" సప్తగిరి T.V. ఇంటర్వ్యూ ... విజేత "

11 నవంబర్, 2006 సంవత్సరం.

సాయంత్రం 8.30 గంటలకు దూరదర్శన్ వారి సప్తగిరి ఛానెల్‌లో అఖిల భారత పిరమిడ్ ధ్యానకేంద్రాల వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రీజీ గారి వాక్-టాక్ కార్యక్రమం ... హైదరాబాద్ అశోకా గార్డెన్స్‌లో ... ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ శ్రీ హనుమంతరావు గారిచే రూపిందించబడిన "విజేత" లో బ్రహ్మర్షి పత్రీజీ ఇచ్చిన సమాధానాలు

-ఎడిర్


స్వాగతం ...

నిత్యవిజేతకు, సత్య ప్రదాతకు సుస్వాగతం...

నేటి మన కార్యక్రమ విజేత ఒక జ్ఞాని ఒక యోగి ... మనల్ని అజ్ఞానం నుంచి, అధ్యానం నుంచి, వెలుగువైపు నడిపించే మహర్షి. "శ్వాస మీద ధ్యాస వుంచాలి" ... "దేవుడంటే మనిషే" ... "నిన్ను నువ్వు ప్రేమించుకో" ... "నీ సదాచారమే నీ శ్రీరామరక్ష" అని ... ప్రవచించే బ్రహ్మర్షి ... ఆయనే ... 'ధ్యానాంధ్రప్రదేశ్' రూపశిల్పి ... 'ధ్యానభారత్' యోగశిల్పి ... 'ధ్యానజగత్' జ్ఞానశిల్పి ... అందరూ ప్రేమగా పిల్చుకునే శ్రీ సుభాష్ పత్రీజీ ... రండి ... ఆనాపానసతి ధ్యానంతో ఆనందంతో మునిగితేలుదాం.

1947 వ సంవత్సరంలో నవంబర్ 11 వ తేదీన నిజామాబాద్ జిల్లాలోని బోధన్ తాలుకా, శక్కర్‌నగర్‌లో శ్రీమతి సావిత్రీదేవి, P.V.రమణారావు దంపతులకు 'లక్కీ ఛైల్డ్' గా బ్రహ్మర్షి పత్రీజీ ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.

ప్రాధమిక విద్య శక్కర్‌నగర్‌లో, మిడిల్ స్కూల్ బోధన్‌లో, హైస్కూల్ చదువు సికింద్రాబాద్‌లో కొనసాగింది. 1966 వసంవత్సరంలో B.Sc. పూర్తిచేశారు.

1970 వ సంవత్సరంలో ... పది నెలలపాటు ... గుంటూరు జిల్లా తెనాలిలో ఇన్‌కమ్ టాక్స్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు. 1974 లో M.Sc.(Ag) పూర్తి చేస్తూనే 'స్వర్ణమాల' గారిని పెళ్ళి చేసుకున్నారు. ఇద్దరు పుత్రికా రత్నాలు ... 1978 లో 'పరిణిత' 1982 లో 'పరిమళ'.

1975 వ సంవత్సరంలో కర్నూలులో ప్రతిష్టాత్మక కోరమాండల్ ఫెర్టిలైజర్స్‌లో మార్కెటింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నత ఉద్యోగిగా ... ఉద్యోగ జీవితం ఆరంభించారు.

1976 వ సంవత్సరంలో సహ ఉద్యోగి శ్రీ రామచెన్నారెడ్డి గారి ద్వారా 'ఒక సదాత్మ' గా ధ్యాన రంగ ప్రవేశం చేశారు.

14 అక్టోబర్ 1979 వ సంవత్సరం నాటికి 'ఒక బ్రహ్మాత్మ'గా అవతరించారు. 1990 డిసెంబర్ 31 న "కర్నూల్ స్పిరిచ్యువల్ సొసైటీ" ఏర్పాటు చేశారు. 1991 లో "బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్ర" స్థాపన గావించారు. 1992 ఏప్రిల్ 16 న ఉద్యోగ విరమణ చేశారు.

అటుపైన అనంతపురం, తిరుపతి ... ఇలా ఎన్నో ఎన్నో శాఖలు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర మొదలైన రాష్ట్రాలలో ఎక్కడ చూసినా ధ్యాన కేంద్రాలే.

1999 లో సింగపూర్, హాంకాంగ్ లలో, 2000, 2001 లో నేపాల్‌లో, 2004 లో అమెరికాలో, 2005 లో శ్రీలంకలో, 2006 ఆస్ట్రేలియాలో ... ధ్యాన బోధన విస్తారంగా చేసారు. మన రాష్ట్రంలో 1,000 కి పైగా పిరమిడ్‌లు నిర్మించారు.

" పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ ఆఫ్ ఇండియా " కు ఫౌండర్ గానూ, బెంగుళూరు లోని " పిరమిడ్ స్పిరిచ్యువల్ ట్రస్ట్ " కు ఛైర్మన్‌ గానూ వ్యవహరిస్తున్నారు. ఇక్కడే మైత్రేయ బుద్ధా ధ్యాన విద్యా విశ్వాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ మెగా పిరమిడ్‌లో 5,000 మంది ఒకేసారి ధ్యానం చేసుకోవచ్చు. "

పత్రీజీ బోధనల సారం ఒక్కటే ... అది మనుష్యులంతా ఒక్కటే ... తారకమంత్రం ఒక్కటే ... అదే ఆనాపానసతి ... అంటే ... శ్వాస మీద ధ్యాస వుంచి ధ్యానం చేయడం.

దీనికి కులం, మతం, ప్రాంతం, మంత్రం, తంత్రం ఏమీలేవు. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. మనకు మనమే దేవుళ్ళం. ఇదే సత్య బోధనగా ప్రతి వ్యక్తినీ ఒక ధ్యాన మూర్తిగా, జ్ఞాన మూర్తిగా తీర్చిదిద్దుతూ ముందుకు నడిపిస్తున్నారు జ్ఞాన యోగి పత్రీజీ. "2004 లో ధ్యానాంధ్రప్రదేశ్" ముగించుకుని ప్రస్తుతం "2008 లో ధ్యాన భారత్", "2012 లో ధ్యాన జగత్" దిశగా కృషి చేస్తున్నారు.

మెడిటేషన్ అండ్ స్పిరిచ్యువల్ లైఫ్ మీద తొలిపుస్తకాలు ఇంగ్లీష్‌లో 1994 లో "Be A Master" తెలుగులో 1995 లో "తులసీదళం" ఆ పైన 49 పుస్తకాలు రచించారు.

తెలుగులో "ధ్యానాంధ్రప్రదేశ్", కన్నడంలో "ధ్యాన కస్తూరి", తమిళంలో "ధ్యాన తమిళనాడు", మలయాళంలో "ధ్యాన కైరలి", మరాఠీలో "ధ్యాన మహరాష్ట్ర" మంత్లీ మ్యాగజైన్స్, ఇంగ్లీషులో "స్పిరిచ్యువల్ ఇండియా" బై మంత్లీ మ్యాగజైన్‌ను ప్రచురిస్తున్నారు. సంస్థకు " www.pssmovement.org" వెబ్‌సైట్ కూడా వుంది. పదండి ... ప్రశాంత చిత్తంతో పదడుగులు వేద్దాం ....


సుభాష్ పత్రి గారూ, 'విజేత' కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ...

"మీ గురించి ... ఒక ఆధ్యాత్మిక గురువుగా ... ఎన్నో విన్నాం. కోరమాండల్ ఫెర్టిలైజర్స్ అనే సంస్థలో ఉన్నత ఉద్యోగంలో వున్న మీరు ఆధ్యాత్మిక గురువుగా మారారు. ఇలా మారటం వెనుక ఏవైనా కారణాలు కానీ, బలమైన సంఘటనలు కానీ వున్నాయా?"

ఓ 'గురువు' గా మారటానికి నేను ఏమి చెయ్యలేదు. కేవలం సత్యాన్వేషణలో ముందుకు సాగాను అంతే. ప్రతి మనిషికీ సత్యాన్వేషణ కావాలి. ఆ సత్యాన్వేషణలో ముందుకు సాగుతూ, సాగుతూ వుంటె "ఏమిటి నా జీవిత నిజమైన లక్ష్యం?" అన్నది నన్ను కుదుపసాగింది. "ఉద్యోగం చేస్తున్నాను, పెళ్ళాం వుంది, పిల్లలు వున్నారు. అన్నీ బాగానే వున్నాయి" అనుకున్నా లోపల ఏదో వెలితి.

" శాస్త్రీయ సంగీతం కూడా బాగానే వస్తోంది కానీ ఈ సంగీతం కూడా నా జీవితంలో నిజమైన లక్ష్యం కాదు " అనిపించింది. ఇంకేదో వుందని ఆ యొక్క వెదుకులాటలో నాకు ఈ ధ్యానం దొరికింది. ఆ ధ్యానం దొరికిన తీగను పట్టుకుని లాగుతూ పోతూ వుంటే అది ఇంతింతై వటుడింతై అన్నట్లు ఇప్పుడు సాంతం మింగేసింది. అదలా జరిగిపోయింది.

ఈ ధ్యానం వైపు మీరెలా ఆకర్షింపబడ్డారు?

'ధ్యానం వైపు' అంటే ... ఆ రోజుల్లో I.A.S. పరీక్షలకి ప్రిపేరు అయ్యేవాణ్ణి,. I.A.S. అంటే మీకు తెలుసు కదా ... అన్ని రకాల పుస్తకాలు చదవాలి. జనరల్ నాలెడ్జ్, ఎస్సే ... అన్నీ వుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సే పేపర్‌లో 'ది పర్సన్ ఆఫ్ లైఫ్' అనే టాపిక్ చూసుకుని నేను రాసాను. అంటే అధ్యాత్మిక బీజాలు అన్నీ అప్పుడే వున్నాయి నాలో. అయితే ధ్యానం అన్నది మాత్రం కర్నూల్‌లో పనిచేసేటప్పుడు 1976 లో స్టార్ట్ చేసాను. 1976 లో మిత్రుడు రామచెన్నారెడ్డి అని చెప్పేసి ఆయనకి విపరీతమైన వెన్ను నొప్పి వుండేది. ఆయన అనేకమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాడు, మందులు తీసుకున్నాడు. ఏమీ కాలేదు. చివరికి వెల్లూరు హాస్పిటల్ తమిళనాదు తెలుసు కదా రాయవెల్లూర్ ... అక్కడికి వెళ్ళి రెండు నెలలు వున్నాడు. వున్నా కూడా అక్కడ వాళ్ళు ఏమీ చెయ్యలేకపోయారు ... వారు దండం పెట్టి "మీరు వెళ్ళిపోండి సార్" అని చెప్పేసారు.

"సరే" అని ఈయన వచ్చేస్తూంటే ఆ బస్సులో ఎవరో ప్రక్కన కూర్చున్నాయన "నువ్వు ధ్యానం చెయ్యి నీ వీపు నొప్పి తగ్గిపోతుంది" అన్నాడు. ఆ విధంగా ఆ తర్వాత అతను ధ్యానం చెయ్యడం, ఆ వీపు నొప్పి తగ్గిపోవడం జరిగింది. అదే ఫస్ట్ టైమ్. ఇక అతను మెల్లిగా ధ్యానం చెయ్యడం మొదలుపెట్టినప్పటి నుంచి విజన్స్ రావడం థర్డ్ ఐ ఎక్స్‌పీరియన్సెస్ రావడం ... నాక్లోజ్ ఫ్రెండ్ కనుక నాతో చెప్పడమూ ... నాకు కొంచెం బ్యాక్‌గ్రౌండ్ నాలెడ్జ్ వుంది కనుక పుస్తకాలు చదివి థియరిటికల్‌గా వాటిని ఎనలైజ్ చెయ్యడం ... ఇలా మొదలైంది ధ్యాన పరిశోధన 1976 .... పరిసమాప్తమైంది 1979 లో.

అంటే ఆ తర్వాత క్రమంలో మీరే ధ్యానం అనేది నేర్పటం, ఆధ్యాత్మిక గురువుగా మారటం ... ప్రపంచంలో చాలామంది మీకు శిష్యులై మీ దగ్గర ఈ ధ్యానాన్ని నేర్చుకోవటం వగైరా...?

'76 నుంచి 79' వరకు కర్నూల్‌లో మరి అక్కడ ఈ ధ్యానం గురించి అవగాహన అతని ద్వారా మొదట నాకు బాగా కలిగి ఆ తర్వాత ఇంక నాకు అనిపించింది. ఇందాక నాకు చెప్పిన 'వెలితి' ఇప్పుడు నాకు లేదు. ఇప్పుడు నాకు కావలసింది దొరికింది.

నా జీవిత లక్ష్యం నా భార్య, పిల్లలు కాదు. నాకన్నీ బాగానే వున్నాయి. ఇంట్లో కూడా ఏమీ కుపరిస్థితులు లేవు. మామూలుగా అందరికీ వున్నట్లే అన్ని పరిస్థితులు వుంటాయి. That's normal. కానీ ఈ యొక్క ధ్యానం అనే అవగాహాన వచ్చినప్పుడు నేను దీన్ని ప్రపంచానికి ఇవ్వాలని ఒక తీవ్రమైన తపన నాకు 1979 లో మొదలైంది. ఆ పరిస్థితిలో ఆఫీస్‌లో వున్నవాళ్ళకీ, ఫ్రెండ్స్‌ వాళ్ళందరికీ ధ్యానం, స్పిరిచ్యువల్ సైన్స్ అన్నవి చెప్పడం మొదలుపెడుతూ, మొదలుపెడుతూ, మొదలుపెడుతూ వచ్చాను.

ఈ రోజు కొన్ని లక్షలమంది శిష్యగణం మీకు వుంది. మీరు అసలు ఈ ధ్యానంలో ప్రవచించే సిద్ధాంతాలు ఏంటి? ఆ తర్వాత ఈ బిజీ లైఫ్‌లో మనిషి ప్రశాంతంగా వుండటానికి సుఖంగా వుండటానికి మీరు ఏం నేర్పుతారు?

బిజీ లైఫ్‌లో 'నాన్-బిజీ' గా ధ్యానంలో కూర్చోవాలి. సంగీతం వినాలి. క్రికెట్ ఆడుకోవాలి... నూటతొంభై వున్నాయి ... ఈ బిజీ లైఫ్‌ని మనం హాయిగా ఎంజాయ్ చెయ్యడం కోసం. కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది ధ్యానం.

మనం గుడికి వెళ్తాం, చర్చికి వెళ్తాం, మసీదుకు వెళ్తాం. చిన్నప్పటి నుంచి గుడికి వెళ్తున్నాం. ఆ గుడిలో ఒక రౌండ్ వేసుకుని వచ్చేస్తాం మనం. "అసలు ఆ గుడి ఎందుకు కట్టారు? అసలు ఏమిటది?" అనేది తర్వాత ధ్యానంలో కూర్చున్నాక నాకు అర్థమైంది. దేహమే దేవాలయం, ఆత్మే పరబ్రహ్మం, జీవుడే దేవుడు. కనుక మనల్ని గురించి మనం తెలుసుకోవడం కోసమే ఆ ధ్యానం అని తెలుసుకున్నప్పుడు ... ఆ ధ్యానం గురించి అందరికీ చెప్తూంటే అందరి జీవితాలూ మారిపోయాయి.

నేను సత్యాన్వేషణ కోసం వచ్చాను. కానీ అందరికీ అది చెప్తూంటే అందరి దుఃఖాలు పోయి, అందరి రోగాలు పోయి, అందరి చెడు అలవాట్లు పోయి అందరూ బాగుపడుతూంటే ... I was feeling so very happy.

మీరు నేర్పే ఈ ధ్యానం అనేది ఏ విధంగా వుంటుంది?

ఏమీ లేదు, వెరీ సింపుల్. హాయిగా కూర్చోవాలి. ఎక్కడైనా కూర్చోవచ్చు. క్రింద కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు. సోఫాలో కూర్చోవచ్చు. Anywhere ... just make yourself comfortable, clasp your hands. కళ్ళు రెండూ మూసుకుని మరి శ్వాస మీద ధ్యాస పెట్టాలి. That is the key point.

నోట్లో నుంచి నేను హిందువుని కనుక "ఓం భూర్భువ ..." అలాంటివి అనుకోకుండా లేక నేనొక ముస్లిమ్‌ని అయితే "లాఇలాహి ఇల్లల్లాహి..." అనకుండా ... అంటే నోటితో ఏమీ చెప్పకుండా ... ఈ ముక్కు అనేది ఓ పిరమిడ్ ... ఈ పిరమిడ్ లోపల వున్న ఆ శ్వాసను ... మనం దాన్ని పట్టుకోవాలన్నమాట. కొంతసేపు దాన్ని మనం పట్టుకుంటే ఆ తర్వాత అది మనల్ని జీవితాంతం పట్టుకుంటుంది.

'పిరమిడ్' అని మీరు అన్నారు ... మీరు పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ అనేది స్థాపించారు. మీరు నేర్పే ఈ ధ్యానంలో 'పిరమిడ్' అంటే ఏమిటి? పిరమిడ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి?

నేను 'పిరమిడ్' స్పిరిచ్యువల్ సొసైటీ స్థాపించలేదు. 'స్పిరిచ్యువల్ సొసైటీ' అని స్థాపించాను... ది ఫస్ట్ స్పిరిచ్యువల్ సొసైటీ అన్నది కర్నూల్ స్పిరిచ్యువల్ సొసైటీ, 1991 లో. అప్పుడు పిరమిడ్ కట్టాం. కానీ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ అని నామకరణం చెయ్యలేదు. కేవలం "ది కర్నూల్ స్పిరిచ్యువల్ సొసైటీ". అయితే అక్కడ ఒక పిరమిడ్ కట్టడం జరిగింది.

పిరమిడ్ ఎలా కట్టామంటే ... 1981-92 లో అనేక వేల పుస్తకాలు నేను చదివాను. ఈ ధ్యానంలోకి రాకముందు జనరల్‌గా చదివేవాడిని. ధ్యానంలోకి వచ్చిన తర్వాత స్పెసిఫిక్‌గా ధ్యానం గురించి రీసెర్చ్ చెయ్యడం మొదలుపెట్టాను. ఏది కనపడినా, ఏ మాస్టర్ గురించి విన్నా ... ఆ పుస్తకం చదవడం ... సో, అందులో పిరమిడ్స్ గురించి వాటి శక్తి గురించి కూడా నేను చదవడం జరిగింది. వాటిల్లో ఒక గ్రంథం బిల్‌షుల్ అండ్ ఎడ్ పెటిట్ అనే ఇద్దరు మాస్టర్స్ వ్రాసిన "ది సీక్రెట్ పవర్ ఆఫ్ ది పిరమిడ్స్" అనే పుస్తకం.

ఆ పుస్తకం చదివి మా కార్పెంటర్‌ని పిలిచి "ఇదిగో ఇలా చిన్న చిన్న అట్టలు చెయ్యవయ్యా ... ఈ పిరమిడ్ యాంగిల్‌తో" అని చెప్పిన మరీ చేయించుకుని ఒక పిరమిడ్‌లో ఒక వంకాయ పెట్టడం, ఒక వంకాయ బయట పెట్టడం మరి బయటపెట్టిన వంకాయ రెండురోజుల్లో కుళ్ళిపోయింది. లోపల పెట్టిన వంకాయ నెలరోజులు వుండిది ఫ్రెష్‌గా. ఇట్స్ రిమార్కబుల్. అలాగే ఒక టమోటా పిరమిడ్ క్రింద పెట్టాను. ఒకటి బయట పెట్టాను. బయట పెట్టింది రెండు రోజుల్లో కుళ్ళిపోయింది. లోపల పెట్టింది నెలరోజుల తర్వాత మళ్ళీ హాయిగా వండుకుని తిన్నాం. అంటే నెలరోజులపాటు ఒక టమోటాను పిరమిడ్‌లో పెట్టినా అదేమీ కుళ్ళలేదు... అదే పిరమిడ్ అద్భుతశక్తి. ఆ రోజుల్లో నేను షేవింగ్ చేసుకునేవాణ్ణి. ఆ షేవింగ్ రేజర్‌ని పిరమిడ్‌లో పెట్టేవాణ్ణి. సో, నాకు 30, 40 షేవ్స్ వచ్చేవి.

ఆ తర్వాత క్రమంలో ... 1990 లో ... శ్రీ B.V.రెడ్డి గారు అని చెప్పేసి కర్నూల్లో ఆయన ధ్యానం క్లాసుకు ఇంటికి వచ్చి ప్రభావితుడై "నేను ఏదైనా మీకోసం చెయ్యదలచుకున్నాను" అంటే అప్పుడు "పిరమిడ్ కడితే ప్రజలకు ఉపయోగపడుతుంది. పిరమిడ్‌లో కూర్చుని ధ్యానం చేస్తే మూడింతలు మరింత శక్తివంతమైన ధ్యానం చెయ్యగలం" అని చెప్పటం జరిగింది. శ్రీ B.V.రెడ్డిగారు ... ప్రముఖ పారిశ్రామికవేత్త మరి ఫిలిమ్ ఛాంబర్ దాంట్లో ప్రెసిడెంట్‌గా వుండేవారు... ఆయన కట్టించారు కర్నూల్లో పిరమిడ్‌ను 1991 లో.

మీరు అన్నారు ... ముక్కు అనేది పిరమిడ్ అని?

చూశారా? మరి ఇక్కడ వెడల్పుగా వుంది పైన.. ఏకంగా వుంది ... అదే కదా పిరమిడ్ అంటే. క్రింద చదరంగా వుంటుంది పైన ఏకం అవుతుంది. క్రింద అనేకం పైన ఏకం ... సర్వమతాలు క్రింద అనేకం ... కానీ పైన ఏకమే ... బహిర్ముఖంగా అనేకం. అంతర్ముఖంగా అంతా ఏకమే. ఉన్న సత్యం ఒక్కటే. కనుక ఈ పిరమిడ్ చాలా బాగా దానికి ప్రతీకగా నిలుస్తుంది. "ముక్కులోని గాలి ముక్తికి మరి దారి" అన్నారు వేమన ... అన్నమాచార్యుల వారు అన్నారు "కాయపుటూపిరిలో గని వున్నది" ... లేకపోతే "ఊపిరిలో దేవుడున్నాడు యోగీంద్రులకు" ... దాన్నే గౌతమబుద్ధుడు 'ఆనాపానసతి' అన్నాడు. ఆన అంటే ఉచ్ఛ్వాస ... అపాన అంటే నిశ్వాస. ఆయన కనుక్కున్నదే ఇది ... మరి మనం ఎందుకు మర్చిపోయాం?

థామస్ ఆల్వా ఎడిసన్ 'ఇన్‌కాండిసంట్ బల్బు' కనుక్కున్నట్లు ... లేక న్యూటన్ 'లా ఆఫ్ గ్రావిటీ' కనుకున్నట్లు ... ఈ 'ఆనాపానసతి'ని గౌతమబుద్ధుడు కనుక్కున్నాడు. కానీ మనం మర్చిపోయాం. ఆయన దుఃఖానికి కారణం తెలుసుకున్నాడు. అయితే మనం ఇంకా దుఃఖంలోనే వున్నాం. దుఃఖం తృష్ణ వలన. తృష్ణ అవిద్య వలన. అవిద్య అన్నది అష్టాంగమార్గం వలన తొలగిపోతుంది. అష్టాంగమార్గంలో ఫైనల్ పాయింటే 'సరైన ధ్యానం' అంటే 'ఆనాపానసతి'.

ఇంకా చాలా ప్రశ్నలు అడగాలనిపిస్తోంది. ఒకటి ఇందాక చెప్పారు ... మీ స్నేహితుడుకి ... వెన్నునొప్పి వుండటం వల్ల "ఈ ధ్యానం చెయ్యటంతో .. అది పోయింది" అన్నారు. నేను కూడా అబ్జర్వ్ చేస్తే చాలామంది తమకు వున్నటువంటి వ్యాధులకి మేలు జరిగిందని విన్నాను. ఇది ఎలా సంభవం?

ధ్యానం ద్వారా ... లక్షలమంది వ్యాధులన్నీ పోయాయి. లక్షలమంది రోగ విముక్తులు అయ్యారు. అందరూ డాక్టర్ల దగ్గరకు పోవడం మానుకున్నారు. మందులు మింగడం మానుకున్నారు.

దీనికి శాస్త్ర ఆధారాలు వున్నాయా? ఇది ఎంతవరకు శాస్త్ర సమ్మతం?

'శాస్త్రం' అంటే అసలు మీ ఐడియా చెప్పండి నాకు. 'శాస్త్రం' అంటే ఏమిటి? మీరు చెప్తారా? నాకు చెప్పండి?

మన కంటికి ఎదురుగా వుండేది ... మనం సత్యం అనేది

సారీ .. సారీ... కంటికి ఎదురుగా కనబడేది మాత్రమే సత్యం కాదు. ఉదాహరణకు ఈ స్పెక్ట్రమ్ తీసుకుంటే రెడ్ దగ్గరి నుంచి వైలెట్ వరకు ... ఈ యొక్క VIBGYOR అనేది సత్యమా? Infrared ... Ultraviolet ... అది కంటికి కనపడుతుందా? అది సత్యం కాదా? కాదా?

సత్యమే

కనుక టోటల్ స్పెక్ట్రమ్‌లో VIBGYOR అవతల 190 లక్షల స్పెక్ట్రమ్ ఫ్రీక్వెన్సెస్ వున్నాయి. వాటన్నింటినీ చూస్తుంది ధ్యానం. ఈ సైన్స్ ... మీరు చెప్పే సైన్స్ ... VIBGYOR నే చూస్తుంది. ఆటమ్స్ ... మాలిక్యూల్స్ వరకే చూస్తుంది. అంతకుమించి ఇంకేమీ లేదా? అసలు అక్కడి నుంచే కథ మొదలౌతుంది. ఆ కథను సాంతం చూస్తుంది ధ్యానం.

ఈ ధ్యానం ద్వారా ఎన్నో వ్యాధులు నిర్మూలిస్తున్నా ... మరి ఇంకా ఎన్నో వ్యాధులు పుడుతున్నాయి.

అన్ని వ్యాధులూ ... తలకాయనొప్పి దగ్గరి నుంచి క్యాన్సర్ వరకు అన్నీ ధ్యానంలో మాయం. ఇంకా కొన్ని రోజుల్లో డాక్టర్లు అని ఎవ్వరూ వుండరు ... సర్జన్లు వుండరు ... హాస్పిటల్స్ వుండవు. మరి మందుల షాపులు వుండవు. జీవితం అందరికీ హాయిగా వుంటుంది.

అలాంటి సమాజాన్ని మీరు కోరుకుంటున్నారా?

నేను కోరకోవటమే కాదు ... అది వచ్చి తీరుతుంది. దానికోసమే నేను పుట్టాను.

"దానికోసమే నేను పుట్టాను" అన్నారు ... మీ శిష్యులు కొంతమంది మీరు మైత్రేయబుద్ధుని అవతారంగా పరిగణిస్తూ వుంటారు. దీని గురించి మీరేమంటారు?

వాళ్ళ అనుభవాలు వాళ్ళవి. వాళ్ళ సత్యశోధన వాళ్ళది. నాకు మటుకు ఆదర్శ గురువు ఆ బుద్ధుడే. ఆ బుద్ధుడే చెప్పాడు. "2500 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ వస్తాను" అని చెప్పేసి ... 'నేను' అంటే ఒక మనిషి కాదు. ఆయన కనుక్కున్న విధానం మళ్ళీ వస్తుంది. ఇప్పుడు వచ్చింది ... ఇప్పుడు ... పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ ఒక్కటే కాదు ... ఈ ఆనాపానసతి గురించి చెప్పేది ప్రపంచమంతా ఆనాపానసతి గురించే చెప్తోంది.

I am also one of those persons. I am not the only person. కనుక ప్రపంచం అంతా మళ్ళీ ఇప్పుడు తిరిగి ఆనాపానసతి దగ్గరికి వస్తోంది. That's what he predicted 2,500 years back.

పత్రి గారు, మీరు "ఈ ధ్యానం వల్ల సమాజం మారుతుంది" అన్నారు. కరుడుకట్టిన ఈ సమాజంలో ఈ ధ్యానం వల్ల ఏ విధమైన మార్పు వస్తుంది?

ధ్యానం అనేది A to Z మార్పులను తీసుకువస్తుంది. Physical, Mental, Emotional, Social, Economic, Intellectual ... all. Meditation is al in all. Meditation is all in all. ధ్యానం అన్నది సర్వరోగనివారిణీ ... సర్వభోగకారిణి ... విశ్వశక్తిప్రదాయిని ... సత్యజ్ఞానప్రసాదిని ... ఇవన్నీ చెప్తే మీకు 'ఎక్స్‌ట్రా' గా కనపడుతూ వుండవచ్చు. కానీ నదిలో దిగినవాళ్ళకే లోతు తెలుస్తుంది కదా. గట్టు మీద కూర్చున్నవాళ్ళకి ఏం తెలుస్తుంది... ఎంత లోతుందో.

సుభాష్ పత్రి గారు, మీరు వేణుగాన విద్వాంసులని కూడా విన్నాం. మీరు ఎక్కడ చూసినా సంగీతాన్ని కూడా మీ ధ్యానంలో ఒక భాగంగా వినిపిస్తూ వుంటారు. ఈ రెండింటినీ ఎలా మేళవించారు?

ధ్యానానికి 'చక్కటి అనుకూలమైన పరిస్థితులు' అనేవి వుంటాయి. చక్కగా చీకటి చేసుకోవటం, అందరూ సైలెంట్‌గా వుండడమూ, వేరే సౌండ్స్ లేకుండా చేసుకోవడమూ, తర్వాత క్లాసికల్ మ్యూజిక్ పెట్టడమూ సీట్‌ని సౌఖ్యంగా చేసుకోవడమూ ... మంచి అగరుబత్తి పెట్టుకోవడమూ ... ఇవన్నీ కూడానూ మెడిటేషన్‌కి కావలసిన అనుకూలమైన పరిస్థితులు. 'ప్రతికూల పరిస్థితులు, అనుకూల పరిస్థితులు' అని రెండు రకాలుగా పరిస్థితులు వుంటాయి. కనుక ఈ అనుకూల పరిస్థితుల్లో అన్నింటికన్నా అద్భుతమైనది చక్కటి ఇన్‌స్ట్రుమెంటల్ మ్యూజిక్ మరి క్లాసికల్ మ్యూజిక్. నేను పాడుతూంటాను మరి ఫ్లూట్ వాయిస్తూంటాను. అందరూ చక్కగా ధ్యానంలోకి వెళ్తూంటారు.

ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం మీ వేణుగానాన్ని వినిపించే అవకాశం కలిపిస్తారా?

ఓ ... తప్పకుండా. ఏ రాగం వాయించమంటారు?

మీ ఇష్టం.

వర్షాకాలం వర్షం వస్తుంది ... ok మలహర్.(పత్రీజీ వేణుగానం)

అద్భుతం, మీ సంగీతంతో ఈ రోజు చాలా ఆనందిపజేశారు. ఇలా సంగీతాన్ని ఉపయోగించటం అనేది నిజంగానే అద్భుతం. కొంతమంది సంగీతాన్ని వ్యాధుల నివారణకి కూడా ఉపయోగిస్తున్నారు. ఇది కూడా ప్రజల మీద అంటే మీ శిష్యుల మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది?

First of all నాకు శిష్యులు లేరండి. I don't have any Guru and I don't have any శిష్యాస్. I am a scientist of meditation ... and there are people who want to learn the art and science of meditation. That's all. కనుక, "సంగీతం వల్ల రోగాలు పోతాయి" అనుకుంటున్నప్పుడు అసలు జరిగేదేమిటంటే సంగీతం వల్ల మనస్సు బాగవుతుంది. మనస్సు బాగవుతే రోగాలు పోతాయి. అంటే సంగీతం వల్ల డైరెక్టుగా రోగాలు పోవు. ఎప్పుడైతే మనస్సు సంతోషంగా వుంటుందో అప్పుడు రోగాలన్నీ పోతాయన్నమాట.

మన రాష్ట్రంలో ఈ ఆధ్యాత్మికత నేర్పేవాళ్ళు ... గురువులనండి .. లేకపోతే, ముఖ్యంగా ధ్యానాన్ని నేర్పేవాళ్ళు కూడా ... చాలామంది వున్నారు. ఎన్నో ... 'రామచంద్ర మిషన్' అని లేకపోతే 'బ్రహ్మకుమారీస్' అని రకరకాల పద్ధతులున్నాయి. ఈ పద్ధతులకూ మీరు నేర్పే పద్ధతికీ ఏమైనా తేడా వుందా? మిమ్మల్ని మీరు ఏ విధంగా డిఫరెన్షియేట్ చేసుకుంటారు?

ఉదాహరణకు ఓషో వున్నారు. ఆయన 108 ధ్యాన పద్ధతులు చెప్పారు. రకరకాల ధ్యాన పద్ధతులు. ఆ అన్నింటిలో 107 తీసేసి కేవలం ఒక్కదాన్నే నేను వుంచాను. దాని పేరే శ్వాస మీద ధ్యాస. శ్రీ గోయెంకా గారు దీనికి పెట్టిన పేరు 'విపస్సన'. మిగతా వాళ్ళందరిలో గోయెంకా గారు ఒక్కరే దీన్ని తీసుకున్నారు. ఆయన తర్వాత మరి నేను తీసుకున్నాను.

"రకరకాల ధ్యాన పద్ధతులు లేవు" అని గౌతమబుద్ధుడు చెప్పాడు. "సరియైన ధ్యాన పద్ధతి ఒకటుంది" అని చెప్పాడు. మిగతావన్నీ సుమారుగా సరికాని ధ్యాన పద్ధతులు. సుమారుగా సరికాని ధ్యాన పద్ధతులన్నీ ఒక వైపు ... మరి సరియైన ధ్యాన పద్ధతి అన్నది ఒకవైపు. దాని పేరే శ్వాస మీద ధ్యాస.

నేను ఎంతో రీసెర్చ్ చేసాను. మిగతావాళ్ళు నేను చేసినంత రీసెర్చ్ చెయ్యలేదు. వాళ్ళు నా అంత రీసెర్చ్ చెయ్యలేదు. కనుక తమ తమ పద్ధతుల్లో చేసుకుంటూ, చెప్పుకుంటూ వచ్చారు. నాకు మిగతావాళ్ళకన్నా ఖచ్చితంగా ఎక్కువ తెలుసు. "మిమ్మల్ని ఏమని పిలుచుకోవాలి?" అని మీరు ఎవరన్నా నన్ను అడిగితే " 'శాస్త్రజ్ఞుడు' అని పిలవండి" అంటాను. గురువు కాదు 'శాస్త్రజ్ఞుడు'. న్యూటన్ వున్నాడు, ఐన్‌స్టీన్ వున్నాడు ... వాళ్ళను మీరు గురువు అంటారా, శాస్త్రజ్ఞులు అంటారా?

శాస్త్రజ్ఞులు.

మరి నేను కూడా ఓ శాస్త్రజ్ఞుడనే. మెడిటేషన్‌లో స్పిరిచ్యువల్ సైన్స్‌లో 'ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడు' అన్నమాట.

ఓ ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడిగా మీరు మారిన క్రమంలో ఒక విజేతగా మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ ప్రోసెస్‌లో మీరు ఏం సాధించామనుకుంటున్నారు?

నేను అనుకున్నవన్నీ సాధించాను. అనుకున్నవన్నీ సాధిస్తాను. నేను ఏం అనుకున్నాను? "నాకు సత్యం తెలియాలి" అనుకున్నాను. నేను సత్యం తెలుసుకున్నాను. సత్యం అంటే ఏంటి? నా గత జన్మలన్నీనేను చూసుకున్నాను, "నేనే అంతా" అని తెలుసుకున్నాను.

ఉదాహరణకు అర్జునుడు కృష్ణుడిని అడుగుతాడు. "ఎవరివయ్యా నువ్వు?" అని చెప్పేసి. "అహం ఆత్మా గుడాకేశ ..." అని ఏ విధంగా కృష్ణుడు జవాబు చెప్పగలిగాడో నేను కూడా అలా జవాబు చెప్పగలను నా యొక్క అనుభవం వల్ల.

తర్వాత నా భార్య. నా పిల్లలు అందరూ ధ్యానులయ్యారు. వాళ్ళందరూ సంతోషంగా జీవిస్తున్నారు. ఎవ్వరూ డాక్టర్ దగ్గరికి పోరు. ఎవ్వరూ మందులు పుచ్చుకోరు.

ధ్యానులు రాకముందు ఓ చిన్ని కుటుంబం నాది. ఇప్పుడు లక్షలమంది నా కుటుంబం. నేను లక్షల ఇళ్ళలోకి వెళ్ళి భోంచెయ్యగలను. హెల్త్ ఈజ్ వెల్త్. ఫ్రెండ్‌షిప్ ఈజ్ వెల్త్. వెల్త్ ఈజ్ నాట్ వెల్త్. ఎంత హెల్త్, ఎంత ఫ్రెండ్‌షిప్ నాకు వచ్చిందంటే అదంతా మరి నేను సాధించిందే కదా. ఇక మిగతావాళ్ళందరికీ కూడా అదే వర్తిస్తుంది.

లక్షలమంది తమ చెడు అలవాట్లను పోగుట్టుకున్నారు. త్రాగుడు కానీ ముఖ్యంగా మాంసం తినడం కానీ మరి అన్నీ. అందరూ కూడానూ గ్రామ గ్రామాలు తిరుగుతూ పల్లెలకు వెళ్ళి చక్కగా అందరికీ ధ్యానం చెప్పి వాళ్ళు "మేం కూడా ఒక ప్రజాసేవ చేస్తున్నాం, సాంఘిక కార్యక్రమం చేస్తున్నాం" అనే తృప్తి పొందుతున్నారు. Everybody is very happy. ధ్యానం తోనే హ్యాపీనెస్ వస్తుంది మరింక దేనితోనూ రాదుగా.

అంటే ఈ 'సైంటిస్ట్ ఆఫ్ మెడిటేషన్' అన్నది సాధించడంలో ... ఏ మనిషైనా ఏదైనా సాధించేటప్పుడు ... అనేక కష్టనష్టాలు వుంటాయి, ఫెయిల్యూర్స్ వుంటాయి. వాటన్నింటినీ మీరు ఏ విధంగా ఫేస్ చేశారు? వాటిని మీరు ఏ విధంగా అధిగమించారు?

వీటిని 'ఫెయిల్యూర్స్' అనరు. కేవలం 'స్ట్రగుల్స్' అంటారు. There are no failures. అయితే స్ట్రగల్స్ అన్నవి ఎప్పుడూ వుండనే వుంటాయి. ప్రపంచం బాగుపడాలని మహాత్మాగాంధీజీ కాలి నడక తిరిగినప్పుడు ఆయనకు కాలి నొప్పులు కలగలేదా ఏమిటి? వుంటాయి కాళ్ళ నొప్పులు. అయితే అవి కష్టాలు కాదు, నష్టాలు కాదు. అది అంతా ఎన్నుకున్న బాట. నాదీ అంతే. ఏ విజేతకైనా అంతే.

ఏ విజేత అయినా విజేతగా మారిన క్రమంలో ఎన్నో సాధిస్తారు ... అంటే డబ్బు, సంపద, కీర్తిప్రతిష్టలు, ఇంకా ఏదైనా కావచ్చు, వీటిల్లో ఒక విజేతగా మీరు ... ఏం సాధించారు?

నా ప్రజలు ఆనందం సాధించాను. నాది వసుధైక కుటుంబం. నా భార్యబిడ్డలు మాత్రమే నా కుటుంబం కాదు. ప్రతి మనిషీ నా కుటుంబం. నా కుటుంబంలో విశేషంగా శాంతిని, ఆరోగ్యాన్ని స్థాపించాను... ఆత్మజ్ఞానాన్ని పెంపొందించాను. అదీ నా విజయం.

మానవాళికి మీరిచ్చే సందేశం?

ప్రతి ఒక్కళ్ళు కూడానూ ... ఒకటేమో ... మాంసాహారాన్ని మానాలి. శాకాహారం మాత్రమే తినాలి. రెండోదేమో ఏ డాక్టర్ దగ్గరికీ పోకూడదు. ఏ మందులు పుచ్చుకోకూడదు. స్వంత ఆత్మశక్తి మీదే ఆధారపడాలి. Don`t be dependent, Be independent. ధ్యానం చేస్తే క్యాన్సర్ దగ్గరి నుంచి మరి అన్నీ పోతాయన్నమాట.

"క్యాన్సర్ దగ్గరి నుంచి ధ్యానం వల్ల అన్ని వ్యాధులు పోతాయి" అన్నారు... ఇవన్నీ రీజనింగ్‌కి అందుతాయా? హేతువు వుందా ఇందులో ఏదైనా?

మెడికల్ సైన్స్ వాళ్ళు ... వాళ్ళింకా శాస్త్రీయ దృక్పధాన్ని పెంపొందిచుకోవాలి. వాళ్ళల్లో శాస్త్రీయ దృక్పధం ఇంకా సరిగ్గా పెంపొందింపబడలేదు.

అలాంటి వారికి మీరిచ్చే సందేశం ఏంటి?

ఇంకా శాస్త్రీయ దృక్పధం పెంపొందిచుకోవలని. కేవలం. VIBGYOR లో ఆలోచించకుండా Ultra violet, infrared, ఇంకా infra infrared, ultra ultra violet ఈ విధంగా 190 లక్షల ఫ్రీక్వెన్సీస్ దృష్ట్యా అవగాహన పెంపొందిచుకోవాలి. Develop a little more scientific temper.

మీరు చేసే ఈ ధ్యాన ప్రక్రియలో ఎప్పుడైనా ఇలాంటి వాళ్ళ దగ్గర్నుంచి సమస్యలు ఎదుర్కోవడం కానీ ...?

ఎవ్వరూ సమస్య కాదు స్వామీజీ. ఇలాంటి వాళ్ళు తగులుకుంటారు. వాళ్ళు పెద్ద సమస్య కాదు. అసలు ఎవ్వరూ మనకి సమస్య కాదు. అయితే వాళ్ళందరూ వున్నారు కనుకనే ... వాళ్ళను బాగుచెయ్యడం కోసమే ... మనం పుట్టాం. వాళ్ళని అనుసరించడానికి మనం పుట్టలేదు. బ్రిటిష్ వాళ్ళని అనుసరించడానికి గాంధీజీ పుట్టలేదు, వాళ్ళని తరిమివేయడం కోసమే గాంధీజీ పుట్టారు. అదీ సంగతి. నేనూ అంతే మిడిమిడి శాస్త్రజ్ఞుల్ని ... వాళ్ళ నుంచి వాళ్ళనే రక్షించడం కోసం ... నేను పుట్టాను ... గౌతమబుద్ధుడు పుట్టాడా లేదా? ఏసుప్రభువు పుట్టాడా లేదా? మరి నేను కూడా అలాగే పుట్టాను. వాళ్ళు ఏ కారణాలతో పుట్టారు? నేనూ అదే కారణంతో పుట్టాను.

అంటే మీరు కూడా చరిత్రలో ఆ స్థాయిలో నిలిచి పోవాలని?

'చరిత్ర' గురించి ఎందుకు స్వామీజీ. 'జీవితం' అందాం .. నా పర్సనల్ జీవితం ఇది. చరిత్రకూ దీనికీ సంబంధం లేదు. వాళ్ళు ఎలాంటి జీవితం గడిపారో అందరికీ తెలుసు. మనం కూడా వాళ్ళ బాటలో నడుస్తున్నాం.

ఏసుప్రభువు నడిచిన బాటలో .. గౌతమబుద్ధుడు నడిచిన బాటలో ... నేను నా అడుగులు వేస్తూ నడుస్తున్నాను. ఒక అడుగు జీసస్ అనుకోండి, ఇంకొకటి బుద్ధుడనుకోంది. మీ ఇష్టం.

దుఃఖంలో వుండే ప్రతి మానవుడి కోరిక "నేను దుఃఖం నుంచి బయటపడాలి" అని. ఎలాగైతే రోగీ, డాక్టర్ వుంటారో, అలాగే మరి అజ్ఞానమూ, జ్ఞానమూ వుంటుంది. అజ్ఞానంలో వున్నవాళ్ళు కూడా కోరుకుంటారు "నా అజ్ఞానం పోవాలి" అని ... వాళ్ళకి తెలుసు తమకు అజ్ఞానం వుందని. అలా జ్ఞానం వున్నవాళ్ళు కూడా కోరుకుంటారు ... అజ్ఞానుల అజ్ఞానం పోవాలని. అందరికీ ఒక్క కోరికే ... సమస్త 61/2 బిలియన్ ప్రజల యొక్క సమిష్టి కోరిక....

మీరు తీరుస్తున్నారా?

నేను కాదు ... అందరూ కలిసి తీర్చుకుంటున్నారు.

అంటే మీరు ఓన్లీ క్యాటలిస్ట్‌గా వున్నారు.

నాభాగం నేను చేస్తున్నాను.

సుభాష్ పత్రి గారు, ఈనాటి 'విజేత' కార్యక్రమంలో మీరు పాల్గొని మా దూరదర్శన్ ప్రేక్షకులకు ఎన్నో విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.

Go to top