" శ్రీరామదాసు ధ్యాన మందిరం, భద్రాచలం "

కారణము లేనిదే కార్యమూ జరగదు. ఏప్రిల్ 6,7 తేదీలలో పత్రీజీ గారితో నేను గోవాలో వుండాలనుకున్నా. కానీ ఏప్రిల్ 2 న హైదరాబాద్ నుంచి 'ధ్యానమైన' శ్రీరాములు, మెగా మురళి, పాపారావు గార్లు ఫోన్ చేస్తూ ఏప్రిల్ 7 న భద్రాచలంలో శ్రీరాముల కళ్యాణం చూడటానికి రమ్మన్నారు.

ఖమ్మం నుంచి ఇన్‌కమ్‌టాక్స్ ఆఫీసర్ శ్రీనివాస్ కూడా ఫోన్‌లో భద్రాచలానికి రమ్మని పిలవడంతో ఏప్రిల్ 5 న ఖమ్మం వెళ్ళడం జరిగింది.

ఖమ్మంలో ఏప్రిల్ 5 సాయంత్రం 6.00 గంటలకు శ్రీ పంచరత్న పిరమిడ్ ధ్యానకేంద్రాన్ని ప్రారంభించి, ధ్యాన తరగతి నిర్వహించాము. 6వ తేదీ రామదాసు పుట్టిన నేలకొండపల్లె వెళ్ళి, రామదాసు నివసించిన ఇంట్లో నేను, ఖమ్మం వెంకటేశ్వరరావు, మురళి, నేలకొండపల్లె ధ్యాన కేంద్రం నిర్వాహకులు ఉపేంద్ర కొంతసేపు ధ్యానం చేసాము.

మళ్ళీ ఖమ్మం చేరుకుని మధ్యాహ్నం 3.00 గంటలకు శ్రీ రామారావు గారింట్లో శ్రీ వశిష్ట పిరమిడ్ స్పిరిచ్యువల్ కేర్ సెంటర్‌ను ప్రారంభించాము. సాయంత్రం 6.00 గంటలకు ఖమ్మం రఘురాం ప్రసాద్, వాసు,నేనూ ఇల్లందు చేరి 'బ్రిడ్జి' స్కూల్‌లో ధ్యాన తరగతి నిర్వహించాము. ఇల్లందు వెంకటేశ్వరరావు తదితర పిరమిడ్ మాస్టర్లతో సమావేశమై, పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వహణను చర్చించుకుని రాత్రి 10.00 గంటలకు భద్రాచలానికి బయలుదేరాం. అర్ధరాత్రి 12.30 గంటలకు చేరాం. అప్పటికే ఖమ్మం శ్రీనివాస్, శ్రీరాములు, హైదరాబాద్ నుండి వచ్చిన మెగా మురళి, ధ్యానమైన శ్రీరాములు, పాపారావు గార్లు భద్రాచలం చేరారు. శ్రీ పూర్ణచంద్రరావు గారింట్లో బస ఏర్పాటు చేశారు.

ఏప్రిల్ 7, 2006 శ్రీరామనవమి. శ్రీ రామదాసు నిర్ణయించినట్లు భద్రాద్రి రాములవారి కళ్యాణం ఆరుబయట, సర్వజనులు తిలకించేటట్లు ఏర్పాటుచేయడం జరిగింది. శ్రీనివాస్ ముందుగానే అందరికీ ' V.V.I.P ' టిక్కెట్లు ఏర్పాటు చేశారు. ఉత్సవమూర్తులకు చాలా దగ్గరలో కూర్చున్నాం.

వేడుకలు ఇంకొక రెండు గంటల్లో ప్రారంభం అవుతాయని ప్రకటించారు. అప్పటికి టైమ్ ఉదయం 9.00 గంటలు. మేము ధ్యానంలోకి వెళ్ళాం. 15 నిమిషాల తర్వాత 'గుహుడు' మా ముందు కూర్చుని, మమ్మల్నే చూస్తున్నాడు. 14 సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాను కానీ గుహుడు ఎప్పుడూ కనపడలేదు. "ఎవరు మాస్టర్?" అంటే "గుహుడు" అన్నాడు. "అన్నీ మంచి జరగడానికి మీరొచ్చారు" అన్నారు. తర్వాత శ్రీరాముల కళ్యాణం చూసి, ఆర్యవైశ్య అన్నదానసత్రంలో ఖమ్మం శ్రీరాములు గారితో కలసి భోంచేసి, విశ్రాంతి తీసుకోడానికి శ్రీ పూర్ణచంద్రరావు గారింటికి అందరం వెళ్ళాం. అప్పటికి టైమ్ మధ్యాహ్నం 2.30 గంటలు.

3.00 గంటలు శ్రీ పూర్ణచంద్రరావు గారొచ్చి పిచ్చాపాటి మాట్లడుతూ, ధ్యానం వైపుకు మాటలు వెళ్ళాయి. రావుగారు " 'శ్రీరామదాసు ధ్యాన మందిరం ' భద్రాచలంలో వుంది. కానీ సరైన నిర్వహణ లేదు. మీరు చూడండి. నచ్చితే కమిటీ వారిని కలుస్తాం" అన్నారు. డాక్టర్ కాంతారావు గారికి, భద్రాచలం టౌన్‌షిప్ కార్యనిర్వణాధికారి శ్రీ వేంకటేశ్వరరావు అందరం కలిసి మూడు కార్లలో శ్రీ రామదాసు ధ్యాన మందిరం చేరాం.

శ్రీరామదాసు ధ్యాన మందిరం సువిశాల స్థలంలో 1971 లోనే ప్రారంభీంచబడింది. ధ్యాన మందిరం పైన పిరమిడ్ గానీ, లేక ధ్యాన మందిరం నిర్వహణగానీ పిరమిడ్ మాస్టర్లు బాధ్యత తీసుకుంటే చాలా బాగుంటుంది అనుకున్నాం. వెంటనే పూర్ణచంద్రరావు గారు దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ మెంబర్ శ్రీ పాండురంగారావు గారితో ఫోన్‌లో మాట్లాడి ధ్యాన మందిరం విషయం మాట్లాడాలంటే రమ్మన్నారు. శ్రీ పాండురంగారావు గారికి ధ్యాన మందిరం విషయం చెప్పడంతో ఆనందించి వెంటనే శ్రీ వేంకటేశ్వరరెడ్డి ఛైర్మన్ ట్రస్ట్ బోర్డ్ గారికి ఫోన్ చేసి, "తిరుపతి, హైదరాబాద్, ఖమ్మం నుంచి ధ్యానులు వచ్చారు ... ధ్యాన మందిరం విషయం మాట్లాడతారట. మిమ్మల్ని కలవాలన్నారు రమ్మంటారా?" అంటే, ఛైర్మన్‌గారు రమ్మన్నారు.

శ్రీ వెంకటేశ్వరరెడ్డి, ఛైర్మన్, భద్రాచలం దేవస్థానం ట్రస్టు బోర్డు, చాలా సౌమ్యులు. ఆధ్యాత్మికవాదులే. దేవస్థానానికి మంచి చేయాలని తపన వున్నవారే. అందరం కలిసి శ్రీ రామదాసు ధ్యాన మందిరం విషయం చర్చించాం. ఛైర్మన్ గారు చాలా ఆనందించారు. " ధ్యాన మందిరంలో కనీస సదుపాయాలు మీరు ఏర్పాటు చేయండి ; ధ్యానం చెప్పటం, చేయించటం మా పిరమిడ్ మాస్టర్లు చూసుకుంటారు " అన్నాము. సహృదయంతో ఛైర్మన్ గారు అంగీకరించి " త్వరలో అన్ని సదుపాయాలు చేసి శ్రీ రామదాసు ధ్యాన , మందిరం అప్పగిస్తాము " అన్నారు.

తరువాత కార్యనిర్వహణాధికారి శ్రీ రాజు గారిని కలిశాం. రాజు గారు కూడా " మీకు అన్ని సదుపాయాలు చేసి ఇస్తాం " అన్నారు. తరువాత అందరం భద్రాచల రాములవారిని దర్శించి, ధ్యానించి, కృతజ్ఞతలు తెలియజేశాం.

కారణం భద్రాచల రాముని దర్శనం. కార్యం ‘ శ్రీ రామదాసు ధ్యాన మందిరం ’ పిరమిడ్ మాస్టర్ల నిర్వహణ. పత్రీజీ గారన్నట్లు దేవాలయాలన్నీ ధ్యానాలయాలవుతున్నాయి. త్వరలో " శ్రీ రామదాసు పిరమిడ్ ధ్యాన మందిరం " ప్రారంభోత్సవంలో కలుసుకుందాం.

భద్రాచలం దేవస్థానం ట్రస్టు బోర్డు ఛైర్మన్ శ్రీ వేంకటేశ్వర రెడ్డి గారికి, మెంబర్ శ్రీ పాండురంగారావు గారికి, కార్యనిర్వహణాధికారి శ్రీ రాజుగారికి, భద్రాచలం టౌన్‌షిప్ అధికారి శ్రీ వేంకటేశ్వరరావు గారికి, భద్రాచలం శ్రీ పూర్ణచంద్రరావు గారికి, డాక్టర్ కాంతారావు గారికి పిరమిడ్ మాస్టర్లందరి తరపున కృతజ్ఞతలు.

 

- కంచి రఘురామ్,
అధ్యక్షులు : తిరుపతి స్పిరిచ్యువల్ సొసైటీ,
83, కోలావీధి, తిరుపతి

Go to top