" రోజూ హాయిగా నిద్రపోతున్నాను "

నా పేరు రాజేంద్ర.

నేను ఖమ్మం జిల్లా " మణుగూరు " లోని P.V కాలనీలో ఉంటున్నాను. సుమారు మూడు సంవత్సరాల క్రితం మా సమీప బంధువులు ఒకరి తర్వాత వొకరు చనిపోవటం జరిగింది. దీనితో నేను చాలా డిప్రెషన్కి లోనయ్యాను. అస్సలు నిద్ర పట్టేది కాదు. రాత్రి సమయంలో ఎవరో వస్తున్నట్లు ఉలిక్కిపడేదాన్ని. చాలా భయపడేదాన్ని. మా వారు మానసికనిపుణుడి దగ్గరకు తీసుకువెళ్ళారు. నిద్రమాత్రలు ఇచ్చారు. అవి వేసుకున్నా అంతంత మాత్రమే నిద్రపోయేదాన్ని. చాలా చిక్కిపోయాను. ఏదో తెలియని భయం నాలో ఆవరించింది ; చనిపోవాలనిపించేది. మా వారు ఎంత ధైర్యం చెప్పినా నేను మారలేకపోయాను. ఇదే క్రమంలో నా నుదిటిపై 1/4 అంగుళం ఎముక పెరిగింది. విపరీతమైన తలనొప్పి వచ్చేది. డాక్టర్కి చూపిస్తే శస్త్రచికిత్స చేయాలన్నారు.

ఇలాంటి సమయంలో మా ఇంటిపైన క్వార్టర్లో పిరమిడ్ మాస్టర్స్ మరి " శ్రీ హనుమాన్ పిరమిడ్ ఉచిత ధ్యానకేంద్రం " నిర్వాహకులు " బి. రామకృష్ణ " మరి " రమాదేవి " దంపతులు దిగారు. మా పరిచయంలో రమాదేవి గారికి నా గురించి అన్ని విషయాలు చెప్పాను. అప్పుడు వారు నాకు ధ్యానం గురించీ, ధ్యానం యొక్క విశిష్టత గురించీ తెలిపి వాళ్ళ ఇంట్లో వున్న పిరమిడ్ క్రింద కూర్చోబెట్టారు. నేను మొదటి అరగంట వారు చెప్పిన విధంగా ధ్యానం చేసాను. నేను ధ్యానం నుంచి కళ్ళు తెరిచినప్పుడు ఏదో ప్రశాంతత నన్ను ఆవరించినట్లు అనిపించింది.

ఇంటికి వెళ్ళిన తరువాత మళ్ళీ ధ్యానం చేసాను. అప్పుడు నన్ను ఎవరో లాగుతున్నట్లు అనిపించింది. చాలా భయపడిపోయి కళ్ళు తెరిచాను. వెంటనే రమాదేవి గారి దగ్గరకు వెళ్ళి జరిగింది చెప్పాను. వారు ఎంతో ఆప్యాయంగా నన్ను దగ్గరికి తీసుకుని భయపడవద్దనీ, నాలోని నెగెటివ్ విధానాలు పోయి పాజిటివ్ పద్ధతులుగా మారుతున్నప్పుడు ఇలా జరుగుతుందనీ అన్నారు, రాత్రి పడుకునేటప్పుడు ఆవిడ దగ్గర వుండి నాతో ధ్యానం చేయించారు. ధ్యానం నుంచి లేవగానే ఆశ్చర్యం నాకు మనస్సు చాలా నిర్మలంగా అనిపించింది. చాలా నిద్ర వచ్చింది. ఆ రోజు నిద్రమాత్ర వేసుకోకుండానే హాయిగా నిద్రపోయాను.

ఆ రోజు మొదలు హాయిగా నిద్రపోతున్నాను. నిద్రమాత్రలు అన్నీ బయటపడవేసాను. మా వారికి చాలా ఆశ్చర్యం, సంతోషం కలిగింది. అప్పటి నుంచి క్రమం తప్పకుండా నేను ధ్యానం చేయటం మొదలుపెట్టాను. రమ గారి సలహా మేరకు వారు ఇచ్చిన CD లు చూడటం మరి పుస్తకాలు చదవటం అలవాటు చేసుకున్నాను.

పత్రీజీ ప్రవచనాలు నన్ను చాలా ప్రభావితం చేసాయి. పత్రీజీని కలవాలని బలమైన కోరిక కలిగింది. ఒకరోజు పత్రీజీ భద్రాచలంలో పౌర్ణమి ధ్యానం కోసం వస్తున్నారని తెలిసింది. అప్పుడు నేను రమ గారితో అక్కడికి వెళ్ళి పత్రీజీని కలిసాను. పత్రీజీ నన్ను ఎంతో ఆప్యాయంగా దగ్గరగా తీసుకున్నప్పుడు నేను ఎంతో పరవశించిపోయాను, " నా జన్మ ధన్యమైంది " అనుకున్నాను. నాకు ఆనందంతో నోట మాట రాలేదు. ఆయన దీవెనలు అందుకున్నాను.

ఇప్పుడు ధ్యానం మొదలుపెట్టి రెండు సంవత్సరాలు అయింది. నా ఆరోగ్యం పూర్తిగా నయమైంది. రోజూ హాయిగా నిద్రపోతున్నాను. నా నుదిటి మీద పెరిగిన ఎముక క్రమక్రమంగా తగ్గిపోయింది. ఇప్పుడు నేను మా వారి సహకారంతో ధ్యానం చేయటమే కాకుండా అందరిచేత ధ్యానం చేయిస్తున్నాను. ధ్యాన ప్రచారం చేస్తున్నాను. నేను ధ్యానం మొదలుపెట్టినప్పటి నుంచి పూర్తి శాకాహారిగా మారిపోయాను.

- A. రాజేంద్ర,
మణుగూరు

Go to top