" రాబోయే ఫలితం ముందుగానే కనిపించింది "

నా పేరు దీపిక.

మాది చిత్తూరు జిల్లా మదనపల్లె. ప్రస్తుతం నేను ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్నాను. మా నాన్నగారు " C. జానకీరామ్ ", అమ్మ " మాలతి " ల ద్వారా నేను 2004 వ సంవత్సరంలో ధ్యానంలోకి రావడం జరిగింది. నా తల్లిదండ్రులతో కలిసి బ్రహ్మర్షి పత్రీజీ కార్యక్రమాలకూ, అనేక ధ్యాన మహాయజ్ఞాలకూ, ట్రెక్కింగులకు మరి సీనియర్ మాస్టర్ల కార్యక్రమాలకు హాజరవుతున్నాను.

నేను ఐదవతరగతి చదువుతున్నప్పుడే ధ్యానంలో ప్రవేశించాను. అప్పటినుంచి ప్రతి పరీక్షలో క్లాసులో ఫస్ట్ వస్తున్నాను. ఏడవతరగతిలో నాకు రాబోయే ఫలితం " 570/600 " అని ముందుగానే ధ్యానంలో కనిపించింది . ఈ విషయం ధ్యానం క్లాసులో మాస్టర్లకు ముందుగానే చెప్పాను. భవిష్యత్తులో జరగబోయే విషయాలన్నీ ముందుగానే ధ్యానంలో కనిపిస్తూ వుంటాయి.

ఎందరో ఆస్ట్రల్ మాస్టర్లు, ప్లీడియన్స్, ముఖ్యంగా శ్రీకృష్ణుడు ఎప్పుడూ కనిపిస్తూ ధ్యానంలో సందేశాలు ఇస్తూంటారు. నా బెస్ట్ ఫ్రెండ్ ఉషాకి ఒకసారి తీవ్ర జ్వరం మరి న్యూమోనియా వచ్చి బెంగళూరు, సెయింట్ జాన్స్ హాస్పిటల్లో జాయిన్ చేసారు. అప్పుడు నేను వెళ్ళి తనకు ధ్యానం గురించి చెప్పి తనతో ధ్యానం చేయించాను. తను అప్పటికే చాలా డిప్రెషన్లో వుంది. ఇంక తాను బ్రతకలేనని వున్న దశలో ధ్యానం చేయగా పదిరోజులలో స్వస్థతను పొందింది. అందుకు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషించారు.

ఇక నాకు పదవతరగతిలో 94% మార్కులు వచ్చాయి. నా స్నేహితులు, మా స్కూల్ టీచర్స్ అందరూ పదవతరగతి తర్వాత ఇంటర్మీడియట్ బయట ఇతర ఊళ్ళలో చేరమని చెప్పారు. కానీ బయట చేరితే ధ్యానం చేయడానికి ఉండదని సొంత ఊళ్ళోనే మామూలు కాలేజీలో చదువుతూ, ప్రతిరోజూ క్రమం తప్పకుండా కనీసం 45 నిమిషాలు ధ్యానం మూడుసార్లు చేసుకుంటూ ఇంటర్ మొదటి సంవత్సరంలో 97% మార్కులు, మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 100% మార్కులు సాధించాను.

ఏదైనా ఒక్కసారి చదివితే చాలు అలాగే గుర్తుండిపోతుంది. నా స్నేహితులందరూ " నువ్వు అంత బాగా చదివింది ఎలా గుర్తుపెట్టుకుంటావు ? " అని అడుగుతూంటారు. కేవలం ధ్యానం ద్వారానే బాగా చదువుతున్నాననీ, వారిని కూడా ధ్యానం చేయమనీ, వారికి కూడా కౌన్సెలింగ్ చేస్తూంటాను.

చివరిగా " ధ్యానాంధ్రప్రదేశ్ " మాసపత్రిక ద్వారా విద్యార్థినీ విద్యార్థులకు నా మనవి ఏమిటంటే ఈ సులభమైన, మహత్తరమైన " శ్వాస మీద ధ్యాస " ద్వారా ఏమైనా సాధించవచ్చు ; ఇది సత్యం, సత్యం, సత్యం.

 

- C. దీపిక,
మదనపల్లె, చిత్తూరు జిల్లా
సెల్ : +91 9703205541

Go to top