" వింత వింత లోకాలను చూసాను "

నా పేరు లక్ష్మీనరసింహ వరప్రసాద్.

నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను. మాది నెల్లూరు జిల్లా సుళ్ళూరుపేట మండలం ‘ మన్నారుపోలూరు ’ గ్రామం. నేను గత కొంతకాలంగా " ఆనాపానసతి " ధ్యానం చేస్తున్నాను. నేను ధ్యానానికి కూర్చున్న మూడవరోజే దివ్యచక్షువు ఉత్తేజితం చెంది ఎన్నోసుందర ప్రదేశాలనూ, ఎంతోమంది మాస్టర్స్నూ, వింత వింతలోకాలనూ చూసాను. తర్వాత బుద్ధా మాస్టర్ తలపై సహస్రదళ కమలం వున్నట్లు కనిపించి మరి తర్వాత ధ్యానంలో కృష్ణా మాస్టర్, బుద్ధా మాస్టర్ కనిపించి నన్ను ఒక వింతలోకానికి తీసుకువెళ్ళారు. అక్కడ ఎటుచూసినా చెట్లు, నీరు, బంగారు రంగులో మెరుస్తున్నాయి.

నాకు ధ్యానంలో నా గతజన్మ కనిపించింది. గతజన్మలో నా పేరు " ఉత్తేజ్ ", మా అమ్మ పేరు " ప్రసన్నమ్మ ". నాన్న పేరు " గోవిందయ్య ". అప్పుడు ఒక అడవిలో ఒక గుడి వుండేది. మా నాన్న ఆ గుడికి పూజారి. ఉదయాన్నే లేచి ధ్యానం చేయాలి. తర్వాత పండ్లు తిని మళ్ళీ ధ్యానం చేయాలి. మళ్ళీ పండ్లు తిని పడుకోవాలి. అంటే రోజుకు రెండు పూటలు మధ్యాహ్నం, రాత్రి పండ్లే తినాలి. ఆ రాత్రి ధ్యానంలో కృష్ణా మాస్టర్ కనిపించారు. నాకు దాహం వేస్తున్నట్లు అనిపించింది. కృష్ణా మాస్టర్ మురళి ఊదగానే ముత్యాల్లాగా, రత్నాల్లాగా మూడు నీటిచుక్కలు నా నోట్లో పడ్డాయి. నా దాహం తీరిపోయింది.

నాకు ఒకసారి ధ్యానంలో చీకటిగుహలోకి పోయినట్లు అనిపించింది. నరసింహ మాస్టర్, కృష్ణా మాస్టర్ సముద్రంలోకి తీసుకువెళ్ళి తిమింగలాన్నీ, ఆక్టోపస్నూ చూపించారు. తర్వాత విశ్వంలోకి వెళ్ళి కుజగ్రహాన్నీ, శనిగ్రహాన్నీ తాకిచూసాను. జాబిలిలోకి వెళ్ళివచ్చాను. సూర్యమండలంలోకి వెళ్ళాను. అక్కడ మండుతున్న అగ్నిగోళంలోకి వెళ్ళాను. అక్కడ ఎటు చూసినా మంట కనిపించింది.

మధ్యాహ్న సమయంలో అరటి ఆకులతో వున్న గణేశ్ మాస్టర్ నాకు ధ్యానం నేర్పిస్తున్నట్లు కనిపించింది. ఆ తరువాత ధ్యానంలో నేను బ్రహ్మలోకానికి వెళ్ళాను. అక్కడ బ్రహ్మ మాస్టర్, సరస్వతి మాస్టర్ ఒక సరస్సులోని పద్మంలో కూర్చుని ధ్యానం చేస్తున్నారు. ప్రక్కన పదిమంది పిల్లలు ఆడుకుంటున్నారు. నేను ఆ పిల్లలతో కలిసి కాసేపు ఆడుకున్నాను.

ఇలా ఎప్పుడు ధ్యానం చేస్తున్నా నాకు రకరకాల అనుభవాలు కలుగుతున్నాయి. నేను చదువులో కూడా క్లాస్లో అందరికంటే ముందుంటున్నాను. రోజూ ధ్యానం చేయడం వల్ల నాకు ఇదివరకటికంటే పాఠాలు చక్కగా అర్థమవుతున్నాయి. ఏది మంచి, ఏది చెడు అన్న విచక్షణాజ్ఞానంతో అందరితో మర్యాదగా మసలుకోగలుగుతున్నాను. అందరితో స్నెహంగా ఉండగలుగుతున్నాను. పిల్లలందరూ వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి కూర్చుని రోజులో కొద్దిసేపు ధ్యానం చేస్తే వాళ్ళు ఎంతో హాయిగా వుండొచ్చు.


- Y.H.L.L.V. వరప్రసాద్,
నెల్లూరు

సెల్ : +91 8019305924

Go to top