" తల్లినీ, తండ్రినీ మించిన మరోవ్యక్తి .. పత్రీజీ "

 

 

నా పేరు M. సుమతి ఆనంద్.

నేను తేది 03-03-1996 సం||న పత్రిసార్‌ని కలవటం జరిగింది. చిన్న గెడ్డం, జీన్స్ ప్యాంట్, టీ షర్ట్ లో చాలా అందంగా కనిపించారు. ఆ క్షణంలో వారు చూసిన చూపును ఈ క్షణం వరకు మరువలేను.

"ఇంకొక గురువును కలవాలి" అన్న తలంపు కానీ, "ఇంకొక ధ్యానం చెయ్యాలి" అన్న ఆలోచన కానీ ఇక నాకు రాలేదు. ఒక్కచూపుతో వారి వైపు త్రిప్పుకున్న "మహాగురువు సాంగత్యంలో పదమూడు సంవత్సరాలు గడిచిపోయాయి" అంటే నమ్మలేకపోతున్నాను.

1997 సం|| అనుకుంటాను, "తలకోన ట్రెక్కింగ్ ప్రోగ్రాం ఉంది, 200 మంది మాస్టర్స్ వస్తారు, మీరు రండి" అని సార్ పిలిచారు. నేను ఆనందరావు సార్, పిల్లల్ని తీసుకుని వెళ్ళాము. ‘తలకోన’, ‘నెలకోన’ అంతా తిరిగి రాత్రికి ఒక దగ్గర బస చేసాము. "సార్..200 మంది మాస్టర్స్ వస్తారని చెప్పారు; వాళ్ళు ఎప్పుడు వస్తారా?"అని ఎదురుచూసాను. మరుసటిరోజు కూడా గడిచిపోతూ ఉంది. నాకు ఆతృత ఎక్కువయింది. నేను "మాస్టర్స్‍ని కలుసుకోకుండా వెళ్ళిపోతానేమో" అనుకుంటూ, అయినా పత్రిసార్‌నే ఒకసారి అడుగుదాం" అనుకుని అడిగాను. "సార్..! 200 మంది మాస్టర్స్ వస్తారని చెప్పారు; వాళ్ళు ఎప్పుడు వస్తారు?" అని అడిగాను.

సార్ "‘మాస్టర్స్’ అంటే వీళ్ళే, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ మాస్టర్స్" అన్నారు. నాకు ఒక్కసారిగా షాక్ "ఏమిటి?".. వీళ్ళందరూ మాస్టర్లా? ఒక్కరికి కూడా కాషాయ బట్టలు లేవు, గెడ్డాలు లేవు, చిన్నపిల్లలు, పైపైచ్చు జోక్సు, అయితే వీరు మధ్యమధ్యలో "నాకు సాయిబాబా కనిపించారు", "నాకు కృష్ణుడు కనిపించారు"అంటూ వాళ్ళు ధ్యానానుభవాలు చెపుతూ ఉంటే నాకు నమ్మశక్యం కాలేదు. అయినా "ఏమిటీయన? వాళ్ళ దగ్గరకు వెళ్ళి జోక్సు వింటూ వాళ్ళు చెప్పింది నమ్మి,చప్పట్లు కొట్టిస్తూ, వాళ్ళని ‘గ్రేట్ మాస్టర్స్‘ అంటూ పొగుడుతూ" నేను జీర్ణించుకోలేకపోయాను. "రాక రాక వచ్చి పిచ్చివాళ్ళ గ్రూప్‌లో పడ్డాను" అనుకున్నాను.

అయితే రాను రాను వారితో నా పరిచయం పెరిగేకొద్దీ నాకు అర్థమయింది.. ఈయన మనకి సామాన్యంగా కనిపిస్తున్నా.. మనల్ని మార్చగల మహా అస్త్రం చేత పూసిన మహా (వ్యక్తి) శక్తి అని, మనతో కలిసి మనలో ఒక్కరుగా మెలుగుతూ జ్ఞానాన్ని బోధించడం చిన్న విషయం కాదు.

1998 సం|| తిరుమల కొండలలో "No Food Treking" కి వెళ్ళాను. మొత్తం 250 మంది పాల్గొన్నారు. అక్కడికి వైజాగ్ సత్యామేడమ్ 11 నెలల బిడ్డను తీసుకుని వచ్చారు. అమ్మో అనుకున్నాను. ఒక పెద్దావిడ 70 సం|| ఏళ్ళు.. వీళ్ళంతా ఎందుకు యువకుల్లాగా తిరుపతి కొండల మీదకి ట్రెక్కింగ్ కి రావటం అనుకున్నాను. 70 సం||ల ఆవిడ చిన్నపిల్లల్లాగ కొండ లెక్కి వస్తూంటే మతిపోయింది. ఆ ట్రెక్కింగ్‌లో అన్నం లేదు, జడివాన, వంటి మీద బట్టలు తడిచిపోయాయి, బట్టల మార్చుకుందామ అంటే బ్యాగ్‌లో బట్టలు తడిసిపోయాయి, రాత్రిళ్ళు నిద్రలేదు, పళ్ళు కొరుక్కుపోయే చలి, వెలగని క్యాంప్‌ఫైర్, లోపల ఆకలి, పరుగుల నడక, వీటన్నిటికీ తోడుగా "అందరూ కళ్ళు మూసుకుని ధ్యానం చెయ్యండి" అని సార్ ఫ్లూట్ వాయిస్తూ.. అసలు ఏమిటి??

"చీకట్లో కళ్ళు మూసుకుంటే ఏమిటి? తెరిస్తే ఏమిటి? అన్ని పిచ్చిచేష్టలు చేస్తున్నారు. ఇంక బుద్ధి ఉంటే ఇలాంటి ట్రెక్కింగ్‌లకు మళ్ళీ రాకూడదు" అనుకున్నాను. ఏడుపు ఒక్కటే తక్కువ.

మెల్లగా సార్ వచ్చి నా ప్రక్కన కూర్చుని, "మేడమ్, ఏమిటి? కాళ్ళు గీరుకుపోయాయా?నొప్పి పెడుతున్నాయా?" అంటూ కాళ్ళు నొక్కేరు, నాకు ఏమి అర్థం కాలేదు. ఆ క్షణం నిజంగా నాకు మతిపోయింది. నాకు ఆ క్షణంలో నా తల్లినీ తండ్రినీ మించిన వ్యక్తిని వారిలో నేను దర్శించాను. "నా కొనవూపిరి ఉన్నంతవరకు ఈయన్ను వదలిపెట్టి వెళ్ళకూడదు" అనుకున్నాను. దటీజ్ పత్రీజీ!!

కఠినమైన పరిసరాలనూ, పరిస్థితులనూ కల్పిస్తూ మనకి ట్రైనింగ్ ఇవ్వగల మాస్టర్లకే వారు. A.C. రూమ్‌లో హాయిగా ఉన్న ఆడవాళ్ళు ఏమిటి... పులులు, క్రూరమృగాలు, కఠినశిలలు ఉన్న అరణ్యాలకు వెళ్ళటం ఏమిటి? "రాత్రిళ్ళు చెట్లు ఎక్కి కూర్చోండి" అని శాసించేవారు ఆయన. అంతటి కఠినశిక్షణ ఎందుకు ఇచ్చారో నాకు ఇప్పుడు అర్థం అయ్యింది. (ఇచ్చేటప్పుడు బాగా తిట్టుకున్నాను) దటీజ్ పత్రీజీ!!

ఒకసారి "సార్, ఇంతమంది మాస్టర్లు ధ్యానానికి వస్తున్నారు కానీ, ఒక్కరిలో కూడా మనం మాస్టర్ అవ్వాలన్న తపన, శ్రద్ధ లేదు. ఎందుకు? ..మమ్మల్ని మాత్రం ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువునీళ్ళు త్రాగించారు" అని అడిగాను.

ఆయన "నేను శిక్షణ ఇచ్చిన వారు యోధానుయోద్ధులు. ఎంతటి కఠినపరీక్ష‌లు ఎదురైనా, తమంతా తాము ఎదుర్కోగలవారు, ఇప్పుడు వచ్చే వీళ్ళందరూ మీ ట్రైనింగ్‌లో ట్రెయిన్ అయ్యేవాళ్ళు అన్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా .. ధ్యానంలో కానీ, బాహ్యంలో కానీ.. ధీటుగా తనంత తాను నిలబడగలిగిన వారు మాస్టర్లు అవుతారు" అన్నారు.

సార్ చేత ట్రైనింగ్ పొందటం నిజంగా మా భాగ్యం. అందుకు కించిత్ గర్వం కూడా లేకపోలేదు. అయితే ఎప్పుడూ తిట్టించుకోవటం, తన్నించుకోవటం తప్పదు అనుకోండి.. అది వేరే విషయం.

నేను సార్‌ని చాలా శ్రద్ధగా గమనిస్తూ ఉంటాను. ఆయన ఉన్నప్పుడు ఒక్కక్షణం కూడా వారిని ‘మిస్‘ అవ్వటం ఇష్టం ఉండదు. వారు ఒక్కక్షణం కాలం కూడ వృధా చెయ్యరు. ఎప్పుడూ పుస్తకాల గురించి,వారు చదివిన ఇంగ్లీషు బుక్స్ గురించి చిన్నచిన్న కాన్సెప్ట్ రూపంలో చెబుతూ .. భగవద్గీతనూ, వేదాలనూ, ఉపనిషత్ సారాలనూ సైతం ఒక కొత్తకోణంలో ఆలోచించి మనకి అర్థం అయ్యేలాగా చెప్పగల ప్రజ్ఞాశాలి సార్. ఎవరయినా "సార్, నాకు ఈ పుస్తకంలో ఫలానాది నచ్చింది" అంటే.. వెంటనే "మరి ఆలస్యం ఎందుకు? అనువదించండి" అంటూ ప్రోత్సాహం చేసి వారిలోని జ్ఞానాన్ని వారికి తెలియజేయగలిగిన గురువు ఆయన. అందుకే మన పిరమిడ్ సొసైటీలో పుస్తకాలు అనువదించగలిగిన ఇంతమంది దిట్టలు తయారయ్యారు. దటీజ్ పత్రీజీ!!

1999 సం||లో, మన ఎన్నికల సమయంలో, ఉన్నట్టుండి ఆనందరావు గారికి "ఉద్యోగం రాజీనామా చేసి ఎన్నికల్లో మీరు MLA గా పోటీ చేయండి" అన్నారు, మాకు అర్థం కాలేదు. ఏం చేయాలో తెలియలేదు." సరే" అని ఉద్యోగానికి రాజీనామా చేసినట్టు పై అధికారికి కాగితాలు పంపించాము. అక్కడి నుంచి వారు"మీరు అన్ని విధాలుగా సరిగ్గా ఉన్నట్టు ఉత్తరం పంపండి, లేకుంటే దీన్ని చెత్తబుట్ట దాఖలు చేస్తాము" అని దాన్ని తిరస్కరించారు. అప్పుడు ఆనందరావు గారిని కాకుండా, ‘నన్ను’ MLA గా పత్రిసార్ దగ్గరుండి నామినేషన్ వేయించారు.

"రాజకీయం" అంటే ప్రజలలో చైతన్యం తేగలిగిన ఒక శక్తివంతమైన ఉపకరణం. ఆత్మజ్ఞానులే రాజ్యపాలన చెయ్యలన్నది సార్ ఉద్దేశ్యం. ధ్యానం నుంచి రాజకీయ రంగం వైపు ప్రయాణం చేయటం చిన్నవిషయం కాదు. ధ్యానం అంటే "కే" అంటారు, రాజకీయం అంటే మాటలా .. కానీ దానివైపు కూడా దూసుకువెళ్ళగల అపర చాణుక్యుడు వారు. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మూవ్‌మెంట్ లో నేను పాల్గున్నందుకు ఎంతైనా గర్వపడుతున్నాను. దటీజ్ పత్రీజీ!!

సార్‌లో నేను అప్పుడప్పుడూ ఒక విచిత్రమైన వ్యక్తిని దర్శిస్తూంటాను. ఒక వక్తిని కొట్టి, బండబూతులు తిట్టి కాసేపటి తర్వాత అదే వక్తి ఎదురుపడితే "ఏమిటి సంగతి? ఇందాక బాగా కొట్టానా? బాగా తిట్టానా?" అని అడుగుతారు. కొట్టించుకున్న వ్యక్తితో పాటు అక్కడ ఉన్న వాళ్ళకు కూడా మతిపోతుంది. ఆ వ్యక్తిమీద ద్వేషంతో కాదు కొట్టేది. "కొన్ని వేలమందిని కంట్రోల్ చెయ్యాలి అంటే తప్పదు" అనిపిస్తుంది. ఒక క్లాసులో ఒక పిల్లవాడిని దండిస్తే అందరం జాగ్రత్త పడతాము. సార్ "ఏ వ్యక్తి ఏమిటో" అని నిమిషాలలో స్కాన్ చెయ్యగలవారు. ఆయన ఏం చేసినా మనకు మంచిదే దటీజ్ పత్రీజీ!!

మేము గూడూరు కి ధ్యానం చెప్పటానికి వెళ్ళాము. అక్కడ అందరూ కొత్తవాళ్ళే, మంచి స్థితిమంతులు, బాగా చదువుకున్నవారు డాక్టర్స్ వచ్చారు. సార్ చెప్పిన ధ్యాన విధానం వారికి నచ్చలేదు. దానికి వారు సార్ మీద తిరగబడి మాట్లాడారు, "అందరూ కొట్టుకుంటారేమో" అన్నంతదాకా వచ్చింది. ఆ క్షణంలో "ఒక పులిని బోనులో బంధిస్తే" ఎలా ఉంటుందో అలా ఉన్నారు సార్. "అసలు ధ్యానం చెప్పటానికి మీకు అరహత లేదు" అన్నారు. ఇంత కోపిష్టి గురువును మేం ఎక్కడా చూడలేదు" అన్నారు. అప్పుడు సార్‌ను చూస్తే నాకు చాలా భయం అనిపించింది. వచ్చి కారులో కూర్చున్నాము. అంతటి కోపం ఎటు మాయం అయ్యిందో చాలా ప్రసన్నం అయ్యారు. ఇది ఎలా సాధ్యం అయిందో నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే. ఒక సమస్య వచ్చినప్పుడు ఆయన ఎంత గంభీరంగా మారిపోతారో, ఎంత సమయస్పూర్తిని ప్రదర్సిస్తారో సార్ దగ్గర నుంచి నేర్చుకోవలసిందే దటీజ్ పత్రీజీ!!

ఈ మధ్యకాలంలో మాంసాహారం మీద విప్లవం తెచ్చింది సార్ మాత్రమే అనిపిస్తుంది. మాంసాహారం మనిషి యొక్క జీవశక్తిని నశింపజేసి, మానసిక శక్తిని నాశనం చేసి, మనల్ని మన మూలచైతన్యం లోనికి వెళ్ళనివ్వకుండా ఆటంకపరుస్తుంది. మాంసాహారులు రాక్షసప్రవృత్తి గల వారుగా తయారవుతారని నిఖ్చిచ్చిగా సత్యాన్ని బోధించిన వ్యక్తి ఆయన. ఆయన ఒక్క మాటతో చాలా మంది శాకాహారులుగా మారటం నేను చూసాను వారి మాట ఒక శక్తి లాగా పనిచేస్తుంది. "చెట్లను నరకడం, జంతువులను చంపడం మన భూగోళానికి మనిషి తలపెడుతున్న హాని. అది మనకి మనమే ఆత్మాభివృద్ధి కలగకుండా ఆటంక పరుస్తున్నాము" అంటారు ఆయన.

నేను ధ్యానం మొదలుపెట్టింది మొదలు ఆయనను ఎన్నో కోణాలలో దర్శించాను. కఠినమైన శిక్షణ ఇచ్చే గురువునూ, అపారమైన ప్రేమను కురిపించే తండ్రినీ, మన అందరినీ కూడా గురువులుగా చూడగలిగిన గురువునూ, అందరినీ స్నేహితులుగా చూడగలిగిన స్నేహితుణ్ణీ, అప్పుడప్పుడూ వారితో సమ్మోహనపరిచే చూపులనూ, మరుక్షణమే శాసించగలిగిన మాటలనూ, మనల్నీ దేవుళ్ళుగా చూసే నడిచే దేవుణ్ణీ; "గురువును గురువే గుర్తించగలడు, నేను గురువు అయితే మీరు గురువులే" అన్న ఏకైక గురువునూ చూసాను.

అలాంటి గురువుకు ప్రకృతి ఏం కావాలన్నా ఇస్తుంది, ఆయన తన ముద్దుబిడ్డ. "ఈ రోజు ఎన్నోవేలమంది ఈ సంస్థలో ఉన్నారు" అంటే అది ఆయన పడ్డ శ్రమ. ఇందులో పత్రిసార్‌తో సహా లక్షల కొద్దీ వర్కర్స్ .. ధ్యానం చేసేవారు, చెప్పేవారు, పుస్తకాలు వ్రాసేవారు, పిరమిడ్స్ కట్టేవారు, ఇతర దేశస్థులకు ధ్యానశిక్షణ ఇచ్చేవారు, ధ్యానంతో పంటలు పండించేవారు, మందుమొక్కలు పెంచేవారు, ఒక్కటేమిటి ఇలా ఎన్నో .. ఒక వ్యక్తి పనిచేస్తే ఒక్కరి పని చేయగలడు, అదే పని చేయించగలిగితే ఓ వంద మంది చేత చెయ్యించగలడు. మరి ఇది ఆయనకే సాధ్యం. అందుకే సార్ నా దృష్టిలో ఒకే ఒక్కడు, అసామాన్యుడు దటీజ్ పత్రీజీ!!

ఇలా వ్రాస్తూ పోతే పదమూడు సంవత్సరాల చరిత్ర వ్రాయాలనిపిస్తుంది. ఆయనతో పంచుకున్న భావాలు ఎన్నో ఎన్నెన్నో. వారి సాంగత్యంతో నేర్చుకున్నది ఎంతో.

ఒక ఇంటర్వ్యూ‌లో పత్రిసార్‌ని మీరు "ఎందుకు ధ్యాస ప్రచారం చేస్తున్నారు? దీని ద్వారా మీరు పేరు ప్రతిష్టలను ఆశిస్తున్నారా?" అని అడిగారు. దానికి సార్ ఒక్కక్షణం ఆగి "నేను ధ్యానం చెయ్యటం మొదలు పెట్టినప్పటి నుంచి చాలా ఆనందంగా ఉన్నాను. మరి ఇతరులకు చెప్పినప్పుడు వారు కూడా ఆనందంగా ఉన్నారు. అందుకే నేను చేస్తూ, ఇతరుల చేత చేయిస్తున్నాను" అన్నారు. ఇది విన్న ఎవ్వరికైనా కించెత్తు కూడ గర్వం రమ్మన్నా రాదు. అందుకే ఆయనకు ఆయనే సాటి. అందుకే ఆయన అంటే మన అందరికీ ఎనలేని గౌరవం, ప్రేమ దటీజ్ పత్రీజీ!!

 

M. సుమతి ఆనంద్

Go to top