" పంచుకుంటే పెంచబడుతుంది "

ధ్యానమిత్రులందరికీ నమస్కారం.

నా పేరు మాధవి.

నేను 2001 డిసెంబర్ నెలలో పిరమిడ్ కుటుంబం లోనికి వచ్చాను. దానికి ముఖ్యకారణం నాకు చిన్ననాటి నుంచి ఉన్న ఒక నమ్మకం .. " ఎవరో వస్తారు సమాజాన్ని మారుస్తారు, దానిలో నేను భాగస్వామినవుతాను " అని.

నాకు అత్యంత ప్రియమైన వ్యక్తి మేడమ్ ఉమారాణి గారు ఒకసారి ఫోన్లో ధ్యానం గురించి చెప్పడం వలన నేను కుకట్పల్లి సెంటర్ వెతుక్కుంటూ వెళ్ళి సామూహికధ్యానం చేసి .. నన్ను నేను తెలుసుకున్నాను.

నేను ధ్యానంలోనికి వచ్చిన 9వ రోజున పత్రిగారిని కలవడం .. మొదటి పరిచయంలోనే ఆయన నాకు నచ్చేయడంతో ఆయన ఒక గురువుగా కాక నాకు స్నేహితునిలా అనిపించారు. ఊరూర తిరుగుతూ .. ధ్యానం విలువ చెబుతూ అందరినీ అప్రమత్తం చేస్తున్న ఆయనను చూసాక ఇక నాకు " ఈ సమాజంలో ఉన్నతమైన మార్పు తప్పక తేగల సమర్థులు వారే .. వారి అడుగుజాడల్లో నడిస్తే నా ఆశయం కూడా తప్పక నెరవేరుతుంది " అని అనిపించింది అంతే. ఇక ఆ క్షణం నుంచి ఆయనే నాకు గురువు, స్నేహితులు మరి మార్గదర్శకులు అయ్యారు.

వృత్తిరీత్యా నేనొక మెడికల్ రిప్రజెంటేటివ్ని. 2001 సం||లో నా జీతం Rs. 2,800/- ఉండేది. అప్పుడు కూడా " నేను పదిమందికి ఉపయోగపడాలి " అని ఆలోచించి 2002 సం||లో సంతోష్నగర్లో సెంటర్ పెట్టి ధ్యానం క్లాసులు నిర్వహించాను.

నేను ధ్యానం చెప్తూ ధ్యానప్రచారం ఎలా చేస్తున్నానో .. అలా నా ఆదాయం కూడా పెరగడం మొదలైంది.

ఇక ధ్యానప్రచారం పెరిగిన కొద్దీ నాకు ప్రమోషన్లు రావడం మొదలై 2004 సం||లో కల్లా నా జీతం Rs. 20,000/- లకు చేరింది ! 2007 - 2008 సం||రాల్లో Rs. 45,000/- ల సంపాదనలోనికి అడుగుపెట్టాను. నేను నా ఆదాయంలో 20% ధ్యానప్రచారానికి ఖచ్చితంగా ఖర్చు చేస్తాను. జ్ఞానం పంచుకుంటే పెరుగుతుంది. అలాగే ధనం కూడా ఖర్చు పెట్టే కొద్దీ పెరుగుతుంది.

పత్రీజీ చెప్పింది ‘ తు ’. ‘ చ ’. తప్పకుండా ఆచరిస్తూ నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఒక సం|| క్రితమే స్వంతంగా ఒక మార్కెటింగ్ కంపెనీ మొదలుపెట్టి నలుగురు ధ్యానులం కలిసి " ధ్యానగ్రామీణం " వ్యానును కొని దానిలోనే ధ్యానప్రచారంతో పాటుగా నా వ్యాపారప్రచారం కూడా చేస్తూ భౌతికంగా 50%, ఆధ్యాత్మికంగా 50% నా ప్రయాణం సాగిస్తున్నాను. నాలో కొనఊపిరి ఉన్నంతవరకు నేను ధ్యానప్రచారం చేస్తూనే ఉంటాను.

 

- మాధవి,
హైదరాబాద్

Go to top