" ఎన్నో సూక్ష్మ శరీరయానాలు "

నా పేరు దుగ్గిశెట్టి పూర్ణచందర్ రావు, టెంపుల్ అల్వాల్, సికింద్రాబాద్.

నేను ఫిబ్రవరి 2005 సం||న పిరమిడ్ మాస్టర్ శ్రీ జయరామిరెడ్డి గారు నిర్వహించిన ఉచిత ధ్యానశిక్షణ తరగతులలో ధ్యానం నేర్చుకున్నాను. శ్రీ శ్రీనివాస్ జగద్గిరిగుట్ట హైదరాబాద్ గారు నన్ను ఈ ధ్యానం క్లాసులకు తీసుకుని వెళ్ళగా అప్పటి నుంచి నేను ధ్యానం చేస్తూ ధ్యానశిక్షణ తరగతులను నిర్వహిస్తున్నాను.

2005 సం|| ఫిబ్రవరిలో శ్రీ నరేందర్ ముదల్కర్ హైదరాబాద్ గారి ఇంట్లో శ్రీ నాయిని నర్సింహ్మారెడ్డి గారు మరి బ్రహ్మర్షి పత్రీజీ తో వెబ్‌సైట్ ప్రారంభం కార్యక్రమంలో పాల్గొన్నాను. అదేరోజున వారి యింటిలో గల పిరమిడ్‌లో ధ్యానం చేస్తూండగా నాకు ధ్యానంలో బ్రహ్మర్షి పత్రీజీ గారు రావడం జరిగింది.

ఫిబ్రవరి 2005 సం||లో శ్రీ విఘ్నేశ్వరాలయంలో 20 రోజుల ఉచిత ధ్యానశిక్షణ శిబిరం తరగతులను నిర్వహించగా ఎంతోమంది ఈ శిక్షణ శిబిరంలో ఎన్నో అనుభవాలను పొందడం జరిగింది. మార్చి 2005 మరో దేవాలయంలో 40 రోజుల తరగతులను నిర్వహించాను. రెండు సం||ల నుంచి ఇంట్లోనే "శ్రీ వేంకటేశ్వర పిరమిడ్ ధ్యానకేంద్రం" ను నెలకొల్పి అనేకమందికి ధ్యానంద్వారా ప్రచారం చేస్తున్నాను.

చాలాసార్లు నాకు ధ్యానంలో ఎన్నో సూక్ష్మశరీరయానం అనుభవాలు కలిగాయి.

ధ్యానంలోకి రాకముందు నాకు నడుమునొప్పి, మోకాళ్ళ నొప్పి వుండేవి. సంవత్సరానికి ఒకసారి జ్వరం వచ్చి నేను చాలా నీరసించి పోయేవాడిని. నేను ధ్యానం ద్వారా చాలా సంవత్సరాల నుండి వున్న అన్ని అనారోగ్యాలను నిర్మూలించుకున్నాను. నేను ధ్యానం మొదలు పెట్టినప్పటి నుండి నాలో ఏదో తెలియనిశక్తి ప్రవేశించి ఎనలేని ధైర్యం వస్తుంది. అనేక ధ్యానప్రచార కార్యక్రమాలు నిరంతరం నిర్వహించగలుగుచున్నాను.

ప్రతిరోజు సుమారు 18 గంటలు పనిచేస్తూన్నా, నాకు నీరసం కానీ, అలసట కానీ లేదు! కారణం ధ్యానం చేస్తూ, ధ్యానప్రచారం చేయటమే. ధ్యానంలో కల్గిన అనుభవాలు వర్ణనాతీతం, అది అనుభవించితే కానీ తెలియదు, ఇంత ఆనందం ఎందులోనూ లభించదు. ధ్యానం ప్రారంభం చేసినప్పటి నుంచి నేటివరకు నేను ఏ డాక్టర్ దగ్గరకు పోలేదు,మందులు వాడలేదు. ధ్యానం చేయటం, ధ్యానప్రచార కార్యక్రమాలు నిర్వహించడమే ఇందుకు కారణం.

అన్ని సమస్యలనూ పరిష్కరించే మార్గం ధ్యానమార్గం, అదే "ఆనాపానసతి ధ్యానం" అని నా స్వానుభవం ద్వారా తెలుపుతున్నాను.ధ్యానం ద్వారా ఏ కార్యక్రమం తలపెట్టినా అతిసులభంగా నెరవేర్చగలుగుతున్నాను.

ధ్యానం అన్ని సమస్యలకూ సులభమార్గం. ధ్యానం చేయడం, ధ్యానప్రచార కార్యక్రమాలు నిర్వహించడం నా జీవిత ధ్యేయంగా పెట్టుకున్నాను.

 

- దుగ్గిశెట్టి పూర్ణచందర్ రావు,
సికింద్రాబాద్

Go to top