"ది విజయవాడ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ"

 

"ఆవిర్భావం - విస్తరణ:

1997 జనవరి 17 వతేదీన "ఓమ్ ఆర్ట్ ప్రింట్" అధినేత B.ముఖర్జీ గారి ద్వారా బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిగారి గురించి విన్నాను. వెంటనే నా శ్రీమతి పద్మతో " 'ఏ పుట్టలో ఏ పాము వుందో? ' అంటారు గదా. పద వెళ్ళొద్దాం" అన్నాను.

అలా మొదటిసారి విజయవాడలో బ్రహ్మశ్రీ పత్రీజీని కలిసాను. మాకున్న సర్వ సందేహాలు ఆయన ముందు పెట్టాం. అన్నీ విన్న తర్వాత పత్రీజీ, "ఇన్ని సందేహాలు లొపల పెట్టుకుని బయట వెతికితే ఏం లాభం?" అని అన్నారు. కళ్ళు మూసుకుని 'శ్వాస పై ధ్యాస' పెట్టమన్నారు.

అలా ధ్యాన ప్రపంచంలో అడుగుపెట్టిన మేము, మాకంటే ముందుగా 'ధ్యాన సాధన' లో వున్న మెడికల్ స్టూడెంట్స్ డా|| v.శ్రీనివాస్, సదాశివ్, పద్మ, కిరణ్ మొదలైన సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటూ, సాధనాపరంగా ముందుకు సాగాం.

తదుపరి ఈ పిరమిడ్ ధ్యాన కుటుంబంలో అడుగుపెట్టిన మాస్టర్ నాగలక్ష్మితో మొట్టమొదటిసారి కర్నూలు వెళ్ళి అక్కడి సీనియర్ మాస్టర్స్ ఆంజనేయశర్మ, పాల్విజయ్కుమార్ గార్ల ద్వారా మరిన్ని సందేహాలు నివృత్తి చేసుకున్నాం.

పిరమిడ్ ధ్యానం చేస్తే ఎటువంటి శక్తి వస్తుందో అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాం. తర్వాత బ్రహ్మశ్రీ పత్రీజీతో కొన్ని గంటలు గడిపాం. ఆ సందర్భంలో పత్రీఈతో "ఈ రోజు మంత్రాలయ రాఘవేంద్రస్వామి గుడి చూసుకుని విజయవాడ వెళ్తాం." అన్నప్పుడు, సార్ మాతో "అలాగే దారిలో వున్న ఎమ్మిగనూరులో దిగి వీరన్నశెట్టిగారి ఇంటి వద్దక్లాసు తీసుకునివెళ్ళండి" అన్నారు.

కాస్సేపు నాకేమీ అర్ధం కాలేదు. తర్వాత సార్ని అడిగాను. "నేనే నేర్చుకోవలసిన టైమ్లో క్లాసు ఎలా తీసుకోవాలి?" అని. దానికి సార్ "మాస్టర్స్గా ఎదగవలసిన వారు ఎప్పుడూ తమకు తెలిసిన 'ABCD' ప్రక్కవారికి చెప్తూ తాము 'EFGH' నేర్చుకుంటూనే వుండాలి." అని చెప్పారు. అలా ధ్యాన క్లాసులు చెప్పటం మొదలుపెట్టిన నేను విజయవాడ వచ్చిన తర్వాత జరిగిన విషయాలన్నీ నా శ్రీమతి పద్మతో చెప్పి ఇద్దరం కలసి నిర్ణయించుకున్నాం. దాని పర్యవసానమే "ది విజయవాడ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ" ఆవిర్భావం.

ఆ రోజు నుండి ప్రతి ఆదివారం సాయంత్రం 6.00 నుండి 8.00 వరకు క్రమం తప్పక సజ్జన సాంగత్యం, సాధనాపరమైన శిక్షణ మాకు సర్వసాధారణమైన విషయాలుగా మారిపోయాయి. ఎన్నెన్నో ఊళ్ళ నుండి ఎంతో మంది గ్రేట్ మాస్టర్స్ విజయవాడ సొసైటీకి విచ్చేసి తమ తమ అమూల్యమైన సలహాలను అందిస్తూ మా ఆత్మోన్నతికి ఎంతగానో దోహదపడ్డారు.

ఇక బ్రహ్మశ్రీ పత్రీజీ విషయం చెప్పనక్కర్లేదు. తనకు తానుగా పెరగాలి అనుకున్న ప్రతివారికీ ఆయన వద్ద నుండి నేర్చుకోవటానికి ఆయన ప్రతి మాట, ప్రతి కదలిక నుండి కూడా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఆయన ఎవరిని ఉద్దేశించి ఏం చెప్పినా అందులో మనం నేర్చుకోవటానికి కావలసిన విషయం కూడా ఏదో ఒకటి ఇమిడే ఉంటుంది. ఎన్నో సందేహాలతో మన మనసులో ప్రశ్నలు వేసుకుని ఆయన ప్రక్కన కూర్చున్నా ఏదో ఒక సందర్భంలో మనకు ఆన్సర్ అందుతుంది.

మరి ముఖ్యంగా పత్రీజీ తీసుకున్న టార్గెట్ "2004 నాటికి ధ్యానాంధ్ర", "2008 నాటికి ధ్యానభారత్", "2012 నాటికి ధ్యాన జగత్"ల నిర్మాణం - ఏమాత్రం ఆలోచనాపరుడైనా కాస్త మనస్సు పెట్టి ఆలోచిస్తే ఇటువంటి టార్గెట్స్ ఎవరు పెట్టగలరు?

అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం. ఆయన చేతిలో 'టీ' పైసలు కూడా వుండవు. కానీ దేశమంతా తిరిగి ధ్యాన ప్రచారం చేయగల్గుతున్నారు. పైగా రోజుకు రెండు నుండి మూడు ఊళ్ళలో క్లాసులు నిర్వహిస్తూన్నారంటే సామాన్యమైన విషయం కాదు. సామాన్యుడు చేసే పనులు అంతకన్నా కావు.

ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన సంకల్పాలు అలా నెరవేరుతూ వెళ్ళటానికి ముఖ్య కారణం - ఏ స్వార్ధ చింతనా లేదు, స్వప్రయోజనం అక్కడ లేదు. బ్రహ్మశ్రీ పత్రీజీ ఎక్కడ ఏ క్లాసు చెప్పినా, ఎక్కడ ఏ యజ్ఞాలు, యాగాలు నిర్వహించినా అంతా లోక కళ్యాణర్ధమే అని వేరే చెప్పనక్కర్లేదు. ఇటువంటి నిర్ణయాలు.

 

జె.రాఘవరావు
విజయవాడ

Go to top