" ఒడిలో బిడ్డను వుంచుకుని ఊరంతా వెదికినట్లు "

 

నా పేరు లక్ష్మీ సుందరి.

మా వారు S. త్రిమూర్తులు .. పోలీస్ డిపార్ట్ మెంట్ లో D.S.P. గా పనిచేస్తున్నారు. పిల్లలంతా డాక్టర్ లూ, ఇంజనీర్లు దేనికీ ఏ లోటూ లేని సంసారం నాది , ఇంట్లో అందరం ఆనందంగానే ఉంటాం.

కానీ .. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తుంటే .. నాకు ఏదో వెలితి, ఏదో తెలియని బాధ అనిపించేది. అందరి ఆలోచనా విధానం చాలా తేడాగా అనిపిస్తూ .. అందరిలో నేను ఇమడ లేకపోయేదాన్ని. చిన్నప్పటి నుంచీ నాకు భక్తి ఎక్కువ కావడంతో ఏది జరిగినా ' భగవత్ సంకల్పం ' అని నమ్మేదాన్ని " ఆ భగవంతుడి గురించి బాగా తెలుసుకోవాలి " అనిపించి ఆరవ తరగతి నుంచే ఆధ్యాత్మిక పుస్తకాలు, భక్తికధలు, గొప్పవ్యక్తుల జీవిత చరిత్రలు చదివేదాన్ని.

1995వ సంవత్సరం " S.S.Y " లో చేరి ఆధ్యాత్మికంగా జీవించడం ఎలాగో కొంచెం అర్ధం చేసుకున్నాను. భగవద్గీత పారాయణం చేసేదాన్ని కానీ అంతగా అర్ధం కాలేదు. " ఎవరయినా ఒక గురువు ఉంటే బావుండును " అనిపించి .. సత్యసాయి దగ్గరికీ, రామకృష్ణా మఠంకూ వెళ్ళాను .. కానీ నాకు మనశ్శాంతి కలిగేలా పరిస్ధితులు అనుకూలించలేదు.

" చిన్న జీయర్ స్వామీజీ " ప్రవచనాలు చాలా నచ్చి .. ఆయన దగ్గర మంత్రోపదేశం కూడా తీసుకుని, మంత్రజపం చేసుకునే దాన్ని కానీ .. నాలో వెలితి మాత్రం తీరలేదు . గీతా పారాయణం , విష్ణు సహస్రనామాలు అన్నీ ఎంతో భక్తిగా చేసాను. కాస్సేపు మనశ్శాంతిగా .. బాగానే వుండేది కానీ మనస్సులో స్పష్టత లేక ఏదో తికమకతో, ప్రపంచం అంతా గందర గోళంగా అనిపించేది.
ఈ క్రమంలో అనుకోకుండా సంవత్సరం క్రితం " ఒక యోగి ఆత్మకధ “ పుస్తకం చదవడం జరిగింది.

" ' పూజ ', ' జపం ' కంటే .. పై స్ధాయిలో ధ్యానం అన్నది ఉంది " అని అర్ధం అయ్యింది. నేను చదివినదాన్ని బట్టి " యోగులందరూ ఇతర రాష్ట్రాలలోనే ఉన్నారు .. మన తెలుగు రాష్ట్రంలో ఎవ్వరూ లేరా ? అసలు ఆధ్యాత్మిక విషయాలు తెలియాలంటే కొంచెం భాషాపరిజ్ఞానం కూడా ఉండాలి. మన తెలుగు అయితే బాగా అర్ధం అవుతుంది. " అని బాధ పడ్డాను.

అనుకోకుండా, సంవత్సరం క్రితం కాకినాడలో ఉన్న మా కజిన్ " అడబాల శ్రీనివాస్, స్వర్ణలత " ఇంటికి వెళ్ళడం జరిగింది. అప్పుడు వాళ్ళు " ధ్యానం " గురించీ, పిరమిడ్ గురించీ చెప్పారు. అది విని నేను ఎంతో ఆశ్చర్యపోయాను. " ఒడిలో బిడ్డను ఉంచుకుని ఊరంతా వెతికినట్లు .. నా బంధువుల్లోనే ధ్యాన యోగులు ఉండగా సమయం వచ్చే వరకు నేను గుర్తించలేక పోయాను " అనుకున్నాను.

అప్పట్లో నేను తలనొప్పితో చాలా బాధపడేదాన్ని. శ్రీనివాస్ వాళ్ళు వాళ్ళ ఇంటిపై ఉన్న " విశ్వశాంతి పిరమిడ్ " లో నన్ను ధ్యానం చెయ్యమని చెప్పారు. అలా నేను మొదటి సారి అక్కడ ధ్యానం చేసాను. ఆశ్చర్యంగా నా తలనొప్పి క్షణాల్లో తగ్గిపోయింది . " ఒక్కరోజు ఉండి వెళ్దాం " అనుకున్నదాన్ని .. వాళ్ళింట్లో వారం రోజులు ఉండి పోయాను. " ' పౌర్ణమి ధ్యానం ' ఇంకా బావుంటుంది " అని నాతో చేయించారు. ఆ రోజు అక్కడికి వచ్చిన ధ్యానం మాస్టర్ " నడింపల్లి పద్మ " గారితో జరిగిన సత్సంగం నాకు ఎంతో చాలా బాగా నచ్చింది. చిన్నప్పటి నుంచి నాలో ఉన్న తికమక గందరగోళాలకు నాకు ఉపశమనం దొరికినట్లు అయ్యింది. " సృష్టిలో లోపం లేదు; మన దృష్టిలోనే లోపం వుంది. " అని అర్ధం అయ్యి .. చాలా సంతోషంగా ఇంటికి వచ్చాను.

మా వారితో అన్ని విషయాలు చెప్పి తర్వాత కొన్నాళ్ళకు అమరావతిలో " ధ్యానమహాచక్రం " జరుగుతుందని తెలిసి, " రెండు రోజులు చూసి వచ్చేస్తాను " అని అమరావతికి వెళ్ళాను.

అక్కడ పత్రీజీ రోజుకో విషయం అరటి పండు వలిచి పెట్టినంత విపులంగా, సరళంగా చెప్తూంటే .. ఎంతో ఆనందం వేసింది. నా ఆలోచనలకు సరియైన సమాధానం ఆయన మాటల్లో వింటుంటే .. " ఆ భగవంతుడే నాకు ఈ రూపంలో సమాధానాలు ఇస్తున్నాడు " అనిపించింది.

ఇక ప్రతిరోజూ ప్రాతఃకాలం ఆ ప్రశాంత సమయంలో ధ్యానం చేస్తూ పత్రీజీ వేణునాదం వింటూంటే నాకు గోకులంలో పిల్లనగ్రోవికి పరవశించి పోతున్నట్లుగా అనిపించేది. ఒకరోజు ఆ కార్యక్రమంల్లోనే .. కృష్ణానంద గురూజీ పత్రీజీ గురించి చెపుతూ .. పత్రీజీ మన దగ్గరకే వచ్చి .. మనల్ని తనంత వాళ్ళుగా తయారు చేసే గురువు అని చెప్తూంటే నేను మనస్సులో, " పత్రీజీ నాకు ఆ భగవంతుడు ప్రసాదించిన గురువే అయితే .. వారు నన్ను ఆదరించాలి, నన్ను గుర్తించాలి " అనుకున్నాను .

ఆశ్చర్యంగా ఆ రోజు ధ్యానం అయ్యాక, పత్రీజీ జనం మధ్యలోంచి వెళుతూ .. ఒక ప్రక్కగా నిలబడిన నాకు షేక్ హ్యండ్ ఇచ్చి, నా భుజం మీద చెయ్యివేసారు ! " ఇక వారే నా గురువు , నేను ' జపం ' నుంచి ' ధ్యానం ' అనే పై క్లాసుకు ప్రమోట్ అయ్యాను " అని అర్ధం చేసుకున్నాను.

ప్రతి రోజూ అమరావతిలో నేను పొందుతున్న అనుభవాలూ, అనుభూతులూ మా వాళ్ళకు ఫోన్ చేసి .. చెపుతూండేదాన్ని, నా సంతోషం చూసి ధ్యానమహాచక్రం ఇంకా మూడు రోజులు ఉందనగా, .. మావారు, పిల్లలు అంతా కలిసి అమరావతికి వచ్చారు. ఒకరోజు అక్కడే అందరం కలిసి ధ్యానం చేస్తూంటే .. నేను ఎనిమిది గంటల పాటు ధ్యానంలో .. అలా ఊండిపోయాను, ఇంకా ఉండేదాన్నేమో కానీ .. ఎవరో .. నన్ను లేపేసారు.

మా వాళ్ళంతా ఆశ్చర్యపోయారు , ఎందుకంటే గతంలో నాకు ' బ్యాక్ బోన్ ' ఫ్రాక్చర్ అయ్యి .. గత కొన్నేళ్ళుగా నేను అంతసేపు అలా కూర్చోలేదు, ఆ తరువాత కూడా ఇప్పటివరకూ నాకు మళ్ళీ నడుము నొప్పి రాలేదు.

ప్రస్తుతం మేము ఇంట్లో ఒక పెద్ద పిరమిడ్ పెట్టుకుని రోజూ ధ్యానం చేస్తూ .. అందరికీ ధ్యాన ప్రచారం చేస్తున్నాం.

యాభై సంవత్సరాలపాటు అజ్ఞానంతో " నేను చాలా జ్ఞానవంతురాలిని " అనుకుంటూ బ్రతికేసాను, కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే కానీ .. నేను అజ్ఞానంతో ఎంత కళ్ళు మూసుకుని ప్రవర్తించానో నాకు అర్ధం కాలేదు.

నాలాగా ఇంకా ఎంతోమందిని ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆలోచనల ఊబి నుంచీ .. అజ్ఞాన పంకిలం నుంచీ బయట పడవేస్తున్న పరమగురువు పత్రీజీ గారికి నా ధ్యానసుమాంజలి.


- S. లక్ష్మీ సుందరి,
సికింద్రాబాద్
సెల్ : +91 9603697651

Go to top