" ధ్యానంతో నా జీవితం రంగుల హరివిల్లు "

 

నా పేరు నిత్య. నేను ఫైనలియర్ చదువుతున్నాను. నేను M.విజయలక్ష్మి మేడమ్ ద్వారా ధ్యానం గురించి తెలుసుకున్నాను.

నేను డిసెంబర్, 2003లో విజయపురి కాలనీ పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రారంభం అయినప్పటి నుండి ధ్యానం చేస్తున్నాను. మొదట్లో ధ్యానం వల్ల అంత నమ్మకం కలుగలేదు. కానీ ధ్యానం చేస్తున్నప్పుడు నెమ్మది నెమ్మదిగా రంగులు, ప్రకృతి దృశ్యాలు కనిపించడం ప్రారంభించి ధ్యానం పట్ల నమ్మకం మొదలయ్యింది.

అప్పుడప్పుడూ శరీరం 'క్లీన్' అవుతున్న అనుభూతి కలిగింది. ఒకరోజు ధ్యానంలో నల్లగా వున్న నరాలను ఎవరో చేతితో 'క్లీన్' చేసినట్లు, 'క్లీన్' అయిన భాగం ఎర్రగా శుద్ధి అయినట్లు కనిపించింది.

నాకు సైనస్ ప్రాబ్లమ్ వుండేది. బాగా మందులు వాడేదాన్ని. ఇప్పుడు సైనస్ చాలా వరకు తగ్గింది. మందుల వాడకం మానేసాను. ధ్యానం చెయ్యడం ప్రారంభించాక ఆందోళన తగ్గింది. ఆలోచనా విధానం మారింది. ధ్యానం చేసిన తరువాత రోజంతా ఫ్రెష్‌గా ఉంటోంది.

ఒకరోజు ధ్యానంలో పర్వతాలు, శివుడు, నాగదేవత, హోమాగ్ని వద్ద క్రతువులు నిర్వహిస్తున్న ఒక వ్యక్తి కనిపించారు. అర్థనారీశ్వర రూపంలో శివుడు నృత్యం చేస్తూ కనిపించాడు. మరొకసారి వర్ణరంజితమైన క్రిస్టల్ పిరమిడ్ ఉద్భవించి శిరస్సునంటినట్లయ్యింది. మనస్సంతా ప్రశాంతతో నిండిపోయింది.

మరొకసారి ధ్యానంలో స్వచ్ఛమైన తెలుపు వర్ణపు దుస్తులు ధరించిన అమ్మాయి ఆడుకుంటూ కనిపించింది. ఆ దుస్తులపై మురికిపడితే వెంటనే 'క్లీన్' చేసుకుంది. మళ్ళీ మనస్సుని స్వచ్ఛంగా చేసుకోవాలని మెస్సేజ్ వచ్చింది.

చెయిన్ మెడిటేషన్ చేస్తున్నప్పుడు మౌనంగా కూడా ఇతరులతో సంభాషణ అన్నది సాధ్యమని అనుభవమయ్యింది. ఎనర్జీ నఖశిఖపర్యంతం ప్రవహించి పరమానందస్థితి కలిగింది. ధ్యానంలోకి రావడం వలన ఆనందంగా వున్నాను. ప్రకృతికి మరింత సన్నిహితమయ్యాను. మరింత బాగా ధ్యానం చేసి నా కుటుంబ సభ్యులకు మరింత చేరువయ్యాను.

ధ్యానం వలన సహనం వస్తుంది. ఆరోగ్యం పెంపొందుతుంది. సమస్యల పట్ల మన దృష్టికోణం మారుతుంది. కనుక అందరూ ధ్యానం చేసి నూతన అనుభవాలను పొంది. "అనుభవమే జ్ఞానం" అని తెలుసుకోవాలని నా కోరిక.

 

P.నిత్య
వనస్థలిపురం, హైదరాబాద్

Go to top