" మనస్సాంతా ఆ చైతన్యమూర్తే, ఆ బ్రహ్మతేజస్సే, ఆ చిరునవ్వుల చిద్విలాసమే "

 


"ఎవరో ‘పత్రీజీ’ అట! N.S.M. పబ్లిక్ స్కూల్‌లో ఏదో మెడిటేషన్ క్లాస్ ఉందట! ఆ పెద్దాయన పద్ధతేదో వెరైటీగా వుందట! ‘ధ్యానం చేసి పూర్వజన్మలు తెలుసుకోవచ్చు..’ అంటున్నారట!

 

 

వెళదామా?" అన్నారు మా బాబాయి.

"ఓ" అన్నాను నేను.

ప్రోగ్రామ్‌కి ఓ అరగంట ముందే వెళ్ళాం అక్కడో పెద్దాయన తన చుట్టూ చేరిన కొందరిని నవ్విస్తూ కవిస్తూ చప్పట్లు కొట్టిస్తూ..

* * *

తెల్లని లాల్చీ, అదే రంగు పైజామా.. వెండితీగల్లాంటి గెడ్డం.. బంగారం లాంటి బట్టతల.. "ఓహో.. ఈయనేనా ‘పత్రి సార్’ అంటే?!" అనుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళాం, నేనూ, నాన్నా, బాబాయీ..

* * *

"నమస్తే" అన్నాం!

"కూర్చోండి.." అన్నారు ఆయన.

చుట్టూ అర్థచంద్రాకారంగా కూర్చున్నాం!

పెద్దాయన దృష్టి బాబాయి మీద పడింది.

"చెప్పండి సర్.."

ఆ కంఠంలో కమాండింగ్ కనబడింది

"ఏమిటి మీ జీవిత లక్ష్యం?"

"ఏముందండీ.. పదిమందికీ అంతో ఇంతో సహాయపడుతూ చక్కగా బ్రతకాలని.." అన్నాడు బాబాయి.

"మంచి లక్ష్యం.. మరి అయితే మీకు మీరు ఎప్పుడైనా పూర్తిగా సాయం చేసుకున్నారా..?" "???!!!"
మా బాబాయి మొహం నిండా క్వశ్చన్‌మార్కులే!

"O.K." అంటూ నాన్న వంక తిరిగారు పత్రి సర్.

"ఆ బాడీ లాంగ్వేజ్ అద్భుతం అనిపిస్తోంది" నాకు.

"చెప్పండి సర్.. మీ జీవిత లక్ష్యం ఏమిటి?" నాన్న పైకి వచ్చి పడింది ఆ ప్రశ్న!

"మోక్షం సాధించాలనీ.." అన్నాడు నాన్న.

"వెరీగుడ్ సర్! మంచి లక్ష్యం.." అంటూనే "మోక్షం అంటే ఏంటీ సర్?".. గంభీరంగా వుందా ప్రశ్న!"..???!!!"

మా నాన్న ఫేసులో అంతవరకూ వున్న గాంభీర్యం గజిబిజిగా మారిపోయింది!

"మీరు పొందదలచుకుంది ఏంటో మీకే తెలీకుండా ఎలా పొందుతారు?"

"అందరూ అంటూంటారని..", ఆగిపోయారు నాన్న..

* * *

"O.K. అంటూ నా వైపు తిరిగి.. సూటిగా చూస్తూ..
"ఎస్ మేడమ్, వాట్ ఎబౌట్ యు?"
ఆ ప్రశ్నని నా చెవులైతే విన్నాయి.. మనుసుకి ఇవేం పట్టటం లేదు..
ఆ చూపు.. ఏమిటిది, అలా వుంది.. మాటలు రాకుండా చేస్తోందేమిటి ఆ చూపు??

ఆయన నా కళ్ళను గానీ, నా ముఖాన్ని గానీ, చూస్తున్నట్టుగా లేదేంటి?..

ఓ దశాబ్దం నుంచి అర్థం కాని అలజడితో నేను వెతుకుతున్నది ఏదో.. అనేక స్వామీజీల బోధనల వద్దకు నన్ను నడిపించిందేదో.. నేను చూడదలచుకున్నదేదో.. అది నాలోనే ఉన్నట్టు ఆయన దాన్నే చూస్తున్నట్లు అనిపిస్తోందేమిటి???

* * *

నా అంతరంగం లోంచి పొరలు పొరలుగా తెరలు తెరలుగా ఆరాటామేదో వుబికి వస్తోంది గానీ ఆయన ప్రశ్నకు సమాధానం చెప్పాలని అనిపించడం లేదేంటి???

నా నిశ్శబ్దంలో తన ప్రశ్నకు సమాధానం అందినట్లు తలూపారు పత్రీజీ!

"ఓహో.. తెలుసుకోటానికొచ్చావా..?

"వెరీగుడ్..! అంటూ చిరునవ్వుల అక్షతలు చల్లారు నా పైన!

* * *

ఇంటికి వెళ్ళాం! మనస్సాంతా ఆ చైతన్యమూర్తే! ఆ బ్రహ్మతేజస్సే! ఆ చిరునవ్వుల చిద్విలాసమే! ఇది 1997 జనవరి మూడవ ఆదివారం ఉదయం నాడు జరిగిన సంఘటన..
ఆ రోజు నుంచే నాలో ధ్యానోదయం జరిగిందని వేరే చెప్పాలా ఏంటి?!

 

B. నాగలక్ష్మి

Go to top