" పత్రీజీ మాట .. ఫలితం తెలిసిన బాట "

హలో, నా పేరు చంద్ర.

మాది కార్ఖానా, సికింద్రాబాద్.

1998 సంవత్సరంలో .. మేము కర్నూలులో ఉండేవాళ్ళం. అప్పట్లో నాకింకా ధ్యానం గురించి అస్సలు ఏమీ తెలియదు. ఇంట్లోవాళ్ళకు వండిపెడుతూ .. ఇంటికొచ్చిన వాళ్ళకు సేవ చేస్తూ .. అలా అలా జీవితం గడిపేస్తూండేదాన్ని. అంతకంటే వేరొక జీవితం ఉంటుందని కూడా నాకు తెలియదు అప్పుడు.

మా బంధువు ఆదోని మాస్టర్ ప్రేమ్నాథ్ గారి వద్ద మావారు, మేము ధ్యానం నేర్చుకున్నాము. ఒకసారి పత్రిసార్ కర్నూలు వచ్చారని తెలిసి మా ఇంటికి ఆహ్వానించాము. ఆ రోజు మా అమ్మాయి పుట్టినరోజు. " చాలా గొప్ప గురువు వచ్చి మా ఇంటిని పావనం చేసారు " అని మేము సంతోషించి " మా అమ్మాయిని దీవించండి " అని అడిగాం.

" ‘ మా అమ్మాయి చనిపోయిన రోజు కూడా మేం ఇలాగే సంతోషంగా సంబరాలు జరుపుకుంటాం ’ అని మీరు అంటేనే .. నేను కేక్ ‘ కట్ ’ చేస్తాను " అన్నారు పత్రీజీ. ఇక చూడండి మా చుట్టాలందరూ గుసగుస. వాళ్ళకు కోపం కూడా వచ్చేసింది. " శుభమా అంటూ పుట్టినరోజున దీవించమంటే ఈ గురువు ఇలా అంటారేమిటీ " అని.

కానీ చిత్రంగా నాకు మాత్రం ఏమీ అనిపించలేదు. పైగా " నిజమే కదా, చావు పుట్టుకలు రెండిటినీ సమంగా చూడగలిగే ఆత్మస్థైర్యాన్ని కలిగించుకోమని నిక్కచ్చిగా చెప్తున్నారు ఈ గురువు " అని ముచ్చట కూడా వేసింది అలా .. తన శిష్యుడు కనపడగానే ఇక క్షణమాత్రం ఆలస్యం చేయకుండా .. వెంటనే ఆత్మజ్ఞానశిక్షణ మొదలుపెట్టేసే గురువు పత్రీజీ. దటీజ్ పత్రీజీ.

ఆ తరువాత 2005 సంవత్సరంలో మా వారు .. " మారం శివప్రసాద్ " గారికి తీవ్రంగా జబ్బుచేసి మా బంధువులందరూ మా గురించి మధనపడుతూ ఉంటే మేము మాత్రం " మనం ధ్యానం చేస్తాం .. ధ్యానం అందరికీ నేర్పిస్తాం. ఇది ఎలా వచ్చిందో అలాగే పోతుంది. ఓర్పుతో దాన్ని గమనిస్తూ ఉండడమే మనం ఇప్పుడు చేయాల్సింది " అన్న ఆత్మజ్ఞానంతో " పత్రీజీవారము .. మాకేల విచారమూ ? " అన్న పత్రిభావన తో రోజులు గడిపేవాళ్ళం.

మా వారికి కావలసిన సహకారం ఇస్తూ .. వారి బెడ్ ప్రక్కన పిల్లలతో సహా కూర్చుని ధ్యానం చేసేదానిని. ధ్యానం గురించీ .. ధ్యానశక్తి గురించీ తప్ప వేరే ఏ ఆలోచన నాకు ఉండేది కాదు. " మనకు ఇలా ఎందుకు జరుగుతోంది ? " అని ఎప్పడూ ఏడ్వలేదు. పైగా మా వారికి తెలివి వచ్చినప్పుడు చక్కగా .. సరదాగా జోకులు అవీ వేసుకుంటూ .. మాట్లాడుకుంటూ .. టీవీ చూసుకుంటూ ఏమి కానట్లే ఉండేవాళ్ళం. అంతటి గొప్ప సమతాస్థితిలో ఉంచగలిగింది ధ్యానం నన్ను.

మారం గారికి కాస్త అనారోగ్యం నెమ్మదించిన తరువాత వారిని వెంటబెట్టుకుని ఇద్దరమ్మాయిలతో సహా బెంగళూరు పిరమిడ్కి ప్రయాణమయ్యాను. అయితే బస్సు జడ్చర్ల చేరేసరికే .. ఇక మావారు ఆయాసపడుతూ అస్సలు కూర్చోలేక పోతున్నారు. ముందుకు ప్రయాణం దుస్సాధ్యం అనిపించింది. అలాంటి పరిస్థితుల్లో ఎటువంటి ఇల్లాలైనా సరే ఏడుస్తూ కూర్చోవల్సిందే. కానీ నేను .. ధ్యానశక్తిని మాత్రమే నమ్ముకున్న మాస్టర్ని కనుక .. అక్కడ దిగిపోయి ఒక హోటల్ యజమాని సహాయంతో కారు మాట్లాడుకుని తిరిగి హైదరాబాద్ వచ్చేసాము.

వారం రోజుల తరువాత పత్రిసార్ శ్రీలంక యాత్ర నుంచి తిరిగి వచ్చారని తెలిసి పిల్లలతో సహా వాళ్ళింటికి వెళ్ళి సార్ని కలిసినప్పుడు .. వారు మాతో ఒక గంట ధ్యానం చేయించి .. నాతో వంట చేయించి .. ఆ రోజు మా అమ్మాయి జన్మదినాన్ని ‘ కేక్ ’ కట్ చేయించి మరీ ఆనందంగా జరిపించారు. ఆ తరువాత మావారి ఆరోగ్యం కూడా కుదుటపడింది.

అప్పుడు అర్థమయింది నాకు " పత్రీజీ మాట .. ఫలితం తెలిసిన బాట " అని. క్లిష్టపరిస్థితుల్లో కూడా నేను ధైర్యంగా తిరుగగలిగాను అంటే .. దానికి కారణం మా వెనుక ఉన్న ధ్యానశక్తి మరి నా గురువు యొక్క అభయహస్తం మాత్రమే. అలా చెప్పకనే చేయూతనిస్తూ మనల్ని సదా ముందుకు నడిపిస్తూంటారు పత్రీజీ.

షిర్డీ, తిరువణ్ణామలై, హైదరాబాద్ ధ్యానయజ్ఞాల వంట ఏర్పాట్లలో పాలుపంచుకోవటం నిజంగా నాకెంతో తృప్తి నిచ్చింది. అందరికీ వండివార్చటం ఇష్టపడే " వంటింటి కుందేలు " లా ఉన్న నేను .. ఈ విధంగా అనేక ధ్యానయజ్ఞాల్లో పాల్గొని ఆ ప్రాంగణాల్లో భోజనాలకై ఏర్పాటు చేయబడిన " ధ్యాన వంటశాలల కుందేలు " గా మారి, నాకు చేతనైన పనులు చేస్తూ వచ్చాను.

వంటల్లో సహాయం చేయడం దగ్గరి నుంచి త్రాగిన గ్లాసులు కడగడం వరకు .. ప్రతి ఒక్క పనిని కూడా ఒక యజ్ఞంలా సమర్పణాభావంతో చేసే నిబద్ధతను కలుగజేసిన పత్రీజీ కి నిజంగా ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం ? " వీలైనప్పుడల్లా వారికి ఇష్టమైన మిరపకాయబజ్జీలు, ఆలుగడ్డకూర, వంకాయకూర, ఉల్లిపాయల సాంబారు వంటివి వండిపెట్టడంతో తీర్చుకోవచ్చులే " అనుకున్నాను.

కానీ నా అంచనా తప్పయి .. తల్లక్రిందులై " ఈ భూమిమిద పుట్టిన ప్రతి ఒక్కరూ ధ్యానప్రచారం చేసే తీరాలి. అంతకుమించిన మోక్షం లేనే లేదు " అన్న పత్రీజీ ఛండశాసనాన్ని శిరసావహించి ధ్యానప్రచారం మొదలుపెట్టాను. ఇలా సదా మనల్ని సరియైన ట్రాక్లో ఉంచే గురువే నిజమైన గురువు. .. అంటే పత్రీజీ మాత్రమే.

మా అత్తగారి ఊరు కర్నూలు జిల్లా " ఆత్మకూరు " లో ధ్యానప్రచార నిమిత్తం హైదరాబాద్ నుంచి కొందరు మాస్టర్స్ని వెంటబెట్టుకుని వెళ్ళి వారం రోజుల పాటు ధ్యానతరగతులు నిర్వహించాము. అంతకుముందు ప్రతిదానికీ ఎంతో మొహమాటపడే నేను ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంచి ధ్యాన తరగతుల్లో వారికి జ్ఞానం అందిస్తూ అనుభవాలు పంచుకుంటూ నన్ను నేను ఎంతో సంస్కరించుకున్నాను. ధ్యాన తరగతులు విజయవంతంగా జరిపించడంలో మా మరిదిగారు మాకు ఎంతో సహకారం అందించారు.

ఆ తరువాత ఇక నేను వెనుకకు తిరిగి చూసుకోలేదు. నాకై నేనుగా ఎన్నో ధ్యానశిక్షణా తరగతులు నిర్వహించాను. మరి ఎవరు పిలిచనా .. వెళ్ళి ఆయా తరగతుల్లో నా జ్ఞానాన్ని పంచుకునే దాన్ని. ఇలా నాలో వస్తోన్న పెనుమార్పులను సాక్షిలా గమనించుకుంటూ హైదరాబాద్ " చర్లపల్లి జైలు " లో 40 రోజుల ధ్యానశిక్షణా తరగతులు ఏకధాటిగా, విజయవంతంగా నిర్వహించగల స్థాయికి నన్ను చేర్చినవారు పత్రీజీ. ఇది నిజంగా నా జీవితానికి ధ్యానం అందించిన మహాకానుక.

కరుడుగట్టిన మనస్సులతో .. కక్ష్యలు కార్పణ్యాలతో .. తీవ్రశిక్షలు అనుభవిస్తున్న మానసిక వ్యధతో .. తమవారికి దూరమై .. " ఇలా ఎందుకు జరుగుతోంది ? ", " ఇకముందెలా గడపాలి? " తెలీని అయోమయంలో నిస్సారంగా తమ తమ జీవితాలను గడుపుతోన్న ఖైదీ సోదరులకు ధ్యానం నేర్పి ఆత్మజ్ఞానం తెలియజేసి వారి జీవితాలకొక అర్థం .. పరమార్థం కల్పించగలిగే అవకాశం ఒక అతిసాధారణ ‘ వంటింటి కుందేలు ’ గా ఉన్న నాకు లభించింది ఈ ధ్యానప్రచారం వల్లనే, దటీజ్ పత్రీజీ.

ప్రతిరోజూ ఇంటిపనులు చక్కబెట్టుకుని .. ఒక ఉద్యోగం చేస్తున్నట్లు జైలుకు వెళ్ళి తరగతులు నిర్వహించే వాళ్ళం. సీనియర్ మాస్టర్లను రప్పించి .. అద్భుతమైన జ్ఞానాన్ని వాళ్ళకు అందించే కృషిచేసాము. అక్కడి ఖైదీల అనుభవాలు వింటూంటే .. " ఆ జైలు తపోభూమికేమీ తక్కువకాదు .. మరి అక్కడ వాళ్ళంతా గొప్ప గొప్ప ఋషులనూ .. మునులనూ మించినవాళ్ళే " అన్న సంగతి అర్థమైంది.

మామూలు మనుషులు తలుచుకోవడానికే భయపడే " చర్లపల్లి జైలు " లో .. ఎప్పుడైనా కారణాంతరాల వల్ల నేను క్లాసుకు వెళ్ళలేక ఎవరైనా మాస్టర్ని పంపి మర్నాడు వెళితే " నిన్న ఎందుకు రాలేదమ్మా, " అంటూ ఎంతో ఆర్ద్రంగా, ఆప్యాయంగా వాళ్ళు నన్ను పలుకరిస్తూంటే నాకు కళ్ళు చెమర్చేవి. ఇలా వాళ్ళ హృదయాలను తట్టి వారిలోని ఆత్మను జాగృతం చేసి వారిలో ప్రేమదీపాలను వెలిగించగలిగే అవకాశం నాకిచ్చిన పరమగురువు పత్రీజీ.

" ప్రతిఒక్క ప్రాణీ ఆత్మస్వరూపమే .. స్వీయాభివృధ్యర్థం జన్మ తీసుకున్న దేవతలే " .. అన్న జ్ఞానాన్ని మనకు ఎరుకపరుస్తూ మనల్ని నడిపించే గురువు .. ఒక్కరే. దటీజ్ పత్రీజీ.

 

- మారం చంద్ర,
హైదరాబాద్

Go to top