" ధ్యాన సంగీత ప్రచారంతో నా జన్మ ధన్యమైంది "

నా పేరు ప్రసాదరావు. ఇంటిపేరు పిప్పళ్ళ.

2003 లో నేను పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మూవ్మెంట్ లోకి వచ్చాను. అప్పటికి పదిహేను సంవత్సరాలుగా శ్రీ షిర్డీసాయి భజన్స్ చేస్తున్నాను. నా మొదటి పరిచయంలోనే బ్రహ్మర్షి పత్రీజీలో షిర్డీసాయిని దర్శించాను. తరువాత ధ్యానంలో ఎన్నో అనుభవాలు పొందుతూ బ్రహ్మానందాన్ని పొందుతున్నాను.

ఏడు సంవత్సరాలుగా ధ్యానప్రచారం చేస్తున్నాను. మరి ముఖ్యంగా చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ప్రాణం. వేణువులో డిప్లొమో చేసి కీబోర్డ్, తబలా, జాజ్, పేడ్స్ మొదలైన వాయుద్య పరికరాలతోపాటు గాత్రం కూడా నేర్చుకుని ఉండటంతో ధ్యాన ప్రచారంలో నాకు ఒక చక్కని విశిష్టమైన స్థానం లభించింది.

కొంతమంది కళాకారుల సహకారంతో నేను ఆంధ్రరాష్ట్రంలోని ప్రతి గృహంలోనూ, ప్రతి పట్టణంలోనూ మరి ఇతర రాష్ట్రాలలోనూ ధ్యాన ప్రచారం చేస్తున్నాను. శ్రీశైలం ధ్యానమహాయజ్ఞానికి గుంటూరు జిల్లాలో నాలుగు నెలలు ప్రతి గృహంలోనూ ప్రచారం చేసి పత్రీజీ యొక్క ఆశీస్సులు పొంది ఈ మధ్య షోలాపూర్లో జరిగిన మూడు రోజుల ధ్యానమహాయజ్ఞంలో కార్యక్రమం చేసి మరింత ధ్యాన ఆనందాన్ని పొందాను.

" ప్రతి పిరమిడ్ మాస్టర్ తప్పనిసరిగా ఒక పిరమిడ్ నిర్మించి ప్రపంచానికి అంకితం ఇవ్వాలి " అంటూ వుంటారు పత్రీజీ. గురువు గారి మాట ప్రకారం భీమవరంలో మంచి సెంటర్లో స్థలం కొని పిరమిడ్ నిర్మించాను. పత్రీజీ సహృదయంతో ఏప్రిల్ 23 వ తేదీ ఉదయం 11.00 గంటలకు ప్రారంభించి " విశ్వశాంతి పిరమిడ్ " ను ప్రపంచానికి బహుమతిగా ఇచ్చారు. అదే రోజు ఆరు జిల్లాల పిరమిడ్ మాస్టర్లు రావడం మరి వారికి నా మీద వున్న ప్రేమను గ్రహించాను. వచ్చిన పిరమిడ్ మాస్టర్లచే పలుమార్లు " ధ్యానరత్న పిప్పళ్ళ ప్రసాద్రావు " అనిపించారు పత్రీజీ.

ఆ తరువాత " ధ్యానమహాచక్ర " కార్యక్రమానికి ఇప్పటినుంచే ప్రచారం మొదలుపెట్టమని చెప్పడంతో నా బాధ్యత ప్రకటితమైంది. నా కుటుంబం పూర్తిగా " ధ్యానకుటుంబం " అయింది. కొన్ని జిల్లాలలో " పత్రీజీ కార్యక్రమానికి కొంత సమయం ముందు నా సంగీత కార్యక్రమం జరగడం ఎన్నో జన్మల పుణ్యఫలం " అనిపిస్తుంది. ఈ ధ్యానాన్ని పరిచయం చేసిన శ్రీ తటవర్తి రాఘవరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

పిరమిడ్ ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని పొందిన " తల్లీ గోదావరి ", " ధ్యాన రంజని " పాటల ఆల్బమ్ చేయడం నా మహా అదృష్టం.

 

- పిప్పళ్ళ ప్రసాద్రావు,
భీమవరం
ఫోన్ : +91 9440377555

Go to top