" ధ్యానంతో నేను బాగు, బాగు... "

నా పేరు శివలింగారెడ్డి, నేను ధ్యానంలోకి అడుగుపెట్టడమే చాలా ఆశ్చర్యకరమైన విషయం. 2000వ సంవత్సరంలో నన్ను బలవంతంగా ధ్యానం చేయమని కూర్చోబెట్టారు. నా భార్య వాళ్ళు నా కన్నా ముందు నుంచే ధ్యానం చేసి వాళ్ళ నొప్పులు పోగొట్టుకున్నారు. అందువల్లనే వాళ్ళు అతి బలవంతంగా ధ్యానానికి కూర్చోబెట్టారు. మొదట కూర్చోలేక పోతే "అర్ధగంట కూర్చోంటే చాలు" అని చెప్పారు. చాలా ఆశ్చర్యంగా అత్యంత సులభంగా గంటసేపు ధ్యానం చేశాను. తేజోవంతమైన ఎన్నో రంగులు కనిపించాయి. ఎప్పుడూ, ఎక్కడా చూడనటువంటి వర్ణించనలవికాని ప్రకృతి దృశ్యాలు కనిపించాయి. వినాయకుడు, ఈశ్వరుడు, ఏడు తలల నాగేంద్రుడు, రావణాసురుడు, అప్సరసలు మొదలగు వారినందరినీ చూశానీ ధ్యానంలో. సాయిబాబా వచ్చి నా పక్కలోనే కూర్చొని ధ్యానం చేస్తున్నట్లు కనిపించింది. 30 సంవత్సరాల క్రితం చనిపోయిన మా పెద్దన్నయ్యను కూడా ధ్యానంలోనే చూశాను.

ఒకసారి 2002 సంవత్సరం నవంబర్ 29 న ఉదయం పదిన్నర గంటలకు మిద్దెమీద కూర్చొని ధ్యానం చేస్తున్నాను. కరెక్టుగా 11.00 గంటలకు మిద్దెకప్పు నిట్టనిలువుగా అలాగే కుప్పకూలిపోయింది. ఆ కప్పుతో పాటు నేను కూడా పడిపోయాను. కానీ కప్పు కూలిన శబ్దం వినిపించలేదు. నేను పడినది కూడా నాకు తెలియలేదు. ధ్యానంలో అలాగే కూర్చున్నాను, బయట మా ఊరిజనం వచ్చి కంగారుగా అరుస్తూంటే అప్పుడు "ఏం జరిగిందా?" అని కళ్ళు తెరిస్తే అప్పుడు తెలిసింది విషయం. నాకు ఒక్క దెబ్బ కూడా తగలలేదు. మా వూరి వాళ్ళందరూ నన్ను చూసి ఆశ్చర్యపోయారు.

నాకు కళ్ళు సరిగ్గా కనిపించడం లేదని ఆపరేషన్‌కు వెళ్ళాలని వెళ్తూంటే రవి మాస్టర్ వెళ్తే "వెళ్దువు గానీ, 3 రోజులు రాత్రి పగలు కంటిన్యూగా కళ్ళకు నల్లని బట్ట కటి, పిరమిడ్ కళ్ళజోడు పెట్టుకుని మౌనధ్యానం చేయి" అన్నాడు. "నీకు నేను సహాయం చేస్తా"నని ఆ మూడురోజులూ రవి మాస్టర్ చాలా ఓర్పుగా మా అమ్మ కంటే నాకు ఎక్కువుగా తోడవుండి 3 రోజుల మౌన ధ్యానం చేయించాడు. ఆశ్చర్యంగా నాకు చూపు వచ్చింది. కాబట్టి "అందరూ ధ్యానం చేయండి. ఆరోగ్యంగా వుండండి" అని చెప్తూ 100 రోజుల ధ్యానప్రచారంలో కూడా పాల్గొన్నాను. ధ్యానం చేస్తున్నాను. అందరితోనూ చేయిస్తున్నాను.

 

- R. శివలింగారెడ్డి
బోడాయపల్లి, తాడిపత్రి దగ్గర, అనంతపురంజిల్లా

Go to top