మారం శివప్రసాద్ : నమస్కారం సార్..! మీ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను.

P.G. రామ్మోహన్ : నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్‌గా పనిచేస్తూ వాలెంటరీ రిటైర్‌మెంట్ తీసుకున్నాను. నేను B.Com చేసాను. చిన్నప్పటి నుంచి సైన్స్ బుక్స్ ఎక్కువగా చదివేవాడిని. చివరికి ‘స్పిరిచ్యువల్ సైంటిస్ట్’ అంటే ‘ఆధ్యాత్మిక శాస్త్రవేత్త’ గా కావడం జరిగింది!

మారం : చిన్నతనం నుంచే మీకు ఆధ్యాత్మిక స్పృహ ఉండేదా?

P.G. రామ్మోహన్ : "ఎదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలి" అనే తపన నాకు చిన్నప్పటి నుంచే ఉండేది. అదే క్రమంగా ఆధ్యాత్మికతలోకి దించింది.

మారం : మీ ఆలోచనా రీతులు ధ్యానం గురించి తెలియకముందు కానీ, ఆధ్యాత్మికత పైన అవగాహన లేకముందు కానీ ఎలా ఉండేవి? ఇప్పుడెలా ఉన్నారు?

P.G. రామ్మోహన్ : అందరిలాగే "నేనొక భక్తుడిని" అనే ఫీలింగ్‌తో, "దేవుడు నాకు చాలా ఆzత్మీయుడు" అనిపించేది ధ్యానం ఒక స్థాయికి వచ్చేసరికి దాని లోతు ఏమిటో తెలుసుకున్నాను. అయితే జీవించాలని అనుకున్నా, మరణించాలని అనుకున్నా అది మన ఛాయిస్ అని నాకర్థమయ్యింది ధ్యానం చేయడం మొదలుపెట్టిన కొద్దికాలంలోనే. ఆ తరువాత నేను పూజలు చేయటం మానేసాను. "నేను భక్తుడిని కాదు, జ్ఞానిని కాదు, అన్వేషకుడిని కాదు..నేనెప్పుడూ దేవుడి సన్నిధిలో ఉన్నాను" అనే భావనతో "నేనేమీ చేయవలసిన అవసరం లేదు" అని తెలుసుకున్నాను. "సదా ఎరుకస్థితిలో ఉంటూ రైట్ టైమ్ వచ్చినప్పుడు రైట్ యాక్షన్ చేస్తాను" అనే భావన! అంతే!

మారం : ఆధ్యాత్మికత గురించి మీకు ఎప్పుడు అవగాహన కలిగింది? ధ్యానం మీరు ఎప్పుడు మొదలుపెట్టారు?

P.G. రామ్మోహన్ : నా స్వస్థలం తిరుపతి. తిరుమలలో మా బాబాయి మిరాసీదారుగా ఉండేవారు. నృసింహజయంతి నాడు వారింటికి దేవుడి పల్లకీ వచ్చేది. మా అవ్వ హారతి పళ్ళెం పట్టుకెళ్ళేది. అలా దగ్గరగా వెంకటేశ్వరస్వామిని చూసే వాళ్ళం. అప్పుడు దేవుడు గురించి ఆలోచిస్తే, " వేంకటేశ్వర స్వామిని మించిన దేవుడు లేడు" అనిపించేది. అప్పుడే కొన్ని విషయాలు నాకు వాటంతటవే తెలుస్తూండేవి. చిన్నప్పుడు నాకొక ఆప్తమిత్రుడు ఉండేవాడు ‘రాము’ అని యోగా చేసేవాడు. నాకు హఠయోగం నేర్పాడు. హఠయోగం చేస్తూంటే, సడన్‌గా ప్రకాశించినట్లుగా ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ డెత్ కూడా కలిగింది. అప్పుడు నాకు 12,13 సం||వయస్సు ఉండేది.

యోగా చేస్తూ ఉంటే తపస్సు చేసినట్లుగా కూర్చునేవాడిని. ఇంక "వస్తావా? వస్తావా?"అని ఎవరో అడుగుతున్నట్లుగా అనిపించేది. "ఇప్పుడే రాను, ఇప్పుడే రాను" అని నేను చెప్పేవాడిని. అలాంటి అనుభవం మూడు నాలుగు సార్లు వచ్చింది. B.com పాస్ అయిన తర్వాత, మళ్ళీ ఒక రోజు ఇలాంటి ఎక్స్ పీరియన్స్ వచ్చింది. అ సమయంలో నేనొక డిటెక్టివ్ నవల చదువుతున్నాను. సహజంగా ఏదైనా చదివేటప్పుడు నేను "అది" అయిపోతాను. ఆ నవలలో స్విట్జర్లాండ్‌లో ఒక లోయలో బాగా చలిగా ఉన్న ప్రదేశంలో ఒక సందర్భం. ఉన్నట్లుండి నా గదిలోకి చీకటి వచ్చింది. నా ఎదురుగా ఆ చీకట్లో ఒక గోల్డెన్ బాల్! ఆ పొజిషన్‌లో నేను పూర్తిగా హిప్నటైజ్ అయ్యాను. ఆ గోల్దెన్ బాల్‌లోంచి "వస్తావా? ఉంటావా?" అనే మాటలు వినబడ్డాయి. చాలాసేపు ఏమాట లేక Freeze అయినట్లుగా అయిపోయాను. టైమ్ స్తంభించినట్లుగా అయింది. క్రమంగా ఆ గోల్డ్‌బాల్ ఒక వైట్ స్క్రీన్ లాగా అయిపోయి, దానిపై నా చిన్నప్పటి నుంచీ భూత భవిష్యత్ వర్తమానాల తాలూకు అన్ని దశ్యాలు కనిపించడం మొదలుపెట్టాయి. జీవితంలో జరుగబోయే సంఘటనలు అన్నీ కనబడుతున్నాయి. కొన్ని లక్షల బొమ్మలు కనబడ్డాయి, వచ్చే ప్రాబ్ల్‌మ్స్‌తో సహా. మరణం మాత్రం కనబడలేదు. చూస్తున్నప్పుడు నిజంగా అనుభవించినంత ఉద్విగ్నత నాలో.. "ఎంతోకాలం, ఎన్నో సంవత్సరాలు ఆ కాస్సేపట్లో అనుభవించినట్లుగా!" అనిపించింది. కాస్సేపటికి ఆ బాల్ మాయమైపోయింది. నా దృష్టిమాత్రం, ఆ నవల నేను ఎక్కడ చదువుతూ ఆగిపోవడం జరిగిందో ఆ పేజీ దగ్గరే ఉంది. ఏమీ జరిగినట్లుగా కానీ టైమ్ గడిచినట్లుగా గానీ లేదు. కానీ ఒకటిన్నర, రెండు గంట్ల పాటు ఈ ప్రాసెస్ జరిగింది! నా మూలంతో నేను కలిసి ఉన్నట్లు అర్థమయింది. ఏదో ఒక సంకల్పం మీద, ఒక ఛాలెంజ్ తో ఈ భూమి మీదకు వచ్చినట్లు, నాకు అప్పుడు అర్థమయ్యింది. "నా క్రీడాపూర్వకమయిన ఛాలెంజింగ్‌గా తీసుకువచ్చిన పనిని నేను అయిఉన్నాను’ అనే స్పృహ-ఎరుక అప్పుడు కలిగింది.

సాధారణంగా మనం మనస్సు అనే పరికరం లో ఇరుక్కుని ఉంటాం, దేహంలో ఉన్నప్పుడు. అనంతం నుంచి వచ్చిన మనం, మనస్సు అవరోధం వల్ల "నేనొక మేధావిని, నేనొక అది, నేనొక ఇది" అనే మాయలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ధ్యానం నేర్చుకున్న తరువాత నాకు పర్పస్ ఆఫ్ లైఫ్ స్పష్టంగా అర్థం అయింది. అవగాహన శక్తి కూడా పెరిగింది. తరువాత ఓన్లీ కాన్సియస్‌నెస్! అంతః‌చైతన్యం !

మారం : మీకు ధ్యాన పరిచయం చేసిన మాస్టర్ ఎవరు?

P.G. రామ్మోహన్ : నేను హైదరాబాద్‌లో ఉండగానే నా ఫ్రెండ్ N. హయగ్రీవశాస్త్రీ నాకు ధ్యానం గురించి తెలియచేసారు. 1997 లో. కర్నూలులో "బుద్ధా పిరమిడ్ ధ్యానకేంద్రం"లో బ్రహ్మర్షి పత్రీజీ పరిచయంతో హయగ్రీవశాస్త్రీ ధ్యానం చక్కగా తెలుసుకున్నారు. తను కూడా SBI లో పనిచేసేవారు. నాకు చక్కటి మిత్రుడు. హయగ్రీవశాస్త్రీ గారి తండ్రి నోరి నరసింహశాస్త్రి. నన్ను కూడా తమ కుమారుడిలాగానే చూసుకునేవారు. వారి కుటుంబమంతా కూడా నన్నెంతో ఆదరించేవారు. వారి ద్వారా "ఆనాపానసతి" ధ్యానపరిచయం కలిగింది. నరసింహశాస్త్రి గారు కవిసామ్రాట్. ఎన్నో సాహిత్య నవలలు వ్రాసారు.

మారం : మొదటిసారి బ్రహ్మర్షి పత్రీజీ ని కలిసినప్పుడు మీ అనుభూతి?

P.G. రామ్మోహన్ : హయగ్రీవశాస్త్రి శివభక్తుడే కాకుండా హస్తసాముద్రికం, జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం మరి మంత్రశాస్త్రంలో కూడా స్పెషలిస్ట్ ఒకసారి తను నా చేయి పట్టుకుని చూసి తన శాస్త్ర పరిజ్ఞానంతో నువ్వు "ఫలానా వయస్సులో మరణిస్తావు" అని చెప్పాడు అతడు చెప్పింది కరెక్టే అని తెలుసు. ఎందుకంటే అప్పటికే ఐదు సార్లు "నువ్వొస్తావా? నువ్వొస్తావా?" అనే పిలుపును నేను విని, "నేను రాను! ఇప్పుడే రాను!" అని చెప్పి ఉన్న వాడిని. శాస్త్ర ప్రకారమైతే కరెక్టే. అయితే "వీడు.. ఈ రామ్మోహన్ పెద్ద మొండివాడు. తన మరణం తన ఇష్టం అని అప్పటికే తెలుసుకున్నవాడు. వీడు ఎవ్వరిమాటా వినడు. ‘నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు’ అని హయగ్రీవశాస్రికి చెప్పినవాడు."

నేను కొత్తకోట SBI లో 1997 లో పనిచేస్తున్నప్పుడు హయగ్రీవశాస్రీ కర్నూలు బుధవారపేట SBI లో పనిచేసేవాడు. ఆయన ఒకసారి నాతో మాట్లాడుతూ, "కర్నూల్లో బుద్ధా పిరమిడ్ ధ్యానకేంద్రంలో పెద్ద పిరమిడ్ ఉంది. పత్రిగారు అని చాలా గొప్ప మాస్టర్. వారు You Forever పుస్తకం చదివి ఎన్‌లైటెన్ అయ్యారు. నువ్వు కూడా You Forever చదివావు కదా, ఒకసారి కర్నూలు రా; పత్రీజీ దగ్గరకు వెళదాం" అని పిలిచాడు. అంతకుముందే ధ్యానం గురించి చెప్పాడు. కానీ మనకు ఇంట్రెస్ట్ లేదు కదా. "రేడియో రిపేర్ చేసే టెక్నాలజీ నేర్చుకుందాం; కార్టున్లు గీసుకుందాం; ఏవో నాలుగు కథలు వ్రాసుకుందాం" అంటూ అనుకునేవాడిని.

ఆ తర్వాత నాకు ఆదోని ట్రాన్స్‌ఫర్ అయింది. వచ్చేటప్పుడు, పోయేటప్పుడు తరచు కర్నూలులో ఆగడం జరిగేది. ఒకసారి కర్నూలు వెళ్ళినప్పుడు నన్ను హయగ్రీవశాస్రీ పత్రీజీ దగ్గరకు తీసుకెళ్ళారు. అప్పుడు పత్రీజీ మౌనంలో ఉన్నారు. అది 1997 సం||. T.V. పెట్టుకుని చూస్తూన్నారు. అందులో స్పోర్ట్స్ వస్తున్నాయనుకుంటా. పత్రీజీ పేపర్ మీద ఏవో కొన్ని ప్రశ్నలు వేసారు. మనం మన నాలెడ్జి అంతా ఉపయోగించి వాగిందే వాగుడు. తెగజెప్పా.. నా లెవల్ మెయిన్‌టైన్ చేసుకుంటూ! ఆయన T.V. చూస్తున్నారు. మళ్ళీ మధ్యలో పేపర్‌మీద క్వశ్చ్‌న్స్ వేస్తున్నారు. అలా అరగంట పైనే. అంతా అయిపోయిన తర్వాత పేపరు తీసుకుని "నీకేమి తెలియదు! నీకు ఏమీ రాదు! 100 మార్క్స్ కి 0 వచ్చాయి. ‘నువ్వు జీరో’" అని వ్రాసారు.

"మరి నేనేం చేయాలి?" అని అడిగాను. ఒక పాంప్లెట్ తీసి ఇచ్చారు. "ధ్యానం ఎలాచేయాలి" అనే వివరాలు వ్రాసి ఉన్నాయి అందులో! మనం చేయం కదా! ఎందుకు చేస్తాం మరి! లేచి వచ్చాను. పత్రిసార్ కు నామీద గౌరవమే లేదు. నాకు జీరో మార్కులు ఇచ్చారు. మనం ఇంత ఇంటెలిజెంట్ కదా! మేథావులం మరి. పాంప్లెట్ చదివాం. కోపంతో ధ్యానం మాత్రం చేయలేదు! ఎందుకు చేయాలి?

మళ్ళీ ఒక మూడు నెలల తర్వాత కర్నూలు వెళ్ళినప్పుడు డా|| హరికుమార్ నన్ను ధ్యానంలో కూర్చోబెట్టారు. మొదటిసారి అలా కూర్చున్నాను పద్మాసనంలో .. అంతే! శరీరం ఒక కిలోమీటర్ ఎత్తుకు పెరిగిపోయినట్లు అనిపించింది, ఆ ఎత్తులో నుంచి దూరంగా ఏవో గుడిగంటలు, మసీదులోని నమాజు వినిపిస్తోంది. పక్షులు తమ గూళ్ళకు చేరుకుంటున్నాయి. వాటి కిలకిలారావాలన్నీ వినిపిస్తున్నాయి. ఇదంతా ధ్యానంలోనే! ధ్యానంలో నేను చూస్తూన్న, వింటూన్న ఆ సమయం సంధ్యాకాలం. ఇలా మొదటిసారి థాట్ మెస్సేజ్‌లో నేను పొందిన అనుభవాలు ఇవి. ఒక గంట ధ్యానం చేసినట్లున్నాను. లేచిన తరువాత హరికుమార్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చాను. "ధ్యానం చేస్తూ ఉండండి, బాగుంటుంది" అన్నారు హరికుమార్.

ఆ తర్వాత అంతా ఇక అంతా ధ్యానం! ధ్యానం! ధ్యానం! హయగ్రీవశాస్రి అడగడంతో You Forever ను తెలుగులోకి అనువాదం చేసాను. అదే "మరణం లేని మీరు"! పత్రీజీ చాలా బాగుందని అన్నారు. ఆ వరుసలోనే దాదాపు ఇప్పటికి 20 పుస్తకాలు అనువాదం చేయడం జరిగింది! ప్రింటింగ్ అయిన మొదటి పుస్తకం లోబ్‌సాంగ్ రాంపా మాస్టర్ అనువాదం మరణం లేని మీరు. టోర్కోమ్ సెరాయ్ డారియన్ పుస్తకం "Breakthrough to higher Phydism" అనువాదం "ఆత్మయోగంలోకి మహాప్రవేశం" ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అలా!

మారం : మరి ఈ మధ్యకాలంలో మీరు పత్రీజీ ని ఎక్కువగా కలుస్తున్నట్లు లేదు. కారణం?

P.G. రామ్మోహన్ : ఈలోగా నాకు ఒక కొత్త అహంకారం మొదలైంది. పత్రిగారిని కలవడం మానేసాను. "మరణం లేని మీరు" ట్రాన్స్‌లేట్ చేసినప్పుడు ఏ అహంకారం లేదు మనకు. హయగ్రీవశాస్త్రీ అడిగాడు చేసాను. పత్రీజీ చాలా బాగుందన్నారు. ఆ వరసలో మరికొన్ని పుస్తకాలు అనువాదం చేయడం మొదలుపెట్టాను. అప్పుడు కూడా మనకు ఏ అహంకారం లేదు. ఆ తరువాత "రామ్తా" వచ్చింది. అది మన సొంత అనువాదం కాదు. మరికొందరు అనువదించినది. ఒకసారి పత్రీజీ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన చేతిలో రెండు పుస్తకాలు ఉన్నాయి. ఒకటి రామ్తా, మరొకటి మిర్దాద్. ఆ రెండు పుస్తకాలు ఇద్దరు మేడమ్స్ ట్రాన్స్‌లేట్ చేసి ఇచ్చినవి. పత్రీజీ మిర్దాద్ నా చేతికిచ్చి "దీనిని మరింత సెట్ చేసి ఇవ్వండి" అన్నారు. రెండు మూడు గంటలసేపు ఆ పుస్తకం నా చేతిలోనే ఉంది. అయితే నేను ఇంటికి వెళ్ళేటప్పుడు "మిర్దాద్ నేను చేస్తాను, రామ్తా మీరు చేయండి" అని మార్చేసారు పత్రీజీ. అలా రామ్తా తీసుకెళ్ళాను. ఇక ఇరవై పేజీలు సెట్ చేసేసరికి నాకు పిచ్చెక్కిపోయింది. ఇక లాభం లేదనుకుని, మొదటి నుంచి ఫ్రెష్‌గా ట్రాన్స్‌లేట్ చేయడం మొదలుపెట్టాను. చాలా కష్టపడ్డాను ఆ సమయంలో. భౌతికంగా చాలా కష్టాలు వచ్చాయి కూడా. అయినా పూర్తిచేసి ఇచ్చాను ఎంత శ్రమ అయినా. ఆ తరువాత రామ్తా, మిర్దాద్ రెండు పుస్తకాలు కూడా రిలీజ్ అయ్యాయి. "రామ్తా చాలా బాగుంది" అన్నారు పత్రీజీ.

ఇక, మనకు అహంకారం మొదలయింది మెల్లగా! ఆ తర్వాత మరొక కుర్రాడు ట్రాన్స్‌లేట్ చేసిన పుస్తకం Conversation with God రీసెట్ చేసి ఇమ్మని నాకు పత్రీజీ ఇచ్చారు. నాకు ఆ అనువాదం నచ్చక నేను మళ్ళీ వ్రాయలేక ఎలాగో నాలుగయిదు నెలలు గడిచాయి. పత్రీజీ కి ఎవరో కంప్లైంట్ చేసారు నేనీ పుస్తకాన్ని ఇంకా సరిచేసి ఇవ్వలేదు అని. “నువ్వు చెయ్యకపోతే, ఇచ్చేయవయ్య” అన్నారు పత్రీజీ కోపంగా, మళ్ళీ మన అహంకారం డౌన్ అయ్యింది. ట్రాన్స్ లేషన్స్ చాలా బాగున్నాయి అని చెప్పి, నా అహంకారం పెరిగేలా చేసిందీ ఆయన పొగడ్తలే, కోపం చేసుకుని నా అహంకారం అణగిపోయేలా చేసిందీ ఆయనే!మనస్సు వచ్చేసింది-అహంకారం వచ్చేసింది-బుద్ధి వచ్చింది- అహంకారం పోయింది.

భౌతికంగా పత్రిగారి ప్రక్కన ఎక్కువగా కూర్చోకపోయినా, ఆయన ఆత్మలో నేను ప్రక్కనే ఉన్నాను. మనలోపల మన ప్రక్కననే ఆయన ఉంటారు. భౌతికంగా అవసరం అనుకుంటేనే కలుస్తాను. ఆత్మపరంగా మాత్రం ఎప్పుడూ ఆయన దగ్గరే! అవసరం అయితేనే పర్సనల్‌గా వెళుతూంటాను. అంతే! క్రమంగా మళ్ళీ మనస్సు లేని స్థితి.

మారం : ఈ అహంకారం అనే విషయం గురించి మరింత విపులంగా చెప్పండి!

P.G. రామ్మోహన్ : మనస్సు వల్ల అహంకారం కలుగుతుంది. ఇది ఆత్మ ఎదుగుదలకు ఎప్పుడూ ఒక అడ్డంకే. మనస్సు లేకుండా ఉంటేనే ఇది సాధ్యం. సాధనతోనే ఇది సాధ్యం. ధ్యానమే ఇందుకు మార్గం. మరొకటేమి లేదు. ధ్యానం ద్వారానే ప్రాణశక్తిని ఉపయోగించుకోవడం సాధ్యమవుతుంది. ఈ ప్రాణశక్తిని ఉపయోగించుకునేవారు, ప్యూర్‌గా ఉండాలి, సృష్టికార్యానికి వ్యతిరేకంగా అంటే ఇతరుల ప్రాణం తీయడం కానీ, హానిచేయడం కానీ, డబ్బు సంపాదించుకోవడానికి కానీ వీలు లేదు. అందుకే పత్రీజీ మన 18 ఆదర్శ సూత్రాలలో "ఆధ్యాత్మికతలో డబ్బు ప్రమేయం ఉండరాదు" అని బల్లగుద్ది మరీ చెప్పారు. ధ్యానం నేర్పడానికి మనం డబ్బు తీసుకోకుండా ఉండడానికి ముఖ్యకారణం అదే! ఈ విషయం విజ్ఞాన భైరవతంత్రంలో చక్కగా వివరించడం జరిగింది, శివుడు పార్వతికి చెపుతాడు ఇవన్నీ, ఆత్మశక్తులు ఎలా ఉపయోగించాలో!

బ్రహ్మసత్యం జగన్నిత్యం; అసలు మృత్యువే లేదు. 'ECK' అని మనం అంటాం కదా. అది సత్యం. ఎనర్జీ, కాన్సియస్‌నెస్, నాలెడ్జ్ ఇదే సత్యం. విశ్వశక్తి చైతన్యం, జ్ఞానం ఇవే శాశ్వతం. సమయం అనే పరిధిలో మనం ఉండటం వల్ల దేహభ్రమలో మనం ఇరుక్కుని ఉన్నాము. తాను మృత్యువుకు లోబడి ఉన్నాను అనే మాయవల్ల మనిషి 'ECK' త్వరగా అందుకోలేకున్నాడు. శ్రీకృష్ణుడు ప్రకృతి.. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం అనే ఎనిమిది స్థితులలో కూడుకుని ఉంది అని చెప్పాడు. అహంకారం కూడా ప్రకృతిలో భాగమే. అది “నేను" అనే విషయాన్ని పెంచుకుని పోతూ ఉంటుంది. ఏ వాస్తవాన్ని మనం సృష్టి చేయడానికి వచ్చామో, దాన్ని అహంకారం వల్ల మరచిపోతాం.

మారం : అసలు "మనస్సు" ఎలా తయారువుతోంది? ఇది ఎందుకు ఇంత "మాయ" ను సృష్టిస్తోంది?

P.G. రామ్మోహన్ : ఇంకొక దానిలో కలయిక వల్ల ఇది జరుగుతుంది! భౌతికమైన కలయిక, మానసికమైన కలయిక, ఆధ్యాత్మికమైన కలయిక. ఈ మూడింటిలో దేనివల్లనైనా మనస్సు తయారవుతోంది. దాంతో తాను చూసేవాడు కాస్తా చూడబడే విధంగా మారుతాడు. ఏది తెలుసుకోవాలనుకుంటున్నాడో, ఆ జ్ఞానం పొందే ప్రకృతి వల్లనే మనస్సు తయారవుతోంది. ప్రత్యక్షజ్ఞానం మనస్సు ఆలోచన వల్లనే వస్తోంది. ఆలోచనలు లేకపోతే అసలు మనస్సే లేదు. తెలిసిన దానితో తెలియని దానిని పోల్చి చూస్తూ మనిషి ఒక్కొక్క విషయం నేర్చుకుంటూ ఉంటాడు.

ఇలా ఒక దానిని మరొక దానితో పోల్చి చూస్తూ నేర్చుకుంటూ పోతూ ఉండడమే మనస్సు పని. మనం సంకల్పించిన, మనం ఆలోచించిన, మనం నేర్చుకుంటున్న జ్ఞాన సమాహారమే మనస్సు. కొన్ని విషయాలు ఇష్టం లేకున్నా బలవంతంగానైనా నేర్చుకుంటాం మనం. బాధపడైనా, కష్టపడైనా తప్పక నేర్చుకోవాల్సిందే. ప్రకృతి ఎప్పటికప్పుడు నేర్పిస్తూనే ఉంటుంది. కిందపడి మోకాలు కొట్టుకుని నేర్చుకుంటాం. చేయికొట్టుకుని కష్టపడి బాధాకరంగా నేర్చుకుంటాం. చిన్నప్పుడు తప్పు మాట్లాడితే తల్లిదండ్రులతో, ఉపాధ్యాయులతో తిట్లు, దెబ్బలు వస్తాయి. తప్పనిసరిగా కష్టంగా ఇవి నేర్చుకుంటాం. ప్రతిఒక్కరూ నేర్చుకున్నదే, నేర్చుకోవలసిందే! రాముడైనా, కృష్ణుడైనా, బుద్ధుడైనా, మహావీరుడైనా, జీసస్ అయినా, మహమ్మదైనా, నానక్ అయినా, జోరాస్టియయనైనా, శంకరాచార్యులైనా! కష్టపడి, ఆ తర్వాత క్రమంగా ఇష్టపడి ఆత్మస్థితిలోకి వచ్చే దాకా నేర్చుకుంటాం! చాలా లోతుగా! మనస్సుని ఆత్మస్మృతి కలిగేదాకా నేర్చుకుంటాం. ప్రాపంచిక జ్ఞానం అన్నదే అవిద్య. ఇది ఎందుకూ పనికిరాదు. అందుకే పరమార్థిక విద్యను నేర్చుకోవాలి. అదే ధ్యానం. జ్ఞానం. ఇలా ..క్రమంగా పరిపక్వస్థితిని ధ్యానం వలననే పొందుతాం.

మారం : మనస్సుతో కాకుండా హృదయంతో, బుద్ధితో జీవించడం ఎలా?

P.G. రామ్మోహన్ : మన చేష్టల వల్ల ఇంకొకరు బాధింపబడకూడదు. ఎవరైనా నీకు నష్టం చేసినప్పుడు నీకు బాధ కలుగుతుంది అనుకుందాం. "అలా ఇతరులను బాధపెట్టే పనులు, మాటలు నువ్వు చేయవద్దు" అని మనం తెలుసుకుంటాం. నీ చేష్టల వల్ల ఇంకొకరికి బాధ కలుగకూడదు. నీ చేష్టలను బట్టి కాని, నీ మాటలను బట్టి కాని ఎవ్వరూ బాధింపబడకూడదు. పైగా ఏ పని నువ్వు చేస్తే సంతోషం కలుగుతుందో, ఏ పని నువ్వు ఇష్టంగా చేస్తావో, ఆ పనులు అవతలి వాళ్ళను కూడా అంత సంతోషపెట్టాలి. బాధించకూడదు. అదే ధర్మం! ఇలా తాను దేనివల్లనైతే ఆనందిస్తాడో, దానివల్ల అవతలి వాళ్ళుకూడా అంత ఆనందం పొందేలా చేయగల్గినవారు "హృదయవాసి"!

మారం: జన్మజన్మల కర్మలు జ్ఞానం ద్వారా తొలిగిపోతాయి, దగ్ధం అవుతాయి-కామెంట్ ప్లీజ్!

P.G. రామ్మోహన్ :నేను గొప్పవాడిని. నేను బలవంతుడిని. నేను విద్యావంతుడిని. గొప్పకులంలో పుట్టినవాడిని. మహాయవ్వనంలో ఉన్నవాడిని. నేను కోటీశ్వరుడిని. నేను అధికారిని. నేను గొప్పలీడర్‌ని. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? మనస్సులో, మరి ఇవన్నీ ఉండి కూడా వాడు పిచ్చివాడు అయ్యాడు అనుకోండి. వాడికి పైవన్నీ ఉన్నా, ఏవీ స్మృతిలో లేవు. డబ్బున్నా, అదేమో తెలియదు. ఏది డెబిట్ కార్డో, ఏది క్రెడిట్ కార్డో కూడా తెలియదు. ఇంకేది కూడా తెలియదు. కనుక అన్నీ లేదా కొన్ని అవి ఉన్నపుడే, మనసు వలన కలిగిన అహంకారాన్ని దూరం చేయాలి. లేకపోతే అన్నీ ఉన్న బీదవాడే, స్మృతి లేకపోతే! అహంకారమే మనిషికి పెద్ద ప్రతిబంధకం. అహంకారాన్ని పోషిస్తున్న మనస్సు ఉండటం వల్లనే, మనిషి సత్యాన్ని చూడలేక పోతున్నాడు. గ్రహించలేక పోతున్నాడు. కనుక మనస్సును ప్రక్కన పెట్టాలి. అంటే ఆలోచనలు పొగరు, స్వాతిశయం, అహంకారం తగ్గించాలి! ఇవి తగ్గించడం సాధ్యం కాదు. అయితే ఇగ్నోర్ చేయాలి కొంచెంసేపు! అంటే కాసేపు మనస్సును ఆలోచనల నుంచి మరల్చాలి! కొంచెం ప్రక్కన పెట్టినా కూడా వచ్చే వెలుతురు, ప్రకాశం నిన్ను కాపాడుతుంది. అదే బుద్ధి.

ఒక గుహలో కోటి సంవత్సరాల నుండి కటికి చీకటి ఉందనుకోండి. ఒకడు వెళ్ళి అగ్గిపుల్ల గీసి, ఒక మైనపు వత్తిని వెలిగిస్తే వెంటనే చీకటి .. కోటి సంవత్సరాలు చీకటి కూడా మాయమై పోయింది.

అలాగే ఒక "చిన్న జ్ఞానకిరణం” వల్ల ఎన్నో జన్మజన్మల కర్మలు, అజ్ఞానం పటాపంచలు అయిపోతాయి. అంటే నెగెటివిటీ అనబడే చీకటి తొలగిపోతుంది. మనస్సు ఒక కోతి. అది తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆలోచనల ద్వారా అది పెరిగి, పోషింపబడుతూ మరింత పెద్దకోతి అవుతూ ఉంటుంది.

దాన్ని కంట్రోల్ చేయడం ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యం. ధ్యానం అంటే ఏమీ చేయకుండా మన నిజస్థితిని మన స్మృతిలోకి తెచ్చుకోవడమే! కర్మలు దగ్ధం చేసుకోవడమే!

మారం : సచ్చిదానంద స్థితి! దీన్ని వివరించండి సర్!

P.G. రామ్మోహన్ : ఇందాక చెప్పుకున్నాం కదా - ఏమీ చేయకుండా ఉండడమే అని! చేస్తున్న అన్నిపనులు కొద్దిసేపు మానివేయడమే ధ్యానం. అలాగే ఏ పని అయితే చేస్తున్నామో, ఆ పని మీద ధ్యాస పెట్టి, మిగతా అన్ని ధ్యాసలు ప్రక్కన పెట్టడమే ధ్యానం. దుప్పట్లు మార్చేపని అయినా సరే! "నేను చేస్తున్నాను" అనే ఫీలింగ్ లేకుండా, దుప్పటిని శ్రద్ధగా మడతలన్నీ కరెక్టుగా పెట్టడం ధ్యానం. తదేక ధ్యాస ధ్యానం. చీపురు పట్టుకుని, "నేను చిమ్ముతున్నాను" అనే ఫీలింగ్ లేకుండా శ్రద్ధగా, చిమ్మడమే ధ్యానం. అక్కడ నువ్వుండవు, నువ్వు చేసే పని ఉంది. అదే ధ్యానం! తదేక ధ్యానం!

అలాగే శ్వాసను గమనిస్తూ ఉంటే, నేను గమనిస్తూ ఉన్నాను అనే విషయాన్ని ప్రక్కనపెట్టి, శ్వాసనుగమనించాలి. అప్పుడు ఆలోచనలు రావు. అదీ అసలైన ధ్యానం! "నేను ధ్యానం చేస్తున్నాను" అనే ఫీలింగ్ కూడా అక్కడ ఉండకూడదు. అదే ధ్యానం! ఇక్కడ అద్భుతం ఏమంటే ధ్యానం మొదలుపెడితే, ఉన్నట్లుండి మనం మాయమయిపోతాం. నేను శ్వాసమీద ధ్యాస పెడుతున్నాను, నేను చేస్తున్నాను అనే ఫీలింగ్స్ లేని స్థితి నుంచి మాయమై ఆ పని నుంచి దూరమైతాం. ఏ సంకల్పాలూ ఉండవక్కడ. ఏ తొందరా ఉండదు. ఏ అహంకారం కూడా ఉండదు.

మృత్యువు కూడా మిమ్మల్ని తరమలేదక్కడ! ఆ స్థితిలో మీకు మీరుగా ఉంటారు. ఇదే సచ్చిదానంద స్థితి.

ఆ స్థితిలో 24 గం||ల పాటు కనురెప్ప కూడా కదల్చకుండా ఉన్నా కూడా, మీకు ఆత్మజ్ఞానం అంతా వచ్చినట్లు కాదు. అంతా సాధించేసినట్లు ..స్మృతి వచ్చేసినట్లు కాదు. మీ జీవితధ్యేయం, జన్మకారణం మీకు గుర్తు రావాలి.

సహజంగానే మనం మనలోని మొత్తం శక్తిని ఉపయోగించడం లేదు. చాలా ఎక్కువగా .. అంటే 15 శాతం మాత్రమే వినియోగించుకున్న వాళ్ళు కూడా చాలా గొప్పవాళ్ళు. ఉదా|| మనం ఎడమచేయితో చేసే పనులు తక్కువ. కనుక కుడిచేయి పవర్ చాలా ఎక్కువ, ఎడవచేతి కంటే! కొందరు ఎడమచేతివాటం వాళ్ళు ఉంటారు. వారిలో ఎడమ చేయి పవర్ ఎక్కువ. కుడిచేతిలో ఒక వస్తువును మనం అయిదుసార్లు మోస్తే, ఎడమచేతితో ఒకసారి మాత్రమే మోయగలం. అదే విధంగా నాడీమండలం లో కూడా, మన ఆలోచనా సంవిధానంతో ఎన్నో నాడులను మనం వదిలేస్తుంటాం. మన శరీరంలోని చాలా భాగాల్లో చాల శక్తుల్ని మనం స్మృతి లేక మర్చిపోయాం. ఎంతోశక్తిని కోల్పోయాం. దివ్యశక్తులన్నీ మరచిపోయాం. స్మృతిలోంచి తప్పించేసాం. ధ్యానం చేసినందువల్ల మనలో ఎంతో ప్రాణశక్తి ఉంటుంది. మనం క్రమంగా పూర్తిస్థాయి ఎనర్జీని నిరంతర సాధన వల్ల.. బోధన వల్ల పొందుతాం.

Go to top