" ఇకనుంచి షిర్డీ వచ్చే అవసరమే లేదు "

నా పేరు అప్పలనరసింహం.

నేను ఈ ధ్యానంలోకి " మాచవరం M.V. రమణ " గారి ద్వారా 22-2-2004 న ప్రవేశించడం జరిగింది. 21-4-2004 న ఆకివీడు ధ్యానమహాయజ్ఞంలో పత్రీజీని కలవడం జరిగింది. ఆ రోజు పత్రీజీ సభాప్రాంగణంలోకి అడుగు పెడుతూంటే .. " నా ఇష్టదైవం శ్రీ షిర్డీ సాయిబాబాయే నడిచి వస్తున్నారా " అన్న అనుభూతి నాకు కలిగింది. నేను 31-12-2003 న నూతన సంవత్సరం సందర్భంగా షిర్డీ వెళ్ళడం జరిగింది. అప్పుడు నేను బాబాని దర్శనం చేసుకుంటూండగా .. నాకు అంతర్వాణి ప్రభోధం " నీకు సరియైన గురువుని చూపిస్తున్నాను ; ఇక నుంచి నువ్వు షిర్డీ వచ్చే అవసరం లేదు " అని.

ధ్యానంలోకి రాకముందు నా శరీరం విపరీతమైన బరువుగా వుండి నడవటానికి కానీ, మెట్లు ఎక్కడానికి కానీ చాలా ఇబ్బంది పడేవాడిని. నాకు అల్సర్ వ్యాధి కూడా వుండేది. ప్రతిరోజూ తప్పనిసరిగా మందులు వాడవలసి వచ్చేది. ధ్యానం చేస్తున్నప్పటికీ పూజలు చేస్తూ ఉండేవాడిని. కానీ ఎందుకో నాకు అంత సరిగ్గా ధ్యానం కుదిరేది కాదు. ఇలా కాలక్రమంలో .. ఆకివీడు ధ్యానయజ్ఞంలో పత్రీజీని దర్శించాక .. నాకు ధ్యానం బాగా కుదిరి నలభైరోజులు తిరగకుండానే నేను 18 కేజీల బరువు తగ్గి నా అల్సర్ వ్యాధిని నయం చేసుకుని ఈ రోజు వరకు ఎటువంటి మందులు వాడకుండా ఆరోగ్యంగా వున్నాను.

నేను ఈ ధ్యానంలోకి వచ్చిన దగ్గరినుంచి మా పిరమిడ్ నిర్మాణం వరకు క్లాసులు నిర్వహించాను. నేను పొందినటువంటి ఆరోగ్యాన్నీ, ఆనందాన్నీ పదిమందికి పంచాలన్న సంకల్పంతో పత్రీజీ అమృత హస్తాలతో 17-12-2004 న పిరమిడ్ శంఖుస్థాపన జరిగింది. నేను మా బిల్డింగ్ కొన్నప్పుడు శుభలేఖలో " శ్రీ షిర్డీ సాయిబాబా ధ్యానమందిరం " అని వేయించడం జరిగింది. ఆ రోజు అలా ఎందుకు జరిగిందో నాకు తెలియదు కానీ .. మా పిరమిడ్కి పత్రీజీ అదే పేరుతో " శ్రీ షిర్డీ సాయిబాబా పిరమిడ్ ధ్యానమందిరం " అని నామకరణం చేయడం జరిగింది.

ఇలా పిరమిడ్ శంఖుస్థాపన జరిగాక తాపీమేస్త్రీ వచ్చి కావలసిన సామాన్లు వ్రాయడం జరిగింది. ఆ రోజు సాయంత్రం ధ్యానంలో నాకు పిరమిడ్తో పాటు " స్వాధ్యాయ మందిరం, సజ్జనసాంగత్య మందిరం, ధ్యాన గ్రంథాలయం వుంటే బాగుంటుంది " అనిపించింది. ఆ కారణంగా ఆ రోజు పనులు ఆపివేసి మళ్ళీ 1-8-2006 న పని ప్రారంభించి 18 * 18 పిరమిడ్ నిర్మాణం పూర్తిచేయడం జరిగింది. 24-3-2007 న పత్రీజీ అమృత హస్తాలతో పిరమిడ్ను ప్రారంభించడం .. ఆ రోజు సుమారు 1200 మంది ధ్యానులచే మొట్టమొదటిసారిగా మాచవరం గ్రామంలో శాకాహార ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం పల్లపువీధి కళ్యాణమండపంలో ధ్యానులకు పత్రీజీ దివ్యజ్ఞాన సందేశం ఇవ్వడం జరిగింది. పిరమిడ్ ప్రారంభించినప్పటి నుంచీ నేటివరకు ఎన్నోవేలమంది ధ్యానం చేసుకుంటూ సంపూర్ణ ఆరోగ్య ఆనందాలతో జీవిస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం వాస్తవ్యులు " వైశాలి " అనే మేడమ్ గారు తీవ్రమైన కీళ్ళవాతంతో బాధపడుతూ డాక్టర్లు కూడా " నయం చేయలేము " అన్న పరిస్థితిలో ధ్యానం గురించి విని ప్రతిరోజూ రామచంద్రాపురం నుంచి మా పిరమిడ్కి వచ్చి వారి తల్లిగారు మరి నా భార్య సహాయంతో నలభైరోజులు పట్టుదలతో ధ్యానం చేసి ఆ వ్యాధిని నయం చేసుకుని ఆ ఆనందాన్నీ, అనుభూతినీ, ఆరోగ్యాన్నీ అందరికీ పంచాలనే సదుద్దేశ్యంతో వారి బిల్డింగ్పై అద్భుతమైన పిరమిడ్ని నిర్మించడం జరిగింది.

అదే విధంగా మా పిరమిడ్లో ధ్యానం చేసుకుంటూ .. పులగుర్తి వాస్తవ్యులు తోటకూర హరిబాబు గారు, కుతుకులూరు వాస్తవ్యులు కొవ్వూరి బుల్లిరెడ్డి గారు .. వారి గ్రామాలలో వారి బిల్డింగులపై పిరమిడ్లు నిర్మించి పత్రీజీ అమృత హస్తాలతో ప్రారంభింపజేసి ధ్యానప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.

నా సొదరి కల్లూరి వరలక్ష్మి, విశ్వేశ్వరావు దంపతులు మా పిరమిడ్లో ధ్యానం చేసుకుని రాజమండ్రి శాటిలైట్ సిటీలో వారి బిల్డింగ్పై పిరమిడ్ నిర్మించడం జరిగింది.

ఈ పిరమిడ్లో ధ్యానం చేసుకుంటూ .. ఈ పిరమిడ్ మహాశక్తిని వ్యాపింపచేయాలనీ .. దానికి పిరమిడ్ నిర్మాణమే మార్గమనీ భావించి ఎంతోమంది ఔత్సాహికులు ముందుకు రావడం నాకు చాలా ఆనందాన్ని అందించే విషయం.

అదేవిధంగా గ్రామంలోనూ, దేవాలయాలలోనూ " ధ్యానప్రచారం ఫ్లెక్సులు " ఏర్పాటుచేసి ధ్యానం క్లాసులు ఏర్పాటుచేసి ఎక్కువమందికి పత్రీజీ ఆశీస్సులతో ఈ ధ్యానమార్గం లోకి ప్రవేశింప చేయడం జరిగింది. దీనిలో భాగంగా పదమూడు రకాల విభిన్నరకాల ధ్యానప్రచార సందేశ పత్రికలు సుమారు 39,000 పంచి దీనిని ఇలా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతోంది.

నాకు ఈ జన్మలో ఇంతటి అదృష్టాన్ని ప్రసాదించిన జగద్గురువు బ్రహ్మర్షి పత్రీజీ కి మరొకసారి ధ్యానాభివందనం తెలుపుతూ ..


- బోడా అప్పలనరసింహం (బాబూరావు),
ఆకివీడు

Go to top