" ఆస్ట్రల్ సర్జరీ "

 

 

నా పేరు శ్రీలక్ష్మి.

నేను నా భర్త మాధవ్ గారి ద్వారా 2008 జూన్ నుండి ధ్యానం చేయడం ప్రారంభించాను. నేను వైజాగ్ టింపనీ స్కూల్‍లో బయాలజీ టీచర్‌గా పనిచేస్తున్నాను. మా వారికి 2006 సం||లో వెన్నునొప్పి ప్రారంభమయింది. ఎంతోమంది డాక్టర్స్‌ను కలిసాము, ఎన్నో టెస్ట్‌లు చేయించాము. చివరకు "ఈ వెన్నునొప్పి జీవితాంతం ఉంటుంది, మీరు చాలా జాగ్రత్తగా ఎలాంటి శారీరక శ్రమ చేయకుండా మందులు వాడుతూ ఉండడం ఒక్కటే పరిష్కారం" అని డాక్టర్లు తేల్చి చెప్పేసారు. దానితో నేను, మావారు చాలా నిరాశగా నిస్పృహతో బ్రతకడం మొదలుపెట్టాము.

జీవితంలో అనుకోనివి జరగడం సహజంకదా, అలాగే మావారు ఒకసారి హేమలత మేడమ్ గారి ఇంటబయట "మైత్రేయ బుద్ధ ధ్యానకేంద్రం" అనే బోర్డు చూసి మేడమ్ ద్వారా ధ్యానం చేయడం నేర్చుకున్నారు. మే 2008 ’బుద్ధ పౌర్ణమి ఉత్సవాలకు" బెంగళూరు మెగా పిరమిడ్‌కు వెళ్ళారు. మూడురోజుల ధ్యానశిక్షణతో వెన్నునొప్పి పూర్తిగా తగ్గిపోయింది. అంతేకాక జీవితంలో తిరిగి ఉత్సాహం వచ్చింది. పాజిటివ్‌గా ఆలోచించడం మొదలుపెట్టారు. ధ్యానం మా వారిని పూర్తిగా మార్చివేసింది.

ఆయనలో మార్పు చూసాక నాకు ధ్యానం మీద నమ్మకం కలిగింది. 2008 జూన్ నుండి నేనూ ధ్యానం చెయ్యడం మొదలుపెట్టాను.ధ్యానం చెయ్యకముందు నాకు నడుమునొప్పి, ముడుకుల నొప్పి ఉండేవి. ధ్యానం మొదలుపెట్టిన మూడవరోజు వెన్నెముకలో క్రింది నుండి పైకి కరెంట్‌షాక్ కొట్టినట్లు అయింది. నాడీమండల శుద్ధి జరగడం తెలిసింది. పదవ రోజున ధ్యానంలో నేను టింపనీ స్కూల్‌లో బయాలజీ లాబ్‌కి వెళ్ళాను. అక్కడ నా గురించి ఎవరో వ్యతిరేకంగా మాట్లాడడం చూసాను. ఆ తరువాత జూలైలో ఇదే సంఘటన నాకు వాస్తవంగా ఎదురయింది. అయితే ముందుగా వచ్చిన ధ్యానానుభవం వలన ఈ సమస్యను చక్కగా పరిష్కరించుకోగలిగాను.

అక్టోబర్ 2008 లో భీమవరం "ఆత్మజ్ఞాన శిక్షణా తరగతులకు" నేను, మావారు మా పాపతో సహా వెళ్ళాము. 3వ రోజు ధ్యానంలో దివ్యానుభవం పొందాను. జనవరి 2009 లో విగ్రహారాధన మానివేసాను. ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ రెడ్డినాయుడి గారి ఇంటిలో "ఏడు గంటల అఖండధ్యానం" లో పాల్గొన్నాను. అక్కడ ఆధ్యాత్మిక గ్రంధాలయం పెట్టమనే సందేశం వచ్చింది. ఫిబ్రవరిలో మా ఇంటిలోనే "శ్రీ కుసుమహర పిరమిడ్ స్పిరిచ్యువల్ లైబ్రెరీ" ని ప్రారంభించాము. ఫిబ్రవరిలో సహస్రార దశ అనుభవాన్ని పొందాను. ఫిబ్రవరిలోనే సూక్ష్మశరీరయానం చేస్తూ దేవాలయ గోపురాలు తీయించి పిరమిడ్ రూఫ్‌లు పెట్టిస్తున్న అనుభవాన్ని పొందాను. ఏప్రిల్ 3, 2009 శ్రీరామనవమి రోజు ఎయిడ్స్ రోగులకు ధ్యానం చెప్పమనే సందేశం వచ్చింది.

ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కూర్చోవడమే కాదు, ధ్యానం అంటే 1. ధ్యానం 2. స్వా-అధ్యాయం, 3. సజ్జన సాంగత్యం చెస్తేనే సరిగ్గా ధ్యానం చేసినట్లు అవుతుందని చెప్తూ ఉంటారు మన పత్రీజీ. నేను ధ్యానంలో ఎన్నో అనుభవాలు పొందాను. సజ్జనసాంగత్యంతో ఎంతో జ్ఞానాన్ని పొందుతున్నాను. స్వాధ్యాయం నా జీవితాన్ని చాలా ప్రభావితం చేసింది, ప్రతి పుస్తకం నాలో ఎంతో మార్పును తెచ్చింది.

మా అమ్మాయి నేహాగాంధీ (9 సం||) చక్కగా ధ్యానం చేయడమే కాకుండా, తన స్నేహితులకు, టీచర్లకు కూడా ధ్యానం నేర్పించింది. "మాది ధ్యాన కుటుంబం" అని నేను గర్వంగా చెప్పగలను.

భీమవరం ఆత్మజ్ఞాన తరగతులలో వెల్లుల్లి వలన తమోగుణం, రజోగుణం వృద్ధి చెందుతాయని తెలుసుకున్నాను. అప్పటి నుండి ఇంట్లో వాటిని వాడడం మానివేసాము. అయితే, ఒకరోజు ఆవకాయలో వెల్లుల్లి తినాలని చాలా గాఢంగా అన్పించింది, తినేసాను. అప్పటి నుండి సరిగ్గా వారం రోజులు ధ్యానం కుదరక చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అంటే ఒక వెల్లుల్లి వలన పొందిన ఇబ్బందిని సరిచేయడానికి అంత సమయం పట్టింది. ఒక్క వెల్లుల్లే నాకు వారం రోజుల పరీక్షను పెట్టిందే, మరి ధ్యానం చేస్తూ కూడా మాంసం తినేవారి సంగతి ఏమిటో? ఆలోచిస్తేనే భయం వేస్తుంది కదూ.

నేను, మావారు, మా పాప నేహాగాంధీ 2009 మే నెల 8 వతేది నుంచి 10 తేది వరకు బెంగళూరులో జరిగిన బుద్ధ పౌర్ణమి ఉత్సవాలకు వెళ్ళాము. అఖండ ధ్యానంలో అనేక అనుభవాలు సొంతం చేసుకున్నాము.

ఆరోజు వైజాగ్ మాస్టర్స్ అందరం కలిసి కింగ్స్ ఛాంబర్‌లో రాత్రంతా ధ్యానం చేసుకోవాలని ప్లాన్ వేసుకున్నాం కానీ నాకు మాత్రం చిన్న తలనొప్పి. ధ్యానం చేయాలని అనిపించటం లేదు. నిద్రపొమ్మని అంతరాత్మ చెబుతోంది. కొంచెంసేపు పడుకుని, తర్వాత లేచి ధ్యానం చేయాలని నిర్ణయించుకున్నాను. మావారు నేను ధ్యానంకు రానందుకు విసుక్కుని కింగ్స్ ఛాంబర్‌కు వెళ్ళిపోయారు. విపరీతంగా నిద్ర వచ్చి మెగా పిరమిడ్‌లోనే నిద్రపోయాను. కరెక్టుగా రాత్రి 11.52 ని||లకు తెలివి వచ్చింది. ఆ తరువాత గాఢనిద్రలోకి జారిపోయాను. నాకు అద్భుతమైన అనుభవం కలరూపంలో కళ్ళకు కట్టినట్టు మొదలైంది. నన్ను ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్ళారు. 11 వతేది రాత్రి అనుభవంలో నాకు జరిగింది "ఆస్ట్ర‌ల్ సర్జరీ" అని అర్థం అయింది. కళ్ళవెంట ఆనందబాష్పాలు వచ్చాయి. ఒక సంవత్సరం నుండీ నా ఎడమకాలి చీలమండలో అప్పుడప్పుడు నొప్పి మరి మంటగా అన్పిస్తుంది. కానీ, విచిత్రంగా ఆ సంగతి నాకే గుర్తు లేదు. కానీ, మాస్టర్స్ ఎంతో గుర్తుపెట్టుకుని నాకు హీలింగ్ చేసారు. వెంటనే నాకు హీలింగ్ చేసిన మాస్టర్‌ను చూడాలని అనిపించి ధ్యానంలో కూర్చున్నాను. "దిగ్రేట్ గ్రేటెస్ట్ మాస్టర్ లోబ్‌సాంగ్ రాంపా" అని తెలిసింది. ఈ శస్త్ర చికిత్స మధ్యలో మావారు, మా పాప నన్ను నాలుగుసార్లు లేపారట. అయినా నేను లేవలేదట.

ఉదయం 6గం||లకి ధ్యాన నుంచి బయటకు వచ్చాను. కింగ్స్ ఛాంబర్‌లో వున్న మా వారితో చెబుదామని లేచాను కాని నాకు ఆస్ట్రల్ సర్జరీ జరిగిన ప్రదేశమంతా పచ్చిపుండులాగా వుండి, అడుగువెయ్యడం చాలా కష్టమయింది. కొంచెం వాపు కూడా వచ్చింది. మళ్ళీ మే 12వ తేదీన రాత్రి కూడా రాంపా మాస్టర్ కలలోకి వచ్చి డ్రెస్సింగ్ చేసారు. తరువాత వాపు పోయింది నొప్పి కూడా తగ్గింది.

నా ఈ దివ్య అనుభవాలను ఆత్మ బంధువులందరితో పంచుకునే అవకాశం ఇచ్చినందుకు ధ్యానాంధ్రప్రదేశ్ బృందానికి కృతజ్ఞతలు.

 

శ్రీలక్ష్మి
వైజాగ్

Go to top