" ధ్యాన వ్యవసాయం "

నా పేరు శ్రీకాంత్.

నాది నల్గొండ జిల్లా కోదాడ మండలం ఎర్రారం గ్రామం. జూన్ 2008 సం||లో నా ధ్యాన పరిచయం రామాపురం క్రాస్ రోడ్ పిరమిడ్ మాస్టర్ జె. శివలీల మేడమ్ ద్వారా జరిగింది.

నేను రోజూ ఇంటి దగ్గర 1 గంట ధ్యానం చేసేవాడిని. వీలున్నప్పుడల్లా కోదాడ కేర్ సెంటర్‌కు వెళ్ళేవాడిని, అక్కడ ధ్యానం గురించి చాలా అవగాహన వచ్చింది. దాంతో నాకు మా వూరిని కూడా ధ్యానమయం చేయాలని సంకల్పం కలిపి మా ఊరిలో కోదాడ మాస్టర్స్ లక్ష్మి, రవిగార్లతో, మునగాల మాస్టర్ సీతయ్య గారితో మరి రావులపాలెం మాస్టర్ P.S.S. శేఖర్ గారితో క్లాసులు చేయించాను. మా ఊరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 250 మంది విద్యార్థులతో రోజూ రెండుసార్లు ధ్యానం చేయిస్తున్నాను. మా ఊరి కేబుల్ నెట్‌వర్క్ లో వారానికి నాలుగుసార్లు ధ్యానగ్రామీణం CD వేయిస్తున్నాను.

మాకు ఊరికి దగ్గరలో నాకు ఒక ఎకరం మాగాణి వుంది. అందులో నారు పోసినప్పటి నుండి రోజూ ఉదయం 1 గం||, సాయంత్రం 1 గం|| ధ్యానం (పిరమిడ్ క్యాప్ పెట్టుకొని) చేసాను. నాట్లు వేసి కోత కోసే వరకు అలా చేస్తూ వచ్చాను. అయితే ప్రతి సంవత్సరం నాకు క్రిమి సంహారక మందుకై ఎకరానికి 4,000 రూ||లు ఖర్చు పెట్టేవాడిని, కానీ ఈ సంవత్సరం నేను క్రిమిసంహారక మందులు అస్సలు వాడలేదు. అంటే నాకు Rs 4,000 వరకు మిగిలింది! నా పొలం చుట్టూ వున్న రైతులు మూడు నుంచి నాలుగుసార్లు వరకు క్రిమిసంహారక మందులు వాడారు. చీడ పీడలు నా పంటకు ఎటువంటి హాని చేయలేదు. నేను పెట్టుకున్న సంకల్పం ఒక్కటే .. "మా పొలంలో ధ్యానంలో కూర్చుని ఎటువంటి పురుగులు పడకుండా పంట అద్భుతంగా పండాలి" అని. అలాగే "పొలానికి మందు కొట్టే వారు నాకు గానీ, నా కుటుంబ సభ్యులకు గానీ కనపించకూడదు" అని సంకల్పం పెట్టుకున్నాను. అలాగే ఈ రోజు వరకు కనిపించలేదు.

తరువాత నా పంటను కోసి ధాన్యాన్ని కాటా వేసాను. ప్రతి సంవత్సరం పండినట్లే ఈ సంవత్సరం కూడా ఎకరానికి 32 బస్తాలు దిగుబడి వచ్చింది! రోజూ నా పొలంలో రెండు గంటలు ధ్యానం చేస్తున్నాను. మళ్ళీ 15 రోజుల్లో రెండవ పంట వేయనున్నాను. అప్పుడు కూడా పశువుల ఎరువు మాత్రమే వాడతాను. ఎలాంటి రసాయనిక ఎరువులు మరి క్రిమిసంహారక మందులను వాడకుండా నాధ్యానశక్తితో నా సంకల్పశక్తితో వ్యవసాయం చేయాలని సంకల్పం పెట్టుకుని ధ్యానం చేయడం వలన ఎంతో లాభం వుందని అర్థమైంది!!

నా పొలంలో పనులకు వచ్చేరైతు కూలీలకు కూడా ధ్యానం గురించి చెప్పి వారితో కూడా ధ్యానం చేయించి నా పొలంలో పనిచేయిస్తున్నాను. ధ్యానం చేయటం వలన నాకు లాభం కలగటమే కాకుండా ప్రకృతితో కూడా మైత్రి చేయవచ్చునని తెలిసింది ధ్యానం వలన నా ఆత్మశక్తిని మరింత విస్తారంగా వాడుకోవటం అవగాహనకు వచ్చింది.

మనదేశంలో ప్రతి ఒక్కరైతు కూడా ఈ విధంగా తమతమ పొలంలో ధ్యానం ఛేసి దిగుబడులను పెంచుకోవాలని నా యొక్క విన్నపం. ఈ విధంగా ధ్యానం చేయటం ద్వారా పంట దిగుబడి పెరగటమే కాకుండా ప్రతి ఒక్కరికి కల్తీలేని ఆహారం అందివ్వగలం.

ప్రతి ఒక్కరం మన మన పొలాల వద్ద ధ్యానం చేయటం వల్ల మన పంట భూములన్నీ సారవంతమై శక్తివంతంగా తయారవుతాయి. విత్తనాలను పిరమిడ్‌లో నిలువ వుంచి వాడటం ద్వారా మరింత అధిక దిగుబడిని శక్తివంతమైన ఆహార ధ్యానాలను పొందవచ్చు.

ఇలా నాకు ధ్యానం ద్వారా ఎంతో మేలు జరిగింది. ప్రతి ఒక్కరైతు దాన్ని పాటిస్తే అందరికీ మేలే జరుగుతుంది. ధ్యానం చేయనంతవరకు నేను సామాన్యరైతుని, ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన తరువాత మాంసాహారాన్ని వదిలి శాకాహారిని అయ్యాను. అందరూ ధ్యానం చేయాలి మరి శాకాహారులుగా మారాలి. ఈవిధంగా "ధ్యాన వ్యవసాయం" చేయటం ద్వారా ఏ ఒక్కరైతుకు కూడా ఆత్మహత్య చేసుకునే అవసరం వుండదు.

- శ్రీకాంత్,
నల్గొండ

Go to top