" ఆస్ట్రల్ మాస్టర్ చేసిన పెళ్ళి "

నా పేరు కొండారావు.

నేను BSNL లో ఉద్యోగిని. నేను 2003నుంచి ధ్యానం .. ధ్యానప్రచారం చేస్తున్నాను. 1986 లోనే నాకు " కుండలినీ జాగృతం " అయింది. అప్పటినుంచి నాకు విపరీతమైన ఆనందం కలుగుతోంది. అదేమిటో తెలుసుకోవటానికి నాకు దాదాపు పందొమ్మిది సంవత్సరాలు పట్టింది. అదీ పత్రీజీ దయతో దాని విశిష్టతను తెలుసుకున్నాను. " అదే నాయనా .. శ్వాస మీద ధ్యాస అంటే. నువ్వు ధ్యానప్రచారం చేయటానికి జన్మ తీసుకున్నావు. నువ్వు మంచి సాధనమార్గంలో వున్నావు. దానిని కొనసాగించు " అన్నారు తిరుపతి ట్రెక్కింగ్లో.

అయితే మా ఇంట్లోవాళ్ళు ఎవరూ ధ్యానం చెయ్యరు. కానీ నా మాట మీద గౌరవంతో మా కుటుంబం పూర్తి శాకాహార కుటుంబంగా వున్నాం. మా పెద్దమ్మాయికి పెళ్ళి చేయటానికి నేను గత ఎనిమిది సంవత్సరాలుగా చేయని ప్రయత్నం అంటూ లేదు. అయితే తను మొండిగా " మేం ధ్యానం చెయ్యం .. నీకు ఇష్టమైతే నా పెళ్ళి చెయ్యి లేకపోతే లేదు " అనేది. ఈ బాధను నేను అనుభవించటం తప్ప ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి.

ఈ సమయంలో ఆరు సంవత్సరాల క్రితం చనిపోయిన మా నాన్న " కృష్ణమూర్తి గారు " మార్చి 28-2-2010 న రాత్రి సమయం దాదాపుగా 1.00 గంట ప్రాంతంలో ఆస్ట్రల్ మాస్టర్గా నా ప్రక్కకు వచ్చి " పెళ్ళి నేను చేస్తాను .. నువ్వు అలా నిలబడు అంతే. మీ గురువు గారు సామాన్యులు కారు. ఆయన యొక్క అనుమతితోనే నేను ఈ కార్యానికి పూనుకున్నాను " అని చెప్పారు.

ఆ తరువాత సంబంధాలు చూడడానికి ఒకరోజు విజయవాడ వెళ్ళాను. ఒకేరోజు ఆరు సంబంధాలు చూశాను. అందులో ఒక సంబంధాన్ని కుదుర్చుకున్నాను. కానీ వాళ్ళు అనుకున్న దానికంటే దాదాపుగా డెబ్భైవేల రూపాయలు అదనంగా అడిగారు. దానితో నేను ఏమీ మాట్లాడలేక పోయాను. నాకు బాధ కలిగింది. ఆ సమయంలో మా నాన్న మళ్ళీ రాత్రి నాకు కలలో కనిపించి " డబ్బు గురించీ, పెళ్ళి గురించీ నువ్వు ఆలోచించవద్దు. పెళ్ళి ప్రయత్నం చెయ్యి .. ఆ డబ్బు ఎలా తేవాలో, పెళ్ళి ఎలా చేయాలో నేను చేస్తాను. నేను చనిపోయిన దగ్గర్నుంచి నీకు మనవడిగా పుట్టాలని ప్రయత్నం చేస్తున్నాను. నువ్వు పెళ్ళి చేయాలని ప్రయత్నం చేస్తున్నావు. కానీ వీళ్ళ మొండితనం వల్ల నువ్వు పడే బాధ చూడలేక నేనే పూనుకున్నాను " అని చెప్పారు.

ఆ తరువాత పెళ్ళికొడుకుతరపువాళ్ళు వాళ్ళంతట వాళ్ళే నాకు ఫోన్ చేసి 10-4-2010 న పెళ్ళి జరిపించారు. ఇది ఒక ఆస్ట్రల్ మాస్టర్ అద్భుతంగా జరిపించిన వివాహం. ఇది నేను మర్చిపోలేని అద్భుతకార్యం. పత్రీజీకి విషయమంతా భీమవరంలో వివరించాను. ఆయన వెంటనే " దీనిని ధ్యానాంధ్రప్రదేశ్కి ఫోటోతో సహా పంపు ; ఇది సరిక్రొత్త అనుభవం " అన్నారు.

మరొకసారి బ్రహ్మర్షి పత్రీజీకి మరి పిరమిడ్ మాస్టర్లు అందరికీ శతసహస్రకోటి ధ్యాన ప్రణామాలు.

 

- G. కొండారావు
ఆకివీడు, పశ్చిమగోదావరి జిల్లా
ఫోన్ : +91 94904 32929, 08816-253111

Go to top