" పత్రీజీ ఎంతో ఆత్మీయులుగా అనిపించారు "

హలో ఫ్రెండ్స్ .. నా పేరు శ్రీలక్ష్మి.

నేను గత పదకొండు సంవత్సరాలుగా నా భర్త " సతీష్ " తో కలిసి అమెరికాలోని చికాగో నగరంలో నివసిస్తున్నాను.

2008 సంవత్సరం ఏప్రిల్ నెలలో నాకు పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మూవ్మెంట్ యొక్క పరిచయభాగ్యం .. బ్రహ్మర్షి పత్రీజీ గారి సోదరి డా || సుధా కోడూరి గారి ద్వారా కలిగింది. ఇక అప్పటి నుంచి నేను నిత్యం ధ్యానసాధన చేస్తున్నాను. ధ్యానం చేయడం వలన జీవితం యొక్క పరమార్థాన్ని సదా ఆనందంగా జీవించడాన్ని తెలుసుకున్నాను.

2008 సంవత్సరం డిసెంబర్లో బెంగళూరు ధ్యాన మహాయజ్ఞానికి హాజరైనప్పుడు పత్రిగారిని మొట్టమొదటిసారిగా చూసినప్పుడు ఎన్నో జన్మల నుంచి వెతుకుతూన్న ఆత్మబంధువును కలిసిన అనుభూతి కలిగింది. బెంగళూరు ధ్యాన మహాయజ్ఞంలో అద్భుతమైన అనుభవాలను పొందాను. ఎంతోమంది గొప్ప ధ్యానుల పరిచయభాగ్యం నాకు అప్పుడు కలిగింది.

మళ్ళీ 2009 సంవత్సరంలో కూడా శ్రీశైలం లో తాండవ శివ, సంగీత, నృత్య, ధ్యాన మహాయజ్ఞానికి హాజరైనాను. శ్రీశైలంలో పత్రిగారి సాన్నిధ్యంలో ధ్యానం చేసినప్పుడు ప్రతిఒక్కరూ ఒక్కొక్క దేవతలాగా కనిపించారు. అప్పుడు అనుభవపూర్వకంగా అర్థం అయ్యింది .. పత్రిగారు ప్రతిఒక్కరినీ ఎందుకు " దేవుళ్ళు " అని సంబోధిస్తారో. శ్రీశైలం మహాపుణ్యక్షేత్రంలో ఆ ఏడురోజులు పత్రిగారు మరి ఎందరో గొప్ప ధ్యానుల సమక్షంలో ధ్యానం చేసే అవకాశం ఎంతో అరుదైనది . సాక్షాత్తు ఆ పరమశివుడే అందరితో కలిసి ధ్యానం చేసిన అనుభూతికి లోనయ్యాను. చాలామంది ధ్యానులు కూడా ఇదే అనుభూతిని వ్యక్తపరిచారు.

ఎందరో స్వామీజీల యొక్క, ధ్యానుల యొక్క ధ్యానానుభవాల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటూ " ప్రతిఒక్కరి నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉంది " .. అనే సత్యాన్ని ఈ ధ్యానయజ్ఞం ద్వారా తెలుసుకున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది.

పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్మెంట్ యొక్క కార్యవర్గంలోని ప్రతిఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారి యొక్క నిరంతర కృషి మరి సంకల్పశక్తి వల్లనే శ్రీశైల ధ్యానయజ్ఞం అంతా దిగ్విజయంగా జరిగింది.

ధ్యాన యజ్ఞానికి హాజరైన ప్రతిఒక్కరికీ చక్కటి భోజన వసతి సౌకర్యాలు కల్పించగలిగారు. ఏడవరోజు చివరిలో " అప్పుడే అయిపోయిందే .. " అన్పించేటట్లు చేసారు. " పైమా మాస్టర్స్ " అందరూ ఎంతో నేర్పుతో, ఓర్పుతో చేసిన స్వచ్ఛందసేవ చూసినప్పుడు " ఇది కేవలం నిత్యం ధ్యానం చేసే మాస్టర్స్కే సాధ్యం " అనిపించింది.

న భూతో, న భవిష్యత్తుగా జరిగిన శ్రీశైల తాండవ, శివ, సంగీత, నృత్య, ధ్యాన మహాయజ్ఞానికి హాజరైన మహాద్భుతావకాశం నాకు కలిగినందుకు ఎంతో ఆనందపడి ఆ అనుభూతులను హృదయంలో పదిలపరుచుకుని చికాగో తిరిగి వచ్చేసాను.

ఇహ, పరలోకాల్లో ఉన్నతోన్నత శిఖరాలు అధిరోహించడానికి ధ్యానం ఒక్కటే మార్గమని మనందరికి తెలియజేసిన పత్రిగారికి నమస్కారాలతో .. "2010 ధ్యాన మహాచక్రం - అమరావతి " లో అందరినీ మళ్ళీ కలుస్తానని ఆశిస్తూ .. అమెరికాలో ధ్యాన ప్రచారానికి నావంతు కృషి తప్పక చేస్తానని తెలియజేస్తున్నాను.

 

- శ్రీ లక్ష్మి,
అమెరికా
E-mail : This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

Go to top