" బ్రహ్మయా? బ్రహ్మర్షియా "

 

గత ఆరు సంవత్సరాలుగా "పత్రీజీ"తో పాటు పయనం. పరిచయమైన రోజు వారు నాతో అన్న మొదటిమాట "నువ్వేమన్నా ప్రైమ్ మినిష్టరువా?" అని. అవును. పిరమిడ్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే నేను ప్రైమ్ మినిష్టరునే.

వారి వాక్కులు సుభాషితాలు. చీవాట్లు కర్మలను కరిగింపజేసే కలిమికుండలు. సలహాలు సత్య శిఖరానికి మార్గాలు. సూచనలు స్వర్గ ద్వారాలు. ఆదేశాలు ఆత్మ సాక్షాత్కారానికి దారులు.

"మారం. నువ్వు చాలా చేస్తున్నావు. నిన్ను రోడ్డుమీద చినిగిన గుడ్డలతో తిరుగుతూ ఉంటే చూడాలని ఉంది." అని ఒక సంవత్సరం క్రితం అన్నారు. అవధూత స్థితిని అనుభవించమంటున్నారని అర్ధమయి మహదానంద పడ్డాను. ఈ మధ్య మరలా, "నువ్వు ధ్యాన మార్గంలోకి వచ్చిన తరువాత వ్యాపారం చేసి డబ్బు పోగుట్టుకున్నావు. ఇప్పుడు 'ధ్యాన ప్రియ రెస్టారెంట్' ఆరంభించు. మహాభాగ్యాన్ని అనుభవించు" అన్నారు. త్వరలో అదీ నెరవేరబోతున్నది.

వారి ఆదేశాలనూ, సలహాలనూ, సూచనలనూ అర్ధం చేసుకుని అమలు చేస్తే జీవితాలు ధన్యం అవుతాయి. భౌతిక జీవితంలో ప్రశాంతతనూ ఆధ్యాత్మిక మార్గంలో అత్యున్నత స్థితిని ప్రసాదిస్తాయి.

నా గత జన్మను నేను చూసుకున్నా, నా సమాధి ముందు కూర్చుని ధ్యానం చేసి భౌతికంగా షిర్డీబాబా దర్శనం చేసుకున్నా. మా అమ్మాయిలకు దృష్టి దోషం తొలగిపోయిందన్నా, నాకు చక్కటి హీలింగ్ పవర్ వచ్చిందన్నా, మహావతార్ బాబా, గణపతి మాస్టర్, విశ్వామిత్ర మాస్టర్‌ల 'Divine Friendship' దొరికిందన్నా .... కారణం ధ్యానం, ధ్యాన ప్రచారం మాత్రమే. ఇంకా ఏమైనా నేను పొందగలను. ప్రైమ్ మినిష్టరు పదవైనా కూడా. ఇదంతా "పత్రీజీ" చలవే. నా ధ్యాన ప్రచార భాగ్యమే.

నేననుకుంటాను "నేను 'పత్రీజీ' ని ఒక శాతం అర్ధం చేసుకున్నాను" అని అందుకే నేనెంతో గర్విస్తాను. మిగిలిన తొంభై తొమ్మిదిశాతం కూడా ఈ జన్మలోనే తప్పక తెలుసుకుంటాను. ఎందుకంటె 'ఆనాపానసతి' మార్గాన్ని త్రికరణశుద్ధిగా అమలు చేస్తున్న మా కుటుంబ సభ్యులందరికీ ఇదే ఆఖరు జన్మ కనుక.

నాకంటూ ఒక విలువను ప్రసాదించిన ఈ మహనీయుడు బ్రహ్మర్షియా ? నిశ్చయంగా బ్రహ్మయే. 'పత్రీజీ' గారి 'వాకిన్ బర్త్‌డే' ఐన 'అక్టోబర్ 14'న వారికి ఇవే ఈ "మారం శివ ప్రసాద్" మరి కుటుంబసభ్యుల పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆత్మప్రణామాలు.

 

మారం శివప్రసాద్
ధ్యానప్రియ రెస్టారెంట్
సికింద్రాబాద్

Go to top