ఎంతో మిన్నగా నిజమైన వ్యక్తిత్వ వికాసాన్ని నేర్పిన వారే... "పత్రీజీ"

 

 

నా పేరు చంద్రశేఖర్ ; నివాసం వనస్థలిపురం హైదరాబాద్.

నేను 2005 సం|| ఏప్రిల్ 3వ తేదీన A. మధుమోహన్‌గారు ప్రారంభించిన తొమ్మిది వారాల ధ్యానశిక్షణ కార్యక్రమంలో నా ధ్యాన జీవితం ప్రారంభించాను.

ఏమని చెప్పను, ఎలా చెప్పను పత్రీజీ గురించి. ఒక్క మాటలో కాదు ... వారితో గడుపుతూన్న ప్రతిక్షణం ఎరుకతో కూడిన ఎదుగుదలే. జ్ఞానపరంగా అర్థవంతంగా మనిషి ఎలా జీవించాలి. ఎందుకు జీవించాలి అని వారు తెలుపుతూన్న వైనం అమోఘం! అందుకే అంటారు అందరూ "దటీజ్ పత్రీజీ" అని!

"మీలోని దైవత్వాన్ని గుర్తించనంతవరకు మీ జీవితం కకావికలంగా అస్తవ్యస్తంగా అసంతృప్తికరంగా, వ్యర్థపు మాటలతో కాలయాపన అవుతూనే ఉంటుంది. కానీ జీవితం అంటే ఇది కాదు. మీలోని అనంతమైన చైతన్యశక్తిని ఎరుక పరుచుకుంటూ ఆనందంగా జీవించడం" అంటూ నేర్పిన వారు.. "పత్రీజీ"!

తినడం దగ్గర నుంచి మొదలుపెట్టి, మాట్లాడటం, జీవించటం వంటి ప్రతి ఒక్క విషయం తను ఆచరించి చూపిస్తూ తల్లిదండ్రుల కంటే... ఉపాధ్యాయుల కంటే ..ఎంతో మిన్నగా నిజమైన వ్యక్తిత్వ వికాసాన్ని నేర్పిన వారే... "పత్రీజీ"!

"సరదాగా ధ్యానం నేర్చుకుందాం" అని వచ్చిన నేను వారి మాటలకూ, వారు నాపట్ల చూపిన ప్రేమకూ నిజంగా అబ్బురపడిపోయాను. నిజంగా గురువు అంటే ఒక శిష్యుడితో ఇలా ఉంటారా? శిష్యుడికి ఇంత దగ్గరగా ఉంటూ ఇంత జ్ఞానం నేర్పిస్తారా??!

"ఇలా శిష్యుడితో కలిసి జ్ఞానంతో పాటు ఆటపాటలూ, సదాచారాలూ నేర్పడం ఏ గురువుకి కూడా సాధ్యం కాదు" అని నాకు ఎంతగానో అనిపించింది. అందుకే వారు అందరి హృదయాల్లో ఎంతో విశిష్టస్థానాన్ని ఆక్రమించారు.

ఈ సందర్భంగా ఒక ముఖ్య విషయం : మొదటిసారి వనస్థలిపురంలో 2005 సం|| డిసెంబర్‌లో పత్రీజీ ని కలిసి కార్యక్రమం తరువాత వారిని కారులో ఇంటివద్ద దింపడానికి వెళ్తున్నాను. కారులో వారు నన్ను అడిగిన ప్రశ్న.. "క్వశ్చన్ వెయ్యి!" అని. ఇంతవరకూ గురువులనేవాళ్ళు చెపుతూంటే అలా చెవులప్పగించి విని దులుపుకుని వెళ్ళడమే కానీ.. ప్రశ్నలడిగేంతగా ఎదగలేదుగా మరి మనం.. దాంతో నాకు ఏం అడగాలో తెలియలేదు. నేను అప్పటి వరకు చేసిన అరకొర కార్యక్రమాల వివరాలు చెప్పాను. వారు వెంటనే " You are great a master " అన్నారు. నాకు ఏమీ అర్థం కాలేదు. ఆ తరువాత వారి ఇంటికి వెళ్ళిన తరువాత "భోజనం చెయ్యి" అని వారు స్వయంగా ప్లేట్ లో పదార్థాలన్నీ వడ్డించి నా చేతిలో పెట్టి, "మనం భోజనం ఎలా చెయ్యాలి" అని నేర్పుతూంటే "ఒక గురువు ఇలా కూడా చేస్తారా..? అని ఆశ్చర్యపోవడం నావంతు అయింది.

"ఎప్పుడూ ఇతరుల నుంచి ఏదేదో ఆశిస్తూ మరి వారి నుంచి విరివిగా తీసుకోవడం కాదు. నీ సమస్యను నీవే పరిష్కరించుకోవాలి. నీ జీవితంలో ఎదురైనా సంఘటనలను ఖాతరు చెయ్యక నీలోనే ఉన్న ఆ చైతన్యశక్తి ద్వారా నీవే పరిష్కరించుకోగలవు" అని వివరిస్తూ ఇతర గురువుల లాగా "నా మీద ఆధారపడు" అని నేర్పని నిజమైన గురువులు పత్రీజీ!

ఒకటిన్నర సంవత్సరం క్రితం నేను తీవ్ర అనారోగ్యానికి గురిఅయ్యాను. ఆగస్ట్ 25, 2008 రాత్రి నేను మరుసటి రోజు అంటే.. "ఆగస్టు 26 సూర్యోదయాన్ని చూస్తాను" అని అనుకోలేదు. నాకు ఆ సమయంలో పత్రీజీ బోధ గుర్తుకు వచ్చింది. ఇక మరి నేను ఆలస్యం చెయ్యక పత్రీజీ నేర్పిన ధ్యానం, ఆ ధ్యానం మీద నాకు ఉన్న అపారమైన నమ్మకంతో నా జీవితాన్ని నా చేతుల్లోకి తీసుకుని నాలోని ఆ చైతన్యశక్తిని తెలుసుకుని నా ఆత్మశక్తితో.. శ్వాస మీద ధ్యాస పెట్టి ప్రాణశక్తిని గ్రహిస్తూ మందులు అసలు వాడకుండా.. నా ఆరోగ్యాన్ని అద్భుతంగా తిరిగి తెచ్చుకున్నాను! ఇలా నాలోని చైతన్యాన్ని నాకు ఎరుక పరిచి నాలోని Inner Doctor ని మేల్కొలిపింది పత్రీజీ యే..!

ఆ తరువాత సెప్టెంబర్, 2008 లో పత్రీజీ "కడ్తాల్ లో 30 రోజుల క్లాస్ ఏర్పాటు చేసి అ చుట్టుప్రక్కల గ్రామాలన్నింటికీ వెళ్ళి గ్రామస్థులందరికీ ధ్యానపరిచయం చెయ్యి"అని అదేశించారు. అది కూడా "ప్రతిరోజూ ఒక మాస్టర్‌ని తీసుకుని వెళ్ళు" అన్నారు. ప్రతిరోజు ఒక్కొక్క మాస్టర్‌ను హైదరాబాద్ నుంచి కడ్తాల్ తీసుకురావడం అంటే కత్తి మీద సాము లాంటిదే. ఒక సామాన్యుడిగా ఆలోచిస్తే ఒకరకంగా చాలా ఇబ్బందే! కానీ ఆ పరిస్థితులలో ఒకటే నిర్ణయం చేసుకున్నాను. "నేను పత్రిసార్ కి మాట ఇచ్చాను. మరి వారు అంతమంది మాస్టర్స్ ఉండగా నాకు మాత్రమే ఆ పని అప్పజెప్పారు. అంటే అది నా వల్ల మాత్రమే అవుతుంది! ఆ అవకాశం అందుకే నాకు ఇవ్వబడింది" అని. ఇక నేను లేని ధైర్యం కూడతీసుకుని ఆర్థిక, అనారోగ్య పరిస్థితులనూ కూడా లెక్కచేయక పత్రిసార్ ని మనస్సులో తలచుకుని ప్రతిరోజూ ఒక మాస్టర్‌ని హైదరాబాద్ నుంచి కడ్తాల్ తీసుకుని వెళ్ళటం, పెద్దలకు ధ్యానశిక్షణతో పాటుగా అక్కడి స్కూళ్ళలో కూడా ధ్యాన తరగతులు నిర్వహించడం జరిగింది!

30 రోజుల తరువాత బ్రహ్మర్షి పత్రీజీ ఆధ్వర్యంలో కడ్తాల్‌లో బ్రహ్మాండమైన కార్యక్రమం విజయవంతంగా జరిగి వేలమంది గ్రామస్థులు పత్రీజీని కలవడం మరి వారంతా ఆనందించడం చూసి.. నా ప్రయాసనంతా మర్చిపోయాను!

"హమ్మయ్య! ఇక్కడితో నాకు అప్పజెప్పిన పని అయిపోయింది" అని నేను సంతోషిస్తూంటే మరుక్షణంలోనే "కడ్తాల్ నుంచి 30 కి.మీ. దూరంలో ఉన్న గ్రామం ’వెల్‌జాల్’ కి వచ్చేనెల వస్తున్నాను. ఆ గ్రామం చుట్టుప్రక్కల కూడా నువ్వే చూసుకో" అంటూ ఇంకో బాంబు పేల్చారు పత్రీజీ. ఇది నిజంగా నాకు పెనుసవాల్! అంతదూరం మాస్టర్స్‌ని తీసుకువెళ్ళడం చాలా ఇబ్బంది. అదికాక "ప్రతిరోజూ హైదరాబాద్ నుంచి వెళ్తే అక్కడ అనుకున్న లక్ష్యం నెరవేరదు" అని నిర్ణయించుకుని ఇక ఆ ఊళ్ళోనే మకాం వేద్దామని బ్యాగు సర్దుకుని నేను నా భార్య శ్రీవాణి బయలుదేరాం!

నిజానికి పత్రిసార్ కి ఇక్కడ చెప్పాలి " దటీజ్ పత్రీజీ" అని. ఎందుకంటే మాకు అతిథ్యం ఇచ్చిన ఆ గ్రామస్థులు P. చిన్నయ్య దంపతులు మరి P. గోపాలకృష్ణ దంపతులు మరి ప్రతిగ్రామంలో మాకు క్లాసులు ఏర్పాటు చేసిన C. రమేష్ గార్లవంటి అద్భుతమైన ధ్యానులను మాస్టర్లను ఆ క్లాసుల ద్వారా బయటికి తేవడం మరి సొసైటీకి అటువంటి ఆణిముత్యాలను అందించండం నా ద్వారానే జరిగిందనే తృప్తి అనుపమానం!

ఇక్కడ ఒక నిమిషం ప్రత్యేకంగా చెప్పాలి. అప్పటివరకు ఏదో ముక్కున పట్టుకుని చెప్పడం తప్పించి ప్రత్యేకంగా నేను ఎక్కడా క్లాసులు చెప్పలేదు. కానీ మొండిధైర్యంతో "నేను చెప్పగలను” అని పత్రిసార్ ని తలుచుకుని బయలుదేరి వెళ్ళాను. నా మొండిధైర్యం, పత్రీజీ కాన్షియస్‌నెస్ నన్ను ఒక సమర్థుడైన మాస్టర్‌గా తీర్చిదిద్దింది! అక్కడ ఉన్న 25 రోజులు ప్రతిరోజూ ప్రతిక్లాసులో ఒక అద్భుతమే జరిగేది. ప్రతిరోజు ఉదయం 4 గం||లకి ప్రారంభమైన మా ప్రయాణం రాత్రి 12 గం||లకి ముగిసేది. ఇలా సుమారు ఆ చుట్టుప్రక్కల 18 గ్రామాలు మరి పాఠశాలలు కవర్ చెయ్యడం అద్భుతమే మాకు. చివరిరోజు మిట్టమధ్యాహ్నం 2 గం||లకు పత్రిసార్ క్లాస్‌కు అంత మండుటెండలో కూడా సుమారు 1300 మంది ప్రజలు ఆ చుట్టుప్రక్కల గ్రామాల నుంచి రావడం చూసి నేనే ఆశ్చర్యపోయాను. ఏం క్లాసు తీసుకోవాలో తెలియని నాకు మరి అన్నిరోజులు వేరే ఏ మాస్టర్ లేకుండా 25 రోజులు అద్భుతంగా క్లాసులు నిర్వహించేలా తయారుచెయ్యడం ఎవరికి సాధ్యం??

ఆ తరువాత కల్వకుర్తి చుట్టుప్రక్కల గ్రామాల్లో కూడా నెలరోజుల పాటు క్రొత్తవాళ్ళకు క్లాసులు నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఇంకా గొప్పవిషయం ఏమిటంటే భగవద్గీత గురించి అసలు ఎప్పుడూ తెలుసుకోలేదు. కానీ ఇక్కడ అంటే ఈ గ్రామంలో భగవద్గీత పారాయణం బాగా చేస్తారు. వారికి దీనిని పారాయణం చేయడం తెలుసుగాని, దాని సారాంశం తెలియదు. అందుకని నేను కూడా భగవద్గీత మరి ఉత్తరగీత తెలుసుకుని దానిసారంతో క్లాసులు చెపుతూంటే నిజంగా వారు అనుభవించిన ఆనందం అంతా ఇంతా కాదు. పత్రిసార్ కృష్ణుడి రూపంలో వచ్చి అక్కడ ఉండి నా రూపంలో చెబుతూ వుంటే నిజంగా నా జన్మ ధన్యం అయిందనిపించింది!!

మన కడ్తాల్ మహేశ్వర మహా పిరమిడ్ దగ్గర జరిగిన "శివరాత్రి అఖండ ధ్యానం" మరి ఆగస్టు 15 శిలాన్యాసం సందర్భంగా పత్రీజీ నాకు అప్పజెప్పిన పని ఎంతో సమర్థవంతంగా చెయ్యడానికి ప్రతిక్షణం వారు అందించిన సూచనలు చాలా అద్భుతం. ఇలా "ఒక మాస్టర్ అంటే కేవలం సాధన, స్వాధ్యాయం, సజ్జనసాంగత్యమే కాదు; ఏ పని అయినా చెయ్యగలడు" అని నిరూపించిన వారు "దటీజ్ పత్రీజీ" మరి నా అదృష్టమేమో గానీ ఈ సంవత్సరం శ్రీశైలంలో జరిగే 11వ ధ్యాన యజ్ఞ నిర్వహణలో నాకు కూడా అవకాశం కల్పించినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను!

నేను, నా భార్య శ్రీవాణి ప్రతి గవర్నమెంట్ స్కూల్‌కి వెళ్ళి విధ్యార్థులకు మూడు రోజులు చొప్పున క్లాసులు చెప్పడం జరిగింది. తరువాత వారు ఇచ్చిన కాంప్లిమెంట్స్ మాకు చాలా ఆనందాన్ని ఇచ్చేవి. ఇలా ఇటువంటివి ఎన్నో అనుభవాలు ఇంకా ఎన్నో పంచుకున్నా తరగనివి!

ఎటువంటి శిష్యుడినైనా జ్ఞానపరంగా దూరంగా పెట్టే గురువులనే చూసాను కానీ, ప్రతిక్షణం ఎన్నివేల మైళ్ళదూరంలో ఉన్నా మనల్ని అంటిపెట్టుకుని ప్రతి సందర్భంలోనూ వారు మనకు తగు సూచనలు చేస్తూ మనం సరియైన మార్గంలో ప్రయాణించేలా మనల్ని తీర్చిదిద్దుతూ ఉన్న మన గురుదేవులే "దటీజ్ పత్రీజీ"!!

జీవితంలో ఎంతో నిజాయితీతో, ఎంతో తెగింపుతో, ఎంతో తపనతో "మీలోనే ఉన్న ఆ దైవం కోసం వెతకండి; జీవితం అంటే కేవలం, భౌతికం లేక ఆధ్యాత్మికం కాదు; రెండు కూడా రెండు కళ్ళవంటివి; రెండింటి మీద సమస్థితిలో ప్రయాణం చేయగలిగిన వాడే అసలైన జ్ఞాని" అని కుండబద్దలు కొట్టిన వారే పత్రీజీ. అందరిగురువుల లాగా ఉంటే పత్రీజీలో ‘కిక్’ ఏం ఉంటుంది?!

ప్రతి సందర్భంలోనూ వారినే గమనిస్తూ వారి సందేశాన్ని తీసుకుంటూ వారి ఆశీస్సులను ఎల్లవేళలా కోరుకుంటూ...

 

ధూళిపూడి చంద్రశేఖర్
వనస్థళిపురం, హైదరాబాద్,
సెల్: +91 98487 88128

Go to top