" పగలు ప్రాపంచిక పనులు .. రాత్రిళ్ళు ధ్యానం "

నా పేరు సత్యనారాయణ.

మాది విశాఖపట్నం. నా వయస్సు 53 సంవత్సరాలు. నేను ఈ ధ్యానంలోకి 2005 జూలై నెలలో " సీతమ్మధార " లో వున్న " కుమారి మాస్టర్ " ద్వారా వచ్చాను. అప్పటికే నాకు ముడుకులనొప్పి, నీరసం వుండేవి. ధ్యానం చేసిన తర్వాత అవి పూర్తిగా పోయాయి. అరవైలో ఇరవై అన్నట్లు హుషారుగా వున్నాను. ఒక సంవత్సర కాలం ధ్యానంలో నా మూడవకన్ను ద్వారా అందరి దేవుళ్ళనూ చూసాను.

ఈ సంవత్సరకాలంలో మూడురోజుల ధ్యానం, తొమ్మిది రోజుల ధ్యానం, పదిహేనురోజుల ధ్యానం వివిధ సెంటర్లలో నిర్వహించారు. వీటిలో పాల్గొని ధ్యానం గంట, గంట పెంచుకుంటూ ఐదుగంటల సిట్టింగుకు వచ్చాను. రెండవ సంవత్సరం ఏడుగంటల ధ్యానం మొదలైంది. ఒక పట్టు పట్టాను. " ఏడుగంటలు ఒకే సిట్టింగ్లో కూర్చోవాలి " అని అలాగే కూర్చున్నాను. " O.K " చెప్పిన తరువాత అందరూ చప్పట్లు కొట్టి నాకు షేక్హ్యాండ్ ఇచ్చారు.

ఒక మాస్టర్ నా చేతిలో అడ్రస్ కాగితం పెట్టి వచ్చే వారం మా ఇంటికి ఏడుగంటల ధ్యానానికి తప్పకుండా రావాలని పిలిచారు. ఇలా ఎవరి ఇంట్లో ఏడుగంటల ధ్యానం పెట్టినా చేసేవాడిని. ఇది నా శరీరంలో ఎంతో మార్పుని తెచ్చింది.

ఒకసారి ఏడుగంటల ధ్యానం మంచి స్థితిలో వుండగా ఒక ఋషి ధ్యానం చేస్తున్నట్లు, అతని ఎదురుగా ఒక యజ్ఞగుండం, అందులో ఒక దివ్యమైన జ్యోతి ప్రకాశిస్తున్నట్లు, ఆ యజ్ఞానికి సాక్షాత్తు శ్రీ కృష్ణుల వారు దివ్యమైన కాంతితో వచ్చి కూర్చున్నారు. దీనికి నేను ఏమనుకున్నానంటే నేను చేస్తున్న ఏడుగంటల యజ్ఞానికి శ్రీకృష్ణుల వారు వచ్చి కూర్చున్నారని, నన్ను చూసి ధ్యానులంతా ఒకే సిట్టింగ్ ఏడుగంటల ధ్యానానికి రావాలని అనుకున్నాను. అలాగే ఇప్పుడు చాలామంది ధ్యానులు ఒకే సిట్టింగ్లో ఏడుగంటలు చేస్తున్నారు . ఇది నాకు చాలా ఆనందంగా వుంది.

మన వైజాగ్లో మూడురోజులు గురుపౌర్ణమి ధ్యానయజ్ఞం అద్భుతంగా జరిగింది. ఇందులో " పౌర్ణమి ధ్యానం " పుస్తకం పత్రీజీ గారి చేతుల మీదుగా రిలీజ్ అయింది. అప్పటినుంచి ప్రతి పౌర్ణమికి మూడురోజుల ముందు ఆ రోజు తరువాత మూడురోజులు మొత్తం ఏడురోజుల ధ్యానాలు ప్రతి నెల ఒక్కొక్క సెంటర్లో జరుగుతున్నాయి. ఒక సెంటర్లో ఏడురోజులు రాత్రుళ్ళు ధ్యానంలో గడిపాను. రాత్రుళ్ళు ధ్యానం, పగలు ప్రాపంచిక పనులు చేస్తున్నా ఎక్కడా నిద్రలేమి, నీరసం లేదు ; ఎంతో హాయిగా, ఆనందంగా వుంది.

భగవత్ స్వరూపులైన గురువుగారు బ్రహ్మర్షి పత్రీజీకీ, పిరమిడ్ మాస్టర్లు అందరికీ మరి ధ్యాన మిత్రులందరికీ మరొకసారి నా ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటున్నాను.

 

- Ch. సత్యనారాయణ,
అబీద్ నగర్, అక్కయ్యపాలెం, విశాఖపట్నం
ఫోన్ : 0891-2748721

Go to top