ గారు , " బోధన్ - షక్కర్నగర్ " సావిత్రీదేవి పిరమిడ్ కేర్ సెంటర్ నిర్వహిస్తున్నమీ గురించి చెప్పండి

శ్రీనివాస్ : నా పేరు కె. శ్రీనివాస్. బోధన్ మండలం " సాలంపాడు " మా ఊరు. నా వృత్తి ప్రైవేట్ పాఠశాల అడ్వైజర్. నా డిగ్రీ చదువు పూర్తికాగానే చేసిన వ్యాపారం .. బోధన్ డివిజన్లోని అన్ని గ్రామాలలో కోళ్ళపెంపకం వారికి కోడిపిల్లలను అందజేసేవాడిని. 1996 నుంచి 2003 వరకు చేసిన ఈ వ్యాపారంలో ఎంతో డబ్బు సంపాదించాను.

ఎంతో జల్సాగా బ్రతికేవాడిని. దానితో ఎన్నో వ్యసనాలకు బానిసయ్యాను. ఈ వ్యసనాల కారణంగా సంపాదించిన డబ్బు మొత్తం పోగొట్టుకోవడం జరిగింది. వ్యాపారంలో కూడా నష్టం వాటిల్లింది. ఎన్నో ఆర్థిక, ఆరోగ్య, సామాజిక ఇబ్బందులకు లోనై పరిష్కార మార్గ అన్వేషణలో భాగంగా బోధన్‌కు దగ్గరగా వున్న అంతర్జాతీయ " విపస్సన ధ్యానకేంద్రం " లో పదకొండురోజుల పాటు శిక్షణను పొందాను. ఆ ధ్యానం వలన నాకు ఏమంత ప్రయోజనం అయితే కలగలేదు కానీ ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలిగింది. " అసలు జీవితం అంటే ఏమిటి ? ", " సరైన జీవన విధానం ఎలా వుంటుంది ? ", " ఎంతో హాయిగా బ్రతికిన నాకు ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చాయి ? " .. లాంటి ప్రశ్నలు ఎన్నో వేసుకుని నన్ను నేనే నిస్పక్షపాతంగా శోధించుకున్నాను. " వీటిన్నటికీ కారణం చేసిన నీచ వ్యాపారమే " అని సమాధానం వచ్చింది.

" ఎన్నో అమాయకమైన మూగజీవుల ప్రాణాలను బలితీసుకోవటం వలన వాటికి కలిగిన వేదన మరి బాధలే నన్ను ఈ దుస్థితికి తెచ్చాయి .. కాబట్టి వెంటనే వ్యాపారం మానివేయాలి " అనుకుని మానివేసాను. " రక్తపు కూడుతో జీవితం సాగించినందువల్లే రజోగుణం ప్రబలి వ్యసనాలకు బానిసయ్యాను " అని గ్రహించి వ్యసనాలకు కొంతవరకు స్వస్తి చెప్పి మిత్రులతో కలిసి ఒక ప్రైవేటు పాఠశాల ప్రారంభించి క్రొత్త జీవితానికి నాంది పలికాను.

రాజశేఖర్ : మరి మన ధ్యానంలోకి ఎలా వచ్చారు ?

శ్రీనివాస్ : " విపస్సన ధ్యానం " కు మించి మరింత మేలు చేసే ధ్యానం కోసం పరితపించే రోజుల్లో 2005 సంవత్సరంలో బోధన్‌లో బ్రహ్మర్షి పత్రీజీ ధ్యానం క్లాసుకు హాజరయ్యాను. అదేరోజు పత్రీజీ దర్శనభాగ్యం కలిగింది, వారి ప్రసంగం, అతిసులభమైన ధ్యానపద్ధతి నన్ను అమితంగా ఆకర్షించటం వలన రోజుకు నాలుగైదు గంటలకు తగ్గకుండా ధ్యానం చేసాను. దీనివలన శరీరంలో, మనస్సులో కూడా చెప్పుకోతగ్గ మంచి మార్పులు కొట్టొచ్చినంత స్పష్టంగా కనిపించి ఒకే ఒక సంవత్సరంలో సమస్యలన్నింటి నుంచి సమూలంగా బయటపడి, అన్ని వ్యసనాలకు దూరం కావటమే కాకుండా వాటి మీద అసహ్యం కలగటం కూడా జరిగింది .

" ఇంత మంచి ధ్యానాన్నీ, ఇంత అపురూపమైన ధ్యాన ఫలితాలనూ అందరూ పొందితే బాగుంటుంది " అనే తపనతో నేను 2006 సంవత్సరాంతంలో నా తోటి స్నేహితులతో కలిసి " మానవసేవ స్వచ్ఛంద సంస్థ " అనే ఒక సమాజసేవకు ఉపయోగపడే సంస్థను నెలకొల్పాం. సమాజానికి ఉపయోగపడే ఎన్నో పనులు చేసి ప్రజాదరణ పొందాం. కానీ దానిలో ధ్యానప్రచార కార్యక్రమం చేర్చటం మాత్రం అప్పుడు సాధ్యపడలేదు.

ఆ తరువాత 2007 సంవత్సరంలో పాఠశాల పబ్లిసిటీ కోసం కరపత్రాలను ముద్రించటం జరిగింది. దానిలో " ధ్యానం నేర్పబడును ; ప్రతిరోజూ ధ్యానసాధన చేయించబడును " అన్న వాక్యాలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ ధ్యానప్రచారానికి నాంది పలికాను. అది మెదక్ జిల్లా కంగ్టి మండలంలో మరింత విస్తారంగా పంచటం జరిగింది.

అప్పటికే షక్కర్నగర్లో ధ్యానప్రచారం చేస్తున్న " దత్తు " గారు నాకు ఫోన్ చేసి కరపత్రాలలో ధ్యానం గురించి ముద్రించినందుకు ప్రశంసించి షక్కర్నగర్ సావిత్రీదేవి పిరమిడ్ కేర్ సెంటర్లో మా సహాయ సహకారాలు అభ్యర్థించారు. నేను నా మిత్రులందరూ ఎంతో సంతోషపడి 2007 జూలై 12 న ధ్యానకేంద్రం ప్రారంభోత్సవానికి పదిరోజుల ముందు నుంచే సన్నాహాలు ప్రారంభించాం, చేసాం.

" దత్తు " గారి యొక్క సలహాలతో .. నా ప్రాణమిత్రుడు రమేష్ సహకారంతో .. ప్రారంభోత్సవం కోసం అన్నిరకాల హంగులు మేము సమకూర్చాము. బోధన్ పట్టణంలోని పలు పాఠశాలలో, కళాశాలలో ధ్యాన తరగతులు నిర్వహించడానికి సిద్ధిపేట సీనియర్ మాస్టర్ బండిపల్లి రామయ్య గారు లాంటి సీనియర్ మాస్టర్లు తోడ్పడ్డారు. అలాగే దత్తుగారి ద్వారా విశాఖపట్టణం " గీత సత్యవతి " మేడమ్‌ను కూడా బోధన్‌కు రప్పించటం .. ఆమె ద్వారా కూడా ఎంతో విజ్ఞానం పొందటం జరిగింది. ఒక నెలరోజులపాటు " సత్యవతి మేడమ్ " సహకారంతో ఎన్నో ప్రదేశాలలో ఉచిత ధ్యానశిక్షణ సుమారు పదివేలమందికి ఇచ్చాం. 2008 లో పత్రీజీ 61వ పుట్టినరోజు వేడుకలకు కూడా బోధన్ షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ శ్రీ గోకరాజు గంగరాజుగారు మరి జనరల్ మేనేజర్ " శ్రీ శేఖరయ్య " గారి ఆధ్వర్యంలో 3,000 మందితో ఘనంగా నిర్వహించాం .

రాజశేఖర్ : ఇంకా మీ ధ్యానానుభవాలను వివరించండి !

శ్రీనివాస్ : ఒకసారి నేను బోధన్ నుంచి బాన్సువాడకు బస్సులో వెళ్తూ ధ్యానం చేస్తున్నాను. కాస్త డీప్ స్థితికి వెళ్ళగానే నా ముక్కురంధ్రం వద్ద పై పెదవి పైన ప్రకంపనలు ప్రారంభమై లోపలికి వెళ్ళి హృదయం దగ్గర సూర్యుని కాంతిని మించి అతి ప్రకాశవంతమైన కాంతి కనిపించింది. ఆ కాంతి నా నుంచి ప్రసారమై ప్రతి మానవుని హృదయంలో కూడా కనిపించ సాగింది. నేను ఏనాడు ఎరగనంత ప్రేమ, కరుణ, దయ, జాలి అనాటి నుంచి మరింత ఎక్కువయ్యాయి , దీని ద్వారా " నేను శరీరం కాదు ఆత్మ ; నా చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఆత్మలే ; మనమంతా ఆత్మబంధువులమే " అని అర్థమైంది.

నాకు మరో కొరిక ఏమిటంటే " ఒక లక్షమందికి ధ్యానం చెప్పాలి " అని ,కానీ దాన్ని ఎలా సాధ్యం చేసుకోవాలి అన్నది తెలియలేదు. విచిత్రంగా 2008 లో జరిగిన అసెంబ్లీ, M.L.A. ల ఎన్నికల సందర్భంలో పత్రీజీ బోధన్ వచ్చి " బోధన్ నియోజకవర్గ పిరమిడ్ పార్టీ సభ్యుడు శ్రీనివాస్ " అని ప్రకటించారు ! నేను ఉక్కిరి, బిక్కిరి అయ్యాను. నాకు " శక్తికి మించిన కార్యక్రమమే " అయినా సార్ మాట వేదవాక్కుగా భావించి ఒప్పుకున్నాను. అనుకోకుండా వచ్చిన ఈ వరం వలన బోధన్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రతి గ్రామ గ్రామం, మండలం పట్టణంలోని ప్రతి ఇంట్లో మూడుసార్లు మన ధ్యాన కరపత్రాలు పంచటం జరిగింది , ఈ విధంగా లక్షమందికి ధ్యాన అవగాహన కలిగించాలనే నా కోరిక అతి సునాయాసంగా పత్రిసార్ తీర్చారు .

పత్రిసార్ వలన .. వారి సులభ ధ్యానప్రసంగాల వలన నిరంతర ధ్యానం చేసి నేను ఎన్ని పొందానో ! శారీరకంగా, మానసికంగా దృఢతరం కావటం .. " ఏ పనైనా ఇట్టే సాధిస్తాను " అనే కొండంత ఆత్మవిశ్వాసం, భౌతికపరమైన ఎలాంటి సమస్యకైనా ధ్యానంలో కూర్చుని పరిష్కారం కనుగొనటం, అనేకసార్లు ఆస్ట్రల్ ట్రావెలింగ్‌లో నా స్థూలశరీరాన్ని చూసుకోవటం, శరీరం అన్నది భౌతికరూపమే కానీ ఆత్మ శాశ్వతమని తెలుసుకోవటం, ఏ రోజు ధ్యానం .. ధ్యానప్రచారం చేయకపోతే ఆ రోజు నిస్సారంగా మారుతుందో గమనించటం, పిరమిడ్ వుంటే వచ్చే విశ్వశక్తికి .. లేకపోతే వచ్చే శక్తికి వున్న భేదం గ్రహించి, నా ఇంట్లో పిరమిడ్ పెట్టించుకోవటమే కాక అందరూ పెట్టించుకునేలా కృషిచేయగల శక్తిని సంపాదించుకోవటం జరిగాయి.

రాజశేఖర్ : బోధన్‌లో మీరు నిర్వహించిన ధ్యాన కార్యక్రమాల గురించి వివరించండి .

ప్రవీణ్ : 2009 నవంబర్‌లో పత్రీజీ జన్మదినోత్సవం మూడువేలమందితో నిర్వహించడంతో పాటు ఉత్తరతెలంగాణాలో మరెక్కడా చేయనంత ఘనంగా 2009 లో పత్రీజీ జన్మస్థలం అయిన " బోధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల " లో పత్రీజీ అనుమతి తీసుకుని ఏడురోజుల ఉచిత ధ్యాన, ఆరోగ్య కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాం. రోజుకు 1,000 మంది చొప్పున హాజరయ్యేవారు . ఏ ఒక్కరోజూ కూడా తగ్గలేదు. దత్తు, రమేష్, మజీద్, అరుణ మేడమ్, యోగా మరి ధ్యాన మాస్టర్ వీరప్ప గారు ఇలా అందరి యొక్క సమిష్టికృషి ఫలితంగా దక్కిన విశేష విజయం ఇది .

ఆ తర్వాత పత్రీజీ సావిత్రీదేవి పిరమిడ్ సెంటర్‌కు నన్ను ఇన్చార్జ్గా నియమించటంతో నాకు మరింత బాధ్యత పెరిగింది. " కేంద్ర సందర్శనార్థం వచ్చేవారికి పూర్తి సౌకర్యాలు కల్పించేందుకు సార్ ఇంట్లో దంపతులు ఎవరైనా వుంటే బాగుంటుంది " అని నాకు అనిపించి " ఎవరైతే బాగుంటుంది ? " అని నేను ధ్యానంలో కూర్చుంటే కల్హేరు మండల నివాసులైన " గంగారెడ్డి ", " సుజాత మేడమ్ " లను మాస్టర్స్ సూచన చేసారు. వారు వెంటనే వచ్చి ఇక్కడ స్థిరపడి అపారమైన ధ్యాన సేవలు అందిస్తున్నారు . " బోధన్‌లో అతిపెద్ద పిరమిడ్ ఏర్పాటు చేయాలి " అనే సంకల్పంతో " ధ్యాన ఆరోగ్య పిరమిడ్ ట్రస్ట్ " ఏర్పాటుచేసి బోధన్ పెద్దలు పెద్దిరెడ్డి గారు, అడ్వకేట్ సంఘం మరి వీరప్ప, అరుణ మేడమ్, వైజాగ్ సత్యవతి మేడమ్, మజీద్, రమేష్ తదితరులతో విశేష కృషి చేయటానికి సంసిద్ధులమవుతున్నాం.

రాజశేఖర్ : మరి పత్రిసార్ ఇంట్లో పిరమిడ్ కట్టాలనే సంకల్పం ఎవరికి ఎలా వచ్చింది ?

శ్రీనివాస్ : " ప్రపంచవ్యాప్తంగా ధ్యానం మరి పిరమిడ్ శక్తిని విస్తృతంగా ప్రచారం చేస్తోన్న బ్రహ్మర్షి పత్రీజీ ఇంట్లోనే పిరమిడ్ లేకపోతే ఎలా ?? " అన్న ఆలోచన నాకు వచ్చింది. కనీసం 11' x 11' కొలతలో కట్టాలనుకుని అందరమూ సమావేశం కాగా వర్ని మాస్టర్ " శ్రీ విరప్ప " గారు పెద్ద మనస్సుతో 16' x 16' పిరమిడ్ కడదాం , దానికి కావలసిన అన్ని ఏర్పాట్లు నేను చుసుకుంటాను " అని భరోసా ఇవ్వటమే కాక అక్షరాలా పాటించారు.

శ్రీ వీరప్ప గారు సావిత్రీదేవి కేర్ సెంటర్లోని పిరమిడ్‌కు ధనరూపంగా .. శ్రమ రూపంగా కూడా కొండంత అండగా నిలబడి మాకు ఎంతో సహాయం చేసారు . ఈ పిరమిడ్ రికార్డు స్థాయిలో కేవలం 25 రోజులలోనే 16' x 16' వ్యాసార్ధంతో నిర్మించబడింది ! ఏదైనా మంచి పనికి మనం పూనుకోవాలే కానీ ఆ పని విజయవంతంగా పూర్తి కావడానికి ముక్కోటి దేవతలు సహాయం చేస్తారని నాకు బాగా విశదమైంది . ఈ పిరమిడ్ పత్రీజీ దివ్య ఆశీస్సులతో వారి ఆధ్వర్యంలో తాండూరు సీనియర్ పిరమిడ్ మాస్టర్ గౌరవనీయులు, ధ్యానవృద్ధులు " శ్రీహరి " గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది . దీని అనంతరం పత్రీజీ నన్ను పిలిచి " ఈ కేర్ సెంటర్, ఈ పిరమిడ్ పూర్తి బాధ్యత నీదే. దీనిని ఏ విధంగా అభివృద్ధిపరుస్తావో .. దీనియొక్క ప్రత్యేకత .. ప్రాముఖ్యత వేలమందికి ఎలా తెలియజేస్తావో అదంతా నీకే వదిలేస్తున్నాను " అనడంతో నేను పరమానందభరితుడనై నా శక్తియుక్తులు మొత్తాన్ని వినియోగించటానికి నిర్ణయించుకున్నాను. దానిలో భాగంగానే వచ్చే నెల (జూలై) 12 వ తేదీన జరగబోయే ధ్యానకేంద్రం యొక్క నాల్గవ వార్షికోత్సవం నుంచి కేంద్రంలో క్రొత్త కార్యక్రమాలు చేపట్టబోతున్నాం.

* ప్రతి ఆదివారం ఉచిత ధ్యానశిక్షణా తరగతులు ఏర్పాటు చేయటం
* ప్రతి పౌర్ణమి మూడురోజులు అఖండ ధ్యానతరగతి నిర్వహించటం
* ప్రతి నెలా కనీసం ఐదు క్రొత్త గ్రామాలలో ధ్యాన పరిచయం, ప్రచారం చేయటం
* 2010 నవంబర్ 11 వ తేదీకి బోధన్ డివిజన్లో వున్న అన్ని గ్రామాలలో ధ్యాన జ్ఞాన తరగతులు జరపటం
* 2012 సంవత్సరం కల్లా " ధ్యాన జ్ఞాన నిజామాబాద్ " ను చేయాలనే దృఢసంకల్పంతో ముందుకు సాగుతున్నాం.

ఈ ధ్యాన ప్రచారంలో ప్రతిక్షణమూ నాకు తోడునీడగా వుంటున్న " రమేష్ " కూ మరి ఇతర ప్రముఖులకూ, నా కమిటీ సభ్యులందరికీ వేలవేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. " శ్వాస మీద ధ్యాస " ధ్యానం ద్వారా ఒక నూతన ఒరవడిని సృష్టించి .. సృష్టికే క్రొత్త అందాలు దిద్దుతోన్న పరమాద్భుతమూర్తి బ్రహ్మర్షి పత్రీజీ కి లక్షప్రణామాలు తెలుపుకుంటున్నాను.


K. శ్రీనివాస్
నిజామాబాద్

Go to top