" భగవంతుని పని చేయడం నా మహాభాగ్యం "

నా పేరు నాగప్రశాంతి.

నేను B.Tech పూర్తిచేశాను. నా వయస్సు 22 సంవత్సరాలు. మాది కర్నూలు జిల్లా బేతంచెర్ల. నేను ధ్యానంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాలు అయింది. మా నాన్నగారి ద్వారా నాకు ఈ ధ్యానం పరిచయమైంది. మాది ధ్యాన కుటుంబం.

ధ్యానం కన్నా ముందు నాకు చాలా కోపం వుండేది. నేను ధ్యానంలోకి వచ్చిన కొద్దిరోజులకే చాలావారకు నాకు కోపం తగ్గింది. ధ్యానం కన్నా ముందు " నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదు " అని నేను భావించేదాన్ని. కానీ ఇప్పుడు ముందు నేనే అందరినీ అర్థం చేసుకోగల అవగాహన నాలో పెరిగింది.

నేను కాలేజీలో ఉన్నప్పుడు మా క్లాస్లో ఫ్రెండ్స్ అందరికీ ధ్యానం గురించి తెలియజేశాను. ధ్యానం నా జీవితంలో చాలా మార్పును తెచ్చింది. ఇలా నేను ధ్యానం చేస్తూ అందరికీ ధ్యానం తెలియజేయడం వల్ల మరి ధ్యానం ద్వారా నాకు అంతకుముందు వున్న కోపం తగ్గడం వలన అందరూ ఇప్పుడు నాకు సహాయం చేస్తున్నారు. ముందు ఉన్నంత కోపం నాకు ఇప్పుడు వుంటే ఎవ్వరూ నాకు సహాయం చేసేవాళ్ళు కాదు.

నేను B.Tech రెండవ సంవత్సరం సెకెండ్ సెమిష్టర్ పూర్తయిన తర్వాత " రిజల్ట్స్ రేపు వస్తాయి " అని మా సర్ వాళ్ళు చెప్పారు. నేను ఆ రోజు రాత్రి ధ్యానానికి కూర్చునేముందు " నా రిజల్ట్ చూపించండి " అని మాస్టర్స్ను అడిగి ధ్యానం చేసిన తర్వాత నిద్రపోయాను. అప్పుడు నిద్రలో నాకు ఒక పేపర్ కనిపించి అందులో నా సబ్జెక్ట్స్, మార్క్స్ మరి " నేను అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయ్యాను " అని నాకు కనిపించింది. మరుసటిరోజు నేను నెట్ సెంటర్కి వెళ్ళి చూసుకుంటే మాస్టర్స్ నా రిజల్ట్ ఎలా చూపించారో సరిగ్గా అలానే, నాకు ఏ ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్కులు వచ్చాయో ఆర్డర్ కూడా మారకుండా అలానే వుంది. అప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. అప్పటినుంచి ధ్యానం పట్ల నాకు ఇంకా నమ్మకం పెరిగింది.

నేను రోజూ కాలేజీకి బస్సులో వెళ్ళివస్తూండేదాన్ని. అప్పుడప్పుడూ బస్సులు ఒక్కొక్కసారి టైమ్ కన్నా ముందు వెనుక వస్తూంటాయి. ఒకరోజు రూమ్లో నేను ఒక్కదాన్నే వున్నాను. అప్పుడు నాకు స్పష్టంగా ఒక " వాణి " వినిపించింది. " ఈ రోజు బస్ త్వరగా వస్తుంది ; నువ్వు స్టాప్కి త్వరగా వెళ్ళు " అని రూమ్లో చూస్తే ఎవ్వరూ లేరు. నేను ఒక్కదాన్నే వున్నాను. " ఎవరు చెప్పారు ? " అనుకున్నాను. " సరే " అని ఆ రోజు త్వరగా బస్ స్టాప్కి వెళ్ళాను. అన్నట్లుగానే బస్ త్వరగా వచ్చింది. మా ఫ్రెండ్స్ అందరూ ఆ బస్ మిస్ అయ్యారు. నేను ఒక్కదాన్నే ఆ రోజు బస్ను అందుకున్నాను. ఈ సంఘటన జరిగినప్పుడు నేను అప్పుడప్పుడే ధ్యానంలోకి క్రొత్తగా వచ్చాను. తర్వాత నాకు తెలిసిన విషయం ఏమిటంటే మాస్టర్స్ మనకు ముందుగానే సమాచారాన్ని తెలియజేస్తూ వుంటారు. ధ్యానం చేసేవాళ్ళకు మాత్రమే ఈ అదృష్టం. వేరేవాళ్ళకు లేదు మాస్టర్స్.

బేతంచెర్ల పిరమిడ్ మాస్టర్ " M.C. మద్దయ్య " సర్ నాకు ఎప్పుడూ చెబుతూ వుంటారు " భగవంతుని పని మనం చేస్తూంటే భగవంతుడు మన పని చేస్తాడు " అని. " భగవంతుని పని " అంటే .. మనం క్రమం తప్పకుండా ధ్యానం చెయ్యడం, మనకు తెలిసిన జ్ఞానాన్ని అందరికీ తెలియజేయడం. ఈ పనులన్నీ నేను ఎప్పుడైతే " సంపూర్ణంగా, స్వయంగా చేయాలి " అని భావించానో .. అప్పటినుంచి ఇంకా మాస్టర్స్ నాకు ఎక్కువ సహాయం చేస్తున్నారు. ధ్యానం కన్నా ముందు నేను ఒక్కదాన్ని ఎక్కడికైనా వేరే ప్రదేశాలకు వెళ్ళాలంటే భయపడేదాన్ని. ఇప్పుడు నేను క్రొత్త క్రొత్త ప్రదేశాలకు కూడా ఒక్కదాన్నే వెళ్ళగలుగుతున్నాను.

ఈ సమయంలో పత్రీజీతో పాటుగా ఈ భూమిపై జన్మ తీసుకుని " ధ్యానజగత్ " కై వారి ఉద్యమంలో పాల్గొనటం నా ధ్యాన మహాభాగ్యంగా భావిస్తున్నాను.

 

- G. నాగప్రశాంతి,
బేతంచెర్ల, కర్నూలు జిల్లా

Go to top