" ' ధ్యానం ' తో మేలుపొంది 'పిరమిడ్' కట్టుకున్నాం "

నా పేరు విజయలక్ష్మి. నేను 2003 సం||లో అనసూయ మేడమ్ ద్వారా ధ్యానం గురించి తెలుసుకున్నాను. 'ధ్యానాంధ్రప్రదేశ్' పత్రిక చదవడం ప్రారంభించాను. కానీ ధ్యానం చెయ్యడం మొదలుపెట్టలేదు. ఆ సమయంలో నేను తీవ్రమైన నడుము నొప్పి, కడుపునొప్పులతో బాధపడేదాన్ని, స్కానింగ్ చేయిస్తే "వెంటనే హిస్టిరెక్టమీ చేయించుకోకపోతే ప్రమాదం" అని చెప్పారు. ఆపరేషన్‌కి డేట్ ఫిక్సయిన తర్వాత, "ధ్యానం వలన అన్ని అనారోగ్యాలు అందరికీ నయం అవుతున్నప్పుడు నేనెందుకు నయం చేసుకోలేను?" అని, మా కుటుంబ సభ్యుల సహాయ, సహకారాలతో ధ్యానం ప్రారంభించాను. మందులు నిలిపివేశాను; పూర్తిగా శాకాహారిగా మారాను.

సీనియర్ పిరమిడ్ మాస్టర్ మారం శివప్రసాద్ గారి సలహా తీసుకొని స్టెయిర్ కేస్ పిరమిడ్ నిర్మించుకున్నాము. ధ్యానం చేయడం ప్రారంభించాక నా ఆరోగ్యం ఎంతో మెరుగైంది. మానసిక ప్రశాంతత లభించింది. రోజూ వీలున్నంత సేపు ధ్యానం చేస్తున్నాను.

బుద్ధ పౌర్ణమి సందర్భంగా ఖమ్మంలో 2003 మేలో జరిగిన ధ్యానయజ్ఞంలో "పత్రి గారిని మొదటిసారి చూశాను. అప్పటి నుంచి వీలైనప్పుడల్లా వారి క్లాసులకు అటెండ్ అవుతున్నాను.

2003 డిసెంబర్ 5న మా ఇంటికి మారం శివప్రసాద్ గారు, తారా విశాల్ గారు మరి కార్ఖానాకు చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ వచ్చి ధ్యాన శిక్షణ నిర్వహించారు. అదేరోజు వారి ప్రోత్సాహంతో మేము మా ఇంట్లో "పిరమిడ్ ధ్యాన కేంద్రం" ప్రారంభించడం జరిగింది. అప్పటి నుండి ప్రతి శుక్ర, శని వారాల్లో సాయంత్రం 6.00 నుండి 8.00 వరకు ధ్యానం మరి సజ్జన సాంగత్యం చేస్తున్నాం. పుస్తకాలు ఇచ్చి, పుచ్చుకోవడం ద్వారా నిరంతర స్వాధ్యాయం చేస్తున్నాను.

ప్రతి శనివారం L.B.నగర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ P.V.S.విజయ కుమార్ గారు సజ్జన సాంగత్యం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తున్నారు.

పిరమిడ్ శక్తిని వీలైనంత వరకు ఉపయోగించుకుంటూ, ఇతరులూ ఉపయోగించుకునేలా ప్రోత్సహిస్తూ, ఆంధ్రరాష్ట్ర ధ్యాన వాహినిలో మేమొక భాగమై, ఎంతో మానసిక ప్రశాంతతనూ, అద్భుత అనుభవాలనూ పొందుతున్నాము. బంధు మిత్రులకూ, పరిచితులకూ, అపరిచితులకూ ... అందరికీ ధ్యానం గురించి చెప్తూ, ధ్యాన ప్రచారానికి యథాశక్తి కృషి చేస్తున్నాము.

ధ్యానం వలన ఆలోచనా పరిధి విస్తృతమవుతుంది. ఆరోగ్యంతో పాటు, ఆనందం వెల్లివిరుస్తుంది. ధ్యానం ప్రపంచ వ్యాప్తంకావాలనీ, శాంతిమయమైన ధ్యాన జగత్తు రావాలనీ మా ఆకాంక్ష.

 

- M. విజయలక్ష్మి,
విజయపురి కాలనీ, వనస్థలిపురం, హైదరాబాద్-70

Go to top