" ధ్యాన ఆరోగ్యం "

నా పేరు వెంకటేశ్వరరావు.

మా ఊరు పశ్చిమగోదావరిజిల్లాలో " అండలూరు " అనే గ్రామం.

2003 వ సంవత్సరం మే నెల 12 వ తేదీన బలుసు శ్రీరాములు గారు మా ఊరి హైస్కూల్లో బ్రహ్మర్షి పత్రీజీ ధ్యానశిక్షణా తరగతి ఏర్పాటు చేసారు. అక్కడ పత్రీజీ " ఈ రోజు నుంచీ మాంసాహారం మానేసే వాళ్ళు చేతులెత్తండి " అన్నారు.

ఎవరూ చేతులెత్తకపోవడం చూసి " ఒక్కరూ లేరా ? " అని ప్రశ్నించగా నేను చెయ్యి ఎత్తాను. అప్పుడు నన్ను దగ్గరకు రమ్మని షేక్హాండ్ యిచ్చి .. అందరితో పాటు నన్ను కూడా ధ్యానంలో కూర్చోబెట్టారు. నాకు ధ్యానంతోనూ, బ్రహ్మర్షి పత్రీజీ తోనూ అదే తొలి పరిచయం.

ధ్యాన పరిచయానికి ముందు ఆరు సంవత్సరాలపాటు నా శరీరంలోని ఎడమభాగం పక్షవాతానికి గురై బాధపడేవాడిని. ప్రముఖ ఆయుర్వేద వైద్యులు చెప్పిన మందులు వాడుతూ వారు చెప్పిన పథ్యం చేస్తూ ఉండేవాడిని. " ఏ రోజు మందులు మానివేస్తే ఆ రోజు నుంచి కొద్ది రోజులలో నీ కాలు, నీ చేయి మళ్ళీ పడిపోతుంది " అని వాళ్ళు నాకు చెప్పారు. దాంతో నేను క్రమం తప్పకుండా మందులు వాడుతూ పథ్యం చేసేవాణ్ణి. ప్రతిరోజూ తీసుకునే ఆహారం అరగడానికీ, మళ్ళీ ఆకలివేయడానికీ పదేపదే మందులు వాడేవాడిని. పత్రిగారు ఆ రోజున చేయించిన ధ్యానంలో నాకు శరీరంలో విపరీతంగా నొప్పులు వచ్చినప్పుడు " నాడీమండలం శుద్ధి జరిగేటప్పుడు నొప్పులు వస్తాయి " అని చెప్పారు. దాంతో నేను నొప్పులు భరిస్తూ ధ్యానాన్ని కొనసాగించాను.

అదే రోజు సాయంత్రం మా ప్రక్కఊరు .. ఉనికిలిలో " వట్టికూటి సుబ్బారవు గారి ఇంట్లో పిరమిడ్ వుంది " అని తెలుసుకుని అందులో కింగ్స్ చాంబర్ మీద కూర్చుని ధ్యానం చేసాను. ధ్యానం చేస్తున్నంత సేపు .. ప్రతి ఐదునిమిషాలకు ఒకసారి శరీరంలో కరెంట్ షాక్ కొట్టినట్లు అనుభూతి కలిగేది. ధ్యానంలో వుండగా ఎక్కడైతే రక్తప్రసరణ జరుగుతుందో అక్కడే నొప్పులు వచ్చేవి. అలా పిరమిడ్లో రోజుకు సుమారు ఆరు గంటల పాటు పద్ధెనిమిది రోజులు .. ధ్యానం చేయడంతో నాకున్న పక్షవాతం సంపూర్ణంగా తగ్గిపోయి మామూలు స్థితికి వచ్చాను. ఈ విధంగా ధ్యానం యొక్క విశిష్ఠత, పిరమిడ్లోని అద్భుత శక్తి నాకు అనుభవంలోకి వచ్చి ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు పగలు ధ్యానం ప్రచారం .. రాత్రి మూడు గంటల పాటు ధ్యానం చేస్తూ మందులకు పూర్తిగా స్వస్తి చెప్పాను మరి సంపూర్ణ ఆరోగ్యవంతుడినయ్యాను.

2003 డిసెంబరులో తిరుపతిలో జరిగిన ధ్యాన మహోత్సవంలో నాకు ఆకివీడు U. సాంబశివరావు గారు, 2004 సంవత్సరంలో ఆకివీడులో పిల్లల వైద్య నిపుణులు అయిన Dr. P.B. ప్రతాప్ కుమర్ గారు .. పశ్చిమగోదావరి జిల్లా పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ అధ్యక్షులు .. పరిచయం అయ్యి అప్పటి నుంచి జిల్లా మొత్తం ధ్యాన ప్రచారం చేస్తున్నాను.

2004 అక్టోబరులో ఏలూరులో ధ్యానప్రచారంలో భాగంగా .. ఇంటింటికీ పాంఫ్లెట్స్ పంచుతూవుంటే చిట్టూరి మూర్తిగారు మరి శ్రీమతి కల్పన గారు పరిచయం అయ్యారు. వారిచే ధ్యానం గురించి చెప్పి ధ్యానం చేయించాను. అప్పటి నుంచి ఏలూరు వెళ్ళినప్పుడు వారి ఇంటివద్దనే వుంటూ ఏలూరు చుట్టుప్రక్కల గ్రామాలకు ధ్యానప్రచారం చేస్తున్నాను.

2004 సంవత్సరం నుంచి మొదలుపెట్టి ఇప్పటివరకు బెంగళూరు మైత్రేయబుద్ధా ధ్యాన విద్యా విశ్వాలయానికి సుమారు 216 జీవిత సభ్యత్వాలు సేకరించి దాంతో పాటు మరి ఎవరు ఎంత విరాళం ఇస్తానంటే అంత వారి వారి గ్రామాలకు వెళ్ళి సేకరించి మరీ ట్రస్టీలకు అందచేస్తూ ఉన్నాను.

2005 సంవత్సరంలో జిల్లాలోని 46 మండలాల హెడ్క్వార్టర్స్ లో D.E.O పర్మిషన్తో జిల్లావాసుల సహకారంతో టీచర్సకు ధ్యాన పరిచయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటుగా వైజాగ్ రమణ మరి ఆకివీడు.సాంబశివరావుగార్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పాంఫ్లెట్స్ తిరగడానికి బైక్ Dr. ప్రతాప్ కుమార్గారు సమకూర్చారు.

2005 సెప్టెంబరులో తిరుపతి వాస్తవ్యులు D. కేశవరాజు, జంగారెడ్డిగూడెం వాస్తవ్యులు D. అన్నపూర్ణ, సత్యనారాయణ రాజు దంపతులతో కలసి జిల్లా కలెక్టర్ అనుమతితో 46 మండలాలలో " ధ్యాన విజ్ఞాన జ్యోతి " కార్యక్రమంలో భాగంగా మండల ఆఫీసుతో పాటు డ్వాక్రా మహిళలకు కూడా ధ్యానాన్ని నేర్పించడం జరిగింది. అందుకు ప్రతిరోజూ సుమారు 100 నుంచి 150 కిలోమీటర్లు ధ్యాన ప్రచార నిమిత్తం ఇప్పటి వరకు తిరుగుతూనే ఉన్నాను.

2006 సంవత్సరంలో ఒక సారి నాకు శరీరంలో నలతగా ఉండి పత్రిగారితో " సార్ ఒంట్లో బాగా లేదు .. ‘ ఒక నెల రోజులు రెస్ట్ తీసుకుందాం ’ అనుకుంటున్నాను. ఏం చేయమంటారు సార్ ? " అని అడిగినప్పుడు సార్ దానికి సమాధానంగా " ఒంట్లో బాగున్నప్పుడు ధ్యానం చేస్తూ, ధ్యానప్రచారం చేస్తూ .. ఒంట్లో బాగోలేనప్పుడు ధ్యానం, ధ్యాన ప్రచారం ఆపేస్తే ప్రగతి ఆగిపోతుందిరా. ధ్యానం, ధ్యాన ప్రచారం .. అన్ని పరిస్థితులలో కూడా చేస్తేనే ప్రగతి ఆగిపోతుందిరా. ధ్యానం, ధ్యాన ప్రచారం .. అన్ని పరిస్థితులలో కూడా చేస్తేనే ప్రగతి , ఆపేస్తే ఇక దుర్గతే " అన్నరు.

దాంతో ఇక నేను అప్పటి నుంచి ఇప్పటి వరకూ నాకు ఎలా ఉన్నప్పటికీ ధ్యాన ప్రచారం చేస్తూనే ఉన్నాను. ఇలా " గురువులు పైకి తిడుతూ లోపల తడుతూ ఉంటారు " అనే విషయం పత్రిగారి ద్వారా తెలుసుకున్నాను.

పిరమిడ్ నిర్మాణాలను ప్రోత్సహించి ఎవరైతే పిరమిడ్ నిర్మాణానికి సుముఖంగా ఉన్నారో వారి వద్దకు ఇంజనీర్లను తీసుకుని వెళ్ళి సలహాలను సూచనలను ఇస్తున్నాను. ఈ విధంగా పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 80 పిరమిడ్ల నిర్మాణంలో పాలుపంచుకున్నాను.

నేను కూడా మా ఊరిలో మా ఇంటిపై జిల్లా పిరమిడ్ మాస్టర్ల ఆర్థిక సహాయంతో " శ్రీ లక్ష్మీ పిరమిడ్ ధ్యాన కేంద్రం " పేరుతో ఒక పిరమిడ్ నిర్మించడం జరిగింది.

ఒకప్పుడు పక్షవాతంతో కాలు చేయి పడిపోయి మంచంలో పడి ఉన్న నేను ఈనాడు ధ్యానశక్తితో సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారి ధ్యానప్రచారం చేస్తూ దేశవ్యాప్తంగా సుమారు వేలాదిమంది ఆత్మబంధువుల కుటుంబాలతో సంతోషంగా, సన్నిహితంగా ఉండగలుగుతున్నాను.

ధ్యాన ప్రచారం వల్ల నా క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అయినప్పటికీ జిల్లా కలెక్టర్లతోనూ, M.L.A లతోనూ, D.E.O లతోనూ మరి ఇతర ఉన్నతాధికారులతోనూ పరిచయం ఏర్పడి వారికి ధ్యానం గురించి చెప్పడం, ఇతర రాష్ట్రాలైన కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబు, ఢిల్లీ, మధ్యప్రదేశ్ లు మరి హిమాలయాలనూ, అమర్నాథ్లనూ మరి ఇతర దేశమైన భూటాన్ను కూడా పైసా ఖర్చులేకుండా సందర్శిస్తూన్నాంటే .. అది ధ్యాన అద్భుతం కాక మరేమిటి ?

 

- వెంకటేశ్వరరావు,
పశ్చిమగోదావరి

Go to top