" మిరాకిల్ విల్ హ్యాపెన్ "

ధ్యానులందరికీ నా ప్రణామాలు. నా పేరు ఆదిత్యకుమారి. మా వారు పాపారావు. మేమిద్దరం ECIL లో వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకున్నాం. డాక్టర్ A.S.రావు నగర్‌లో "గౌతమ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం" స్థాపించి నిర్వహిస్తున్నాం.

బెంగళూరు మెగా పిరమిడ్‌లో బుద్ధపూర్ణిమ ధ్యాన ఉత్సవాలకు వెళ్ళాలనుకుంటున్న తరుణంలో అమెరికాలో ఉన్న మా పెద్దబ్బాయి ఇండియా రావడం ఆ మాస్టర్స్ చేసిన ఏర్పాటే అనుకుంటున్నాను. తాను అప్పటికి ఐదు నెలల నుంచి ఆనాపానసతి ధ్యానం చేస్తున్నాడు. ఇన్ని వేలమంది ధ్యానులతో చేరి ధ్యానించే సదవకాశాన్ని వాడికి కూడా కల్పించాలని నా కోరిక. కానీ "అన్నివేలమందిలో అక్కడ వసతి సౌకర్యంగా లేకపోతే? స్నానపానాదులకు ఇబ్బంది కలిగితే? మూడుగంటల ధ్యానానికి కూర్చోగలడో, లేడో" ... ఇలా అన్ని సందేహాలే.

సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ మెగా మురళి, P.శ్రీనివాసరావు గార్ల కుటుంబాలతో కలసి మా కుటుంబం, రావుల అంజయ్యగారు, డాక్టర్ V.హరికుమార్, D.శ్రీరాములు గారు ... దాదాపు 20 మందితో మా బెంగుళూరు ప్రయాణం చాలా ఆనందంగా సాగింది. అక్కడి ఏర్పాట్లు చూసిన తర్వాత నిర్వాహకులను ప్రశంసించకుండా ఉంటే అది కృతఘ్నత అనిపించుకుంటుంది.

ఆశ్రమ వాతావరణాన్ని తలపింపజేసే కుటీరాలలో బస. అన్ని వేలమంది ఉపయోగిస్తున్నా ఎంతో పరిశుభ్రంగా, సౌకర్యంగా ఉన్న స్నానశాలలు. వేళ తప్పకుండా వేడివేడి అల్పాహార, భోజన ఏర్పాటు. ప్రతి మనిషి నిత్యావసరాలకి ఇసుమంతైనా లోటు రానీయకుండా ఈ ఏర్పాటు కేవలం పిరమిడ్ మాస్టర్స్ మాత్రమే అంత సమర్ధవంతంగా చేయగలరనిపించింది.

ఇంక పచ్చని ప్రకృతి ఒడిలో ఒదిగిన మెగా పిరమిడ్‌లో మూడుగంటల అఖండ ధ్యాన సమయం ఎలా గడచిందోనని మా అబ్బాయికి అమిత ఆశ్చర్యం. ఎంతో ఆనందాన్ని అనుభవించాడు. అదే విషయాన్ని మన పత్రీజీతో తన మొదటి పరిచయంలో చెప్పాడు. ఆయన అమిత వాత్సల్యంతో తనని అలింగనం చేసుకోవడాన్ని చూశాక వాడి జన్మ సార్ధకమైందని ఎంతో పరవశించిపోయాను.

తిరుగుప్రయాణంలో జరిగింది అసలైన అద్భుతం. పిరమిడ్ వ్యాలీ నుండి బయలుదేరడానికి మా వాహనం వచ్చేసరికి 2.30 గంటలు అయింది. కానీ వున్నట్లుండి మా వాహనం ఫెయిల్ అయి కదలనని మొరాయించింది. దిక్కుతోచని స్థితి. సాయంత్రం 5.00 గంటలకు బెంగుళూరులో ట్రైన్‌కి దాదాపు రెండు గంటలు ప్రయాణించి ఎలా చేరగలం? వ్యాలీ నుండి రోడ్డు వరకూ దాదాపు 1.5 కిలోమీటర్లు వెళ్ళి ఇంకొక వాహనం వెతికి తీసుకురావాలంటే కనీసం ఒకగంట పడుతుంది. మెగా మురళి గారు, శ్రీనివాసరావుగారు ఇంకో వాహనం కోసం రోడ్డు మీదకు వెళ్ళారు. మేమందరం వ్యాలీకో చెట్లక్రింద ఎదురు చూస్తున్నాం. మా పెద్దబ్బాయి చాలా ఒత్తిడిని ఫీల్ అవుతున్నాడు. నేను "చూస్తుండు, మనం అనుకున్న ప్రకారం వెళ్తాం. మిరాకిల్ విల్ హ్యాపెన్. మాస్టర్స్ వెళ్ళారుగా. నువ్వు టెన్షన్ పడకు" అని చెప్తున్నాను.

దాదాపు 3.30 గంటలు అయ్యింది. ఎదురుగా ఆర్టీసి బస్సు. కలో నిజమో తెలీని స్థితి. కనకపురా నుండి బెంగుళూరు వెళ్తున్న R.T.C. బస్సుని రిక్వెస్ట్ చేసి, సుమారు 1.5 కిలోమీటర్లు లోపలికి దారిమళ్ళించి, పిరమిడ్ వ్యాలీకి తీసుకువచ్చిన ఘనత ఎవరిది? ఎదురుగా కనిపిస్తున్న పిరమిడ్ మాస్టర్స్ మెగా మురళి, శ్రీనివాసరావు గార్లదా? కంటికి కనిపించని మరెంతమంది ఆస్ట్రల్ మాస్టర్స్ ఉన్నారో పత్రిసార్‌కే తెలియాలి. వీరందరూ కలిసి చేసిన అద్భుతం.

ధ్యాన మహిమను గ్రహించడానికి ఇంతకన్నా ప్రత్యక్ష అనుభవం ఎవరికైనా అవసరమా?.

- P. ఆదిత్యకుమారి,
గౌతమబుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం,
MIG-A-87,Dr.A.S. రావు నగర్, హైదరాబాద్ - 500062,
ఫోన్ : 040-27123905

Go to top