" కల నిజమాయె "

 

నా పేరు శ్రీదేవి.

నా నివాసం నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రక్కన అక్బర్ నగర్ లో ఉన్న Dr. మంతెన సత్యనారాయణ రాజుగారి " ప్రకృతి ఆశ్రమం " దగ్గర.

ఏడు సంవత్సరాల క్రితం మా పక్కింటి బామ్మ గారింటికి మా అమ్మ ఏదో పని చెబితే వెళ్ళి అక్కడ " ధ్యానాంధ్రప్రదేశ్ " మ్యాగజైన్ చూసాను. ఒక్కొక్క పేజీ చదువుతూ ఉంటే ఏదో తెలియని బంధం. " అసలు ఎవరు ఈయన , ఎక్కడ దొరుకుతారు ? ఎలా కలవాలి ? ఎలాగైనా కలిసి తీరాలి " అనుకున్నాను. ధ్యానం చేసే పద్ధతి అందులో చదివి ఇక ధ్యానం మొదలుపెట్టాను.

కానీ ఏడు సంవత్సరాలు ఏమీ ఫలితం లేదు. ఎందుకంటే నేను మాంసాహారిని. " అయినా గురువు గారిని కలవాలి .. కలుస్తాను " అని పూర్తి నమ్మకంతో సంకల్పం పెట్టుకున్నాను.

నా సంకల్పశక్తి ఫలించి " పత్రీజీ పుట్టింది బోధన్ " అనీ, మరి " వారు అక్కడ కట్టిన పిరమిడ్ సందర్శించడానికి వస్తున్నారు "అని తెలిసి ఆలస్యం చేయకుండా ఒక పక్షిలా వెళ్ళి ఆయన ముందు వాలాను. దూరంగా నుంచుని ఆయన్ను చూస్తూంటే .. పత్రీజీ నన్ను దగ్గరకు రమ్మని పిలిచారు.

నేను వెనక్కి తిరిగి చూసాను .. నా వెనక ఎవరూ లేరు ! " ఆయన పిలిచింది నన్నా ?" .. అన్న భ్రమలో ఉన్న నన్ను .. " నిన్నే, ఇటురా " అన్నారు.

" స్వర్గంలోకి వెళుతున్నాను " అనుకుంటూ దగ్గరకు వెళ్ళాను. నా చెయ్యి తన చేతుల్లోకి తీసుకుని .. తన ప్రక్కన కూర్చోమని నాతో చాల చాల ప్రేమగా మాట్లాడారు. నిజంగా అలాంటి స్నేహితుణ్ణి నేను ఎక్కడా చూడలేదు. ఎంతోమంది గురువులనూ, స్వామీజీలనూ చూసాను, కలిసాను కానీ .. ఇంత బ్రహ్మానందం నాకు ఎక్కడా దొరకలేదు. ఆ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తే ఏదో తెలియని బంధం. “ అహం “ అనేది ఏ మాత్రం లేదు. బుద్ధుడా ? బుద్ధుడే సందేహం లేదు.

అలా ఆయనతో నా పరిచయం అద్భుతంగా జరిగింది. ఆ శక్తితో నేను మాంసాహారం వదిలి " అహింసా పరమో ధర్మః " అనే క్రొత్త బంగారులోకంలోకి అడుగుపెట్టాను.

ఇక అప్పటి నుంచి ఎన్నో అనుభవాలు అటు ప్రకృతి, ఇటు పక్షులు, జంతువులు నాకు తోడుగా నిలిచాయి. నాకు నిజమైన స్నేహితులు అంటే ఇవే. హింసను వదిలి హంసను పట్టుకున్నాను. ఇంక నాకు పట్టిందల్లా బంగారమయిపోయింది. ధ్యానం చేస్తే ఇంత ఆరోగ్యమా, ఇంత ఆనందమా, ఇందులో ఇంత విశ్వశక్తి ఉందా, ఇన్ని సంవత్సరాలు ఈ విశ్వశక్తిని అందుకోలేకపోయాను. కనీసం ఇప్పటికైనా బురదలో నుంచి బయటపడ్డాను.

నేను ధ్యానప్రచారం మొదలుపెట్టి .. హైకోర్టు జడ్జి " శ్రీ చంద్రకుమార్ " గారికి ధ్యానం నేర్పించాను. ఒక మామూలు గృహిణిని అయిన నేను .. ఇలా ఎంతో ఉన్నత స్ధానంలో ఉన్న హైకోర్టు జడ్జీకి కూడా ధ్యానం నేర్పడం అన్నది ఒక అద్భుతమే, 10-07-2011 నాడు నిజామాబాద్ లో జరిగిన కార్యక్రమానికి ఆయన వచ్చి .. పత్రీజీని కలిసి .. ఆ కార్యక్రమంలో పాలుపంచుకుని చాలా సంతోషం కూడా పొందారు.

ఎప్పుడైతే మనం ధ్యాన అహింసా మార్గంలో అడుగుపెట్టామో .. ధైర్యం, ఉత్సాహం, సహనం, మౌనం, ఏకాగ్రత వాటంతట అవే పెరుగుతాయి .. మరి ఎంత పెద్ద సమస్య అయినా చిన్నదిగా కనిపిస్తూ గొడ్డలితో కొట్టే దాన్ని గోటితో పీకేయ్యొచ్చు. చావు అంటే భయం పోయి .. " పాత చొక్కా పోతే కొత్త డ్రస్ కొనుక్కోవడం లాంటిదే .. చావు అంటే " అన్న ఆత్మజ్ఞానం వస్తుంది.

 

- శ్రీదేవి,
బోధన్, నిజామాబాద్ జిల్లా

సెల్ : +91 9581248176

Go to top