"‘ధ్యానప్రచారం’ -మరి ‘వృత్తిధర్మం’ .. రెండూ రెండు కళ్ళునాకు!"

 

మారం శివప్రసాద్ : మీరు ఏ సంవత్సరంలో ధ్యానం చేయడం ప్రారంభించారు? బ్రహ్మర్షి పత్రీజీ ని మొదటిసారి ఎప్పుడు కలుసుకున్నారు? మీ విద్యార్హతలు, మీ కుటుంబం గురించి చెప్పండి!

రెడ్డినాయుడు : నేను 1997 సం||లో మొట్టమొదటిసారి "రైలు ప్రయాణం" లో ధ్యానం చేశాను! అదే సంవత్సరం విశాఖపట్నంలో ఓ కళ్యాణమండపంలో జరిగిన ఒక క్లాసులో బ్రహ్మర్షి పత్రీజీ ని ప్రప్రధమంగా కలిసాను.

నేను పత్రీజీ ని కలవడానికంటే కొన్ని నెలల ముందు మా అమ్మగారి అభీష్ఠం మెరకు పుట్టపర్తి వెళ్ళాను. సాయిబాబా ను చూసి వస్తూ తిరుగు ప్రయాణంలోనాకు ధర్మవరం పిరమిడ్ మాస్టర్స్ శ్రీ రజనీకాంత్, శ్రీమతి లలిత దంపతలు ధర్మవరంలో రైల్లో పరిచయం అయ్యారు.

మాటల్లో పుట్టపర్తిలో భక్తులు చేస్తున్న సేవ వగైరా విషయాల గురించి, స్వాముల గురించి, బాబాల గురించి, దేవుడి గురించి, ధ్యానం గురించి మాట్లాడుతూనే రాత్రి 1 గం|| అయింది. నేనూ, రజనీకాంత్ గారు మాట్లాడుతూనే ఉన్నాం. మిగతా వాళ్ళందరూ, లలితా మేడమ్ కూడా నిద్రపోయారు. అప్పుడు రజనీకాంత్ అన్నారు. "సర్ .. మీరు ఇంతసేపునేను చెప్పింది విన్నారు. నా తృప్తి కోసం ఒక పది నిమిషాలు ధ్యానం చేయండి" అని. "సరే" అని కళ్ళు మూసుకుని మఠం వేసుకుని కూర్ఛున్నాను.

ఆరోజు పౌర్ణమి ఆ ధ్యానంలో నేను ఒక దృశ్యం చూశాను. నాకు లుంగీ కానీ, ధోతీ కానీ కట్టుకునే అలవాటు లేదు. కానీ ఆ ’విజన్’ లో నేను పైజమా, ధోతీ వేసుకుని ట్రైన్‌లో బోగీ పైన కూర్చుని ఉన్నాను. ట్రెయిన్ పచ్చటి పొలాల గుండా వెళుతోంది. నేను కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నాను. ఇలా కాస్సేపు గడచిన తర్వాత కళ్ళు తెరచి, నా అనుభవాన్ని రజనీకాంత్‌కు చెప్పాను. "బ్రహ్మాండంగా ఉంది! గతజన్మలో మీకు కాస్త ఆధ్యాత్మిక నేపథ్యం ఉండి ఉన్నందువల్లనే మీకు మొదటిసారే, కొంచెం సేపట్లోనే ఇంత గొప్ప అనుభవం కలిగింది. ఇంకొక్కసారి మరొక పదినిమిషాలు ధ్యానం చేద్దాం" అన్నారు. అలాగే చేశాం, అది నా మొదటి ధ్యానమూ, మొదటి అద్భుతమైన ధ్యాన విజయమూ!

దారిలో రజనీకాంత్ దంపతులు తిరుపతిలో దిగిపోయారు. నేను ముందురోజు పుట్టపర్తిలో పది పుస్తకాలు కొన్నాను. ఆ బ్యాగ్ పైన బెర్త్ మీద పెట్టి వున్నాయి. నేను కాస్త నడుం వాలుద్దామని క్రింది సీట్లో పడుకోబోతున్నాను. ఎలా పడిందో ఏమో పైన బ్యాగులోంచి నేను కొన్న పుస్తకాల్లో ఒక పుస్తకం నామీద పడి తెరచుకుంది. "ఏంటిది ఎలా పడింది బ్యాగులోంచి విచిత్రంగా?" అని ఆ పుస్తకంలో తెరుచుకున్న పేజీని చూశాను కాకతాళీయంగా! అందులో "ఆలోచనకూ ఆలోచనకూ మధ్య కలిగే ఆలోచనా రహిత స్ఠితే .. ధ్యానం" అని బాబా వ్రాసిన పేరా చదవడం తటస్థించింది. మరి ఇది కాకతాళీయమా, వింతయా, అద్భుతమా అర్థం కాలేదు! ఇక మరింత ఇష్టం కలిగింది ధ్యానం పట్ల!!

నేను M.Com. B.L. చేశాను. మా తాతగారిది అనకాపల్లిలో వ్యవసాయ కుటుంబం. మా నాన్నగారు 65 సం||ల క్రింద లా చేసి వైజాగ్‌లో స్థిరపడ్డాను.

మేం ఇద్దరం అన్నతమ్ముళ్ళం, ఆరుగురు అక్కచెల్లెళ్ళు. మాకు ఒక బాబు, ఒక పాప. మా తమ్ముడు అప్పలనాయుడు కూడా సీనియర్ పిరమిడ్ మాస్టర్. చాలా చురుకుగా మన కార్యక్రమాల్లో పాల్గొంటూంటాడు. 1997 సం||ఓ నాకు పత్రీజీ పరిచయం అయ్యారు. మా అమ్మ కూడా పత్రీజీ కి తెలుసు. నా భార్య రమాదేవి. డిగ్రీ చేసింది మాది అంతా ధ్యాన కుటుంబమే.

మారం : మరి పత్రీజీ క్లాసుకు ఎవరి ప్రేరణతో వెళ్ళారు? పత్రీజీ ని కలిసిన మొదటిసారి మీకు కలిగిన అనుభూతులు ఏమిటి??

రెడ్డినాయుడు : ఆ తరువాత రెండు వారాలకు వైజాగ్‌లో డా|| గోపాలక్రిష్ణ (GK) గారిని కలిశాను. "పత్రీజీ వస్తున్నారు, క్లాసుకు రండీ" అని చెప్పడంతో సుబ్బలక్ష్మీ కళ్యాణమండపం లో జరిగిన ధ్యానం క్లాసుకు నేను వెళ్ళాను. ఆ క్లాసులో "ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు" అనే పాటను పత్రీజీ పాడారు, ధ్యానం చేయించారు.

ఆ తర్వాత పత్రీజీ అందరినీ ధ్యాన అనుభవాలు అడిగారు. అప్పుడు నేను .. రజనీకాంత్ మొదటి ధ్యానం చేయించినప్పుడు కలిగిన అనుభవంతో బాటు, పత్రీజీ క్లాసు కంటే రెండు రోజులు ముందు నాకు వచ్చిన ఒక మంచి కల గురించి చెప్పాను. ఆ కలలో నేను పెద్ద సింహద్వారం ఉన్న గొప్ప హాల్‌లోకి నెట్టివేయబడ్డాను. ద్వారం మూసుకుంది. హాలంతా చీకటిగా ఉంది. పై నుండి ఒక ఫోకస్ లైట్ ఒక కుర్చీ మీద పడుతోంది. అందులో సత్యసాయిబాబా కూర్చుని ఉన్నారు. ఆయన ముఖం సగం బాగా నలిగిపోయినట్లు ఉంది. మిగిలిన సగం "గులాబీ రంగు"లో ఉంది. ఆయన కుర్చీలో నా వైపు తిరుగుతూ, "you need not approach me, you need not approach me" అంటున్నారు. మళ్ళీ ఆ పెద్ద ద్వారం తెరుచుకుంది. కల చెదిరిపోయింది.

ఈ కలను విన్న పత్రీజీ ఇలా చెప్పారు : "‘భౌతికంగా కనపడే నా వద్దకు రావాల్సిన అవసరం లేదు, నువ్వు ధ్యానంలో ఎంతోమంది ఆస్ట్రల్ మాస్టర్స్‌ని చూస్తావు. వారిని కలువు’ అని సత్యసాయిబాబా మీకు చెప్పారు" అన్నారు పత్రీజీ.

మారం : ఆ తర్వాత పత్రీజీ ని మళ్ళీ మీరు ఎప్పుడు కలిశారు? మీ కుటుంబ సభ్యులందరికీ ధ్యానం పట్ల అవగాహన కలిగించడానికి ఎంతకాలం పట్టింది?

రెడ్డినాయుడు : అసలు నేను ధ్యానాన్ని పూర్తిగా విశ్వసించడానికి కారణం మా అక్కచెల్లెళ్ళు మరి మా అమ్మ. నేను మొదటిసారి చక్కటి ధ్యాన అనుభవం పొందినా కూడా, ఆ తర్వాత క్లాసులో అందరూ చెప్పే ధ్యాన అనుభవాలను ఎగతాళి చేసేవాడిని. నమ్మబుద్ధి అయ్యేది కాదు. అయితే నాతోబాటు క్లాసులకు హాజరయిన మా అక్కచెల్లెళ్ళు ధ్యానం చేస్తూ మంచి అనుభవాలను పొందారు. నాకూ చెప్పేవారు ఆ అనుభవాలను. క్రమంగా నేను కూడా ఆలోచనలో పడ్డాను. ఆ తరువాత మా అమ్మ ధ్యానం చేయడం ప్రారంభించింది.ఆమెకు అనారోగ్యం ఉండి, రక్తంలో సమస్య ఉండేది. తరుచు మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు వెళ్ళేది. ఆయన రెగ్యులర్‌గా బ్లడ్ టెస్ట్ చేసి ఆ తర్వాతనే మా అమ్మకు మందులు వ్రాసేవాడు. మా అమ్మ ధ్యానం చేయడం మొదలుపెట్టిన తరువాత మా డాక్టర్ గారి దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన బ్లెడ్ రిపోర్ట్ చూసి, "చాలా అభివృద్ధి కనపడుతోంది మీ రిపోర్ట్‌లో, మరి మీరు మందులు వాడడంతో బాటు ఇంకేమైనా చేస్తున్నారా?" అని అడిగారు అమ్మ "నేను ధ్యానం చేస్తున్నాను" అని చెప్పగా, "అయితే ధ్యానం చేస్తే ఇప్పుడు మీరు వాడుతూన్న మందులు సగం వాడితే చాలు" అని మందులు తగ్గించి వ్రాశారు!

ఈ సంఘటన వల్ల నాలో ఎనలేని మార్పు వచ్చింది. "ఎవరో అయితే అబద్దాలు చెప్పవచ్చు, మా అమ్మ చెప్పదు కదా, అలాగే బ్లడ్ రిపోర్ట్ అబద్ధం కాదు కదా" అని నేను రియలైజ్ అయ్యాను. ఆ తర్వ్వాత "ది వైజాగ్ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ" అని సొసైటీని రిజస్టర్ చేసి, ఆ సందర్భంగా పత్రీజీ ని అహ్వానించాం. అలా పత్రీజీని రెండవసారి ప్రోగ్రాం ఏర్పాటు చేసి పిలిచి వారిని కలవడం జరిగింది..

ధ్యానానికి వచ్చిన క్రొత్తలోనే నేను ఎవరికీ చెప్పకుండా కర్నూలు వెళ్ళి చక్కగా ధ్యానం చేశాను. కింగ్స్ ఛాంబర్ పైన కూడా చక్కని అనుభూతులను పొందాను.

మారం : మరి మీరు ఏమేం స్పిరిచ్యువల్ బుక్స్ చదివారు? మీకు జ్ఞాపకశక్తి చాలా ఎక్కువగా ఉందే .. పదేళ్ళ క్రితం సంఘటనలు కూడా కళ్ళకు కట్టినట్లు చెబుతున్నారు!

రెడ్డినాయుడు : పత్రీజీ "తులసీదళం", పీటర్ రిఛెలూ గారి "ఆత్మాయణం" చదివాను. ఆ తర్వాత "మరణం లేని మీరు"చదివాను. వృత్తిరీత్య చాలా బిజీగా ఉండడం వల్ల ఎక్కువ పుస్తకాలు చదవలేదు అయితే మా శ్రీమతి "మిలారెపా" చదివి వినిపించింది. ఇంకా చదివిన ఏమైనా చెపుతూ ఉంటుంది. నేను శ్రద్ధగా వింటాను.

పత్రిగారు పదేళ్ళక్రింద చెప్పిన విషయాలు కూడా నాకు గుర్తున్నాయి. వృత్తి రీత్య లాయరును కనుక, జ్ఞాపకశక్తి సహజంగా ఎక్కువ. ధ్యానం వల్ల నా జ్ఞాపకశక్తి మరింత ఇనుమడించింది. క్లాసులకు హాజరయినప్పుడు కూడా, ఎవరు చెప్పినా శ్రద్ధగా వింటాను.

ఈ సొసైటీ రిజిస్ట్రేషన్ కార్యక్రమం "డాల్ఫిన్ హోటల్" శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు .. అప్పట్లో ఆంధ్రా, తమిళనాడు మ్యూజిక్ అకాడెమీ ఛైర్మన్‌గా ఉండేవారు. వారు "గౌరవ అధ్యక్షులు"గా, మా Law Professor సెక్రెటరీగా, నేను ట్రెజర్‌గా "పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ" ప్రోగ్రామ్ చేశాం.

మారం : మీరొక "ధ్యాన పత్రిక" ను కూడా నడిపినట్లు విన్నాను!

రెడ్దినాయుడు : "ప్రతి పిరమిడ్ సొసైటీ ఒక మ్యాగజైన్ తెస్తే బాగుంటుంది" అని పత్రీజీ అన్నారు. అలాగే తెచ్చాం. ‘ధ్యానసాగరం’ అని పేరు పెట్టారు సార్. ఒక రెండు, మూడు సం||లు నడిపాం. మొదట్లో మామూలుగానె ఉన్నా, తరువాత చక్కని మ్యాటర్, చక్కని పేపర్‌తో తీసుకొచ్చాం. ఆ తర్వాత బ్రోచర్ టైపు తీసుకొచ్చాం ఒక్కొక్క బ్రోచర్ ఒక మాస్టర్ గురించి నాలుగు పేజీలు అలా!

మారం : పత్రీజీ మీ ఇంటికి మొదటిసారి ఎప్పుడు వచ్చారు ? పత్రీజీ సాన్నిహిత్యాన్ని మీరు ఎలా ఫీలయ్యేవారు?

రెడ్డినాయుడు : పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ ప్రారంభోత్సవం రోజు రాత్రి అంతా పత్రీజీ మా ఇంట్లోనే ఉన్నారు. అది మొదటిసారి. ఆ తర్వాత ఎన్నోసార్లు వైజాగ్ వచ్చినప్పుడు మా ఇంట్లోనే బసచేశారు. నేను సహజంగా మితభాషిని. "పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ" వైజాగ్‌లో స్టార్ట్ చేసినప్పటి నుంచీ ఈ రోజు వరకు కూడా ప్రతిసారీ స్టేజీపైన వారి ప్రక్కన కూర్చునో, మితంగా నా సంభాషణను నేను ముగించే వాడిని. వారు చెప్పింది అతి శ్రద్ధగా విని, నా మెదడులో నిక్షిప్తం చేసుకునేవాడిని. వారు పదేళక్రింద చెప్పింది కూడా వివరంగా నాకు గుర్తుంది.

పత్రీజీని నేను అమితంగా ఇష్టపడడానికి కారణం .. ఆయన ఎవ్వరినీ దేనికీ బలవంతం చేయరు! ఏదీ ఎవరిపైనా రుద్దడానికి ప్రయత్నించరు! ఇది చాలా గొప్ప గుణం!

ఒకసారి పౌర్ణమి ధ్యానంలో అందరూ వెళ్ళిపోయిన తరువాత పత్రీజీ ఏకంతంగా దొరికారు అప్పుడు ఆయనను నేను అడిగాను "సర్! ‘థర్డ్ ఐ’ అంటారు. ‘ఆస్ట్రల్ ట్రావెల్స్’ అంటారు. ‘వాకిన్’ అంటారు. ఇవన్నీ నిజమేనా" అని అడిగాను. అందుకు ఆయన తన ఫ్లూట్ చూపుతూ "ఇది సత్యమా? అని అడిగారు. "సత్యమే" అని చెప్పాను. "ఇది నేను పలికించడం ఎంత సత్యమో .. ధ్యానం, అందులోని అనుభవాలు అంతే సత్యం. అయితే దీన్ని నేను నమ్మపలుక నక్కరలేదు. మీరు స్థిర సుఖాసనంలో కూర్చోండి; చక్కగా ధ్యానం చేయండి మీకు కలిగే అనంతమైన అనుభవాల వెల్లువను వ్రాయండి ; వాటిని రివ్యూ చేసుకోండి క్రమంగా మీకే అర్థమవుతుంది, అవగతమౌతుంది. మీ అనుభూతులే మీకు సత్యాలు. ఎవ్వరైనా చెప్పింది .. నేను చెప్పిందైనా సరే .. మీకు ఋజువైతేనే ధ్యానం చేయండి. మీ ఆత్మప్రబోధంలో ‘ఇదంతా అబద్ధం’ అని అనిపిస్తే మానెయ్యండి.మీ ఫీలింగే మీకు సాక్ష్యం! నేను చెప్పేది సత్యమో, అసత్యమో మీకే తెలుస్తుంది" అన్నారు.

ఈ జవాబు నా గుండె లోతులకు తగిలింది. వారి జవాబు నాకు చాలా నచ్చింది. నేను ధ్యానం చేస్తూనే, అనుభవాలు పొందుతూనే మా అక్కయ్యల, మా అమ్మ గారి యొక్క నిదర్శనాలు చూస్తూనే ఇంకా , ఏ మారుమూలల్లోనో ఉన్న సందేహాన్ని పత్రీజీ ద్వారా నివృత్తి చేసుకున్నాను..

మారం : మీరు ధ్యానంలోకి రాకముందు పూజాది కార్యక్రమాలు చేసేవారా? ఇప్పుడూ చేస్తున్నారా?

రెడ్డినాయుడు : ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా, మా ఆఫీసులో బాబా ఫోటో చూసి, నేను అగర్‌బత్తీలు వెలిగించడం చూసి , "మీ పిరమిడ్ మాస్టర్ల 18 ఆదర్శ సుత్రాల్లో ‘పూజలు అక్కరలేదు’ అని వ్రాసి వుంది కదా, మరి ఇదేంటి?" అని అడిగారు ఒక క్లయింట్. నేను నవ్వుతూ "ఇదే ఫోటోను నేను క్రింద పెట్టి దానిపై కాళ్ళు పెట్టి నుంచుంటాను, నువ్వు నుంచుంటావా?" అని అడిగాను. ఇక ఏమి మాట్లాడలేదు ఆ క్లయింట్!

అలాగే రెండు దీపావళి పండుగలకు వరసగా మా ఇంట్లో వున్నారు పత్రీజీ. దీపావళికి "దివ్వెలు కొట్టడం" అనేది ఎన్నో సంవత్సరాలుగా మా ఇంట్లో ఉన్న ఆచారం. "మరి పత్రీజీ ఉన్నారు కదా?" అని మా అక్కచెల్లెళ్ళు సందేహం వెలిబుచ్చారు. దీన్ని గమనించి, పత్రీజీ నవ్వుతూ "మీరు అన్నీ తెలిసినవారు; క్యాజువల్‌గా మీ కార్యక్రమం మీరు కానివ్వండి" అన్నారు. అంతా చూశారు ఆయన. అందరి వెంటా పత్రీజీ కూడా. పటాసులు, తారాజువ్వలు వెలిగించారు. ఆయన చెప్పినదాన్ని అర్థం చేసుకుని, మసలాలి అంతే! అది నాకు, నా కుటుంబ సభ్యులకు చక్కగా అవగతమయింది.

మారం : వృత్తిరీత్యా మీరు ఒక ప్రముఖ న్యాయవాది. ధ్యానంలోకి రాకముందు, ధ్యానంలోకి వచ్చిన తరువాత మీ న్యాయవాద వృత్తిలో కలిగిన మార్పులు??

రెడ్డినాయుడు : మౌలికంగా న్యాయవాద కుటుంబం. మా తాతగారు ధర్మపరులు. మా న్నాన్నగారు ఆ ధర్మబుద్ధిని కొనసాగిస్తూనే, "లా" చేశారు.

ఒకసారి ఒక క్లాసులో పత్రీజీ " ఈ సమాజంలో ఐదుశాతం మంది మాత్రమే 95 శాతమ్ మందిని ప్రభావితం చేస్తూ ఉంటారు" అని చెప్పారు. ఈ ఐదుశాతం వాళ్ళ కర్మల యాక్టీవేషన్ ని బట్టే, మిగితా 95 శాతం మంది ప్రభావితం అవుతూ ఉంటారు. ఈ ఐదుశాతం వాళ్ళు
(1) డాక్టర్లు, శాస్త్రజ్ఞులు
(2) న్యాయవ్యవస్థ న్యాయవాదులు, న్యాయమూర్తులు
(3) పౌరోహిత్యం చేసేవాళ్ళు ప్రీస్టులు, ముల్లాలు
(4) ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, వాస్తు పండితులు
(5) రాజకీయ నాయకులు.

మా జ్యుడీషియరీ - న్యాయవాద డిపార్ట్ మెంట్ ను నేను ధ్యానంలోకి వచ్చిన తరువాత మరింత సునిశితంగా గమనిస్తూ వచ్చాను. అన్నదమ్ముల మధ్య తగవులు, వ్యాపార భాగస్వాముల మధ్య తగవులు, ఇగోలు, ప్రక్కవాళ్ళు ఆజ్యం పోయడం వల్ల, ఎగేయడం వల్ల మరింత పెరిగే గొడవలు, మాటపట్టింపు కోసం జీవితాలను నాశనం చేసుకునే వైనం, 30 రూపాయలకోసం మూడువేల రూపాయలు ఖర్చుపెట్టడం.. ఇలాంటివన్నీ స్పష్టంగా కనిపిస్తూంటాయి.

"పూర్వజన్మకృతం పాపం ‘వ్యాధి’ రూపేణ, ‘వ్యాజ్య’ రూపేణ పీడ్యతే!" వ్యాధిరూపంలో, వ్యాజ్య రూపంలో పూర్వజన్మ కర్మలన్నీ పీడిస్తూంటాయి. ధ్యానంలోకి వచ్చిన తరువాత, నా దగ్గరికి వచ్చే క్లయింట్స్ .. దాదాపు నావి సివిల్ కేసులు పూర్తిగా .. వాటిపై దావా వేసే ముందు నేను ఆ కేసు పూర్వాపరాలన్నీ పూర్తిగా గమనించి, నా ఎనర్జీ లెవల్‌ను, ఎథిక్స్‌ని జోడించి వీలయినంత వరకు దావా వేయకుండా పరిస్కారం చేసుకునే విధంగా నా క్లయింట్స్‌కు నచ్చజెప్పగలుగుతున్నాను! నా వాక్కు వారిని ఎంతో ప్రభావితం చేస్తోంది!

ముగ్గురు ప్రాణమిత్రులు. ఒకే వీధిలో ఉన్నారు. ఇద్దరికి డబ్బు అవసరం వచ్చింది. మూడవవ్యక్తి తన ఇల్లు అమ్మి వీరిద్దరి అవసరం తీర్చడానికి ఒప్పుకున్నాడు. వీరు అమ్మిన ఆ ఇల్లును అసలు ఇంటి ఓనరు ఒకటిన్నర లక్షలకు ఎక్కువకు ఇంకొకరికి అమ్మాడు. ఈ సందర్భంగా ముగ్గురి మధ్య తగాదా వచ్చి, విపరీతంగా పెరిగి స్నేహితుల మధ్య కేసు పెట్టుకొనే వరకు వచ్చింది. నా దగ్గరికి వచ్చిన ఈ కేసును లిటిగేషన్ లేకుండా అసలు స్వంతదారుకు డబ్బు తక్కువ కాకుండా, కొంత concession తో ముగ్గురికీ, కొన్నవారికీ మనస్సు నొచ్చుకోకుండా నేను కేసును అందరూ విత్‌డ్రా చేసుకునేలా చేయగలిగాను! ఇలాంటివెన్నో నేను సామరస్యంగా పరిష్కారం చేయగలిగాను .. కోర్టు కేసులు లేకుండా! ధ్యానం’, ‘జ్ఞానం’.. ఈ రెండూ మనలోని చైతన్యశక్తి ఎదుగుదలకు తోడ్పడుతూ, మన వాక్కుని మరింత శక్తివంతం అయ్యేలా చేస్తూ, చెల్లుబడి అయ్యేలా చేస్తాయి. ఇది నా అనుభవం!

ఒక నిస్సహాయురాలికి ..కేవలం ఆ వృద్దురాలి నిస్సహాయత చూసి, మూడు లక్షల విలువచేసే ఇంటిని పోకుండా కాపాడాను .. కేవలం గులాబి పువ్వు, ఒక కిళ్ళీని ఫీజుగా తీసుకుని!

ధ్యానం లోకి వచ్చిన తర్వాత హైకోర్టు లాయర్లు వాదించిన కేసుల్లో కూడా మెజారిటీ కేసులు గెలువగలిగాను. అయితే అ కేసుల్లోని ఎథిక్స్‌ని నేను తప్పక గమనించేవాడిని!

విశాఖపట్నంలో దాదాపు 5,000 మందికి పైగా లాయర్లు ఉన్నారు. అందులో ప్రాక్టీస్‌లో ఉన్నవారు ఒక 800 మంది పైగానే ఉంటారు. 1998,1999 ప్రాంతాల్లో ఒక సుప్రీంకోర్టు జడ్జిగారు విశాఖపట్నం వచ్చారు. అప్పుడు తాజ్‌లో డిన్నర్ ఏర్పాటు చేశారు. "దానికి ఎంతమంది లాయర్లను పిలవాలి?" అని ఒక లిస్ట్‌ను తయారుచేశారు. 30 మందిని సెలెక్ట్ చేశారు. అందులో 13 వ పేరు నాది, 1999 సం|| ప్రాంతంలో!

ఈ మధ్యనే ఒక సెమినార్‌లో "కేసుల్లేకుండా, మధ్యవర్తిత్వం జరిపి, ఇరు పార్టీలకు బోదించి, ‘కోర్టుకు వెళితే ఇంత సమయం ఇంత డబ్బు వేస్ట్ అవుతుంది’ అని క్లయింట్స్‌కి నచ్చజెప్పే పద్ధతిలో కేసులు సెటిల్ చేయాలి" అని ప్రభుత్వం కోరింది. దీనికి లాయర్లలో కొంతమందిని సెలెక్ట్ చేశారు. ఆ లిస్ట్‌లో నా పేరు 3వ స్థానంలో ఉంది! ఇది మెడిటేషన్ వల్లనే జరిగింది! నా స్థానం ఇంతగా పెరిగింది! పదమూడవ స్థానం నుండి మూడవ స్థానానికి!

మారం : ఈ మాసం జూలైలో "గురుపౌర్ణమి " సందర్భంగా విశాఖలో జరిగిన మూడు రోజుల ధ్యానయజ్ఞం పై మీ అనుభూతి?

రెడ్డినాయుడు : ఇప్పుడు జరిగిన మూడు రోజుల ధ్యానయజ్ఞం చాలా బాగా అయింది. మొదటిరోజు 2000 మంది లోపు, రెండవరోజు 3000 వరకు, చివరిరోజు 4000 మందికి పైగానే హాజరయ్యారు ‘ఉదయం సెషన్’ లో రెండున్నర గంటల ఏకధాటి అఖండ ధ్యానం బ్రహ్మాండంగా అందరినీ ఉర్రూతలు ఊగించింది. మాకు స్థలం కూడా నగరం నడిబొడ్డున దొరకడం ఒక ప్లస్ పాయింట్ అయింది. ఇదొక గొప్ప విజయం! విశాఖ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ చరిత్రలో ఒక మహా మైలురాయి!

మారం : మీరు ఎంతో కాలంగా ధ్యానం చేస్తున్నారు. మీకు కలిగిన అతి గొప్ప అనుభూతి ఏమిటి?

రెడ్డినాయుడు : నాకు ధ్యానంలో కలిగే అనుభవాలు కంటే కలల్లో ఎక్కువగా వస్తాయి. పత్రీజీ "కలలు అన్నీ ఆస్ట్రల్ ట్రావెల్స్" అని చెప్పారు. ఒకరోజు నిద్రలో నేను ఎక్కడో ఉన్నాను ; పిల్లలకు ధ్యానం నేర్పుతూ "శాకాహారం తీసుకోవాలి, మాంసాహారం పాపాహారం" అన్నాను. ఒక పిల్లవాడు లేచి "సార్ మరి గుళ్ళలో అమ్మవార్లకు మాంసమే నైవేద్యంగా పెడతారు కదా" అన్నాడు. నేను ఒక్క క్షణం తడుముకుని, ప్రేరణగా వచ్చిన విషయం ఇలా చెప్పాను - "క్షుద్రదేవతలు ఉండే ఆలయాల్లో, గ్రామదేవతల ఆలయాల్లో మాత్రమే మాంసం నైవేద్యంగా పెడతారు. మరి మన కనకమహాలక్ష్మి ఆలయాల్లో, విజయవాడ కనకదుర్గ ఆలయంలో, లలితాదేవి ఆలయాల్లో ఎక్కడా మాంసం నైవేద్యంగా పెట్టరు. వారు తీక్షణ స్వభావం గల గ్రామదేవతలు, వీరు శాంతస్వభావం గల శక్తి స్వరూపిణులు. మాంసాహారం తింటే మనకు కూడా క్షుద్రస్వభావం వస్తుంది" అన్నాను. అలా చెప్పానో లేదో దూరంగా అమ్మవారు శాంతస్వరూపిణి కనిపించి నన్ను "ఇలా రా" అని పిలిచి నన్ను చేయి పట్టుకుని ఆకాశంలోకి తీసుకుని వెళ్ళింది. అక్కడ నాకు సూర్యుడిని, చంద్రుడిని, భూమిని చూపింది. నాకేమి అర్థం కాలేదు. ’నీకు అర్థం కాలేదా" అని నాపైకి ఒక పుష్పం విసిరింది. అపుడు అది మాలగా మారి నా మెడలో పడింది!

నాకు అర్థం కాలేదు ఈ అనుభవం. ఒక మూడునాలుగు రోజుల్లో పత్రీజీ వైజాగ్ వచ్చారు. వారికి చెప్పాను ఈ కల గురించి. "సూర్యుడు అంటే సూర్యనాడి; చంద్రుడు అంటే చంద్రనాడి; భూమి అంటే మనం. మనం చేస్తున్న "ఆనాపానసతి’ వల్ల శ్వాస క్రమబద్దమై క్రమంగా మనం సమస్థితిలోకి చేరుకుంటాం. ఇక ‘జ్ఞానాగ్నిదగ్ధకర్మాణాం’ -ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి. ‘మనం ధ్యానం చేయడం వల్ల, బోధించడం వల్ల మన కర్మలన్నీ దగ్ధమవుతూ పూలన్ని కలిసిన ఒక మాలలాగ అందరినీ తయారుచేస్తున్నాం’ అని అర్థం’ అన్నారు!

మారం : విశాఖలో గత పది పన్నెండు సంవత్సరాలుగా జరిగిన ధ్యానప్రచారం గురించి చెప్పండి!

రెడ్డినాయుడు : 12 ఏళ్ళ క్రింద మా ఇంట్లో మొదటిసారి క్లాసు జరిగినప్పుడు 32 మంది ఉన్నారు. "గురుజాడ కళాక్షేత్రం" లో క్లాసు చేసినప్పుడు నాలుగు వేలమంది వచ్చారు. ఇప్పుడు మొన్న జరిగిన మూడు రోజుల ధ్యానయజ్ఞం లో మూడురోజులు కలిపి పదివేలమంది పాల్గన్నారు. ఇప్పుడు వైజాగ్ పరిధిలో 70 సెంటర్లు ఉన్నాయి! ఎన్నో రూఫ్ టాప్ పిరమిడ్స్ ఉన్నాయి. CMR పిరమిడ్ 40 ఇన్ టు 40 వచ్చింది. మంచి లైబ్రరీ కూడా డెవలప్ చేసాం.

ఏదైనా ప్రొగ్రామ్ వుందంటే నేను భక్తి కేంద్రాలకు, బీచ్‌కి గుళ్ళకు వెళ్ళి స్వయంగా బ్రోచర్స్ ఇస్తూంటాను. లంకమోహన్ గారు, అప్పాజీ, G,K. మరి మా తమ్ముడు అప్పలనాయుడు సత్యా మేడమ్ వీరజగదీశ్వరి మేడమ్, ఇంకా ఎంతోమంది కృషి చేస్తున్నారు.

మారం : వైజాగ్‌లో "మహా పిరమిడ్" ఎప్పుడు వస్తుంది? ఎక్కడ వస్తుంది?

రెడ్డినాయుడు : బ్రహ్మర్షి పత్రీజీ మొన్న మూడు రోజుల ధ్యానయజ్ఞంలో "కైలాసగిరి మీద పెద్ద పిరమిడ్ రావాలి" అని సంకల్పించారు. "సముద్రం వ్యూ వున్న పిరమిడ్ రావాలి" అని వారి ఆలోచన. అది బెంగళూరు పిరమిడ్ కంటే ఏమాత్రం తక్కువగా ఉండదు. స్టేజీమీద కూడా వైన్ ఛైర్మన్ ని సభాముఖంగా అడిగారు పత్రీజీ మాకొక స్థలం కేటాయించమని! అయన కూడా "ఇది చాలా మంచిపని, తప్పక చేద్దాం" అన్నారు. 2010 సం||లో తప్పక స్థలసేకరణ పూర్తిచేసుకుని నిర్మాణం కూడా మొదలుపెడతాం.

మారం : పత్రీజీ గురించి ఇంకా చెప్పండి!

రెడ్డినాయుడు : ఆత్మప్రబోధాన్ని మించిన ప్రబోధం ఏదీ ఈ భూమిపైన లేదు! సత్యాన్ని కుండబ్రద్దలు కొట్టినట్లు చెప్పగలిగిన మహానుభావుడు పత్రీజీ! తాను చెప్పదలచుకున్నది ఏదైనా, ఎవరికైనా, ఎప్పుడైనా నిర్భయంగా జంకులేకుండా సూటిగా మాట్లాడే గురువు పత్రీజీ! చేయాలనుకున్నది ఏదైనా సరే వెనుదీయక చేయగలిగిన గురువు పత్రీజీ .. ఉదాహరణకు "పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా"!

మారం : భవిష్యత్తులో పూర్తిగా ధ్యాన ప్రచారంలోనే జీవితం గడపాలి అన్న కోరిక ఉందా మీకు?!

రెడ్డినాయుడు : "బాధ్యతే భగవంతుడు" అని విశ్వసిస్తాను నేను. ఎన్నో కేసులు, ఎంతోమంది వ్యక్తులు నా మీద ఆధారపడి, తమ కేసుల్లో తీర్పుకోసం ఎదురుచూస్తూ ఉంటారు. చక్కగా ధ్యానం చేసి, ధ్యానప్రచారం చేస్తూ, నా క్లయింట్లకు నా పరిధిలో న్యాయం చేకూర్చడమే నాకిష్టం. అయితే ఎన్ని బాధ్యతలున్నా, పిరమిడ్ మాస్టర్లను పురమాయించి, అన్ని ప్రోగ్రామ్స్ సరిగ్గా జరిగేట్లు తప్పక చూస్తాను. ఒకసారి స్టేజీమీద కూర్చున్నప్పుడు సమయం ఉదయం గం|| 10.10 ని||లు అయింది. నా థాట్ రిసీవ్ అయిందేమో .. పత్రీజీ అన్నారు "రెడ్డినాయుడు గారూ! మీరు కోర్టుకు వెళ్ళవలసిన సమయం అయింది, వెళ్ళండి" అని. So, దాన్నే నేను పాటిస్తాను. "ధ్యానప్రచారం"-మరి " వృత్తిధర్మం" .. రెండూ రెండు కళ్ళు నాకు!

మారం : "ధ్యానాంధ్రప్రదేశ్" పాఠకులకు మీ సందేశం!

రెడ్డినాయుడు : ధ్యానం చేయడం వల్ల నెగెటివ్ అన్నది పూర్తిగా అన్ని యాంగిల్స్ లో నుండి వెళ్ళిపోతుంది. ధ్యానం చేయండి ధ్యానం బోధించండి. సీజన్ ఛేంజ్ అయినప్పుడు మనకు అనారోగ్యాలు కలుగుతాయి. క్రమం తప్పకుండా రోజువారీ ధ్యానం చేస్తే వాతావరణ మార్పుల వల్ల కలిగే జబ్బుల నుంచి ఎప్పటికప్పుడు మనం తొందరగా బయటపడవచ్చు. ఎటువంటి చెడు కర్మ నుంచైనా బయటపడడానికీ, వాటి పరిణామాలను ఎదుర్కోవడానికీ ధ్యానం ఒక్కటే రాజమార్గం!

 

రెడ్డి నాయుడు
వైజాగ్

Go to top