" జెమిని T.V. ఇంటర్వ్యూ ... గెస్ట్ అవర్ "

మార్చి 4, 2007 న జెమిని న్యూస్ ఛానల్ గెస్ట్ అవర్ కార్యక్రమంలో పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రీజీ ఇంటర్వ్యూ మూడుసార్లు రిలే అయ్యింది. ఆనాటి ఇంటర్వ్యూలోని అంశాలు ... పిరమిడ్ మాస్టర్ల, పిరమిడ్ ధ్యానుల విశేష వినియోగార్ధమై ....

-ఎడిటర్


నమస్కారం పత్రీజీ,

" ప్రస్తుతం ప్రపంచంలో అంతా హర్రీబర్రీగా ఎవరి పనుల్లో వారు ... ఒకళ్ళ మీద ఒకళ్ళు ... ఆధిపత్యం సంపాదించాలని ఓ 'ర్యాట్ రేస్' అనే ధోరణి కొనసాగుతుంది సమాజంలో. ఎన్నో మానసిక ఒత్తిడులు, అలజడులు తలెత్తుతున్నాయి. దీనికంతటికీ

ఆధ్యాత్మిక మార్గం ఒక్కటే పరిష్కారం అని ప్రపంచవ్యాప్తంగా అందరూ మన భారతదేశ సంస్కృతిని పాటిస్తున్నారు. యోగం యొక్క ప్రాధాన్యతను తెలుసుకుని ప్రతినిత్యం యోగాన్ని సాధన చేస్తూ ... యోగాన్ని సాధన చేయిస్తూ ఎంతో సమాజసేవ చేస్తున్నారు. అసలు 'యోగా' న్ని ఎలా అభివర్ణించవచ్చు? "

" యోగం అంటే చిత్తవృత్తి నిరోధం. దట్ ఈజ్ ది డెఫినిషన్ ఆఫ్ యోగ. యోగశాస్త్ర పితామహుడు పతంజలి మహర్షి ... ఆయన నిర్వచనమే మనకి ఆధారం. 'యోగం' అన్న పదం యొక్క అర్థం 'కలయిక'. పతంజలి లేకపోయినా, యోగం వుంటుంది ... ధ్యానం వుంటుంది. ఐన్‌స్టీన్ లేకపోతే ఫిజిక్స్ ఉండకపోదు. గవాస్కర్ లేకపోతే క్రికెట్ ఉండకపోదు. అలాగే పతంజలి ఒకానొక యోగశాస్త్రవేత్త. ఆయనకు ముందు కూడా ఎంతోమంది యోగులు వచ్చారు. ఆయన తర్వాత కూడా ఎంతోమంది యోగులు వచ్చారు. అయితే ఆయన ఇచ్చిన నిర్వచనం 'యోగః చిత్తవృత్తి నిరోధః'. 'యోగం' అంటే 'చిత్తవృత్తులను నిరోధించడం'. "

" బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు ... లాంటి మహనీయులందరూ కొన్ని సూత్రాలు అందించారు ... మనస్సుని కంట్రోల్‌లో ఉంచుకోవడానికి, బుద్ధుడు ‘ ఆనాపానసతి ’ అన్నారు. అయితే యోగానికీ సత్‌ప్రవర్తనకూ సంబంధం వుందా ? మానవునికి

సత్‌ప్రవర్తన ఎలా వస్తుంది? "

" 'యోగం' నుంచే 'సత్‌ప్రవర్తన' వస్తుంది. 'యోగం' లోనే 'సత్యం' తెలుస్తుంది. 'సత్యం' తెలుసుకున్న తర్వాతే సత్యంలో 'జీవించడం' ప్రారంభమవుతుంది. " 'చర్మచక్షువు' లతో చూసింది 'సత్యం' కాదు ... అది కేవలం దృశ్యం. దృశ్యం ... అన్నది 'సత్యం' కాదు. 'ధ్యానయోగం' చేసినప్పుడే సత్యం యొక్క అనుభవం వస్తుంది ... అప్పుడే అందులో 'వర్తనం' వస్తుంది. 'వర్తనం' అంటే జీవించడం. 'ప్ర' వర్తనం అంటే విశేషంగా జీవించడం.

" ఆ బుద్ధుడికే, ఆ జీసస్‌కే సత్యం తెలుసు. అంతేకానీ మన చీఫ్ మినిస్టర్‌కీ, ప్రైమ్ మినిస్టర్‌కీ సత్యం తెలీదు. ఎందుకంటే వాళ్ళు యోగం చెయ్యలేదు. సంగీతం నేర్చుకుంటే సంగీతం వస్తుందా, నేర్చుకోకపోతే వస్తుందా? గొంతుంది, కానీ సంగీతం నేర్చుకుంటేనే మనకు సంగీతం వస్తుంది. అలాగే కేవలం శ్వాస ఉన్నంత మాత్రాన సత్యం తెలియదు. శ్వాస మీద ధ్యాస పెడితేనే ... ధ్యానం చేస్తేనే ... మనకు సత్యం తెలుస్తుంది. "

" మీరు చెప్పే ధ్యానాన్నీ, మంచి ప్రవర్తననీ సంపాదించడానికి ఏ ఏ మార్గాలున్నాయి? అనుసరించదగిన వివిధ మార్గాలు ఏంటి?"

"చెప్పాను కదా. 'యోగం' ... పతంజలి చెప్పిన చిత్తవృత్తి నిరోధ యోగం."

" 'శ్వాస మీద ధ్యాసే' ధ్యానమంటారా? ధ్యానం అంటే ఏమిటి? "

" తెలుసుకోవాలంటే ధ్యానం చెయ్యాలి. కేవలం ప్రశ్న అడిగితే, సమాధానం వింటే ధ్యానం తెలియదు. ధ్యానం చెయ్యాలి. అప్పుడే ధ్యానం గురించి తెలిసేది. దయచేసి ఒక్క నిమిషం కళ్ళు రెండూ మూసుకుని కూర్చుందాం. (ఒక్క నిమిషం ధ్యానం)

" అయితే మీరు ఇప్పుడు ఒక్క నిమిషం కూర్చున్నారు కదా? మీ వయస్సెంత? "

" 31 సంవత్సరాలు. "

" అయితే ... 31 నిమిషాలు కూర్చోవాలి. అప్పుడే మీ మనస్సు లోని ఆలోచనలన్నీ పోతాయి. "

" నాకు ఇక్కడ కొన్ని ప్రశ్నలు తలెత్తాయి గురూజీ ... అంటే శ్వాస మీద ధ్యాస అన్నారు, శ్వాస అనేది దీర్ఘంగా వుండాలా? అంటే ఎక్కువ త్వరత్వరగా గాలి లోపలికి పీల్చి బయటికి వదలటం పద్ధతా...? "

" స్మాల్ ... సింపుల్ ... నేచురల్ ... సాఫ్ట్‌ మరి టెండర్ బ్రెత్ ... అంటే సరళమైన ... స్వాభావికమైన... హ్రస్వమైన... శ్వాస. "

" అయితే, ఈ ఒక్క నిమిషంలో అయితే నా మనస్సుకు ప్రశాంతత అనేది ఇంకా ఏర్పడలేదు. మరి ఎంతసేపు చేస్తే వుంటుంది? కొన్నిరోజుల తర్వాత ప్రశాంతత వుంటుందా? మొదటి నుంచే వుంటుందా? "

" ప్రశాంతత అన్నది మొట్టమొదటిరోజు నుంచే వుంటుంది. అయితే ఎవరి వయస్సు ఎంతుంటుందో అన్ని నిమిషాలు నియమంగా కూర్చోవాలి. ఒక్క నిమిషం సరిపోదు కదా. "

" దీనివల్ల పూర్తిగా మనం ఏం సాధించవచ్చు? పరిపూర్ణత అంటే ఏమిటి? "

" బుద్ధుడు, మహావీరుడు లాంటి వాళ్ళు ఏం సాధించారో తెలుసుకదా మీకు ... అదే మీరూ సాధిస్తారు. "

" అన్నింటిలోకంటే కర్మయోగం గొప్పది. ఎవరి పని వాళ్ళు చేస్తే మొత్తం భారతదేశం బాగుపడుతుంది అని చెప్తారుగా ... అందరూ బుద్ధుళ్ళూ, మహావీరులూ అయిపొతే దేశాన్ని పోషించేదెవరు? "

" నా ఉద్యోగం .. నా కర్మ ... నేను చేసుకుంటూ నేను బుద్ధుడినయ్యాను. మీ ఉద్యోగం చేసుకుంటూ .. మీరూ ఓ బుద్ధుడు కండి. మనకు 24 గంటల సమయం వుంది కదా. పనికిరాని మాటలు ఎన్నో మాట్లాడుతూ ఉంటాంగా... అది కట్ చేసి ధ్యానం చెయ్యాలి. అప్పుడు సులభంగా బుద్ధుళ్ళమవుతాం. "

" అంటే మనం చేసే పనిలోనే కొంత సమయాన్ని వినియోగించలంటారా? "

" చేసే పనిలో తగ్గించమని కాదు. పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటాంగా ... ప్రొద్దుగూకులా ... అది ... ఒక నాలుగైదు గంటలు వుంటుంది. దాన్నంతా ధ్యానంలో పెట్టాలి. అప్పుడు బుద్ధుడౌతారు. "

" ఏ సమయంలో ధ్యానం చేసుకోవాలి? దీనికంటూ ఒక ప్రత్యేకమైన ప్రదేశం కానీ ... ప్రత్యేకమైన పోశ్చర్ కానీ ... "

" మీ ఇష్టం. Any time is O.K. ప్రొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ... ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు ఇలాగే కూర్చోవటం అంతే... అలాగే any place is O.K. Any posture is O.K. వెరసి హాయిగా కూర్చోవాలి ... ఇపుడు కూర్చున్నాంగా ...? అలాగే "

" మీరు ధ్యానం చేసే సందర్భంలో పాట పాడుతూ, అలాగే వేణువు కూడా వినిపిస్తూ వుంటారు. దానివల్ల ఎలాంటి లాభం? సంగీతం కాన్‌సన్‌ట్రేషన్ డిస్టర్బ్ చెయ్యదా? "

" పాట ఎంతో ... వేణువూ అంతే. రెండూ సంగీతమే కదా .. అసలు సంగీతం అంటే ఏమనుకుంటున్నారు మీరు?

" సంగీతం వింటే ... పాము కూడా లేచి ఆడాలి. మనిషి ఎలా ఆడకుండా వుంటాడు మరి ... సంగీతం వింటే చాలా మార్పు వస్తుంది. అయితే సంగీతం కన్నా మహత్తరమైనది ధ్యానం. చిత్తవృత్తుల శాంతము - అదియే ధ్యానము ... ' శాంతము లేక సౌఖ్యము లేదు ' అన్నారు కదా శ్రీ త్యాగరాజు.

" అన్నట్లు నేను రెండు ఇచ్చాను మీకు ఇక్కడ. ఒకటి మీకు జ్ఞానం కూడా ఇస్తున్నాను. ధ్యానమంటే ఏమిటో ... ఆ జ్ఞానం. ఇకపోతే రెండవది సంగీతం. మూడవ విషయం కూడా ఉందండోయ్ .. ఏమిటంటే నేను కేవలం సంగీతజ్ఞుణ్ణే కాదు. ఒక యోగీశ్వరుణ్ణి కూడా ... కనుక నాలో నుంచి ఆ వేవ్స్ కూడా వస్తాయి మీకు. ఇవన్నీ కలిపి మిమ్మల్ని చక్కటి ధ్యానస్థితిలోకి తీసుకువెళ్తాయి. అయితే ఎవరు వయస్సు ఎంత వుందో అన్ని నిమిషాలు ధ్యానం విధిగా, తప్పనిసరిగా చెయ్యాలి. That is the critical minimum time. "

" మీరు మన రాష్ట్రంలోనే కాకూండా దేశంలో చాలా ప్రాంతాల్లో కూడా ధ్యానానికి సంబంధించి లెక్చర్స్ ఇస్తూంటారు కదా ... ఎక్కడెక్కడ ఇస్తారు? ఏం చెప్తారు వేరే భాషలో ... అంటే వాళ్ళ స్థాన, స్థల పరిస్థితులకు అనుగుణంగా మారుస్తారా? లేకపొతే ...? మీరు రెగ్యులర్‌గా క్లాస్‌లలో ఏం చెప్తారు? "

" దేశ, కాల పరిస్థితులకు అతీతమైనది ధ్యానం. పిల్లలకీ పెద్దలకూ ఇదే ... ఆడవాళ్ళకూ, మగవాళ్ళకూ ఇదే ... పండితులకూ పామరులకూ ఇదే ... ఇండియాలోనూ, చైనా లోనూ, అమెరికాలోనూ ఇదే. ఒక్కటే సత్యం ... ఒక్కటే ధర్మం... ఒక్కటే మార్గం... "

" అన్ని క్లాసులలోనూ ఇదే చెప్తాను. ఇప్పుడు మీకేం చెప్పాను? మీకు చెప్పిందే అందరికీ చెప్తాను. ఉప్పు ఉప్పే ... ఎక్కడైనా ... "

" సామాజిక కార్యక్రమాల్లాంటివి ఏవైనా చేస్తారా? "

" ఇదే సామాజిక సేవ, ఇంతకన్నా మించిన సామాజిక సేవే లేదు. "

" దేశ కాల పరిస్థితులను మార్చాలంటే ... ప్రస్తుతం మనం ఒప్పుకున్నా ... ఒప్పుకోకపోయినా ... అంతా రాజకీయనాయకుల చేతుల్లో వుంది కదా ప్రస్తుతానికి మనల్ని పరిపాలించేది వాళ్ళే కదా? "

" సారీ ... ఎవ్వరూ మనల్ని 'పరిపాలించటం లేదు' ... మనల్ని మనమే పరిపాలించుకుంటున్నాం. రాజకీయనాయకుల చేతుల్లో ఏమీ లేదు. ఎవరి జీవితం వారి చేతుల్లోనే వుంటుంది, వుంది. "

" మనకంటూ ఒక కాన్‌స్టిట్యూషన్ కానీ, చట్టాలు కానీ అవసరం కదండీ. ప్రధానమంత్రి, రాష్ట్రపతి అవసరం కదా. నేనే ప్రధానమంత్రి, నేనే రాష్ట్రపతి అనుకుంటే కుదరదు కదా? "

" మీ జీవితానికి మీరే ప్రధాని. భారతదేశ ప్రధాని మీ సొంత జీవితానికి ప్రధాని కాదు. "

" స్వామీజీ ... ధ్యానం చేసేటప్పుడు ఆహార నియమాలు కానివ్వండి,ప్రవర్తనా పద్ధతులు కానివ్వండి ఎలా ఉండాలంటారు? "

" ధ్యానం ... చేసేటప్పుడు అంటే ... మనం భోంచేస్తూ ఏమీ చెయ్యం కదా. ధ్యానం అంటే ... ధ్యానం కోసం ... ఆహార నియమాలు అంటూ ప్రత్యేకంగా వుండవు. అయితే సరియైన జీవన విధానం కోసం నియమాలు ఆహార నియమాలు వున్నాయి. అవి 1.శాకాహారం 2. మితాహారం 3.వారానికొకసారి నిరాహారం. అదీ పెద్దలకు అయితేనే ... వయస్సు మళ్ళినవాళ్ళకు అయితేనే. "

" ప్రతి మనిషీ ... ప్రతిరోజూ ... జీవితాంతం ... ధ్యానం చెయ్యాల్సిందే. ఇది కంపల్సరీ. కనుక ఈ ధ్యానం కోసం వుండే నియమావళి అన్నది జీవితంలో వుండే నియమావళి. "

" యుక్తాహారం .. అంటే రైట్ ఫుడ్. మితాహారం .. అంటే లిమిటెడ్ ఫుడ్. నిరాహారం అంటే ... నో ఫుడ్. యుక్తాహారం అంటే ఏమిటి? శాకాహారమే వుండాలి. మేకను కోసి, జంతువులను కోసి, గద్దను కోసి, పామును కోసి, ఏనుగుని కోసి ... ఆ జంతువుల ఆహారం .. ఎంతో నీచం. మానవుడు జంతువులను తింటే మానవుడు కూడా ఒక క్రూరమృగమే. కనుక మానవునికి సరైనవి చక్కటి పళ్ళు ... ఫలాలు, కూరగాయలు, దుంపలు, గింజలు, విత్తనాలు. That is a right food. "

" ఒకసారి నేను పన్నెండురోజులు ఊర్లన్నీ తిరుగుతూ ... నా పని నేను చేసుకుంటూ .. 'నిరాహారం' గా వున్నాను. ఓన్లీ వాటర్. చాలా బావుంటుంది. "

" ఫ్రిజ్‌లో సాంబారు పెట్టి మూడురోజుల ఆ సాంబార్ తినకూడదు. ఫ్రెష్‌గా చేసుకుని తినాలి. కూరగాయలు, పాలు, పళ్ళు ఇలాంటి వాటికోసమే ఫ్రిజ్ కానీ సాంబారు, రసం, కూర, మొన్నటి కూర ... రాంగ్ ... అది 'అయుక్తం'. ప్రొద్దున చేసింది ఇప్పుడు తినకూడదు. ఇప్పుడు చేసిందే ఇప్పుడు తినాలి. ఇవన్నీ కూడా యుక్తాహారం క్రిందకు వస్తాయి. ధ్యానం చేసే ముందు ఒక అరగ్లాసు నీళ్ళు త్రాగి ధ్యానం అయిపోయిన తర్వాత మిగతా అరగ్లాసు నీళ్ళు త్రాగితే మంచిది. "

" మరి శరీరానికి ఎలాంటి 'వ్యాయామం' ఉండాలంటారు? "

" వ్యాయాయమా? మనం మార్కెట్‌కు వెళ్తాం. స్కూటర్ మీద వెళ్ళకుండా రెండు కిలోమీటర్లు నడిచి వెళ్తే బావుంటుంది."

" అంతకుమించి 'ప్రత్యేకం' గా ఎలాంటి వ్యాయామం చెయ్యవలసిన అవసరం లేదంటారా? "

" కొండలెక్కాలి. స్విమ్మింగ్ చెయ్యాలి. ఇదంతా వ్యాయామమే మరి. శరీరాన్ని శ్రమపెట్టడం తప్పనిసరి మనిషికి ... ధ్యానులకు గానీ, ధ్యానం చెయ్యని వాళ్ళకు గాని, అందరికీ శరీరాన్ని వంచడం అన్నది శరీరానికి ఎంతో ఆరోగ్యదాయకం. ధ్యానులకు అంటూ ప్రత్యేకమైన వ్యాయామ క్రియలు లేవు. ఏ యోగాసనాలూ అక్కరలేదు. మనిషి శరీర దృఢత్వానికి మటుకు .. క్రీడాకారులైతే .. చాలా ఎక్సర్‌సైజ్ చెయాలి. అయితే క్రీడాకారులు కానివారికి ఏ ఎక్సర్‌సైజెస్ తోనూ పనిలేదు. వాహనాల్లో తిరగడం తగ్గించి నడక రూపకంగా శరీరానికి కొంత వ్యాయామం ఇస్తే ఎంచక్కా సరిపోతుంది. "

" 'పిరమిడ్ సొసైటీ' గురించి చెప్పండి "

" నేను పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటి మొదలుపెట్టింది 1990 లో. మొట్టమొదటి స్పిరిచ్యువల్ సొసైటీ కర్నూల్‌లో స్థాపించాను. ఆ రోజుల్లో నేను కర్నూల్ లోనే పనిచేస్తూండేవాణ్ణి. ఉద్యోగం చేస్తుండేవాణ్ణి. అక్కడ మొదలుపెట్టాను 'కర్నూల్ స్పిరిచ్యువల్ సొసైటీ' అని చెప్పేసి. సో, అక్కడ మొట్టమొదటి ధ్యానకేంద్రం స్థాపించడం జరిగింది. దాని పేరు 'బుద్ధా పిరమిడ్ ధ్యానకేంద్రం'. కర్నూల్‌ను తప్పకుండా సందర్శించండి. అక్కడ ఒక పిరమిడ్ కట్టడం జరిగింది. రెండువందలమంది కూర్చుని చక్కగా ధ్యానం చేసుకోవచ్చు. ఆ తర్వాత గుంతకల్ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ, అనంతపురం, ధర్మవరం, తిరుపతి, నెల్లూరు, వైజాగ్, విజయవాడ ... అన్ని ఊళ్ళల్లో ఇప్పుడు పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వున్నాయి."


" పిరమిడ్, అదే 'స్ట్రక్చర్'ని ఎందుకు ఎంచుకున్నారు? "

" నేను 1982 లో ఒక పుస్తకం చదవడం జరిగింది. ఐ యామ్ యాన్ ఒరేషియస్ రీడర్ ఆఫ్ బుక్స్. కొన్నివేల పుస్తకాలు చదివాను. ఆధ్యాత్మిక పుస్తకాలు. అది నా జీవితం. 'ది సీక్రెట్ పవర్ ఆఫ్ పిరమిడ్స్'అని ఒక పుస్తకం వుంది 'బిల్ షుల్ & ఎడ్ పెటిట్'అని ఇద్దరు ఆథర్స్ ఆ పుస్తక రచయితలు. రకరకాల పిరమిడ్ నమునాలు చేసి ... అందులో వంకాయ పెట్టి, బెండకాయ పెట్టి ... వాళ్ళు అన్ని ఎక్స్‌పెరిమెంట్స్ చేసారు. ఆ పుస్తకం అంతా నేను చదివాను. చదివి మా కార్పెంటర్‌ని పిలిచి నాక్కూడా రెండు పిరమిడ్స్ చెయ్యమని చెప్పాను. ఒక చిన్న అట్టపెట్టెతో, ఆ యాంగిల్‌తో, వాడు చేసి ఇచ్చాడు. ఒక పిరమిడ్ లోపల ఒక టొమేటో పెట్టాను. ఒక టొమోటో పిరమిడ్ బయటపెట్టాను. పిరమిడ్ అంటే ఏమీలేదు. స్క్వేర్‌బేస్, 52 డిగ్రీ యాంగిల్‌తో నాలుగు వాల్స్ ఆనిస్తే అదే 'పిరమిడ్' అవుతుంది. అలా పెడితే బయట వున్న టొమోటో రెండుమూడురోజుల్లో కుళ్ళిపోయింది. లోపలున్న టొమేటో ఒక నెలరోజులు ఫ్రెష్‌గా వుంది. ఆ విధంగా నేను పిరమిడ్ శక్తిని తెలుసుకున్నాను. పుస్తకాల ద్వారా నేను ఇతరుల పిరమిడ్ ఎక్స్‌పెరిమెంట్స్ చదివాను. దానికి నా స్వంత అనుభవం జతపడింది.

" ఆ తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ఒక ఇండస్ట్రియలిస్ట్ కర్నూల్‌లో, ముందుకొచ్చి 'నేను ధ్యానకేంద్రం కడతాను, నా దగ్గర డబ్బులున్నాయి' అన్నారు. 'పిరమిడ్ కట్టాలి' అన్నాను. వెంటనే ఆరునెలల్లో కట్టేసాడాయన. ఆయనే B.V.రెడ్డి గారని కర్నూల్‌లో ఇండస్ట్రియలిస్ట్. "

" ప్రపంచవ్యాప్తంగా వున్న యోగులను ... అంటే సోక్రటీస్ కానివ్వండి, ప్లేటో కానివ్వండి, గౌతమబుద్ధుడు, గాంధీజీ, మహావీరుడు ... వీళ్ళందరి మీద మీరు స్టడీ చేసారు. వాళ్ళందరి మనోభావాలు మీరు చక్కగా అందరికీ అర్థమయ్యేరీతిలో చెప్తున్నారు. వాళ్ళల్లో వున్న గొప్పతనం ఏంటి? యోగాకి సంబంధించి కానీ, ధ్యానానికి సంబంధించి కానీ వారి అభిప్రాయలేంటి? "

" 'మరణాంతరం వుంది' అని జీవించేవాళ్ళు ఎప్పుడూ సరిగ్గా జీవిస్తుంటారు. మరణాంతరం తర్వాత జీవితం లేదనుకునేవాళ్ళు ఎప్పుడూ మూర్ఖపు అథవా దుర్మార్గపు పనులు చేస్తూంటారు. "

" 'ఆస్తికుడు', 'నాస్తికుడు' అని రెండు రకాలు వున్నారు. ఆస్తికుడు అంటే 'అస్తి' అనేవాడు. అంటే 'వుంది' అనేవాడు. ఏమిటి 'వుంది'? ఒక 'ఆత్మ' వుందనీ, ఒక 'మరణాంతర జీవితం' వుందనీ, ఒక 'మంచి', 'చెడు' వుందనీ. 'నాస్తి' అంటే ఇవన్నీ 'ఏమీ లేవు'. అంటే, ఇవన్నీ లేనప్పుడు వాడు ఏమైనా పనులు చేస్తూంటాడు. కనుక నాస్తికత్వం అనేది మూర్ఖత్వానికి దారి లేదా దుర్మార్గాలకు దారి. అయితే ఆస్తికత్వం మటుకు సన్మార్గానికి దారి అనే మీరు ఉటంకించిన యోగులందరూ చెప్పారు. "

" రమణమహర్షి 'నిన్ను నువ్వు తెలుసుకో' ... గౌతమబుద్ధుడు 'అప్పో దీపో భవ' ... 'నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో' ... వేదవ్యాసుడు 'ఉద్ధరేదాత్మనాత్మానాం ...' 'ఎవరి వారే ఉద్ధరించుకోవాలి' ... ఇలా అందరూ ఒక్కటే సత్యాన్ని చెప్పారు. అందరూ చెప్పింది ధ్యానమే... అందరూ చెప్పింది సరైన ఆధ్యాత్మికతే. "

" ఆధ్యాత్మికత ... అంటే 'ఆత్మపదార్ధం వుంది' అని; ధ్యానం అంటే ... 'మనస్సుని శూన్యం చేసుకో' అని. మనస్సు శూన్యం అయితేనే గానీ ఆత్మపదార్ధం తెలియదు. 'సత్‌ప్రవర్తన' అన్నారే మీరు ... అంటే ఆ 'ఆత్మ' అనే 'సత్యం' లోకి వెళ్ళి తెలుసుకుని అందులో జీవించే విధనాన్నే 'సత్‌ప్రవర్తన' అంటారు. మీరు అనుకుంటున్న సత్‌ప్రవర్తన వేరు ... మాకు తెలిసిన సత్‌ప్రవర్తన వేరు. ఆత్మగా జీవించడమే, సదా ... ప్రతి ఆలోచనలోనూ, ప్రతి వాక్కులోనూ, ప్రతి కర్మలోనూ ... దాన్నే 'సత్‌ప్రవర్తన' అని నేనంటాను. అది బుద్ధుడు చేసాడు, సోక్రటీస్ చేసాడు. రమణమహర్షి చేసాదు, లక్షలమంది చేసారు. ఇక మీరు, నేను కూడా చెయ్యాలి. "

" 'మెడిటేషన్' అనేది ఒక 'సైన్స్' అంటారా? లేక ఎలాంటి బేస్ లేని ఒక ఆలోచనా? మనకి మనం ఊహించుకుని చేసేదంటారా? "

" అది 'ఊహ' అయితే నేను ఇక్కడ ఉండేవాణ్ణి కాదు. మీరు నన్ను ఇంటర్వ్యూ చేసేవారు కాదు. అది సైన్స్ కనుకనే ఆ సైన్స్‌తో నేను దాన్ని సాధించాను. సాధించాను కనుకనే మీరు నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్నారు. 'ఊహ' అయితే మీరు నన్ను పిలువనే పిలువరు. ఇది సైన్స్. సైన్స్ అంటే ఏమిటి ... రెప్లికబిలిటీ. ఒకళ్ళు ఒక పనిని చేస్తూ అందరూ ఆ పనిని చేయగల సమర్ధులు అన్నమాట... దాని పేరే రెప్లికబిలిటీ. "

" ఉదాహరణకు ... నేను A+B చేశాను అనుకోండి నాకు C+D వచ్చింది. ఒక 'గివెన్ టెంపరేచర్ అండ్ ప్రెషర్' లో A+B రెండూ కలిపితే C+D అని వచ్చాయనుకోండి. మీరు కూడా అదే టెంపరేచర్‌లో, అదే ప్రెషర్‌లో మీరు కూడా A,B లను కలిపితే మీక్కూడా అదే C+D రావాలి. దట్ ఈజ్ సైన్స్. "

" అంటే ధ్యానంలో బుద్ధుడు ఏదో చేసాడు. నేను కూడా అదే ధ్యానం చేసాను. నాకూ అదే రావాలి. గౌతమసిద్ధార్ధుడు ధ్యానం ద్వారా బుద్ధుడు అయ్యాడు. అంటే బుద్ధి వచ్చింది. మనకు కూడా బుద్ధి వస్తుంది. నాక్కూడా బుద్ధి వచ్చింది. 'బుద్ధి' అంటే ... ఏమిటి? ఏది తినాలో, ఏది తినకూడదో తెలుసుకోవడం. ఎలా మాట్లాడలో, ఎలా మాట్లాడకూడదో తెలుసుకోవడం. డబ్బు ఎంత సంపాదించకూడదో తెలుసుకోవడం. "

" చతుర్విధ పురుషార్థాలు కదా ... అంటే ప్రతిరోజూ ఇంత ధర్మం చెయ్యాలి. అంటే ఏంటి ... కాస్త ప్రక్కవాళ్ళను చూసుకోవాలి. మీ భార్య, మీ పిల్లలు, మీ తల్లిదండ్రులూ అంతా మీ ప్రక్కవాళ్ళే కదా. అది మీ ధర్మం... ప్రతిరోజూ ఒక రెండు బస్తాలు మోసి రెండు రూపాయలు సంపాదించాలి. ప్రతిరోజూ మీ యొక్క ఆకలి చూసుకోవాలి. మీ యొక్క కామాన్ని మీరు ఎంచక్కా చూసుకోవాలి. మీ యొక్క సొంత కోర్కెలు మీకుంటాయి కదా. "

" చివరిగా 'జ్ఞానం' ఏమిటి? ... 'సత్యం' ఏమిటి? అని ప్రతిరోజూ కొంత 'మోక్షం' చూసుకోవాలి. పుట్టిన మొదటి 25 సంవత్సరాలు కామం అనీ, తర్వాత 25 సంవత్సరాలు అర్థం అనీ, తర్వాత ధర్మం అనీ, చచ్చిపోయేముందు మాత్రం మోక్షం అనీ, దట్ ఈజ్ నాట్ కరెక్ట్. ప్రతిరోజూ ఈ నాలుగూ వుండాలి. అంటె 100 సంవత్సరాల ముసలివాళ్ళు కూడానూ కామంలో వుండాలి ... పదేళ్ళ పిల్లవాడు కూడానూ మోక్షంలో వుండాలి. "

" ఇప్పుడు చతురాశ్రమాలు అని పెట్టారు కదండీ బ్రహ్మచర్యం, వానప్రస్థం, గృహస్థాశ్రమం ...? "

" బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నప్పుడు మనం తల్లిదండ్రుల దగ్గర వుంటాం. గురువు దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకుంటాం. తర్వాత గృహస్థాశ్రమం... మనకో 'సంసారం' వుండాలి. మనం 'ప్రపంచాన్ని' చూడాలి. తర్వాత వానప్రస్థం ... మన పిల్లల్ని వదిలిపెట్టేసి కాస్త కమ్యూనిటీ సంగతులు చూసుకోవాలి. ఇక చివరిగా మొత్తం జగత్తును చూసుకోవాలి. అది సన్యాసాశ్రమం. ఈ నాలుగు ఆశ్రమాలు కంపల్సరీగా వుండాలి ... చచ్చిపోయేలోపల. అదీ కరెక్ట్ జీవన పద్ధతి. "

" 'తత్వం' తో జ్ఞానాన్ని సంపాదించవచ్చంటారా? మెడిటేషన్ లేదా భక్తిమార్గం ద్వారానే సాధ్యమవుతుందంటారా? "

" ఓన్లీ మెడిటేషన్. తత్వంతో .. తత్వం వస్తుందంతే. అది అనుభవం కాదు కదా. నేను అన్న పదార్థం శరీరంలో నుంచి బయటకు రావాలి. ఆ శరీరం నేను కాదు అని తెలుసుకోవాలి. అది అనుభవం, జ్ఞానం."

" త్రీ లాస్ ఆఫ్ సైన్స్ ఆఫ్ మెడిటేషన్ అంటారు కదా అవి ఏంటండి? "

" యు ఆర్ రైట్. ఈ ప్రశ్న అడుగుతారేమో అని వెయిట్ చేస్తున్నాను నేను. I am happy you have asked. ఎలాగైతే న్యూటన్ లాస్ మూడు వున్నాయో .. అలాగే సైన్స్ ఆఫ్ మెడిటేషన్‌లో కూడానూ మూడు లాస్ వున్నాయి. అవి నేను కనుక్కున్నాను. "

" ఫస్ట్ లా ఏంటంటే ... స్వామీజీ ... శ్రద్ధగా వినండి. ఎప్పుడైతే మీరు శ్వాసని 'గమనిస్తారో' అప్పుడు మీ మనస్సు 'శూన్యం' అయిపోతుంది. అది ఫస్ట్ లా. ఇప్పుడు మీరు మంత్రం చెప్పారనుకోండి 'ఓమ్ మణి పద్మేహం' .. లేకపోతే ఇంకేదో మంత్రం ... మీ మనస్సు శూన్యం కావడానికి ఎంతో సమయం పడుతుంది. అలా కాక మీరు శ్వాసతో ఉన్నట్లయితే అప్పుడు మీ మనస్సు వెంటనే శూన్యం అవుతుంది. అది మొట్టమొదటి సూత్రం. "

" సెకండ్ లా ఏంటంటే ... ఎప్పుడైతే మీ మనస్సు శూన్యమైపోతుందో బయటవున్న విశ్వశక్తి 'మీ శరీరంలోకి' ప్రవహిస్తుంది. మీరొక మొక్కను చూశారా? ఒక్కనొక మొక్కకు రూట్ సిస్టమ్ వుంటుంది కదా. ఆ రూట్ సిస్టమ్ లోకి సాయిల్ లోని నీరు, అన్ని ఖనిజాలు ఎలా వస్తాయి? వస్తాయా రావా? అలాగే అక్కడ సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ వుంటుంది. ఆస్మోసిస్ ద్వారా నీరు, ఆ ఖనిజాలు వేరులోకి ప్రవేశిస్తాయి. అలాగే మనస్సు కూడా 'సెమీ పెర్మియబుల్' కావాలి. ఇక్కడ 'ఆలోచనల డెన్సిటీ' తగ్గాలి. అప్పుడు బయటి ఎనర్జీ లోపలికి వస్తుంది. తలకాయలో ఓ చిందరవందర పనికిరాని 'ఆలొచనల పుట్ట' ఉందనుకోండి, ఆ ఆలోచనల ద్వారా మన శక్తి బయటికి వెళ్ళిపోతూంటుంది. బయటి శక్తి లోపలికి రాదు. "

" ఇదంతా సింపుల్ ఫిజిక్స్ ... అయితే మెటా ఫిజిక్స్. ఆలోచనలు శూన్యమైనప్పుడు బయటి ఎనర్జీ లోపలికి వస్తుంది. అదీ సిద్ధాంతం. ఆలోచనలు శూన్యం కావాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి. "

" థర్డ్ లా ఏంటంటే ... ఎప్పుడైతే శరీరం ఆ శక్తితో బాగా 'నిండి' వుంటుందో అప్పుడు రకరకాల 'ఆత్మ యొక్క శక్తులు' మనకే అనుభవానికి వస్తాయి. ఆత్మ యొక్క శక్తులు అనుభవానికి వచ్చినప్పుడు నువ్వే యోగీశ్వరుడు. కృష్ణుడు యోగీశ్వరుడయ్యాడు. ఆయనకెన్నో శక్తులు వచ్చాయి. "

" మీరు మ్యూజిక్ ద్వారా, అంటే వేణువు ఊదటం ద్వారా మనిషిని ఒక తాదాత్మ్యతలోకి తీసుకువెళ్ళి అలా రెండుమూడుగంటలు కూర్చోబెడతారేమో? మాయచేసి. "

" మాయ చేస్తా. (నవ్వులు) సంగీతం అనేదే మాయ.. ఆ మాయలో నేను పడ్డాను. "

" అది మాకు కూడా వినిపించొచ్చు కదా. "

" ఆహా ... అయితే నేను ఫ్లూట్ వాయించాలంటే మీరు కాసేపు ధ్యానం చెయ్యాలి మళ్ళీ. "

" రెండు మూడు గంటలైతే కాదు కదా. "

" కాదులేండి, రెండు నిమిషాలు. "

" సరే అయితే "

" మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ధ్యానంలో కూర్చోండి. మీరు నా సంగీతం వినడానికి ప్రయత్నం చెయ్యవద్దు. మీరు మీ 'శ్వాస మీద ధ్యాస' ఉంచాలి. సంగీతం అన్నది మీరు ప్రయత్నం చేసినా, చెయ్యకపోయినా మీ చెవుల్లో నుంచి లోపలికి వెళ్ళిపోతూంటుంది. అండర్‌స్టాండ్. ప్రయత్నం చెయ్యకూడదు. మీ ప్రయత్నం ఎక్కడుండాలి? మీ ధ్యానంలో వుండాలి. మీ ధ్యానానికి సంగీతం కేవలం ఉపకరణం. కనుక మీరు ధ్యానం చేస్తూండండి ... ధ్యానం అంటే ఏమిటి? శ్వాస మీద ధ్యాస అంతే. సో, మీరు మీ పని మీద కాన్‌సంట్రేట్ చేస్తూంటే, నేను నా పని మీద కాన్‌సంట్రేట్ చేస్తూంటాను. కళ్ళు రెండూ మూసేసుకోండి. " (ఒక నిమిషం ధ్యానం)

మెల్లిగా కళ్ళు తెరవండి. ఒక చిన్న మోసం చేశాను. ఒక నిమిషం అని రెండు నిమిషాలు కూర్చోబెట్టేసాను. సారీ ఫర్ దట్."

" ధ్యాన చక్షువు అంటే 'మూడవకన్ను' లాంటిది ఏమైనా ఉపయోగించి ..."

" అది చాలా దూరం లెండి. ఫస్ట్ మన శరీరం బాగుండాలి. అంటే తలనొప్పి, కడుపునొప్పి, క్యాన్సర్స్ లాంటి ఏ రోగాలైనా పోతాయి. తర్వాత మనస్సు బాగవుతుంది. ఫస్ట్ శరీరం బాగవుతుంది. ఏ రోగం వుంటే, ఆ రోగం పోతుంది. "

" మీ అమృతవాక్కులతో ... మీ శ్రావ్యమైన సంగీతంతో ... మా కళ్ళు కాసేపు మూయించి ధ్యాన చక్షువుని తెరిపించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. "

Go to top