" పత్రీజీని చూస్తే ఎప్పుడూ ఆశ్చర్యమే "

 

నా పేరు సువర్ణ. నేను చెన్నైలో వుంటాను. నేను ఈ ధ్యానానికి అక్టోబర్ 2004లో వచ్చాను.

ధ్యానానికి రాకముందు నాకు టెన్షన్ వుండేది. ఎక్కువుగా కోపం వచ్చేది. వీటి ద్వారా తలనొప్పి, గాస్టిక్ ట్రబుల్, అల్సర్ ప్రకోపించేది. దీనిద్వారా కుటుంబ సభ్యులతో అంత సఖ్యంగా వుండలేకపోయేదాన్ని.

"ధ్యానం చేస్తే టెన్షన్ తగ్గుతుంది" అని తెలిసి, ధ్యానం కోసం సంవత్సరం రోజులు వెతికాను. చివరకు పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వారి 'ఆనాపానసతి' ధ్యానం దొరికింది.

ధ్యానంలోకి రాకముందు నేను కోరుకున్నవి రెండే రెండు. అవి 1.ధ్యానం ఉచితంగా నేర్పాలి. 2. నాకు బాగా అందుబాటలో వుండాలి.

నేను కోరుకున్న విధంగ ఉచితంగా ధ్యానం మరి మా ఇంటికి అతి దగ్గరగా "బుద్ధా పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ" వెలిసింది. అందులో ధ్యానం నేర్చుకున్నాను. ధ్యానం అంటే రోజుల తరబడి క్లాసులు వుంటాయని భావించిన నాకు, ఇంత సులభమైన ధ్యానం, ఒకే క్లాసు ద్వారా జ్ఞానం పట్ల అవగాహన కలగడం ఎంతైనా ఆశ్చర్యం.

ధ్యానం చేసిన తర్వాత నాకున్న టెన్షన్ అంతా పోయింది. దానితో పాటుగా వచ్చిన జబ్బులన్నీ పోయాయి. ఏదో తెలియని ప్రశాంతత ఏర్పడింది.

ఒక్క మిద్దె మెట్టు ఎక్కితే ఆయాసం వచ్చేది. ఈ రోజు సునాయసంగా నాలుగు మిద్దెలు కూడా ఎక్కగలుగుతున్నాను. చిన్నప్పటి నుంచి సైనస్ వుండేది. ఎంత ఎండాకాలమయినా చల్లని పానీయాలు, ఐస్‌క్రీమ్ తీసుకుంటే జలుబు, దగ్గు, తలనొప్పి వచ్చి వెంటనే జ్వరం వచ్చేది. ఇప్పుడు ఎంతటి చల్లని వస్తువులు తీసుకున్నా ఏమీ కావటంలేదు.

నా ముగ్గురు పిల్లలు కూడా ధ్యానం నేర్చుకున్నారు. అమ్మాయి 'షాలిని' పదవతరగతి 87% మార్కులు తెచ్చుకుంది. ఇది ధ్యానం ద్వారానే సాధ్యమయింది. అమ్మాయి 'దీపిక' ఇన్ని సంవత్సరాలు ట్యూషన్ ద్వారానే చదివేది. ఎప్పుడూ 75% మార్కులు దాటేది కాదు. ఇప్పుడు ధ్యానం చేయడం ద్వారా ట్యూషన్లు మానేసి ఎనిమిదవ తరగతిలో 94% మార్కులు తెచ్చుకోవడమే కాదు 'out standing student' అని మెడల్ తెచ్చుకుంది.

భర్త ఉద్యోగరీత్యా డాక్టర్. ఆయన కూడా ధ్యానం చేస్తూ వారి పేషంట్లకు ధ్యానం యొక్క ఆవశ్యకతను చెప్తూ వుంటారు.

నేను ఈ ధ్యానానికి వచ్చిన తర్వాత మొట్టమొదటగా 2004 డిసెంబర్‌లో జరిగిన ధ్యానాంధ్రప్రదేశ్ విజయోత్సవాలకు వెళ్ళడం, అక్కడ మొట్టమొదటిసారిగా పత్రీజీ గారిని కలవడం జరిగింది. ఆ తర్వాత కన్యాకుమారి, తామ్రపర్ణి ట్రెక్కింగ్, తూర్పుగోదవరి జిల్లా మారేడుమిల్లి ట్రెక్కింగ్, తిరుపతి తుంబురు తీర్థం ట్రెక్కింగ్ వెళ్ళడం జరిగింది. మామూలు రోడ్డు మీద కిలోమీటరు నడవటానికి కష్టపడే నేను ఈ ట్రెక్కింగ్‌లకు ఎలా వెళ్ళి వస్తానో నాకే తెలీదు. అంతా ధ్యాన మహిమ. 2005మేలో జరిగిన విశ్వాలయం ప్రాణప్రతిష్ట కార్యక్రమాలకు, డిసెంబర్‌లో జరిగిన ధ్యాన భారత్ విజయోత్సవాలకు మెగా పిరమిడ్ బెంగుళూరు వెళ్ళడం జరిగింది. భీమవరం తటవర్తి వీరరాఘవరావు గారి ఆత్మజ్ఞాన శిక్షణా శిబిరం వెళ్ళడం జరిగింది. ఎప్పుడూ ఎక్కడకూ వెళ్ళని నేను ఈ 18 నెలలలో ఇన్నింటిలో పాల్గొనడం నిజంగా నా ధ్యాన భాగ్యం.

శిక్షణా శిబిరం వెళ్ళి వచ్చిన తర్వాత నేను కూడా ఒక ధ్యాన కేంద్రం ప్రారంభించాలని సంకల్పం కలిగి, ఆ విధంగానే మా ఇంట్లో 2005 జూలైలో "బ్రహ్మర్షి పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ" స్థాపించడం జరిగింది. రోజూ మధ్యాహ్నం 11.00 నుండి 12.00 గంటల వరకు సామూహిక ధ్యానం జరుగుతుంది. అంతేకాకుండా వీడియో షో, ఆడియో ద్వారా సంగీత ధ్యానం వుంటుంది. వీటికి అనుబంధంగా లైబ్రెరీ కూడా వుంది. ఇంతేకాకుండా పాంప్లెట్స్ ద్వారా మా ఏరియా మొత్తం ఇంటింటికీ తిరిగి ధ్యాన ప్రచారం చేయాలని సంకల్పించుకున్నాను.

ధ్యానం చేస్తే కేవలం టెన్షన్ తగ్గుతుందని భావించి వచ్చిన నాకు, ఇందులో ఇంత విజ్ఞానం వుందన్న విషయం తెలిసి ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఈ విజ్ఞానం యింత సులభంగా అందరికీ అందుబాటులోకి రావడానికి కారణం బ్రహ్మర్షి పత్రీజీ. పత్రీజీ గారిని ఎప్పుడు చూసినా నా మనస్సు పురివిప్పిన మయూరమే అవుతుంది. సార్‌ను చూస్తేనే ఆనందం. సార్ మాట వింటేనే ఆనందం. సార్ పాట వింటే మరింత మహదానందం. అన్ని గంటలు నిర్విరామంగా క్లాసు తీసుకునే తీరు మరీ ఆనందం, ఆశ్చర్యం.

ఆధ్యాత్మిక గురువు అంటే, ఎవ్వరినీ దగ్గరకు రానీయరు, ఎప్పుడూ గంభీరంగా వుంటూ, ఏదో ఒక బోధ చేస్తారని విన్న మాకు పత్రీజీ గారిని చూస్తే ఎప్పుడూ ఆశ్చర్యమే. జీవితంలో అన్ని రసాలూ మేళవించి జీవించడం అంటే ఏమిటో నేర్పారు. జీవితం అంటే సంపద ఒక్కటే కాదు, అంతకు మించిన ఆనందం వుంటుందని తెలియజెప్పారు. Enjoyment Scienceకు సార్ ఇచ్చే ఇంపార్టెన్స్ సర్వదా ప్రశంసనీయం.

ధ్యానానికి రాకముందు జీవించిన జీవితం, జీవితమేకాదు. ధ్యానం చేస్తూ, ధ్యాన అనుభవాలను పొందుతూ, ధ్యాన ప్రచారం చేస్తూ, సంసారంలో కలిసిమెలసి వుండడమే నిజమైన జీవితం. ధ్యానం చేపట్టని వాడు 'ద్విపాద పశువే' అవుతాడు.

ధ్యానం చేద్దాం, ధ్యానం చేయిద్దాం, ధ్యాన ప్రపంచాన్ని పత్రీజీతో కలిసి నిర్మిద్దాం.

- సువర్ణ
చెన్నై

Go to top