" ధ్యానమే .. ఉత్తమోత్తమైంది "

నా పేరు వీరప్ప.

నేను నిజామాబాద్ జిల్లా ‘ వర్నీ ’ మండలం, ‘ జాకోర ’ గ్రామంలో పుట్టిన రైతుబిడ్డను. ఆ తర్వాత వ్యాపారవేత్తను. అనంతరం లయన్స్ క్లబ్ ఆఫ్ వర్ని లో ఒక సభ్యుడను.

లయన్స్ క్లబ్లో నేను యోగాకు సంబంధించిన విభాగానికి జిల్లా అధ్యక్షుడను. అంతేగాక యోగాలో 25 సం||ల అపార అనుభవం ఉన్నయోగ మాస్టర్ను. నా జీవితంలో అనారోగ్యమనేదే అసలు ఎరగను. ఎన్నో యోగా, సామాజిక కార్యక్రమాలు, వ్యాపార కార్యక్రమాలలో ఎప్పుడూ బిజీ బిజీగా ఉంటూ నాకు సంబంధించిన జీవితాన్ని నేను అనుకున్న జీవితచట్రంలో జీవిస్తూ " ఇదే బహుచక్కని జీవితం " అనుకునేవాడిని.

అయితే ఎన్నో విజయాలు సాధించిన నా జీవితంలో ఎప్పుడూ ఒక తెలియని అసంతృప్తి. గుప్త అలజడి, అర్థంకాని భయం " మరిన్ని విజయాలు సాధిస్తానో లేదో " అనే ఆందోళన నన్ను ఎప్పుడూ వేధిస్తూనే ఉండేది.

గుళ్ళు, గోపురాలు కట్టించాలనీ, కట్టినవారికి గుప్తదానం చేయాలనీ అనుకునే మనస్తత్వం నాది. దాని ద్వారానే మోక్షం లభిస్తుందేమోననీ, ముక్తిని పొందుతానేమోననీ భ్రమపడి ఎన్నో గుళ్ళు, గోపురాలకు ఆర్థిక సాయం, శారీరక శ్రమను అందించాను.

కానీ మనస్సులో తీరని బాధ, భయం మాత్రం వెంటాడుతూనే ఉండేవి.

మా మేనల్లుడు " P. చందు " గత రెండు సంవత్సరాలుగా ఆనాపానసతి పిరమిడ్ ధ్యానం, ధ్యానప్రచారం చేస్తూ నాకు అప్పుడప్పుడు చెబుతూనే ఉండేవాడు. కానీ నేను ఎన్నడూ దాని గురించి ఆలోచించలేదు ; మొత్తం పెడచెవిన పెట్టేవాడిని.

నా చెల్లలు, తల్లిదండ్రులు మాత్రం ధ్యానం గురించి " చందు " వద్ద తెలుసుకుని వెంటనే సాధన చేయటం ప్రారంభించి నాలుగు నెలల వ్యవధిలోనే ఎన్నో ఎన్నో అనుభవాలు పొందటం, ఆరోగ్యంగా మారటం నేను గమనిస్తూ ఉండేవాడిని. " యోగాసనాల ద్వారానే అన్నీ సాధ్యం " అనే నమ్మకం గతంలో కలిగి ఉన్న నేను .. ఇక " ధ్యానమే ఉత్తమోత్తమైంది " అన్న విషయం తెలుసుకున్నాను.

మెల్లగా ధ్యానం చేయటం ప్రారంభించి రాత్రి 11 గం||ల నుంచి ఉదయం 4 గం||ల వరకు ధ్యానం చేయటం అలవాటు చేసుకున్నాను. ఎంతో ఆనందం, ఉల్లాసం. భయం లేదు, ఓటమి లేదు , " ఏదైనా సాధిస్తాను " అన్న నమ్మకం నాలో రోజు రోజుకూ మరింత రెట్టింపుగా జరుగుతూనే ఉంది. " శరీరమే నేను " అనుకున్న స్థితి నుంచి " నేనొక ఆత్మను .. ఈ శరీరంలో నివసిస్తున్నాను " అన్న ఆత్మజ్ఞానాన్ని పొందాను.

ఎందరో సీనియర్ పిరమిడ్ మాస్టర్ల అనుభవాలు, పుస్తకాలు, CD లు చూడటం, వినటం, సజ్జనసాంగత్యం చేయటం ప్రారంభించాను. ఇంక నాకు ప్రతిరోజూ ఆనందమే ఆనందం .. అదే బ్రహ్మానందం. ఆరోగ్యపరంగా, వ్యాపారపరంగా ఎన్నోరెట్ల వృద్ధి నా వ్యక్తిగత జీవితంలో ప్రస్ఫుటించింది.

వెంటనే " జాకోర " గ్రామంలో మా ఇంటివద్ద సీనియర్ పిరమిడ్ మాస్టర్ల సహకారంతో " బ్రహ్మర్షి ధ్యానకేంద్రం" ను ఏర్పాటు చేసి గ్రామప్రజలందరికీ ఉచిత ధ్యానశిక్షణను ప్రారంభించాను.

పత్రీజీ ఆశయసాధన కోసం త్వరలో బోధన్లో నిర్మించబోయే అతి పెద్ద పిరమిడ్ కొరకు ఏర్పాటు చేసిన " ధ్యాన ఆరోగ్య పిరమిడ్ స్పిరిచ్యువల్ ట్రస్ట్ " లో నేను ఒక ట్రస్టీగా ఉండటం నా పూర్వజన్మ సుకృతం !

 

- B. వీరప్ప
జాకోర (గ్రా||), వర్ని (మం||)
సెల్ : +91 9440090704

Go to top