" నేను ఆనందంగా వెళ్తున్నా "

నా పేరు విజయలక్ష్మి. నాకు ధ్యానం 2002 సెప్టెంబర్‌లో పరిచయమైంది. నేడు మహబూబ్‌నగర్‌లో సీనియర్ మాస్టర్‌గా అభివృద్ధిలో ఉన్నాను. రాష్ట్రంలో ఎన్నోచోట్ల చాలా కార్యక్రమాలలో పాల్గొన్నాను.

నాతోపాటు మా అమ్మమ్మగారు ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయటం ప్రారంభించారు.

92 సంవత్సరాల వయస్సులో ఉన్న ఆ పెద్దామె ఒక్క సిట్టింగ్‌లో 2,3 గంటలు కూర్చుని ధ్యానం చేయటం ప్రారంభించి గంటలు గంటలు ధ్యానం చేస్తూ తన సూక్ష్మశరీరంతో విహరించేది. వంశపారంపర్యంగా వచ్చినటువంటి తన శరీర వణుకుడు మందులు లేకుండా ధ్యానం ద్వారా పూర్తిగా తగ్గించుకుంది.

తన మూడు సంవత్సరాల ధ్యాన సాధనలో అంతర్వాణి సందేశాలు ఎన్నో పొంది అనుభవించి మాతో ఎన్నో విషయాలు చెప్పేవారు.

" ఎవరో నాలో మాట్లాడుతున్నారు. ఏవేవో చప్పుళ్ళు వినపడుతున్నాయి " అని పదే పదే చెప్పేవారు. ధ్యానం ప్రారంభించిన వెంటనే మాంసాహారం మానివేసి అందరికీ తినవద్దని చెప్తూ ఉండేది. తన చావు గురించి తాను తెలుసుకుని " ఆసుపత్రి వద్దు - పత్రీజీ గారి దగ్గరే తుది శ్వాస విడుస్తా " అని అందరితో చెప్పి గురువు గారి ఫోటో దగ్గర ప్రాణం వదిలిపెట్టిన మహామనిషి ఈమె. శ్వాస మీద ధ్యాసతోనే స్వర్గానికి వెళ్ళారు.

తన శరీరాంత కర్మకాండల్లో బంధువర్గం కానీ, ఇంకెవరైనా కానీ మాంసాహారాన్ని పెట్టమన్నా తిరస్కరించమనీ, ఎవరి ఆనందం వారు ధ్యానం ద్వారా పొందమనీ, " నేను ఆనందంగా వెళ్తున్నా. నా శరీరాన్ని మట్టిలో పెట్టకుండా కాల్చివేయండి " అని నాతో చెప్పి మరీ వాగ్ధానం చేయించుకున్నారు.

అందువల్ల నేను ఆమె అంతిమ శరీరాన్ని ఎంతమంది మా బంధువులు పూడ్చమని వాదించినా చివరికి స్థలమే దొరకని పరిస్థితిలో ఆమె కోరినట్లు కాల్చటమే జరిగింది. ఆమె సంకల్పశక్తి వలన ఆ యోగులే అనుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేసారు.

ఆమె ఖర్మ రోజున మాంసాహారం వండమని అందరూ బలవంతం చేయగా వారందరికీ రాత్రి నిద్రలో రాక్షస కృత్యాలు కనిపించాయి. ఆ రోజు మాంసాహారం వద్దని ఆమెయే తన సూక్ష్మశరీరం ద్వారా అందరికీ తెలిపారు.

తరతరాల నుంచి వస్తున్న ఆచారాలను పక్కన పెడుతూ ఆ కర్మకాండను పండుగులా ఆనందంగా జరుపుకున్నాం. ఇదంతా గమనించిన కాలనీ వాసులు ఎంతోమంది ధ్యానులుగా మారి మూఢ సాంప్రదాయాలకు తెరదింపారు.

 

- G. విజయలక్ష్మి,
మహబూబ్‌నగర్

Go to top