" 2002 ధ్యాన మహాయజ్ఞంలో నా అనుభవాలు "

 

"ధ్యాన మహాయజ్ఞం" పాంప్లెట్ చూడగానే 27వ తేదీన ధ్యాన మహాయజ్ఞానికి వెళ్ళాలి అనే ఒక దృఢమైన సంకల్పం నాకు కల్గింది. ఆ రోజున బయలుదేరదామనుకుంటే చాలా అడ్డంకులు ఎదురయ్యాయి. "ఇవన్నీ నాకు పరీక్షలే. ఏది ఏమైనా నేననుకున్న టైమ్‌కే బయలుదేరాలి." అని నేను బయలుదేరిన మరుక్షణం ఎక్కడిపనులు అక్కడ చకచకా జరిగిపోయాయి.

28వ తేదీ ఉదయం "ధ్యాన మహాయజ్ఞ" ప్రాంగణంలోకి చేరాను. అక్కడకు చేరగానే "విజయవాడ ధ్యాన మహాయజ్ఞ ప్రాంగణమే వేదికగా కృష్ణమ్మ దూకింది రంగానికి. ఎదురింక లేదు పత్రి సింహానికి" అనిపించింది. కొద్దిసేపటికి సార్‌వేదిక మీదకు పిలిచారు. ఒక సంవత్సర కాలంలో జీవిత శాస్త్రాన్ని అధ్యయనం చేసి అయోమయ స్థితి నుండి ఆనందమయ స్థితికి చేరిన నా ధ్యానానుభవాలను నా ధ్యాన మిత్రులందరితో పంచుకున్నాను. 28 వతేదీ సాయంత్రం నా ధ్యాన మిత్రురాలు ఝాన్సీతో కలిసి నేను పుట్టిన ఊరు అయిన నూజివీడు వెళ్ళాను.

29 వ తేదీ ఉదయం 5.15 గంటలకు నూజివీడులో బయలుదేరిన మేము 6.15 కల్లా యజ్ఞ ప్రాంగణంలోకి చేరుకున్నాం. ఆధునిక భారతంలో శ్రీకృష్ణ సందేశాన్ని అద్భుతంగా వివరించిన నవీన వ్యాసుడ్ని దర్శించి తరించాము. 29 వతేదీ మధ్యాహ్నం నా ధ్యానానుభవాలను ధ్యాన మిత్రులతో పంచుకునే మహద్భాగ్యం నాకు కలిగింది. ఆ రోజు సాయంత్రం వసంత్‌నగర్ పిరమిడ్ మాస్టర్స్ రమా, రాంబాబు గార్లతో కలిసి మళ్ళీ నూజివీడు బయలుదేరాము. అనుకోకుండా కారు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయింది. పది నిమిషాలలో రెండు కిలోమీటర్ల పొడవు ట్రాఫిక్ జామ్ అయ్యింది. కారు ఎటూ కదిలే పరిస్థితి కనిపించలేదు. అప్పుడు కారు దిగి ఎదురుగా టైరు దగ్గర కూర్చుని "సార్" అని ఒక్క పిలుపు పిలిచాను. ఏం జరిగిందో నాకు తెలీదు కానీ కారు మాత్రం ఒక్కసారిగా ముందుకు కదిలింది. నా ధ్యాన మిత్రులకు నేను పుట్టిన ఊరును చూపిస్తూ చిన్ననాటి నా అనుభవాలను వారితో పంచుకుంటూ ఆనందంతో ఆ రోజు గడిచింది.

30వ తేదీ ఉదయం 5.00 గంటలకు బయలుదేరి మళ్ళీ 6.15కు యజ్ఞ ప్రాంగణంలోకి చేరుకున్నాం. సంసారమనే ఘోరారణ్యంలో దారి తెలియక తల్లడిల్లుతున్న నాకు ఓ దారిని చూపించి, అజ్ఞానాంధకార జీవితంలో 'జ్ఞాన జ్యోతి'ని వెలిగించి, ప్రాపంచిక క్షేత్రమున వెలుగును చూపించి; ఒక జాతిని గానీ, ఒక మతాన్ని గానీ, ఒక సంప్రదాయాన్ని గానీ, దూషింపక సర్వ సమన్వయ పద్ధతిలో మాకు జ్ఞాన దాతవై; పాపులు గానీ, దురాచార పరులు గానీ ఏనాటికైనా పుణ్యాత్ములు కాగలరని ఢంకా మ్రోగించి చెప్పి; నిరాశా పరులకూ, నిస్పృహులకూ ధైర్యం చెప్పి, జీవుల అంతఃకరణాన్ని శుద్ధి పరుచుటకు లెక్కలేనన్ని మార్గాలను సూచిస్తూ వ్యాస మహర్షి కురుక్షేత్రాన్ని కళ్ళకు కట్టించి - ఇదే ఈనాటి కృష్ణ సందేశం పొమ్మన్నారు. ఆ రోజు రాత్రి మూడు గంటలసేపు శరీర స్పృహ లేకుండా సమాధి స్థితిలో సాధన చెయ్యగలిగాను.

31వ తేదీ కృష్ణ సందేశం ముగింపు సందర్భంగా, 'శ్రీకృష్ణ సందేశాన్ని' విన్నాం. కృష్ణుని వ్యక్తిత్వ విశిష్టత వివిధ కోణాలలో దర్శించాం. అంతటి మహనీయుని సృష్టించిన వేదవ్యాసుని వ్యాపకత్వమూ గ్రహించాం. ఆ మహాభారతం చరిత్రో, కథో మనకు తేలీదు. కానీ ఈ ఆధునిక భారతంలో ఆ కృష్ణుడు అంతటి అనేకమంది కృష్ణులు మన కళ్ళ ఎదురుగా తయారు చేయబడి ఖచ్చితమైన ఉదాహరణలుగా మనలోనే వున్నారు. ఒక కృష్ణుడ్ని ఇచ్చిన ఆ వ్యాసుని వ్యాపకత్వం అంత విస్త్రృతమైనదైనప్పుడు మరి ఇంతమంది కృష్ణుల్ని తయారు చేసిన "ఈ వ్యాసుని" గురించి ఒకసారి ఆలోచించండి.

'సైన్స్' నిజమే, 'శాస్త్రీయతా' సత్యమే కానీ 'సైన్స్' సంగతి ఏమిటి? మీ 'సైన్స్' ఉపయోగించి మీరేమిటో గ్రహించండి.

ప్రతి విషయమూ కూడా నమూనా ప్రకారమే అమలు జరుపబడుతోంది. ఆ ప్రణాళికను అందుకొని ఆచరించగలిగిన వాళ్ళు ఆచరించండి. సందేహం వున్న వాళ్ళు సంకోచిస్తే దానిని అందుకొని అమలు జరపగలిగిన అర్హత వున్నవాళ్ళు వెన్నంటి వుండనే వుంటారు. మన సందేహం వల్ల మన ఆత్మాభివృద్ధే కుంటుపడుతుంది గానీ ఈ సృష్టికి జరిగే నష్టమేమీ లేదు.

ముత్యాల సరం నుండి తెగిజారిన ముత్యాలలా ఆయన కంఠం నుండి జాలువారిన నక్షత్రాలమే మనం. ఈ నక్షత్రాలన్నిటినీ మళ్ళీ ఏరి, కూర్చి ఆయన కంఠసీమను అలంకరించుకోబోతున్న ఈ తరుణంలో నా హృదయం స్పందనకు అక్షర రూపమే ఇది.

31వ తేదీ మధ్యాహ్నం కొంతసేపు యజ్ఞ ప్రాంగణం మేఘావృతమయ్యింది. భీతావహ వాతావరణమే అలముకొంది. సాయంత్రానికి ధ్యానోత్సాహ వేడుకలతో ప్రాంగణమంతా కళకళలాడింది. అందరికీ సార్ సన్మానాలు చేస్తూ, పాదాభివందనం చేసారు. అది చూసిన నాకు "ఎందరి కాళ్ళమీద పడి అయినా సరే సత్యాన్ని కాపాడుకుని; నవ్యజ్ఞాన యుగ స్థాపనకు నడుం బిగించాలి" అనే నా కర్తవ్యం నాకు బోధపడింది. ఆ తరువాత పిరమిడ్ సీనియర్ మాస్టర్ నరసింహప్పగారు చెప్పిన ధ్యానానుభవాలే "2008 నాటికి ఖచ్ఛితంగా ధ్యానభారత్‌ను సాధించుకొంటాము" అనే మన సంకల్పానికి నిదర్శనం.

సన్మానం చేయించుకోవటం ఆయనకు ఇష్టంలేకపోయినా మహిళా లోకానికిచ్చిన మాటకోసం సన్మానం చేయించుకున్న ఆయనకు సమస్త మానవాళి తరపున సహస్ర ప్రణామాలు తెలియజేస్తున్నాను.

ఎవరు ఎంత కష్టపడగలరో అంత కష్టపడి, ఎవరి ఇష్టం వచ్చినంత వారు ఖర్చు పెట్టుకొని, ఎవరికి ఇష్టం వచ్చిన వారిని వారు పిలుచుకుని, అందరినీ సర్వస్వతంత్రులుగా తీర్చిదిద్దుతూ, సమిష్టి ప్రయోజనానికి అద్దంపడుతున్నట్లుగా ధ్యాన యజ్ఞాలను తీర్చిదిద్దుతున్న ఆ మహనీయునికివే నా సహస్ర ప్రణామాలు.

ఆయన చేతుల మీదుగా జరుగుతోన్న పిరమిడ్ వివాహాలే యువలోకానికి ఆదర్శమవ్వాలి. ఆ జంటలు హిమగిరి శిఖరాన తల ఎత్తి నిలబడాలని హృదయ పూర్వకంగా అభినందిస్తూ, ఆ వివాహోత్సవాన్ని తిలకించాం.

ఆ తరువాత 2002 సంవత్సరానికి వీడ్కోలు. 2003 సంవత్సారానికి స్వాగతం చెబుతూ పిరమిడ్ ధ్యాన ప్రపంచమంతా ధ్యానముద్రలో నిమగ్నమయ్యింది. ఆ తరువాత నూతన సంవత్సర వేడుకలతో చిన్న-పెద్ద, పేద-ధనిక, కుల-మతాలకతీతంగా అందరూ ఆనందోత్సాహాలతో గంతులు వేస్తూ దివి నుండి భువికి దిగి వచ్చిన స్వర్గసీమగా తయారయ్యింది ఆ ధ్యాన మహాయజ్ఞ ప్రాంగణం.

 

పద్మజ
కూకట్‌పల్లి
హైదరాబాద్

Go to top