" మెగా పిరమిడ్‌లో మెగా అనుభవం "

 

పత్రీజీ, సురేష్ దంపతులతో కలసి మే 10 న బెంగూళూరు బయల్దేరాను. మొట్టమొదటిసారి నేను పత్రీజీ గారితో ప్రయాణం చేయడం.

ఆ రోజు సార్ చేతిలో ఒక పుస్తకం చూశాను. నేను సార్‌తో అన్నాను. "మీ పరిచయం కాకముందు నేను దేశవిదేశాలు తిరిగేదాన్ని. గంటలకొద్దీ ప్రయాణం. గంటలు గంటలు ఎయిర్‌పోర్ట్‌లో వేచి ఉండటం ఉన్నా, చేతిలో ఒక పుస్తకం, ఒక వాక్‌మెన్‌లో పాటలతో ఎప్పుడూ హాయిగా కాలక్షేపం చేసేదాన్ని. కానీ ఇప్పుడు విమానంలో ఎక్కగానే హాయిగా కళ్ళుమూసుకుని శ్వాసను గమనించటం అలవాటుగా మారింది. చాలా ఆనందంగా ఉంది " అన్నాను.

వెంటనే సార్ " మేడమ్, ఈ పుస్తకం మీ కోసమే " అన్నారు. అప్పుడు ఆ పుస్తకం పేరు చూసాను. " Power Vs Force ". నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ పుస్తకం నా దగ్గరకు నాలుగు సంవత్సరాల క్రితం వచ్చింది. U.S.A.లో నా క్లోజ్ ఫ్రెండ్ " నీకు చాలా హెల్ప్ చేస్తుంది " అని ఇచ్చింది. నేను చదవడానికి ప్రయత్నించాను. కానీ పెద్దగా నచ్చలేదు. బహుశా అర్థం కాలేదేమో కూడా. ఆ మాటే చెప్పగానే సార్ నాకు ఒక పేజీ ఓపెన్ చేసి "చదవండి" అన్నారు. అంతే, ఇప్పుడు అవన్నీ రాస్తే నా ఈ వ్రాయడం ఆగదు. పైగా 'పిరమిడ్' విషయం వ్రాయలేను. కానీ ఒక్కటి చెప్పగలను. నా హెల్త్ ప్రోబ్లెమ్స్ గురించి నాకు కరెక్ట్‌గా సమాధానం దొరికింది. వెంటనే సార్‌కి షేక్‌హ్యాండ్ ఇచ్చి "థాంక్యూ సర్" అని చెప్పాను.

ఆ తర్వాత హాయిగా వాళ్ళు సర్వ్ చేసిన డిన్నర్ తిని నా శ్వాస దగ్గరకు వెళ్ళిపోయాను. ఎంతో రిలీఫ్, ఎంతో ఆనందం. చక్కని విజన్. ఎంతకీ కళ్ళు తెరవాలి అనిపించలేదు. ఎందుకంటే పత్రీజీ కనిపించారు. వెంటనే ఆయన ముఖం నా మనుమడు 'భవేష్' ... ఒక సంవత్సరం పిల్లాడు ... ముఖం లాగా మారిపోయింది. బలవంతంగా కళ్ళు తెరిచాను. ఆయన ముఖంలొ అదే దైవత్వం, అమాయకత్వం కనిపించాయి. చెప్తే నవ్వేశారు.

మాతో వచ్చిన సురేష్ గారి సతీమణి విజయగారు అదే మొదటిసారి విమానం ఎక్కడం. బెంగళూరు చేరేటప్పటికి ల్యాండ్ అవడానికి వీలులేక పైన కాసేపు తిప్పారు. "లలిత గారు, విజయ గారు విమానం దిగడానికి ఇష్టపడలేదు... అందుకే అలా జరిగింది" అని సురేష్ గారు జోక్ చేశారు. ఎంతో అద్భుతమైన ప్రయాణం. బెంగళూరు ఎయిర్‌పోర్ట్ బయట వానలో సార్‌తో పాటు వేసిన ప్రతి అడుగూ నాకు గుర్తే. మరచిపోలేని అనుభవాల్లో అదొకటి.

రాత్రి గెస్ట్‌హౌస్‌లో రెస్ట్. ఉదయం రెడీ అయిన బ్రేక్‌ఫాస్ట్ కోసం రాగానే సురేష్ గారు అక్కడ ఒక మేడమ్, ముగ్గురు పిల్లలతో కూర్చుని వున్నారు. ఆమెను చూపించి "మేడమ్, She is a great Master and Channel. Please talk to her" అని చెప్పి వెళ్ళిపోయారు. ఆమె ' కెన్యా ' నుంచి వచ్చారు. పేరు ' పెట్రీషియా '. ఆ పేరు నాకు చాలా సుపరిచితం. నా జీవితంలోని ఒక ముఖ్యమైన మలుపుకు కారణమైన ' లూయీస్‌హే ' వర్క్‌షాపులో మా టీచర్.

" ఓహో నేను ఆ పెట్రీషియా టీచర్ దగ్గర పాఠాలు అన్నీ నేర్చుకున్నాను. మళ్ళీ ఈ పెట్రీషియా టీచర్ ఎందుకు వచ్చిందో? " అనుకున్నాను. ఆవిడతో నా పేరు చెప్పబోతుండగా సగంలోనే ఆపి "Yes, Mom, glad to see you" అన్నారు. అని "Do you do Channeling?" అన్నారు. నేను "No, అవన్నీ నాకు తెలియవు" అన్నాను. వెంటనే తాను "You are doing it, but you don't know" అన్నారు. ఆ తర్వాత ఆవిడ పిల్లలు పరిచయం అయ్యాక "అసలు ఇండియాకి ఎలా వచ్చారు?" అన్నాను. అత్యంత ఆసక్తికరమైన ఆమె కథనాన్ని వినిపించారు.

తాను 12 సంవత్సరాల వయస్సు నుంచి భగవంతుని గురించి తెలుసుకోవాలని తపించిపోయేదట. ఎప్పుడూ మన హిందూ దేవతల ఆకారాలు కన్పించేవట. అప్పట్లో అవేంటో తెలిసేవి కావట. ' పిరమిడ్ ' అంటే ఎంతో ప్రేమ, ఇష్టంగా ఉండేది. ' పిరమిడ్ ' కీ తనకూ ఏదో అనుబంధం ఉండేదని చెప్పింది.

అక్కడ ఉద్యోగరీత్యా ముంబయి నుంచి వెళ్ళిన ఒక ఇండియన్‌ని పెళ్ళాడంది. ముగ్గురు ఆడపిల్లలు కలిగారు. కానీ, తనలో ఒక తపన, ఆరాటం ... ఇంకా ఏదో కావాలని.

ఛానెలింగ్‌లో ఇప్పుడు ఈ భూమి మీద ఒక భగవంతుడు సజీవంగా నడయాడుతున్నట్లు వచ్చేదట. " అక్కడికి వెళ్ళు " అని ఎవరో తొందరపెట్టినట్లుగా ఉండేది. " హైదరాబాద్ " అని చాలాసార్లు వినిపించిందట. కానీ అది ఎక్కడ ఉందో తెలీదు. భర్తను అడిగితే " సౌత్‌లో ఉంది నాకు సరిగ్గా తెలియదు " అన్నారు. రాను, రాను ఇండియా వెళ్ళాలని తపన పెరిగింది. వెంటనే సకుటుంబంగా ముంబయిలో దిగింది. అక్కడ కాలు మోపగానే ఇంటికి వచ్చిన ఫీలింగ్, "నా స్థలం నా ఇల్లు" అన్న భావం కలిగిందట. అక్కడి నుంచి ఎలాగో మైసూర్ చేరింది. కానీ, తాను చూడాలనుకున్న 'GOD' ఎక్కడున్నాడో తెలీదు. ఎలా ఉంటాడో తెలీదు. కానీ వెతుకుతూనే ఉంది.

అప్పుడే ఒక అద్భుతం జరిగింది. ఆమెకు " స్పిరిచ్యువల్ ఇండియా " మ్యాగజైన్ ఇవ్వబడింది .. మైసూర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మి గారి ద్వారా. అదీ 2004 సంవత్సరానిది. అంతే, ఆవిడకు తాను ఎవరికోసం వచ్చిందో అర్థం అయింది. " Law of Karma " అన్న ఆర్టికల్‌లో ... తాను వెతుకుతూన్న ప్రశ్నలన్నింటికీ పత్రీజీ ఆ పత్రికలో సమాధానం ఇచ్చారు. వెంటనే వివరాలు తెలుసుకుంది. ' పిరమిడ్ ' గురించి విని ఆశ్చర్యపోయింది. "ఈ దేశంలో ఇంత పెద్ద పిరమిడ్ ఎలా సంభవం? " అనుకుందట. మైసూర్‌కి దగ్గరలోనే పిరమిడ్ ఉందనీ, పత్రీజీ అక్కడికీ వస్తున్నారనీ తెలిసి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యింది. వెంటనే ప్రయాణం చేసి ఆ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంది.

అసలు కథ ఇక ఇప్పుడు మొదలయ్యింది. పత్రీజీకి నేను విమానంలో వస్తున్నప్పుడు చెప్పాను, " సార్, నాకు ఈ మధ్య ఎవరితోనూ మాట్లాడాలని లేదు. I want to be with my self ... అందుకే బెంగుళూరు వస్తున్నాను. నేను అచ్చంగా పిరమిడ్‌లో కూర్చుని ధ్యానం చేసుకుంటాను. నన్ను మాట్లాడామని అనొద్దు " అన్నాను. మీకందరికీ తెలుసు ... సార్ చిన్నగా నవ్వి " అలాగే మేడమ్, అంతా మీ ఇష్టం " అన్నారు.

ఇంక పెట్రీషియాను, పిల్లల్నీ తీసుకుని పిరమిడ్ చేరాం. అప్పటికే మెడిటేషన్ మొదలయ్యింది. నేను పిల్లల్ని బయట ఆడుకోమని తనని తీసుకుని నేను పిరమిడ్‌లోకి వెళ్ళాను. కూర్చుని మెడిటేషన్ చేయమని ఇద్దరం కూర్చున్నాం. పత్రీజీ వేణునాదంతో అంతా మైమరచి ఉన్నారు. కూర్చున్న అరసెకనులోనే అద్భుతమైన అనుభవం.

ఆ పిరమిడ్‌లో ఉన్న ఎనర్జీని ఎలా వర్ణించాలి? ' ఎలక్ట్రిఫికేషన్ ' లాగా కాస్మిక్ ఎనర్జీ పై నుంచి వస్తుందంటారు. నాకు మాత్రం ఆ రోజు క్రింద కాళ్ళలోంచి, ప్రక్కలనుంచి, అన్ని ప్రక్కల నుంచీ, ఒక దివ్యతేజం వచ్చి నాలోకి దూసుకుపోతున్నట్లుగా, నేను ఒక కాంతి వెలుగు whirlpoolలో చుట్టుకున్నట్లు విచిత్రమైన అనుభూతి. పంచముఖ ఆంజనేయస్వామి రామలక్ష్మణులను చెరొకవైపూ ఉంచుకుని ఆ పిరమిడ్‌పై విహరిస్తున్నట్లు అద్భుతమైన విజన్. అనుభవంతో శరీరమంతా వింత గగుర్పాటు. పత్రీజీ .. How can I thank you for that moment. Thank you Sir, I Love You ... " నా అనుభవమే అద్భుతం " అనుకున్నాను... పెట్రీషియా చెప్పేది వినేంతవరకు.

పత్రీజీ గారి వేణునాదంతో తాను కూడా మైమరచి పోయింది. ఆయన అల్లంత దూరంలో ఉన్నారు. అంతా చీకటిమయం. ఆయన ఎలా ఉంటారో తెలీదు. కానీ, ఆయన నడుస్తూ వస్తున్నప్పుడు తనకు కల్గిన అనుభవం ... ఆయన పాదం అడుగు వేస్తూంటే భూమాత పులకించి చిన్నగా కదిలి ఆయనకు స్వాగతం పలికినట్లు, రకరకాల రంగుల వెల్లువై భూదేవి ప్రేమగా దారిచూపినట్లుగా ఇంకా ఎంతొ అద్భుతంగా వర్ణించింది. "He is Living God on this Planet Earth at this moment" అని ఖచ్చితంగా తనకి క్లియర్‌గా మెస్సేజ్ వచ్చింది. కళ్ళూ మూసుకునే ఆయన దివ్యదర్శనంతో ఒళ్ళంతా తనకు ఎలా పులకరించిపోయిందో తాను మాత్రమే వివరించగలదు.

ఇంక ' పిరమిడ్ ' గురించి ఎంత వ్రాసినా తక్కువే. ఇది ఒకరు చెప్తే వినేది, చదివితే తెలిసేది కాదు. ఎవరికి వారు స్వయంగా అనుభవించి, ఆస్వాదించాల్సిన అందమైన అనుభూతి.

తర్వాత సార్‌ని తనకి పరిచయం చేశాను. కూర్చోగానే మేము అడగకుండానే ఛానెలింగ్ మొదలైంది. అక్కడే ఉన్న నిర్మలా మేడమ్, శ్రీ B.N.రెడ్డి తదితరులు, మేమందరం ఆశ్చర్యపోయాము. " రికార్డింగ్ చేస్తే ఎంతో బాగుండేది " అనిపించింది.

సాయంత్రం సార్ ఆమెతో స్టేజీ మీద ఛానెలింగ్ చేయించారు. అదంతా ఒక పిరమిడ్ మాస్టర్ రికార్డ్ చేశారు. మరోసారి అదంతా వివరంగా వ్రాస్తాను. నేను దాన్ని కొంతవరకు తెలుగులో చెప్పగలిగాను. ఆ తర్వాత నేను తెలుగులో మాట్లాడాను. ఆ తర్వాత పెట్రీషియా చెప్పింది తాను ఛానెలింగ్ చేసే దేవుడితో చెప్పిందట ... నేను చెప్పిందంతా తనకు అర్థం కావాలని. ఆ తర్వాత నా గురించి నేను మాట్లాడిన దాని గురించి తాను చెప్పగా వింటే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది.

తాను చెప్పిన దాంట్లో అన్నిటికన్నా ముఖ్యమైనవి రెండు. ఒకటి, " లివింగ్ గాడ్ మీ ముందున్నారు " ; రెండు, " ఈ పిరమిడ్ చూడ్డానికి 2008 కల్లా హోల్ వరల్డ్ విల్ కమ్. ఇంకొక మహత్తరమైన పిరమిడ్ కూడా ఇండియాలోనే రాబోతుంది.

నా ఉద్దేశ్యం ఇక్కడ తప్పకుండా చెప్పాలని ఉంది. నా విజన్ ఆఫ్ ఫ్యూచర్ ఈజ్ ... నా మనమడు, మనమరాలు(వయస్సు ఒక సంవత్సరం) పెరిగి ఈ ప్రపంచంలో తిరిగే సమయానికి, ఈ భూమి మీద అసూయ, ఆశ, ఆగ్రహం, అనుమానం లాంటివి అన్నీ సమిసిపోయి అన్ని చోట్లా ' ఆప్యాయత ', ' ప్రేమ ', ' అనురాగం ', ' నమ్మకం ', ' శాంతి ' ... లాంటి మాటలు మాత్రమే వినపడతాయి.

ఇప్పుడు ఇండియా అంటే వేదాలు, భగవద్గీత, ధ్యానం యోగా లాంటివి వినిపిస్తున్నాయి. ఇప్పటివరకూ ఇండియా వస్తే ' తాజ్‌మహల్ ', ' చార్మినార్ ', ' బెనారస్ ' అంటున్నారు. కానీ ఇంక భవిష్యత్తులో కేవలం బెంగుళూరు మైత్రేయ బుద్ధా పిరమిడ్ కోసమే ఇండియా వస్తారు. ఒక్కసారి పిరమిడ్‌లో కూర్చుని ధ్యానం చేస్తే చాలు... ఇక కాశీలూ, బృందావనాలూ, హిమాలయాలు అక్కర్లేదు. ఏ మానససరోవరాలో అక్కర్లేదు.

" ప్రాణం ఉండగా ఒక్కసారైనా, కనీసం ఒక్కసారైనా ఈ మెగా పిరమిడ్ సందర్శించి ధ్యానం చేయకపోతే ఆ జీవితమఏ వ్యర్ధం " అని తప్పకుండా అందరూ తెలుసుకుంటారు. ప్రపంచమంతా వస్తారు. తప్పదు, తప్పదు కాక తప్పదు.

ఇంతమందికి ఇంత ఆనందాన్ని కలిగించడానికి పిరమిడ్ నిర్మాణంలో కష్టపడిన ప్రతిఒక్కరికీ, రాళ్ళు మోసిన వారి దగ్గర నుంచీ, ఇంజనీర్లు, డ్రైవర్లు ఒక్కరు కాదు ఎందరో, ఎందరెందరో మహానుభావులు అందరికీ శతకోటి వందనాలు.

ద్రవ్యరూపంలో సహకరించినవారికీ... పాల్ గారు, వారి బృందానికీ ... నాకు తెలిసినవాళ్ళూ, తెలియనివాళ్ళు .. అందరికీ మరీ మరీ వందనాలు.

ముఖ్యంగా, అసలు ఇలాంటి పిరమిడ్ రావాలని సంకల్పించిన పత్రీజీ .. మీకెలా వందనం చేయాలో .. మీతో సహకరిస్తూ ఆ నాలుగురోజులూ మేము ఏదో పెళ్ళికి వెళ్ళామనే భావన వచ్చేలా, రకరకాల భోజన పదార్థాలతో, రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలతో, మనందరి ప్రేమపాత్రులు విజయ్, ప్రాశాంతిల వివాహం .. ఇలా ఎన్నో ఎన్నెన్నో కలిసి అత్యంత అద్భుతంగా ఎక్కడా ఎవ్వరికీ ఏ లోటూ లేకుండా చూసుకుంటూ, తన అలసటను ఇసుమంతైనా కనపడకుండా నిత్యనూతనంగా చిరునవ్వులతో ప్రేమపూర్వక ఆహ్వానంతో అందరినీ ఆదరించిన నా చిట్టితల్లి .. స్వర్ణమాలపత్రికి నా శుభాశీస్సులు.

నా ప్రార్థన ఒకటే. ఇది చదివేటప్పటికి మీరు బెంగుళూరు వెళ్ళి ఉండకపోతే ఒక్కసారి వెళ్ళి వచ్చి మీ అనుభవం నాకు దయచేసి తెలపండి.

మరొక్కమాట. అక్కడ ' పెట్రీషియా ' ను అందరూ కలిసి షేక్‌హ్యాంవిచ్చారు. అంతటితో ఆగక చాలామంది మాస్టర్స్ బ్లెస్ చేయమని మమ్మల్ని చాలాసార్లు అన్నారు. పెట్రీషియా చాలా బాధపడింది. "సాక్షాత్తు భగవంతుడు మీ మధ్య అలా తిరుగుతూ ఉంటే నా దగ్గర అడుగుతారేంటి? ఆయన ఉండగా మీకేం కావాలి? మీ అదృష్టం మీకు తెలియటం లేదు. వెళ్ళండి ఆయన దగ్గరకు" అంది.

ఆవిడ ఎంత మాస్టర్ అయినా 'మాస్టర్ ఆఫ్ మాస్టర్' అక్కడ ఉంటే మనం సరిగ్గా గమనించటం లేదని ఆవిడ ఆవేదన. " Please tell your people to see the Divine Presence ", ఆమె పిల్లలు ముగ్గురూ నాకు బాగా చేరువ అయ్యారు.

ఇంక గెస్ట్‌హౌస్‌లో ఉన్నంతసేపు పెట్రీషియాతో గడపడానికి వచ్చే మాస్టర్స్‌తో నాకు ఒక్క నిమిషం కూడా నాకోసం లేకుండా పోయింది. ఆ రోజు నేను సార్‌తో చెప్పాను " సార్, నేను మెడిటేషన్ కోసం వచ్చాను. మీరు నాకు పెట్రీషియాను " ... అంటే షరామామూలుగా నవ్వేసి " అంతే మేడమ్, మనిషి ఒకటి తలిస్తే దేవుడు మరొకటి తలుస్తాడు " అన్నారు. నేను వెంటనే " చేసేదంతా మీరే కదా సార్. మధ్యలో పాపం ' దేవుడే ' అనేవాడిని ఎందుకు బ్లేమ్ చేస్తారు? ఇదంతా మీ ప్లాన్ " అన్నాను.

నిజంగా ఒకందుకు నేను బెంగుళూరు వెళ్ళాను. మరెందుకు ' పెట్రీషియా ' నా జీవితంలో ప్రవేశించిందో కాలమే నిర్ణయించాలి. నేను తనతో నా ' టీచర్ ' గురించి చెప్పి మళ్ళీ పెట్రీషియాతో " నాకు ఏమవసరం ఉందో తెలియటం లేదు " అన్నాను. దానికి తాను " ఆ పెట్రీషియా నీకు నేర్పింది, ఈ పెట్రీషియా నీ దగ్గర నేర్చుకోడానికి వచ్చింది " అంది.

ఏది ఏమైనా గానీ... మనమందరం ... ఈ జీవితంలోకి కొంత నేర్పడానికి, కొంత నేర్చుకోడానికి వచ్చామని నా నమ్మకం. నా జీవితంలో ఒడిదుడుకుల నుండి నేను ఎలా అధిగమించి ఈ రోజు ఇంత ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నానో నాకు మాత్రమే తెలుసు. నేర్పిన మాస్టర్స్ అందరికీ వందనాలు.

ఈ అనుభవాన్నీ అందరికీ పంచి ఇవ్వాలని అందరూ నాలాగే ఆనందంగ జీవించాలని నా ఆశయం. నా ఈ ఆశయసిద్ధి సాధనకు ... నా రాముడు పత్రీజీ ... ఈ పెట్రీషియాను జోడించాడని అనిపిస్తుంది. I welcome everything & love to work. Thank you Sir ... for every bit of growth I am finding in my self. ' ధ్యానాంధ్రప్రదేశ్ ' పత్రికకు నా ధన్యవాదాలు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు.

- గారపాటి లలిత,
హైదరాబాద్, ఫిల్మ్‌నగర్

Go to top