" అతి సూక్ష్మమైన విషయాలు కూడా అలవోకగా నేర్పిస్తారు "

నా పేరు సరోజ.

మాది ఖమ్మం. 1999 ఆగస్టులో నా భార్త నలజాల నరసింహారావు గారి ద్వారా నేను ధ్యానమార్గంలోకి ప్రవేశించాను.

అంతే .. ఇక రెండవరోజు నుంచే ధ్యానప్రచారం, మూడవకన్నుతో ఇతరలోకవాసులను చూడటం, సూక్ష్మశరీరంతో షిర్డీ వెళ్ళి సాయిబాబా సమాధి మీద పడుకుని తిరిగిరావడం జరిగింది. నెలరోజులలో భౌతికశరీరానికి వున్న అన్ని రుగ్మతలు తగ్గించుకోవటం, ఫ్లయింగ్ సాసర్ను చూడటం, ప్రకృతి నుంచి, మాస్టర్స్ నుంచి సందేశాలు తీసుకోవటం అద్భుతంగా జరిగిపోయింది . దటీజ్ పత్రీజీ .

ధ్యానప్రచారం " ఖమ్మం జిల్లా " వరకే పరిమితం కాకుండా ఇతర జిల్లాలలో .. అంటే నిజామాబాద్ జిల్లా బాసర, వరంగల్, అదిలాబాద్ జిల్లా గోదావరిఖని, నల్గొండ జిల్లాలోని సూర్యాపేట, కృష్ణాజిల్లా లోని వత్సవాయి, పెనుగంచిప్రోలు, ఇంకా కొన్ని గ్రామాలలో కూడా ధ్యాన బీజాలు వేయటం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే " అమెరికా " కు మూడుసార్లు వెళ్ళి అక్కడ కూడా ధ్యానప్రచారం చేసి, అక్కడ కూడా ఎన్నొ అనుభవాలు పొందటం మరో ఎత్తు. " అమెరికాలో అగ్గిరాజేసి వచ్చింది " అని పత్రీజీతో అనిపించుకోవడం నాకెంతో ప్రయమైన ప్రశంస. మరి నేను " పాత్రధారి " అయితే " సూత్రధారి " ఆయనే కదా, దటీజ్ పత్రీజీ.

ఇవన్నీ " ఒక సాధారణ గృహిణి " చేసిందంటే దానికి కారణం ధ్యానం మరి పత్రీజీ సాంగత్యం మాత్రమే. ఎక్కడ నేను ప్రచారం చేయటానికి వెళ్ళినా, ఏ పని చేస్తున్నా నన్ను తమ కంటిపాపలా చూసుకుంటూ, తోడుగా, నీడగా నిలుస్తూ, వెన్నంటి నాకు ఎంతో ప్రోత్సాహం అందిస్తూన్న బ్రహ్మర్షి పత్రీజీ కి అనంతకోటి ధ్యాన వందనాలు. అంతటి గురువును పొందటమే అదృష్టం. అదృష్టం అంతా పిరమిడ్ మాస్టర్స్ దే " ధ్యానం " అంటే " పత్రీజీ " .. " శ్వాస " అంటే " పత్రీజీ " నే గుర్తుకువస్తారు. ఇలా తనే " శ్వాస " అయి అందరికీ ఊపిరిని అందిస్తూ పుడమితల్లిని పులకరింపచేస్తున్నారు. దటీజ్ పత్రీజీ.

2002 అక్టోబర్‌లో మొట్టమొదటగా ఖమ్మంజిల్లా అన్నపురెడ్డిపల్లి గ్రామంలో ప్రసిద్ధ " వేంకటేశ్వరస్వామి గుడి " లో 200 మందితో ధ్యానం చేయించాం. " ధ్యానం చేస్తే వర్షం కావాలంటే పడుతుందా ? " అని వాళ్ళు అడిగిన ప్రశ్నకు జవాబుగా నేను " తప్పకుండా పడుతుంది " అన్న సంకల్పం వారితో చెప్పించి వెంటనే పత్రీజీని తలచుకుని ధ్యానం చేయించాను. కొద్దిసేపటికే ధ్యానం చేస్తున్న వారిపై వర్షం పూలజల్లుగా పడటం మరి ఆ ప్రాంతమంతా చప్పట్లతో మారుమ్రోగిపోవటం జరిగింది. దటీజ్ పత్రీజీ.

2000 అక్టోబర్‌లో నా భర్త నరసింహారావు గారి ఆరోగ్యం క్షీణించటం మరి రెండు కిడ్నీలు పనిచేయకపోవటం వలన నేను హైదరాబాద్‌లో సంవత్సరం పాటు వుండటం మరి 2001 అక్టోబర్ 11 న తిరిగి ఖమ్మం రావటం జరిగింది. దానికి పదిహేనురోజుల ముందు ఒకరోజు రాత్రి నిద్రపోతూ వుండగా మధ్యరాత్రి దిగ్గునలేచి కూర్చున్నాను. జరిగినదంతా నెమరు వేసుకున్నాను. నేను ఒక పెద్ద మీటింగ్‌కు వెళ్ళినట్లు, అక్కడంతా పెద్ద పెద్ద మాస్టర్స్‌ని చూసినట్లు, మీటింగ్‌లో పాల్గొని తిరిగి వస్తూంటే పత్రిసార్ పిలిచి " ఇక్కడ నీకు పని అయిపోయింది కదా, ఖమ్మం వెళ్ళి అక్కడ చూసుకో " అన్నారు. అంతే, ఆ రోజు నుంచి ఇక ఈ రోజు వరకు నేను గురువాజ్ఞగా " ఖమ్మం జిల్లా " కు నా ధ్యాన సేవలు అందిస్తున్నాను.

ఈ క్రమంలో " ఖమ్మంలో పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్మెంట్కి ఒక అధికారిక కార్యాలయం వుంటే బాగుంటుంది " అని సంకల్పం చేసుకున్నాను. ఆశ్చర్యకరంగా నేను ఈ సంకల్పం చేసుకోగానే .. ధ్యాన కార్యక్రమాలతో పెద్దగా అనుబంధం లేకుండా .. పక్కా వ్యాపార దృక్పథంతోనే వుండే మా నాన్నగారు శ్రీ గుత్తా కృష్ణముర్తిగారు .. తానే స్వయంగా .. గజం సుమారు 25,000|- ధర పలికే తన స్థలంలో " ఆఫీస్ కట్టుకోండి " అంటూ అనుమతినివ్వడం నిజంగా ఒక మహాద్భుతం.

" కల్లగురుడు గట్టు కర్మచయంబు .. ఉత్తముండు గట్టు యోగసామ్రాజ్యము " అని " వేమన మహాకవి " అన్నట్లు .. నా తండ్రి మదిలో " పిరమిడ్ ఆఫీస్‌కి స్థలం ఇవ్వాలి " అన్న ఆలోచన కలిగించిన ధ్యానజగత్ మహానిర్మాణకర్త " బ్రహ్మర్షి పత్రీజీ " .. ఆ తరువాత్తరువాత కూడా ఆఫీస్ నిర్మాణ క్రమంలో ఎన్నెన్ని విధాల నాకు సహాయం చేసారో .. మాటల్లో చెప్పలేను. ఖమ్మం జిల్లాలోని అందరు మాస్టర్ల సహాయసహకారాలతో మరి పిరమిడ్ ఇంజనీర్ వెంకటేష్ గారి అద్భుత రూపకల్పనతో స్థానిక నెహ్రూనగర్‌లో తొమ్మిదిరంగుల " 108 పిరమిడ్స్, 20’x20’ మెడిటేషన్ హాల్ " మరి చక్కటి గ్రంథాలయంతో కూడిన 10’x20’ ఆఫీస్ అద్భుతాలకే అద్భుతంగా అతితక్కువ సమయంలో నాలుగులక్షల వ్యయంతో కట్టబడడం జరిగింది. దటీజ్ పత్రీజీ.

ఏప్రిల్ 26, 2010 న పత్రీజీ తమ దివ్యహస్తాలతో ఆఫీస్‌కు ప్రారంభోత్సవం చేసి " మేడమ్, మీరు ఒకప్పుడు కేర్ సెంటర్ పెట్టి నన్ను పిలువలేకపోయానని చాలా బాధపడ్డారు కదా. ఇప్పుడు ఈ ఆఫీస్ మీకొక ‘ గిఫ్ట్ ’ .. అందుకే దీన్ని ప్రారంభించడానికి నేను ఇక్కడికి వచ్చాను " అన్నారు. అంతే నేను ఎంతగా సంబరపడిపోయానో .. నా తండ్రి ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎంతగా గుర్తుపెట్టుకుంటారో కదా, దటీజ్ పత్రీజీ.

2006 .. తిరువణ్ణామలైలో ధ్యానయజ్ఞం జరిగినప్పుడు ఖమ్మం నుంచి అక్కడకు ఉదయమే చేరిన నాకు పత్రీజీని కలవటం కుదరలేదు. మధ్యాహ్నం భోజనం చేద్దామని మొదలుపెట్టగానే " పత్రిసార్ దగ్గరకు వెళ్ళి కలవలేదు. ఆయన చుట్టూ ఎప్పుడూ చాలమంది ఉంటున్నారు. డిస్టర్బ్ చేయటం ఎందుకు ? " అని ఊరుకున్నాను. కానీ " ఆయన్ని చూడకుండానే భోజనం చేయాల్సివస్తోంది " అని ఒక్క క్షణం బాధపడ్డాను. వెంటనే పత్రీజీ నా ముందు ప్రత్యక్షమయ్యారు. ప్రక్కన వున్న తమ చిన్ననాటి స్నేహితునికి నన్ను పరిచయం చేస్తూ " ఈవిడ ఖమ్మం జిల్లాను చూసుకుంటారు " అని చెప్పారు. సార్‌ని చూసి ఎంత ఆనందపడ్డానో ; అప్పుడు తృప్తిగా భోజనం చేశాను. దటీజ్ పత్రీజీ.

2006 లో, భద్రాచలంలో,జరిగిన మూడురోజుల యజ్ఞంలో " సరోజా మేడమ్ మూడవకన్ను మాస్టర్ ; ఆవిడ చాలా కష్టపడి దాన్ని సాధించుకున్నారు " అని చెప్పారు.

పత్రీజీ ..

" తండ్రి " గా నా జీవితాన్ని ఎంతో తీర్చిదిద్దారు.
" తల్లి " గా ఎన్నోసార్లు అన్నం పెట్టారు ;
నన్ను తన కడుపులో దాచుకున్నారు.
" గురువు " గా ఎంతో జ్ఞానాన్ని అందించారు.
" స్నేహితుడి " గా నా కష్టసుఖాలలో పాలుపంచుకున్నారు.
" దైవం " గా నా ఆత్మలో కొలువయ్యారు.

ధ్యానంలోకి వచ్చిన పదిహేను ఇరవైరోజుల తర్వాత ఒకరోజు ధ్యానంలో కూర్చున్నప్పుడు " పట్టుపట్టగరాదు " అంటూ పద్యం వినిపిస్తోంది. " ఎవరు పాడుతున్నారు ? " అనుకున్నాను. నాలుగునెలల తరువాత పత్రిసార్ను భౌతికంగా మొదటిసారి చూడటం మరి ఆ రోజు ఈ పద్యం సార్ పాడటం నీకెంత సంతోషం వేసిందో. ఆయన్ని చూడకముందే మా ఇంట్లో తిరుగుతూ వారు నాతో మాట్లాడేవారు. చూసిన తరువాత " ఎన్నో జన్మలుగా సార్ నాకు తెలుసు " అనిపించింది. దటీజ్ పత్రీజీ .

1999 లో ఒకరోజు ఒక గంట ధ్యానం చేసిన తరువాత అంతకుముందు ఎందుకో కుండీలో వున్న ఒక చెట్టు ఎండిపోయి వుంటే చూసి దానిని ప్రేమగా నిమిరాను. వారం రోజులకల్లా ఐదు పెద్ద పెద్ద ఆకులతో అది కళకళలాడుతూ తయారైంది. " చెట్టును ప్రేమతో నిమిరితే .. చిగురించటం ఇలా నిజంగా జరుగుతుందా ? " అని ఇంకా కాస్త సంశయంతోనే ఉన్నప్పుడు నా చేతికి ఒక పుస్తకం దొరికింది. మరి దానిలో ఒకచోట " ప్రేమతో దేనినైనా సాధించవచ్చు ; చనిపోయిన చెట్టును అయినా సరే .. దానిని ప్రేమతో నిమిరితే అది బ్రతుకుతుంది ; ప్రేమకు అంత శక్తి వుంది " అని పత్రీజీ సందేశం వుంది. దాంతో నా అనుమానం పటాపంచలయింది. దటీజ్ పత్రీజీ.

1999 లో ఒకరోజు " తులసీదళం " పుస్తకం నా చేతికి అందింది. దాన్ని అపురూపంగా చదివాను. అది ఒక గొప్ప " నిఘంటువు " లా అనిపించింది. " ఆ పుస్తకంలో ఉన్నవి అన్నీ పరమసత్యాలే ". ఒక జీవితాన్ని సంస్కరించుకోవాలంటే ఇంతకంటే వేరే సందేశాలు లేనేలేవు. " అల్టిమేట్ ఇదే " అనేవిధంగా అనిపించింది.

అలాగే ఒకరోజు " తులసీదళం " పుస్తకం చదివిన తరువాత టేబుల్ మీద పెట్టి నిలబడ్డాను. ఆ పుస్తకం మీద వున్న పత్రిసార్ ఫోటో నుంచి సార్ నాతో మాట్లాడుతున్నారు. ఒకే ప్రాణంగా వున్న స్నేహితులు మాట్లాడితే ఎలా వుంటుందో అలా అనిపించింది. నాకు సార్ ఆ సమయంలో కృష్ణుడిలా కనిపించారు.

పిరమిడ్ మాస్టర్స్ పత్రీజీ గురించి మాట్లాడినప్పుడు అందరిదీ ఒకటే అభిప్రాయం " పత్రీజీ నా స్వంతం " అన్నట్లుగా మాట్లాడుతారు. అదే పత్రీజీ స్పెషాలిటీ. " అద్దం " లా వుంటారు ఆయన ; ఆయన నుంచి ఎంతో నేర్చుకోవాలి. దటీజ్ పత్రీజీ.

2003 లో మంగళగిరిలో ఒకసారి " పౌర్ణమి ధ్యానానికి " వెళ్ళినప్పుడు అక్కడ గుట్ట మీద క్లాస్ జరిగింది. " ఖమ్మం వాళ్ళందరూ స్టేజీ మీదకు రండి " అని పత్రీజీ పిలిచారు. " పదినిమిషాలు చంద్రునికేసి చూడండి " అని చెప్పారు. నేను కూడా అలా చూస్తూండగా మరునిమిషంలో మహాద్భుతం కనిపించింది. ఆకాశం అంతా నిండి వున్న నరసింహస్వామి ఆయనలో ఆక్రమించి పత్రీజీ నింగి, నేల కలుపుతూ ఉన్నంత పెద్దగా .. నా భౌతికమైన కళ్ళతో చూశాను. అందరూ పానకాలస్వామిని చూడటానికి గుడికి వెళ్తే నేను ఆ పానకాలస్వామిని పత్రీజీలో చూశాను. దటీజ్ పత్రీజీ.

మూడవసారి అమెరికా నుంచి 2009 నవంబర్‌లో ఖమ్మం తిరిగి రాగానే నా భర్త నరసింహారావు గారికి మళ్ళీ సీరియస్ అయ్యి హాస్పిటల్లో చేర్పించాం .. అప్పుడే ఖమ్మంలో జాతీయస్థాయి పుస్తకప్రదర్సన జరుగబోతోందని తెలిసి దానిలో మన పిరమిడ్ స్టాల్ కూడా పెట్టాలని సంకల్పం జరిగింది. దానికి సంబంధించిన పనులు చూడటం .. హాస్పిటల్లో నుంచే పుస్తకాలు ఫోన్ ద్వారా చెప్పి తెప్పించుకోవడం .. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి తొమ్మిదిరోజులపాటు బుక్ ఫెస్టివల్లో స్టాల్ నడిపి Rs. 70,000 మన సొసైటీ పుస్తకాలు అమ్మటం చేసాము.

హాస్పిటల్లో పరామర్శించడానికి వచ్చే బంధువులనూ, తెలిసినవారినీ నేను నవ్వుతూ రిసీవ్ చేసుకోవటం చూసి .. " సీరియస్‌గా ఉందన్నా నువ్వు నవ్వుతూ ఎలా వున్నావు ? " అని వాళ్ళంతా ఆశ్చర్యపోవటం జరిగింది. " మనం చేయాల్సిన పని చేస్తూ వుంటే .. జరగాల్సినవన్నీ వాటంతట అవే జరుగుతూనే వుంటాయి " అన్న ప్రాథమిక అవగాహన మనలో వుంటే చాలు ఏ స్థితినైనా నిబ్బరంగా ఎదుర్కోవచ్చు " అని ఆచరణ ద్వారా మనకు తెలియజేస్తారు పత్రీజీ. 2006 డిసెంబర్ 21 న మాతృమూర్తి సావిత్రీదేవి అమ్మగారు దేహత్యాగం చేసినప్పుడు ఎంతో నిబ్బరంగా స్థితప్రజ్ఞతతో పత్రీజీ 24 నుంచి 31 వరకు షిర్డిలో " ధ్యానయజ్ఞం " అద్భుతంగా జరిపి మనందరికీ ఆదర్శప్రాయులైనారు. దటీజ్ పత్రీజీ.

2009 డిసెంబర్లో శ్రీశైలం ధ్యానయజ్ఞంకు ముందు నరసింహారావు గారికి మళ్ళీ సీరియస్ అయితే హాస్పిటల్లో జాయిన్ చేసాం .. హాస్పిటల్లో సిబ్బందితో ధ్యానం చేయిస్తూ .. అక్కడి నుంచే ప్రతిరోజూ ధ్యానయజ్ఞానికి వచ్చేవారి కోసం జిల్లా అంతా ఎలర్ట్ చేసి అన్నిచోట్ల నుంచి పది బస్సులు వేసి యజ్ఞానికి తిసుకువెళ్ళగలిగాం. ఎన్ని పనులున్నా సరే వాటిని అవలీలగా చేయటం .. జిల్లా నుంచి 1000 మంది క్రొత్తవారిని శ్రీశైలం తీసుకురావటం .. మరి వారికి కావలసిన వసతి ఏర్పాట్లన్నీ సక్రమంగా చేసుకోవటం .. మరి ఇదంతా హాస్పిటల్‌నే .. ఒక పిరమిడ్ ఆఫీస్‌లా చేసుకుని అక్కడి నుంచే వ్యవహారాలు నడపడం మా టీమ్కీ మరి హాస్పిటల్ సిబ్బందికి విచిత్రంగా అనిపించింది. ఇంత సహనం, ఇంత ఓర్పు .. ఇదంతా నేను పత్రీజీ నుంచే నేర్చుకున్నాను. ఆయన నోటి నుంచి ఏ మాట వచ్చినా వజ్రంలాగా వుంటుంది. పత్రీజీ మాట్లాడే ప్రతిఒక్క మాటా ఎన్నో సమాధానాలు చెప్పేలా వుంటుంది. పత్రీజీ మాట్లాడిన మాటలు మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటాను. అంత అద్భుతంగా ఇంకెవరూ మాట్లాడలేరు .. ఆయన తప్ప. దటీజ్ పత్రీజీ.

2000 సంవత్సరంలో ఒకసారి పత్రిసార్ ఖమ్మం వచ్చినప్పుడు సార్ కోసం పెసరగారెలు చేసుకుని వెళ్ళాను. అప్పుడు సార్ గారె తిసుకుని తింటూ " ఉప్పు తక్కువ వేశావు " అన్నారు. నేను " మా వారికి B.P వుంది. అందుకే తక్కువ వేశాను " అని చెప్పాను. సార్ వెంటనే " ఇవి ఎవరికోసం చేశావు ? " అన్నారు. " మీ కోసమే సార్ " అన్నాను. " మరి నాకు B.P లేదుగా, " అన్నారు. నేను చేసిన పని నాకు అర్థమైంది. ఇది చాలా చిన్న విషయం అనిపిస్తుంది కానీ నాకు అందులో చాలా పెద్ద విషయం అర్థమైంది " బావిలో కప్పలాగా కాదు, మొత్తం ప్రపంచాన్ని చూడు " అన్నట్లు అర్థమై నాకు దిశానిర్దేశం చేసినట్లు అనిపించింది. ఇలా ఎంతో సూక్ష్మమైన విషయాలు కూడా చాలా అలవోకగా నేర్పిస్తారు. అలా ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు నడుస్తూ ఇప్పుడు గగనానికి ఎగిరే గరుడపక్షిలా తయారయ్యాను. దటీజ్ పత్రీజీ.

ప్రతి పనిలో కూడా " ఈ పని ఎలా ? " అనుకున్నప్పుడు ఎక్కడికక్కడ అంకితభావంతో ఆ పనిని అద్భుతంగా మలచి .. మనతో చేయించడం ఒక్క పత్రీజీకే చెల్లుతుంది.

ప్రతి సంవత్సరం ధ్యానయజ్ఞాలకు వచ్చేవారిని తిసుకువచ్చి .. అంతా అయ్యాక మళ్ళీ ఇంటికి చేరేవరకు వారి బాగోగులు చూసుకోవటం, ఇంతమంది అసంఖ్యాకంగా శిష్యులను తయారు చెయ్యటం .. ప్రపంచమంతా సుడిగాలిగా చుట్టిరావటం .. ఇన్ని ధ్యానయజ్ఞాలు, మరెన్నో ధ్యాన కార్యక్రమాలు నిర్వహించటం, లక్షలాదిగా పిరమిడ్లను నిర్మింపజేయడం ఒక్క పత్రీజీకే చెల్లుతుంది.

నా భర్త నరసింహారావు గారు అనారోగ్యం వల్ల 2000 సంవత్సరం నుంచి మొన్న మొన్నటివరకు కూడా ఎన్నోసార్లు హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటే మాకు ఎన్నోరకాలుగా తోడుగా, నీడగా పత్రీజీ సహాయం చేశారు. మరి మాతో మేం చేయాల్సిన జన్మకారణ కార్యాలన్నీ చేయించేస్తున్నారు .. మళ్ళీ మేము తిరిగిరాని అవసరం లేకుండా, దటీజ్ పత్రీజీ.

థాంక్యూ పత్రీజీ, మమ్మల్ని ఎంతో తరింపజేస్తున్నారు. " ఈ భూమి మీద పత్రిసార్ అంతటి గురువు లేడు. పిరమిడ్ మాస్టర్స్ అంతటి శిష్యులు లేరు. "

 

- N. సరోజ,
ఖమ్మం
సెల్ : +91 8019317995

Go to top