" నా ద్వారా నా గుండెకు ఆస్ట్రల్ శస్త్రచికిత్స "

నా పేరు కురిమిళ్ళ రామమూర్తి.

వరంగల్ నగరంలో కార్పెంటర్‌గా గత 35 ఏళ్ళ నుంచి ఉంటున్నాను. నా వయస్సు 50 సంవత్సరాలు. నాకు భార్య, ముగ్గురు పిల్లలు .. ఇదివరలో నాకు సియాటిక్ పెయిన్ వుండేది. ఎన్ని మందులు తీసుకున్నా తగ్గలేదు. నేచర్‌క్యూర్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ తీసుకున్నాను. సంవత్సరానికి రెండుసార్లు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేవాడిని మరి " దీనికి ముగింపు లేదా ? " అని ఎప్పుడూ బాధపడేవాడిని.

" దీనికి మూలం ఏది ? " అని ఆలోచిస్తూండేవాడిని. వరంగల్ హంటర్ రోడ్ ‘ పిరమిడ్ కేర్ సెంటర్ ’ కు రావడం, ధ్యానం చేయడం చేస్తూ మరి అక్కడి నుంచి రోజుకొక పుస్తకం తెచ్చుకుని చదివేవాడిని. గత రెండు సంవత్సరాల నుంచి అంతకుముందు సంవత్సరంలో రెండు మూడూసార్లు వచ్చే బ్యాక్ పెయిన్ ధ్యానం వలన మటుమాయమైంది. నేను క్రిందనే కూర్చుని ధ్యానం చేస్తాను.

అంతకుముందు నాకు గుండెనొప్పి కూడా వుండింది. " నెలకంటే ఎక్కువరోజులు బ్రతకరు " అని డాక్టర్ పరోక్షంగా చెప్పారు కూడా. " రెండు వాల్వ్స్ దెబ్బతిన్నాయి కనుక బ్రతికినంతకాలం మందులు వాడాలి " అని డాక్టర్లు చెబితే, నేను ధ్యాన సమయాన్ని పెంచి గుండెజబ్బు తగ్గించుకున్నాను. రెండేళ్ళ నుంచి ఏ మందులూ వాడడం లేదు . అయినా ఎంతో ఆరోగ్యంగా వున్నాను .

ఒక సంవత్సరం క్రితం నేను వరంగల్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ కిషన్‌రెడ్డి గారి కేర్ సెంటర్లోనే పత్రీజీని కలిశాను. ఆ తరువాత మా ఇంటిపైన 9' X 9' పిరమిడ్‌ను కట్టాను మరి దానిని పత్రీజీ ఎంతో దయతో ప్రారంభోత్సవం చేసారు . నాకు ధ్యానంలో అద్భుతమైన అనుభవాలు వచ్చాయి. అవి సూక్ష్మశరీరయానాలు. ఒకసారి సూక్ష్మశరీరం విడుదలై బయటకు వచ్చింది. మరొకసారి సూక్ష్మశరీరం నా లోపలే తన ప్రయాణం చేసి నాకు " ఆస్ట్రల్ ఆపరేషన్ " చేసింది.

ఆరు నెలలు క్రింద మా ఇంట్లో హాల్లోనే కూర్చుని ధ్యానం చేస్తూంటే కొంచెంసేపు అయిన తర్వాత శరీరం సహకరించక పోవడం వల్ల శవాసనంలో పడుకుని ధ్యానం చేశాను. కాస్సేపటికి శరీరమంతా చిమచిమలాడినట్లయింది. శరీరంలోంచి ఏదో లాగబడుతూ మళ్ళీ లోపలకు పోతోంది. నల్లగా ఏదో కనపడుతోంది నా శరీరం బయట లోపల మధ్య అలా మూడునాలుగుసార్లు జరిగిన తర్వాత బయటకు వచ్చి నాలుగు అడుగుల అవతల కూర్చుంది అది. అలా నా సూక్ష్మశరీరం ద్వారా నేను భౌతిక శరీరాన్ని చూడగలుగుతున్నాను. " స్థూలశరీరం వేరు, సూక్ష్మశరీరం వేరు " అని చక్కగా గ్రహించగలిగాను. ఎంతో తేలికగా వుండింది ఆ సూక్ష్మశరీరం. " మళ్ళీ శరీరంలోకి ప్రవేశించుదాం " అని అనుకున్న ఒక సెకను కాలంలోనే నా సూక్ష్మశరీరం మళ్ళీ స్థూలశరీరంలో ప్రవేశించగలిగింది.

ఇంకొకసారి నా స్థూలశరీరంలోనే సూక్ష్మశరీరం విడుదలై నా లోపల ప్రయాణం ప్రారంభించింది. అది నా వ్యక్తిరూపంగా నాకు అనిపించింది. అప్పుడు నా మస్తిష్కంలో అంతకుముందు నాకు గుండె ప్రాబ్లమ్ వుంది అనే ఫీలింగ్ కూడా లేని పరిస్థితి. అప్పుడు నా సూక్ష్మశరీరం నా గుండెకాయ లోని ఒక వాల్వ్ లో ప్రవేశించడం జరిగింది. ఆ వాల్వ్ లో అంతా ‘ దుమ్ము ’ కనపడుతోంది. అదంతా సూక్ష్మశరీరధారినైన నేనే తిసివేశాను. అది ఎలా వుందంటే ఒక పైప్‌లోని నీటితో శుద్ధి చేసినట్లు వుంది. ఆ వాల్వ్ పైప్‌లైన్ మొత్తం శుద్ధి అయ్యింది.

ఆ తర్వాత రెండవ వాల్వ్ లో ప్రవేశించడం జరిగింది. అది ఏ మాత్రం గ్యాప్ లేకుండా మొత్తం బ్లాక్ అయివుంది. ఆ తర్వాత ఏవో తెలియని పరికరాలు వున్నట్లు, మా ఇంట్లో ఒక కప్‌బోర్డులోని చెత్త అంతా శుద్ధి చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఎంతోమంది తవ్వినట్లు, పనిచేసినట్లు, ఆ ‘ దుమ్ము ’ ను మోసుకుని దూరంగా పారేసినట్లుగా వుంది. అలాగే ఆ వాల్వ్ లో ప్రయాణం జరిగింది. క్రమంగా ఆ వాల్వ్ ను శుద్ధి చేస్తూ చేస్తూ పోగా, ఆ వాల్వ్ రెండు పాయలుగా మారింది. అంతా చూస్తే శుద్ధిగా వుంది. ఆ వాల్వ్ లో నుంచి బయటికి వచ్చి మళ్ళీ పొత్తికడుపు ప్రాంతంలోకి వచ్చి పైకి గుండెవైపు చూడడం జరిగింది.

నేను ధ్యానంలోనే వుంటూ, నేను లోపలనే వున్నాను అన్నది అంతా తెలుస్తోంది. ధ్యానంలోంచి లేవాలని ఒకవైపు అనిపిస్తోంది. మరొకవైపు "లేవద్దు, అంతా శుద్ధి అవ్వాలి " అనుకుంటున్నాను. ఒక పైప్ పెట్టి గుండెకూ, ఊపిరితిత్తులకూ నీరు వేసి కొడుతున్నాను. అంతా శుద్ధి అయింది. ఇక లేచిపోయాను ధ్యానంలోంచి.

ఇందుకు మూడురోజుల ముందు నుంచి నా శరీరం బాగా ఇబ్బందిపెట్టింది నన్ను. ఎవ్వరికీ చెప్పలేదు నేను. నేను " వుంటానో లేదో " అనే బాధ ఒక శాతం, " నాకు ఏదో మేలు జరగబోతోంది " అని 99% వుండింది. పై క్రియ జరగడానికి ముందురోజు మా ఇంట్లో ఆక్వేరియమ్‌లో చేపలకు మందు వేస్తూ కూడా నేను బాధలోనే వున్నాను. ఆ తర్వాత పైన చెప్పిన ఆస్ట్రల్ శస్త్రచికిత్స జరిగింది నాతో నాకు, నాలో నాకు.

తర్వాత రోజు ఉదయం శరీరం బాగా క్షీణించినట్లు, భౌతికంగా శస్త్రచికిత్స జరిగిన తర్వాత ఒళ్ళంతా పచ్చిపుండులా ఎలా వుంటుందో అలా వుండింది. రెండు రోజుల తర్వాత నుంచి శరీరం చాలా చాలా ఫ్రీ అయింది. ఈ క్రియ తర్వాత శరీరంలో ప్రతి పార్ట్ నయమై చాలా ఖుషీగా, హాయిగావుంది. అప్పటినుంచి నేను గుండెపరంగా ఏ ఇబ్బందీ లేకుండా వున్నాను.

 

- కురిమిళ్ళ రామముర్తి,
వరంగల్

Go to top