" ధ్యాన శాకాహార కుటుంబం "

నా పేరు గుంటుపల్లి మల్లికార్జున్.

మాది వరంగల్ జిల్లా, బచ్చన్నపేట.

నేను 2009 నవంబర్ 29 న జనగాం సీనియర్ పిరమిడ్ మాస్టర్ D.V.L.N. మూర్తి సార్ పర్యవేక్షణలో ఏర్పాటుచేసిన పత్రిసార్ ధ్యాన జ్ఞాన ప్రబోధానికి బచ్చన్నపేట పిరమిడ్ మాస్టర్ జి. రామచంద్రం గారి సహకారంతో వెళ్ళి ధ్యానంలోకి ప్రవేశించాను.

ధ్యానంలోకి వచ్చిన తర్వాత క్రమంగా నాలో వస్తోన్న మార్పులకి నేనే ఆశ్చర్యపోయేవాడిని. మూడురోజుల ధ్యానం తర్వాత నేను, నా శ్రీమతి మరి హాస్టల్లో వుండి చదువుకునే మా పిల్లలు మౌనిక, సుమంత్లు అందరూ సంపూర్ణ శాకాహారులుగా మారడం మరి మాది ‘ ధ్యాన శాకాహార కుటుంబం ’ అయిపోవడం అద్భుతమే.

ఒకరోజు ధ్యానంలో పత్రిసార్ దర్శనం జరిగి " నువ్వు ధ్యానప్రచారం చేయాలి " అని చెప్పడం .. నా ఈ ధ్యాన జీవితంలో మర్చిపోలేని మరో అద్భుతం. సార్ ద్వారా నాకు అందిన సందేశం ప్రకారం నేను మా మండలాలలో ధ్యానప్రచారం ప్రారంభించాను. నా ధ్యానప్రచారంలో భాగంగా వాల్ రైటింగ్, కరపత్రాలు పంచడంతో పాటు నా వ్యాపార నిర్వహణలో భాగంగా నా వద్దకు వచ్చేవారందరికీ ధ్యానప్రచారం చేస్తున్నాను.

అదేవిధంగా మా కుటుంబం, మా చెల్లెలు వాళ్ళ కుటుంబం మరి మా మామయ్య వాళ్ళ కుటుంబం ఇంకా మా బంధువర్గంలోని చాలామందిని శాకాహారులుగా మార్చడం, వారిని ధ్యానులను చేయడం నాకు పత్రిసార్ అందించిన వరం.

" బచ్చన్నపేటలో మూడు నాలుగు పిరమిడ్లు రావాలి ; పత్రిసార్ బచ్చన్నపేటకు మరి మా ఇంటికి రావాలి " అనే సంకల్పంతో 3-3-2010 నుంచి 14-4-2010 వరకు రాత్రి 10.00 గంటల నుంచి 11.00 గంటల వరకు నేను ఏకతాధ్యానాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ఏకతాధ్యానానికి బచ్చన్నపేట, సిద్ధిపేట, జనగాం, వరంగల్ పిరమిడ్ మాస్టర్లు అందరూ ఎంతో సహకరించారు.

అద్భుతంగా 14-4-2010 న ఏకతాధ్యానం ముగియడం మరి 15-4-2010 న ఉదయం వరంగల్లో కిషన్రెడ్డి సార్ ఆధ్వర్యంలో ఏర్పాటైన సెంట్రల్ జైల్ పిరమిడ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన సార్ దర్శనభాగ్యం కలగడం .. అదే రోజు " 28-4-2010 న బచ్చన్నపేటకు వస్తున్నాను " అని సార్ చెప్పడం .. నేను మర్చిపోలేని అనుభూతి. ఇది నా సంకల్పశక్తి యొక్క బలం.

అలాగే బచ్చన్నపేట " ధ్యానవ్యవసాయక్షేత్రం " లో సార్ దగ్గరుండి నాతో మాట్లాడించడం .. అంతటి జగద్గురువు ప్రక్కన నిలబడి మాట్లాడటం .. ధ్యానం వల్ల జరిగిన భాగ్యమే కాకపోతే మరేంటి.

అంతకుముందు నాకున్న B.P., మైగ్రెయిన్, కిడ్నీలో రాళ్ళు, మానసిక ఆందోళన అన్నీ కూడా ధ్యానంలోకి వచ్చిన తర్వాత మటుమాయం అయిపోయాయి. జీవితంలో ఇప్పుడు నాకు ఎదురయ్యేవన్నీ సంతోషకరమైన విషయాలే.

నా పిల్లలు కూడా హాస్టల్లో వుంటూ వాళ్ళ స్నేహితులను శాకాహారులుగా మార్చి ధ్యానం నేర్పించడం వాళ్ళు చేసుకుంటోన్న మహాభాగ్యం.

" శాకాహారం, ధ్యానం, ధ్యానప్రచారం " మాత్రమే అసలైన ఆధ్యాత్మిక జీవితం. నేను వ్రాసి సార్ ముందు పాడిన ధ్యాన జానపద గీతాలు సార్ విని అందరితో చప్పట్లు కొట్టించడం నేను మరిచిపోలేను అనుభవం.

 

- గుంటుపల్లి మల్లికార్జున్,
బచ్చన్నపేట, వరంగల్ జిల్లా

Go to top