" సకల చరాచర సృష్టిలో నేనే "

 

నా పేరు వరలక్ష్మి. భర్త జయపాల్ రెడ్డి.

మాది శ్రీకాళహస్తి. నాకు ముగ్గురు పిల్లలు. నా వయస్సు 25 సంవత్సరాలు. నేను ధ్యానంలోకి రాకముందు నా యొక్క పరిస్థితులను కొద్దిగా చెప్పుకోవలసిన అవసరం ఉంది.

గడచిన జీవితంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళని రోజు కానీ, మందులు మింగని రోజు కానీ ఎంత వెతికినా దొరకదు. ఎప్పుడూ హాస్పిటల్‌మయమే. ఇల్లంతా మందుల మయమే. ఇలా రోగాలతో బాధపడుతున్న సమయంలో 'శివ మాస్టర్' ద్వారా ధ్యాన పరిచయం జరిగింది.

2002లో వరదరాజస్వామి గుడిలో ధ్యాన సప్తాహాలు జరిగనప్పుడు పత్రీజీ క్లాస్‌లో పాల్గొన్నారు. అప్పుడే నా ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దొరికాయి.

చిన్నప్పటి నుంచీ నాలో కొన్ని ప్రశ్నలు సమాధానాలు లేకుండానే మిగిలి ఉండేవి. అవి ఏవంటే "వీరబ్రహ్మేంద్రస్వాముల వారు కాలజ్ఞానం ఎలా వ్రాశారు? వేదవ్యాసులవారు మహాభారతం ఎలా వ్రాయగలిగారు? వాల్మీకి మహర్షి రామాయణం ఎలా వ్రాశారు?" ... ఇవన్నీ పది సంవత్సరాల వయస్సులోనే చదివేదాన్ని కనుకనే నాకు ఈ ప్రశ్నలు వచ్చాయి.

అప్పుడు నాకు తెలిసిన కొద్దిమందిని అడిగితే వారు నాకు ఇచ్చే సమాధానం ... "వారు మహాయోగులు, మహర్షులు, మనం కేవలం సగటు మానవులం. అది మనవల్ల కాదు. వారు వ్రాశారు, నువ్వు చదివావు అంతే. ఇక వాటి గురించి మరచిపో." అనేవారు. అయితే, మన పత్రీజీ చెప్పినప్పుడు ఎంత ఆనందమో. "మనకు మూడవకన్ను ఉంది, ధ్యాన సాధన ద్వారా అన్నీ సాధ్యం" అన్న సార్ మాటలు నన్ను ఎంతగానో ఆనందపరిచాయి. వెంటనే ప్రతిరోజూ 7,8 గంటలు ధ్యానం చేయడం మొదలుపెట్టాను.

నేను ధ్యానం మొదలుపెట్టిన 40 రోజులకే మా పిల్లలందరికీ ఆరోగ్యం కుదుటపడింది. ఆ క్షణం నుంచీ మందులు లేవు. డాక్టరు లేడు. అప్పుడే మాకు ప్రశాంతత అంటే ఏమిటో తెలిసింది. ఇల్లంతా స్వర్గంలా తయారయింది.

ఒకరోజు ధ్యానంలో విష్ణు మాస్టర్ కనిపించారు. "నీకు ఏం కావాలో కోరుకో" అన్నారు. ఆ యొక్క అత్యద్భుతమైన కిరణాలతో ఎంతో కాంతివంతంగా ఉన్న ఆ స్వామిని చూసి ఎంతో ఆనందంగా గమనిస్తున్నాను. "నువ్వు అడగపోయినా ఇది తీసుకో" అన్నారు. అందులో చెంబు నిండుగా తీర్థం ఉంది. అది తాగేశాను. ఆ తీపిదనం ఇప్పటికీ నా చిరునాలుకపై అలాగే ఉంది. అప్పటి నుంచీ ప్రతిరోజూ అనుభవాలే. దేవతలతో నన్ను ఒకరిగా కలుపుకుని ఒక ఫ్రెండ్‌లా మాస్టర్స్ నాతో మాట్లాడటం, నాతొ గడపటం ఎంత ఆనందమో.

నా ధ్యాన సాధనను ఇంకా ఎక్కువుగా పెంచుకున్నాను. రాత్రంతా ధ్యానం చేయసాగాను. అయినా నిద్ర వచ్చినట్లు అనిపించేది కాదు. ఒకరోజు పదునైన అయస్కాంతం తగిలి నా తలకు గాయమైంది. నొప్పికి తట్టుకోలేకపోయాను. "నాకు నొప్పిగా ఉంది మాస్టర్స్" అంటూ ధ్యానంలో కూర్చున్నాను. వెంటనే ఒక పెద్ద పాము వచ్చింది. ఆ తరువాత మూడు గంటలసేపు ఆపరేషన్‌లాగా చేసింది. కళ్ళు తెరిచి చూశాను గాయం ఆనవాళ్ళు కూడా కనిపించలేదు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది.

ఇకపోతే గత జన్మలన్నీ చూసుకున్నాను. సూక్ష్మశరీరం కూడా విడుదలయింది. తద్వారా నేను ఎన్నో లోకాలు సందర్శించాను. మానస సరోవరం, ఇతర దేశాలు కూడా ఆస్ట్రల్ ట్రావెల్ ద్వారా చూసేదాన్ని.

25-11-05: ఈ రోజు విజయలక్ష్మి మేడమ్‌ని కలవడం కోసం మద్రాస్‌కి వెళ్ళాను. మేడమ్‌ను చూడగానే నాకు తెలియకుండానే ధ్యానంలోకి వెళ్ళిపోయాను. రకరకాల నొప్పులు ధ్యానంలో అనుభవిస్తూ అటూ ఇటూ దొర్లుతూ ఉన్నాను. మేడమ్‌చూసి చాలాసేపు తరువాత నా దగ్గరకు వచ్చి నన్ను గట్టిగా పట్టుకుని అరగంటసేపు ధ్యానం చేశారు. ఆ తరువాత నీళ్ళు చల్లి నన్ను లేపారు. "ఏం జరిగింది?" అడిగాను. "అంతా నీకు తెలుస్తుంది" అన్నారు మేడమ్. ఇంటికి వచ్చాక ధ్యానంలో అడిగాను. అప్పుడు కాళికాదేవి మాస్టర్ వచ్చి జరిగినదంతా చూపించారు. "గతజన్మలు క్లియర్ అవ్వడమే కాక ఇక నాలుగు జన్మలు తీసుకోవలసి ఉండగా వాటియొక్క కర్మఫలితాలను కూడా ఈ శరీరంతోనే అనుభవింపచేసి నశింపచేశారు. ఇదే నీకు ఆఖరి జన్మ. ఈ శరీరంతోనే క్రొత్త జన్మ. ఈ రోజే నువ్వు పుట్టావు. హ్యాపీ బర్త్‌డే" అనిచెప్పారు; "ఇప్పుడు నీకు సహస్రారం ఓపెన్ అవుతూ ఉంది చూడు" అని చూపించారు.

చూశారా, ఒక్క ధ్యానం ద్వారా ఎంత సాధించామో. అందుకే నేను పొందిన అనుభవాలను అందరికీ తెలియజేయాలి అన్న ఉద్దేశ్యంతో అప్పటి నుంచి ధ్యానం అందరికీ చెప్పడం, అందరి అనుభవాలను పంచుకోవడం మొదలుపెట్టాను.

14-01-06: ఈ రోజు నేను నిద్రలో ఉండగా ఒక అజ్ఞానపు ఆత్మ వచ్చి నాతో ఫైట్ చేసి "చంపుతా" అని బెదిరించింది. వెంటనే "పత్రీజీ" అన్నాను. నా చుట్టూ ఒక పెద్ద కాంతివలయం ఏర్పడింది. అదికూడా "ధ్యానం చేస్తా" అంటూ వెళ్ళిపోయింది. అప్పుడే అర్థమయింది నాకు పత్రీజీ గారు శరీరాలు లేని ఆత్మలకు కూడా జ్ఞానం కలిగిస్తున్నారని.

16-01-06: ఆస్ట్రల్ వరల్డ్స్ గురించి అన్ని విషయాలు కనిపించేవి. యూనివర్సల్ పర్పస్‌కి సంబంధించినవి కూడా ధ్యానంలో చూసుకునేదాన్ని.

ఉదాహరణకు "ధ్యాన తమిళనాడు", "ధ్యాన రష్యా", "ధ్యాన యూరప్", "ధ్యాన బెహ్రైన్". దీన్ని బట్టి చూస్తే 2012కి ముందే "ధ్యాన జగత్" పూర్తవుతుంది. ఇక అంతా ధ్యాన మయం. ఇక అందరికీ ధ్యాన జీవితం. ఇక భూమండలమంతా దివ్యమయం.

24-01-06: ఈ రోజు నుంచి నాలో వచ్చిన అద్భుతమైన మార్పు ఏమిటంటే, గతంలోని శత్రువులను కూడా మిత్రులుగా చూడగలుగుతున్నాను. వారిలో కూడా నేనే కనబడుతున్నాను. అంతేకాదు సకల చరాచర సృష్టిలో కూడా నేనే కనబడుతున్నాను. అందరినీ నాలోనే చూసుకుంటున్నాను. ఇప్పుడే "అహం బ్రహ్మాస్మి" అంటే అనుభవపూర్వకంగా అర్థమయింది.

26-01-06: నాకు గత రెండు రోజులుగా నాకే తెలియని ఆనందం నా శరీరానికి తెలుస్తోంది. అంతేకాదు నా శరీరం లోపలి నుంచి మంచి సుగంధపు వాసన తెలుస్తోంది. ప్రతి అణువులోకూడా అత్యద్భుతమైన ఆనందం మరి సువాసనలు ఏరులా, సెలయేరులా ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. కారణం ధ్యానంలో అడిగాను. అప్పుడు మాస్టర్స్ నాకు చూపించిన దృశ్యం అంతా ఇంతా కాదు... నాలో ఒక్కొక్క అణువు కూడ ఒక్కొక్క స్వర్గలోకాన్ని ఏర్పరచుకుంది. రంగురంగుల కిరణాలు ఎంతో కాంతివంతంగా విరాజిల్లుతూ ఉన్నాయి. "ఇదే దివ్యజ్ఞాన ప్రకాశం, ఇదే ఆత్మ పరిమళం, ఇదే నిత్యానందమయ స్థితి" అని చెప్పారు. ఈ ఆనందం మాటలకు, వ్రాతలకు అందనిది.

మన శరీరంలో రక్త మాంసాలు ఉన్నాయి అనుకున్నాం కానీ, ఇప్పుడే అర్థమయింది మనం కాంతివంతులమనీ, మనమే సర్వసృష్టిలో ఏకమై ఉన్నాయనీ, సర్వసృష్టి మనలోనే ఏకమై ఉన్నదనీ, మనలోని స్వర్గలోకం ఇమిడి ఉన్నదనీ అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను.

ఈ "శ్వాస మీద ధ్యాస" చెప్పి పత్రీజీ, శరీరాలు అనే బండరాళ్ళను రత్నాలుగా మారుస్తున్నారు. 2012 లోపు ఈ యొక్క భూమండలాన్ని దివ్యమయంగా మార్చడానికి కారణమైన బ్రహ్మర్షి పత్రీజీకి శతకోటి, సహస్రకోటి నమస్కారాలు.

 

M.వరలక్ష్మి
మైత్రేయ బుద్ధా ధ్యాన కేంద్రం, 4-559,సన్నిధి వీధి, శ్రీకాళహస్తి
ఫోన్: 93900 20536, 93900 20520

Go to top