" ‘ ఎప్పుడో ఒకసారి అవకాశం రాకపోతుందా ’ అని ఇలా ప్రదక్షిణలు చేస్తున్నాం "

నా పేరు మధుకర్.

" చందూర్ " గ్రామవాసిని. ఇక్కడి పిరమిడ్ నిర్మాణకర్త, పిరమిడ్ మాస్టర్ అయిన " ప్రవీణ్ " ద్వారా నాకు ధ్యాన పరిచయం కలిగింది. దాదాపు ఆరునెలలుగా ధ్యానం చేస్తున్నాను. ధ్యానానికి ముందు కూడా నా జీవితం సాఫీగా, సంతోషంగానే సాగింది. ఎన్నో లక్షలమంది కంటే నా జీవనయాత్ర సంతృప్తికరంగా వుండటం నా అదృష్టంగా భావించేవాడిని.

కానీ పత్రీజీ వ్రాసిన మొదటి తెలుగు పుస్తకం .. " తులసీదళం " చదివాక .. " ఇంతకాలం ఈ పుస్తకం చదవని నా బ్రతుకూ ఒక బ్రతుకేనా ? " అనిపించి పత్రిసార్ వ్రాసిన పుస్తకాలన్నీ చదివేశాను. అప్పుడు తెలిసింది అసలు ఆనందం అంటే ఏమిటో " అంతకుముందున్న సంతోషం ఈ బ్రహ్మానందం ముందు ఏ మూలకూ చాలదు " అని అర్థమైంది. గతంలో ఎన్నో విషయాలు చాలా అయోమయంగా, ఖంగారుగా అనిపించేవి. ధ్యానం తరువాత ఏ విషయమైనా సరే చాలా సుస్పష్టంగా అర్థమవడం మొదలైంది. ఇంతకాలంగా నా గురించి నాకే తెలియని ఒక స్పష్టత నాలో వచ్చింది. ఇంకా వస్తూనే వుంది. నన్ను ద్వేషించేవారు .. నేను ద్వేషించేవారు .. ఇరువురమూ కూడా ఇప్పుడు ఎంతో స్నేహంగా ఉండగలిగే పరిస్థితి నాకు ధ్యానసాధన వల్లనే సాధ్యమైంది.

ఒకసారి 5-6-2010 న .. నేనూ, నా మిత్రులు కలిసి హైదరాబాద్ వెళ్తున్నాం. ట్రెయిన్లో నేను ధ్యానం చేస్తున్నాను. పత్రీజీ ఆస్ట్రల్గా వచ్చి " నువ్వు ఇప్పుడు చేస్తున్న ధ్యానం నీ ఆత్మప్రగతి కోసం అయితే తప్పక చేయి ; ఒకవేళ మీరు వెళ్ళే పని గురించి అయితే అవసరం లేదు " అన్నారు. నేను ఆశ్చర్యపోయి " నేను రోజూ లాగానే చేస్తున్నాను. ఇక మేమందరమూ ధ్యానులమే కాబట్టి ప్రకృతే చూసుకుంటుంది కానీ కాస్త టెన్షన్ వుంటుంది కదా సార్ " అన్నాను. అందుకు సార్ " మీరు వెళ్తున్న పని మీకోసం ఎదురుచూస్తోంది. ఆ పని నీ స్నేహితుడి పేరు మీద ఎప్పుడో లిఖించబడింది. మీరు ఎంతమాత్రం టెన్షన్ పడక్కరలేదు " అన్నారు. సార్ మాటలు నాకెందుకో నమ్మశక్యం కాక " అలా లిఖించింది అక్కడున్నవారా లేక విశ్వమా ? " అని అడిగాను. సార్ కోపంగా " నేను చెబితే ఒకటి, విశ్వం చెబితే ఒకటా ? " అని మా మిత్రుడి చేయి పట్టుకుని పెన్నుతో ‘ సుభాష్ పత్రి ’ అని ఆటోగ్రాఫ్ చేసి నాకు చూపుతూ " చూడు, ఇప్పుడు నమ్ముతావా . నాకు వేరే చాలా పనులు వున్నాయి" అని నడిచే ట్రెయిన్లో నుంచే దిగిపోయారు.

ఇలాంటివి చాలామందికి వస్తాయి. " దీనిలో మరీ ప్రత్యేకత ఏముంది ? " అనుకుంటున్నారా ? ఆగండి మరి. మేమందరం లేచాక మా ఫ్రెండ్ అరచేతిలో అస్పష్టంగా సార్ ఆటోగ్రాఫ్ కనిపించింది. అంతేకాదు మేం వెళ్ళిన మూడవ నిమిషంలోనే మా పని కూడా అయిపోయింది.

క్రితం అమావాస్య రోజు " పరమేశ్వర పిరమిడ్ " లో ధ్యానం చేస్తూండగా ముగ్గురు డాక్టర్లు, ఇద్దరు కాంపౌండర్లు, ముగ్గురు నర్సులూ పిరమిడ్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ధ్యానం చేస్తున్న మమ్మల్ని చూస్తున్నారు. నేను ధ్యానంలోనే వారిని చాలాసేపు చూసి " ఎందుకింతలా ప్రదక్షిణలు చేస్తున్నారు ? " అని అడిగాను. దానికి వారు " మేమందరమూ బ్రతికి ఉన్నప్పుడు వైద్యవృత్తిలో వున్నాం. కొందరికి ప్రాణం పోసినా .. మరెందరో ప్రాణాలు మా చేతుల్లోనే పోయాయి. మరి వివిధ పిరమిడ్లలో ధ్యానం చేస్తున్న మీరూ, మీ వారందరూ కూడా ప్రాణాంతకమైన రోగాలు కూడా పోగొట్టుకుని, ఆయుష్షును పెంచుకోగలుగుతున్నారు. ఈ విద్యను మేము కూడా నేర్చుకుందామని పిరమిడ్లోకి ప్రవేశం కోసం చూస్తూంటే ప్రతి పిరమిడ్ ఇలాగే కిటకిటలాడుతున్నాయి. ఎప్పుడో ఒకసారి అవకాశం రాకపోతుందా అని ఇలా ప్రదక్షిణలు చేస్తున్నాం " అన్నారు.

నేను నవ్వి " ఈ బుద్ధి బ్రతికి ఉన్నప్పుడే వుంటే మీరూ, మీ తోటి డాక్టర్లు అందరూ కూడా హాయిగా ఉండేవారు కదా. ఇప్పుడైనా బ్రతికి వున్న డాక్టర్లందరినీ ధ్యానం చేసేలా ప్రేరేపించండి. మీకు పిరమిడ్ ప్రవేశం అవశ్యం దొరుకుతుంది " అన్నాను. వారందరూ " మహాభాగ్యం " అని మాయమయ్యారు.

మనం ధ్యానం చేస్తే మనంతటివారు మరెవరూ ఉండరని సృష్టి మరోసారి స్పష్టపరిచింది.


- మధుకర్,
చందూర్
సెల్ : +91 9441040168

Go to top