" గర్భంలో ఉన్న బిడ్డతో నేను కమ్యూనికేట్ చేయగలిగాను "

 

నా పేరు లక్ష్మీ కమల.
ముందుగా మనందరికీ ఇంత గొప్ప బంగారు బాటనూ, మోక్షమార్గాన్నీ ప్రసాదించిన బ్రహ్మర్షి పత్రీజీకి నమస్సుమాంజలులు. వారి ఆదేశాన్ని అనుసరించి నేను నా ధ్యానానుభవాలను తెలియపరుస్తున్నాను.

ధ్యానంలోకి రాకముందు నేను చాలా పూజలు చేస్తూ.. ’ భగవంతుడు ’, ’ భక్తి ’ .. అని నిరంతరము దైవచింతనతో భగవంతునిలో లీనం అవ్వాలని కోరుకుంటూ ఎప్పుడూ దేవుడి ముందు కూర్చుని స్తోత్రాలూ, పూజలూ గంటలు గంటలు చేసేదాన్ని. అయితే అవి చేసినప్పుడు ఉన్న ఆనందం ఆ తరువాత ఉండేది కాదు. ఏదో తెలియని వెలితి, బాధ . ఏదో కావాలి, ఏదో లేదు .. ’ అది ’ ఏమిటో తెలియదు.

నాకు అన్నీ వుండేవి డబ్బు, ఇల్లు, కార్లు .. అమెరికాలో మా వారికి మంచి సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా మంచి ఉద్యోగం. మాకు లేనిదంటూ ఏమీలేదు .. అయినా తెలియని అంతులేని బాధ నా అంతరంగమంతా నిండి ఉండేది. సంతోషం లేదు , ఒక్కోసారి దేవుడి ముందు కూర్చుని గట్టిగా ఏడ్చేదాన్ని.

2007 లో మా అమ్మ ఏలూరులో ధ్యానానికి వెళ్తూ .. నాకు కూడా ధ్యానం గురించి ఎంతో చెప్పారు. నేను మొదట అజ్ఞానంతో .. “ ధ్యానం అంటే దేవుడికి దూరమైపోతామేమో ?” అనుకునేదాన్ని. కానీ మా అమ్మ రోజూ చెప్తూ ఉంటే “ ఇక సరేలే , అమ్మ చెప్తోంది కదా మంచిది కాకపోతే ఇన్నిసార్లు ఎందుకు చెప్తుంది ?” అని రోజూ సాయంత్రం దేవుడి దగ్గర దీపారాధన చేస్తూ .. ఒక అరగంట ధ్యానంలో కూర్చునేదాన్ని.

కానీ చాలా సందేహాలు ఉండేవి . అంతలో సాయి, సుశీల గార్లు అక్కడే అమెరికాలో పరిచయమై .. 2008 ఉగాది రోజున మా ఇంటికి వచ్చి.. నా సందేహాలన్నీ చాలావరకు తీర్చి, కలిసి ధ్యానం చేశాం . ఆరోజు నుంచి పూర్తిగా మా కుటుంబం ధ్యాన కుటుంబం అయ్యింది.

వెంటనే నేను 40 రోజులు ధ్యానం చేసాను. నాలోకి కాస్మిక్ ఎనర్జీ రావడంతో నేను ధ్యానంలో చాలా ఆనందాన్ని పొందడం జరిగింది. తలలో బ్రహ్మరంధ్రం నుంచి గొంతులోపలి వరకు ఎనర్జీ ప్రవహించడం మరి నా తలపైన అయస్కాంతం పెట్టినట్లు ఉండడం .. నాకు చాలా మంచి అనుభూతిని కలిగించాయి. నాలో ఇంత వరకు ఉన్న ఏదో తెలియని వెలితి, బాధ అన్నీ మంచులా కరిగిపోయి .. ధ్యానం రోజూ చేస్తూ వుంటే .. “ నాకు కావలసింది ఖచ్చితంగా ఈ ఆనందమే “ అనిపించింది.

“ సరే , ఇంత గొప్ప ధ్యానం .. నాకు రెండవ సంతానాన్ని కూడా ఇస్తే బాగుండును “ అని సంకల్పం పెట్టుకుని మాంసాహారం మానేసి 3,4 నెలలు బాగా ధ్యానం చేసి .. గర్భవతిని అవ్వగలిగాను. అయితే డాక్టర్ దగ్గర గర్భం నిర్ధారణ కాగానే మాంసాహారం తినడం మళ్ళీ మొదలు పెట్టేసాను.

తరువాత డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏడు వారాల స్కానింగ్ లో బిడ్డకు హార్ట్ బీట్ లేక బిడ్డ కదలిక ఆగిపోయిందని గర్భస్రావం చేసారు. ఇంటికి వచ్చి బాగా ఏడ్చి ధ్యానంలో కూర్చున్నాను. “ ధ్యానం చేసి మాంసాహారం మానేస్తేనే కదా గర్భం వచ్చింది, మరి మాంసాహారం తినబట్టే ఇలా అయ్యింది “ అని నాలోంచి సందేశం వచ్చింది.

అయితే “ ఈ సందేశం నిజమే అయితే మళ్ళీ నెల వరకు నేను గర్భవతి అవ్వాలి “ అనుకున్నాను. ఖచ్చితంగా రెండవ నెలకల్లా నేను మళ్ళీ గర్భవతిని అయ్యాను . ఇక అప్పటినుంచి అందరం పూర్తిగా మాంసాహారం మానేసాం. గర్భంతో ఉన్న తొమ్మిది నెలలు నేను ధ్యానంలో కూర్చుని బిడ్డతో బాగా కమ్యూనికేట్ చేసేదాన్ని. ఈ అనుభవం నా జీవితంలో నిజంగా అద్భుత విజయం.

తొమ్మిది నెలల్లో మూడు సార్లు “ మాంసాహారం తినాలి “ అని నాకు కోరిక కలిగినప్పుడు .. మూడుసార్లు కూడా అసహ్యం, జుగుప్స, కలిగేలా “ వాటి రక్త మాంసాలను మనం పీక్కుని తింటున్నట్లు “ నాకు కలలు వచ్చేవి.

ధ్యానం లోకి వచ్చేముందు మాంసాహారం మానలేకపోయినా ధ్యానం మొదలు పెడితే మాత్రం ఆ ధ్యానమే మనకు “ సత్యానుభూతి “ కలుగచేస్తుంది మరి మనల్ని అహింసాపరులుగా మార్చి పాప కర్మలనుంచి విమక్తుల్ని చేస్తుంది.

ఏడవ నెలలో అమెరికా రావడానికి మా అమ్మ గారికి వీసా రిజెక్టు అయ్యి “ ఆవిడ రాలేదు “ అని తెలిసింది. ఆ రోజు రాత్రి చాలా బాధగా పడుకున్న నాకు నిద్రపడుతూ ఉండగా .. ఎవరో నా ఎడమ చెంపపైన పెద్ద అరచేయి వేసినట్లు స్పష్టంగా తెలిసింది. కళ్ళు తెరిచి చూస్తే .. ఎవ్వరూ లేరు. కానీ పక్క అంతా చాలా కదిలినట్లయి కడుపులో ఉన్న బిడ్డ గిర్రున సుడిగాలిలాగా తిరగడం జరిగింది. ఆ తరువాత నాలుగు రోజుల వరకు నా ముఖం చెప్పలేని కాంతితో మెరుస్తూ .. నాలో ఎంతో ఎక్కువ ఎనర్జీ నిండిపోతున్నట్లుగా ఫీలయ్యాను. “ మీ అమ్మ రాదని బాధపడవద్దు. మేమందరం ఉన్నాం నీకు , అంతకన్నా అన్నీ బాగా జరుగుతాయి “ అని నాకు ఎవరో చెప్తున్నట్లుగా స్పష్టంగా అనిపించింది.

నిజంగానే 2009 ఆగస్టు 26న బాబు పుట్టాడు . ఏ బాధా లేకుండా అన్నీ చాలా బాగా జరిగాయి. బాబు పేరు కూడా డెలివరీకి ముందు తానే చెప్పాడు .. “ జ్ఞాన్ యోగేశ్ “ అని.

ఆ పుట్టిన బాబుని తీసుకుని 2010 జూన్ లో పత్రీజీని చూడాలని ఇండియా వచ్చి .. ఆయన్ని కలిసినప్పుడు సార్ మమ్మల్ని “ ఇండియా వచ్చి .. బెంగళూరులో స్ధిరపడండి “ అన్నారు.

“ సార్ ! మాకు అమెరికాలో బాగా ధ్యాన ప్రచారం చెయ్యాలని వుంది “ అని చెప్పితే .. “ అవసరం లేదు ! పొలం నీటితో తడపాలంటే పొలమంతా తిరిగుతూ నీళ్ళు జల్లుతామా , ఒక ప్రక్క పైపు పెడితే అదే తెల్లారేసరికి తడుస్తుంది. అలా మనం ఇండియాలోనే ఉండి పైప్ ఫోర్స్ ఎక్కువ పెడదాం వచ్చేయండి “ అన్నారు.

2011 జూన్ లో బెంగళూరు వచ్చి స్ధిరపడి ధ్యానప్రచారం చేస్తున్నాం. నా ద్వారా ఈ విశ్వానికి ఏం జరగాలో అదంతా జరగడానికి నా ఈ జీవితాన్ని అంకితం చేస్తూ ..


- లక్ష్మీ కమల పూర్ణచంద్రరావు,
బెంగళూరు
సెల్ : +91 9686515947

Go to top